close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేరళలో వర్ష బీభత్సం

తేయాకు తోటల్లో మట్టి పెళ్లలు విరిగిపడి 15 మంది బలి
శిథిలాల కింద చిక్కుకున్న 52 మంది

ఇడుక్కి: కేరళలో భారీ వర్షాల తాకిడికి మట్టి పెళ్లలు విరిగిపడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 52 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడి వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. బాధితులంతా తేయాకు  తోటల్లో పనిచేసే కార్మికులు. వీరిలో ఎక్కువ మంది పొరుగునున్న తమిళనాడు నుంచి వచ్చినవారే.

శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల తాకిడికి అకస్మాత్తుగా మట్టి పెళ్లలు విరిగి కార్మికుల ఇళ్లపై పడ్డాయి. అటవీ శాఖ ఉద్యోగి ఒకరు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన 15 మందిలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. శిథిలాల నుంచి 12 మందిని రక్షించారు. వారిని ఎర్నాకుళం, మున్నార్‌లోని ఆసుపత్రులకు తరలించారు. మిగతావారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రంగంలోకి దిగింది. సహాయ చర్యలకు భారీ వర్షాల వల్ల ఆటంకం ఏర్పడుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా వాయుసేన హెలికాప్టర్‌ కూడా అక్కడికి చేరుకోలేకపోయింది. సహాయ చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని పంపినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలు విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఈ ఘటనపై సంతాపం తెలిపారు. సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్‌ కార్యకర్తలకు సూచించారు.

ఘటనాస్థలం.. మున్నార్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనోహరమైన ఈ తేయాకు తోటలో దాదాపు 80 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. మరోవైపు పాలక్కాడ్‌ జిల్లాలో శుక్రవారం ఒక ఇల్లు కూలి, ఒక వ్యక్తి చనిపోయాడు. జూన్‌ 1 నుంచి భారీ వర్షాలతో రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 51కి చేరింది.

ఇడుక్కి జిల్లాలో మరింత వర్ష బీభత్సం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలోని పీర్‌మెడెలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 24 గంటల్లో 26.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వయనాడ్‌, కొట్టాయం జిల్లాల్లోనూ భారీగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మట్టి పెళ్లలు విరిగిపడే ఘటనలు మరిన్ని జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. అనేక నదులు ఉప్పొంగుతుండటంతో ఎర్నాకుళం, త్రిసూర్‌, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. పలుచోట్ల సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.


మహారాష్ట్రలో 5వేల మంది తరలింపు

భారీ వర్షాలతో మహారాష్ట్ర కూడా అతలాకుతలమైంది. పంచగంగ నదిలో వరద పెరగడంతో కొల్హాపుర్‌ జిల్లాలోని 23 గ్రామాలకు చెందిన 5వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భోగవతి నదీ పరివాహక ప్రాంతాల్లో వానల తాకిడికి రాధానగరి డ్యామ్‌లో వరద పెరిగింది. దీంతో అక్కడ గేట్లు ఎత్తివేశారు. కొల్హాపుర్‌కు దారితీసే ముంబయి-బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో ఆ రోడ్డును మూసేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.