close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
75 వేలు దాటిన కొవిడ్‌ బాధితులు

కరోనాతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప వైద్యాధికారి కన్నుమూత
పీజీ సీటు వచ్చిన కొన్నాళ్లకే మృత్యువాత
వైద్యారోగ్య శాఖలో అధికారి స్థాయి వ్యక్తి మరణించడం తొలిసారి
ఈనాడు - హైదరాబాద్‌, దుమ్ముగూడెం, న్యూస్‌టుడే

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 2,207 కేసులు నమోదైనట్టు (రాత్రి 8 గంటల వరకూ తీసుకున్న సమాచారం ఆధారంగా) వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఒక్క రోజులో నిర్ధారించిన పాజిటివ్‌లలో ఇదే అత్యధికం. గత నెల 31న 2,083 నమోదవగా, ఈ నెల 4న 2,012, 5న 2,092 నిర్ధారణయ్యాయి. తాజాగా రెండు వేలకుపైగా కేసులు నాలుగోసారి నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప వైద్యాధికారి గుబ్బల నరేశ్‌కుమార్‌(37) కొవిడ్‌తో పోరాడుతో గురువారం అర్ధరాత్రి కన్నుమూయడం వైద్యారోగ్యశాఖలో కలకలం సృష్టించింది. ఆయన 2019 నుంచి ఆ జిల్లా డిప్యూటి డీఎంఅండ్‌హెచ్‌వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం మణుగూరులోని కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రం ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఇటీవల జరిగిన కౌన్సెలింగ్‌లో ఆయనకు ఉస్మానియా వైద్య కళాశాలలో పీజీ సీటు వచ్చింది. సంబంధిత పనులపై గత నెలలో హైదరాబాద్‌ వచ్చారు. 26న తిరిగి ఇంటికి వెళ్లారు. అప్పట్నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన, తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత నెల 31వ తేదీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. అప్పట్నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘‘ఈ నెల 3వతేదీ తర్వాత ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారని, అయినా ఫలితం లేకపోయిందని’’ కుటుంబ సభ్యులు వాపోయారు. నరేశ్‌కుమార్‌ స్వస్థలం భద్రాచలం. 2014 నుంచి ఆయన దుమ్ముగూడెం మండలం పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తారనే ఖ్యాతి గడించారు. ఆయన మరణంతో మన్యంలో విషాదం అలముకుంది. ఆయనకు భార్య పావని, ఇద్దరు కుమార్తెలున్నారు. వైద్యారోగ్యశాఖలో ఈ స్థాయి అధికారి కరోనాతో మృతిచెందడం ఇదే తొలిసారి. ఆయన మృతి పట్ల వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 532
తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 532 కరోనా కేసులు నమోదవగా, 20కిపైగా నమోదైన జిల్లాల జాబితాలో రంగారెడ్డి(196), వరంగల్‌ నగరం(142), మేడ్చల్‌ మల్కాజిగిరి(136), కామారెడ్డి(96), కరీంనగర్‌(93), నిజామాబాద్‌(89), జోగులాంబ గద్వాల్‌(87), ఖమ్మం(85), భద్రాద్రి కొత్తగూడెం(82), పెద్దపల్లి(71), జనగామ(60), మహబూబ్‌నగర్‌(51), సంగారెడ్డి(37), జగిత్యాల, నాగర్‌కర్నూల్‌(36 చొప్పున), మంచిర్యాల(35), మెదక్‌(32), జయశంకర్‌ భూపాలపల్లి(29), నల్గొండ, సిద్దిపేట(28 చొప్పున), రాజన్న సిరిసిల్ల(25), సూర్యాపేట(23), వికారాబాద్‌(24), యాదాద్రి భువనగిరి(23) మహబూబాబాద్‌(21), ములుగు(20) ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 75,257కు పెరిగింది.

కోలుకున్న వారు 70.7 శాతం
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనాతో 21,417 మంది వైద్య సేవలు అందుకుంటున్నారు. వీరిలో ఆసుపత్రుల్లో, ఇళ్ల వద్ద ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న వారు 14,837 మంది. ఈ నెల 6 నాటికి ప్రభుత్వ వైద్యంలో కరోనా రోగుల కోసం 8,436 పడకలు కేటాయించగా, 2,489 పడకల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. 5947 ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలో కొవిడ్‌ పడకలు 6,819 ఉండగా, 4,091 నిండాయి. 2,728 అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ నుంచి తాజాగా 1,136 మంది కోలుకోగా, మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 53,239కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారు సగటున 67.62 శాతం ఉండగా, రాష్ట్రంలో ఇది 70.7 శాతమని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

నెల బాలుడిని బలిగొన్న మహమ్మారి
నవాబుపేట, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి షాద్‌నగర్‌ నుంచి కూరగాయలు తీసుకొచ్చి మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తుంటారు. ఆయన నెల వయసు కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం చిన్నారి మృతి చెందగా, అదే రోజు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మరణానంతరం బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయినట్టు నవాబుపేట పీహెచ్‌సీకి నివేదిక వచ్చిందని వైద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. బాలుడి తల్లిదండ్రులను హోం క్వారంటైన్‌లో ఉంచామని, వారి నమూనాలు కూడా సేకరిస్తామని వెల్లడించారు.


601కి చేరిన మృతులు

గురువారం 12 మంది మృతిచెందడంతో, మరణాల సంఖ్య 601కి పెరిగింది. రాష్ట్రంలో తొలి కేసు నమోదైనప్పట్నుంచి(మార్చిలో), జూన్‌ నెలాఖరు వరకు 260 మంది కరోనాతో మృతిచెందగా, ఒక్క జులై నెలలోనే 270 మంది, ఆగస్టులో ఇప్పటివరకు 71 మంది బలయ్యారు. దేశంలో సగటు మరణాలు 2.07 శాతంగా ఉండగా, రాష్ట్రంలో అది 0.79 శాతంగా నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ మరణాల్లో కేవలం వైరస్‌ కారణంగా చనిపోయిన వారు 46.13 శాతమని, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మహమ్మారి బారినపడి మరణించిన వారు 53.87 శాతమని ఆ శాఖ వెల్లడించింది.


నరేశ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి: వైద్యుల సంఘాల వినతి

నరేశ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం(ప్రజారోగ్య సంచాలకుల విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు లాలూప్రసాద్‌, ప్రజారోగ్య వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కత్తి జనార్ధన్‌  ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.50 లక్షల బీమాతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి పరిహారాన్ని అదనంగా చెల్లించాలని, భార్యకు అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వడంతోపాటు పిల్లల చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ మంత్రి ఈటల రాజేందర్‌, కమిషనర్‌ వాకాటి కరుణ, సంచాలకులు జి.శ్రీనివాసరావులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.