close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్త ప్రాజెక్టులు ఆపండి

రెండు రాష్ట్రాలకు కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ
రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు ఆపాలని ఆంధ్రకు, కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతల సహా ఏడు ప్రాజెక్టుల పనులు ఆపాలని తెలంగాణకు సూచన
ఈనాడు - హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌ ప్రక్రియను, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూడో టీఎంసీ ఎత్తిపోత సహా ఏడు ప్రాజెక్టుల పనులను ఆపాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సూచించారు. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌, గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులలో పరస్పరం రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకొన్న వాటిని ఆపాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టులను చేపట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ నెలలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్రానికి లేఖలు రాయడం, ఈనెల ఐదున జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. కేంద్రమంత్రి శనివారం ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లేఖలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి సంయుక్తంగా కొంతభాగం ఉండగా, ప్రాజెక్టుల విషయంలో మాత్రమే ప్రత్యేక ప్రస్తావన ఉంది. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఈ నెల ఐదో తేదీన నిర్వహించేందుకు ప్రతిపాదించి ముఖ్యమంత్రుల అంగీకారం తెలుసుకోవాల్సిందిగా కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి ఇద్దరు ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎలాంటి సమాధానం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. ముందుగానే నిర్ణయించుకొన్న కార్యక్రమాలు ఉన్నందున ఆగస్టు 20 తర్వాత నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి  కోరారని, ఈ కారణంగా సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు. త్వరలోనే తదుపరి తేదీని తెలియజేస్తామన్నారు. మీ విజ్ఞప్తి మేరకే సమావేశాన్ని వాయిదా వేశామని తెలంగాణ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.  ‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 84 (3) ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణను పర్యవేక్షించడం కూడా అపెక్స్‌ కౌన్సిల్‌ పనిలో ఒక భాగం. ఇప్పటివరకు 2016 సెప్టెంబరులో మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. తర్వాత ఇప్పటివరకు వివిధ కారణాల వల్ల జరగలేదు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరును 2018 ఫిబ్రవరిలోనూ, 2020 జనవరిలోనూ కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి సమీక్షించారు.రెండు రాష్ట్రాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో పరిష్కారం కాని కొన్ని అంశాలను అపెక్స్‌ కౌన్సిల్‌ పరిశీలనకు పంపారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఎజెండా పంపాలని మా మంత్రిత్వశాఖ 2019 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 2020 జనవరిలో కార్యదర్శి వద్ద జరిగిన సమీక్షలో ఎజెండా అంశాలను పంపడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. 2020 మేలో మళ్లీ రెండు ప్రభుత్వాలను జల్‌శక్తి మంత్రిత్వశాఖ అడిగింది. అయినా స్పందన లేకపోవడంతో రెండు రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు బోర్డుల సలహా మేరకు నాలుగు అంశాలతో తాజా ఎజెండా నిర్ణయించాం’’  అని పేర్కొన్నారు.


కాళేశ్వరం మూడో టీఎంసీతో సహా ఏడు ప్రాజెక్టుల పనులను ఆపండి

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్నంగా ఏడు కొత్త ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని, వీటివల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2020 మే 20న గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నానని కేంద్ర జల్‌శక్తి మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన ఏడు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల, గోదావరి ఎత్తిపోతల మూడోదశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, తెలంగాణ తాగునీటి సరఫరా పథకం, లోయర్‌ పెన్‌గంగ నదిపై బ్యారేజీలు, రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌ మళ్లింపు పథకం ఉన్నాయి. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సలహా కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించిన విషయం మీకు తెలుసు. అయితే తెలంగాణ ప్రభుత్వం తర్వాత పరిధిని మార్చి రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలు మళ్లించేలా సామర్థ్యం పెంచింది. అయితే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలనకు ఇవ్వకుండానే ఈ పనులు చేపట్టింది. ప్రాజెక్టు పరిధి లేదా వ్యయంలో మార్పు జరిగితే మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌ మంజూరు చేయలేదు. బోర్డు పరిశీలన, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని 2020 మే 30న గోదావరి బోర్డు లేఖ రాసింది. ఆమోదం లభించేవరకు కొత్త ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని సూచించింది.. జూన్‌ ఐదున జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాల అభిప్రాయాలు వినడంతోపాటు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పైన పేర్కొన్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను జూన్‌ పదో తేదీలోగా అందజేయాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా బోర్డు పరిశీలనకు అందజేయలేదని నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో డీపీఆర్‌లు అందజేయకుండా, బోర్డు పరిశీలన, అపెక్స్‌ కౌన్సిల్‌ మంజూరు చేయలేదని   ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన పై ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నా’’ అని కేంద్రమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.


‘రాయలసీమ’ టెండర్‌ ప్రక్రియ ఆపండి

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి భిన్నంగా శ్రీశైలం నుంచి రోజుకు ఆరు నుంచి ఎనిమిది టీఎంసీలు మళ్లించేలా పథకాన్ని చేపడుతూ జారీ చేసిన జీఓఎంఎస్‌.నెం-203పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2020 మే 12న కృష్ణా నదీ యాజమాన్యబోర్డు దృష్టికి లేఖ రాసిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నానని కేంద్రమంత్రి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఇది తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలంగాణ పేర్కొంది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌ మంజూరు చేయలేదన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఈ విషయాన్ని ఈ ఏడాది మే 20న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేయడంతోపాటు బోర్డు సిఫార్సు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్‌ను కోరింది. 2020 జూన్‌ నాలుగున జరిగిన 12వ బోర్డు సమావేశంలో కూడా ప్రాజెక్టుల గురించి రెండు రాష్ట్రాలు చర్చించాయని, వారం లోగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేయాలని బోర్డు కోరినట్లు, అప్పటివరకు ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని సూచించినట్లు నా దృష్టికి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వలేదు.రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర పనులు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల టెండర్లు పిలిచినట్లు నా దృష్టికి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు పిలవడం కానీ, ఒప్పందం చేసుకోవడం కానీ చేయవద్దు’’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.


కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టులు

తెలంగాణలో..
1. కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతల
2. గోదావరి ఎత్తిపోతల మూడోదశ
3. సీతారామ ఎత్తిపోతల
4. తుపాకులగూడెం
5. తెలంగాణ తాగునీటి సరఫరా పథకం
6. లోయర్‌ పెన్‌గంగ నదిపై బ్యారేజీలు
7. రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌ మళ్లింపు పథకం

ఆంధ్రప్రదేశ్‌లో..
రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర పనులకు పిలిచిన టెండర్లు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.