త్రిపుర పౌర్ణమి: ఈ పర్వదినం వెనక ఓ ఆసక్తికరమైన కథను వివరిస్తారు. త్రిపురాసురులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మతి సంహార బాధ్యతను పరమేశ్వరుడు తీసుకుంటాడు. భూమి రథంగా మారితే... సూర్యచంద్రులు దానికి చక్రాలుగా, నాలుగు వేదాలు గుర్రాలుగా, శాస్త్రాలు కళ్లెపు తాళ్లుగా మారాయి. దాన్ని అధిరోహించిన నీలకంఠుడు మందర పర్వతాన్ని ధనుస్సుగా ధరించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బాణంగా రూపుదాల్చాడు. పరమేశ్వరుడు ఒకే ఒక్క బాణంతో త్రిపురాలను ధ్వంసం చేసి అందులోని అసురులను అంతం చేశాడు. త్రిపురాసుర సంహారం జరిగిన రోజే త్రిపుర పౌర్ణమిగా మారిందని పురాణగాథ. ఆ రోజు శివుణ్ణి అభిషేకించడంతో పాటు, మారేడు, జిల్లేడు పూలతో పూజిస్తారు. |
దీపోత్సవం: ఈ మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మాసమంతా ఇరు సంధ్యల్లో ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా దీపాలను వెలిగిస్తారు. అన్ని రోజుల్లో ఇలా చేయనివారు కనీసం పౌర్ణమినాడు దీపాలు వెలిగించాలని శాస్త్రవచనం. ఉసిరి కాయలపై, ఆవు నేతితో తడిపిన వత్తులను ఉంచి దీపాలను వెలిగించడం మంచిదని చెబుతారు. అరటి దొప్పల్లోగానీ, ఆకుపై గానీ దీపం ఉంచి నదుల్లో వదులుతారు. ‘ఏకస్సర్వదానాని దీపదానం తథైకతః’... అన్ని దానాలు ఒక ఎత్తైతే దీప దానం మరో ఎత్తని చెబుతారు. దీపదానం చేసేవారు పైడి పత్తితో స్వయంగా వత్తులు చేసుకుని, గోధుమ పిండితో ప్రమిదను చేసుకుని, అందులో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి పండితుడికి దానం చేస్తారు. |
జ్వాలా తోరణోత్సవం: కార్తిక పౌర్ణమినాడు శివాలయంలో జ్వాలా తోరణోత్సవం దర్శించాలని చెబుతారు. రెండు ఎత్తైన కర్రలను నాటి, వాటిని కలుపుతూ మరో కర్రను అడ్డంగా కట్టి, దానికి నెయ్యితో తడిపిన గుడ్డనుగానీ, ఎండు గడ్డినిగానీ చుట్టి నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలా ఉంటుంది కాబట్టి దీనికి జ్వాలాతోరణం అని పేరు. శివపార్వతులను పల్లకిలో ఉంచి దీని కింద తిప్పుతారు. హాలాహలం గరళంలో దాచుకున్న సమయంలో శివుడికి ఏం కాకుంటే చిచ్చుల తోరణం కింద నుంచి మూడుసార్లు వస్తానని పార్వతీదేవి మొక్కుకుందని, అప్పటి నుంచి ఇది ఆచారంగా మారినట్లు చెబుతారు. |
ధాత్రీ పూజ: ధాత్రి అంటే ఉసిరిక. కార్తీకమాసంలో ఉసిరి కాయలపై దీపాలను వెలిగించడంతో పాటు ఉసిరిక వృక్షాన్ని పూజించాలని చెబుతారు. ఉసిరిక చెట్టు మొదలు దగ్గర శుభ్రం చేసి అలంకరించి దీపాలను వెలిగిస్తారు. |
తులసి పూజ: కార్తికమాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంటబెట్టుకుని బృందావనానికి వచ్చాడని చెబుతారు. బృందావనం అంటే తులసికోట. అందుకే క్షీరాబ్ధిద్వాదశినాడు తులసిపూజ చేయాలని శాస్త్రవచనం. అలా చేయలేనివారు పౌర్ణమి రోజు తులసి పూజ చేయాలని చెబుతారు. |
భక్తేశ్వర వ్రతం: కార్తిక పౌర్ణమినాడు భక్తేశ్వర వ్రతం చేయడం ఆచారం. శివుడిని భక్తేశ్వరుడు అనే పేరుతో ఆరాధిస్తూ చేసే వ్రతమిది. పున్నమినాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసి, నివేదించిన అనంతరం ఉపవాసం విరమిస్తారు. దీని వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. పున్నమినాడు పరమేశ్వరుడిని తామరపూలతో పూజించి, మార్కండేయ పురాణం పుస్తకాన్ని దానం చేసే సంప్రదాయం ఉంది. |