close

తాజా వార్తలు

లగడపాటి సర్వే వచ్చేసింది!

తిరుపతి: తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలపై విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్‌, తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారని నిన్న వెల్లడించిన ఆయన ఈ రోజు అంకెలతో కూడిన ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు జరిగినప్పటికీ తెదేపాదే గెలుపు అని స్పష్టంచేశారు. ఏపీలో వైకాపా గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు పది అటో ఇటో స్థానాలు వస్తాయని వెల్లడించారు. వైకాపాకు 72కు 7 సీట్లు అటో ఇటో వస్తాయని తెలిపారు. జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య ఉంటుందని అన్నారు. తెదేపాకు ఇంచుమించు 43 శాతం ఓట్లు వస్తాయని, వైకాపాకు 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఓట్ల శాతంలో ఒక శాతం అటూఇటుగా ఉంటుందని చెప్పారు. ఏపీలో లోక్‌సభ స్థానాలపై మాట్లాడుతూ..తెదేపాకు 15 సీట్లకు రెండు అటుఇటుగా, వైకాపాకు  10కి రెండు అటుఇటుగా స్థానాలు రావొచ్చని లగడపాటి అంచనావేశారు. జనసేన, ఇతరులకు సున్నా నుంచి ఒక లోక్‌సభ స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టు తమ సర్వేలో తేలిందన్నారు.  

కేంద్రంలో ఈసారి హంగే?

తన మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఈసారి కేంద్రంలో హంగ్‌ వస్తుందని లగడపాటి వెల్లడించారు. మెజార్టీలో దగ్గరిగా వచ్చి ఎన్డీయే ఆగిపోతుందన్నారు. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంపైనే ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఏపీలో పార్టీలకు వచ్చే సీట్లపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఏపీ ప్రజల కోరికలు నెరవేరుతాయన్నారు. లేకపోతే మళ్లీ పోరాటం తప్పదని చెప్పారు. కేంద్రంలో ఆయా కూటమిలలోని పార్టీలకు మధ్య మెజార్టీ ఎంత ఉంటుందనేది ఈనెల 23నే తేలుతుందన్నారు. అనేక ఫ్రంట్‌లకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఎవరు అధికారంలోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో కారుదే జోరు!

‘‘చాలా రోజుల తర్వాత తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఫలితాలు వెల్లడించే అవకాశం వచ్చింది.  తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మా సంస్థ జనవరి నుంచి ఎన్నికల ముందు, తర్వాత నెలనెలా రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేసింది. ప్రజల నాడి ఏంటి? మనోగతం ఎలా వుంది? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారి ఆలోచనల్ని క్షుణ్నంగా పరిశీలించాం. లోతుగా పరిశీలించి నివేదిక మా సంస్థ అందజేసింది. శాస్త్రీయంగా జరిగిన ప్రక్రియ ఇది. ఏ పార్టీతో మాకు సంబంధంలేదు. ఏపీలో మా అంచనా ప్రకారం తెలంగాణలో తెరాసకు 14 నుంచి 16 లోక్‌సభ స్థానాలు, కాంగ్రెస్‌కు 0 నుంచి 2 వరకు వస్తాయి. ఒక సీటు ఎంఐఎంకు వస్తుంది.  ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు కలిసి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో అధికారం తెదేపాదే.  ఇప్పుడున్న తెదేపా ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రాబోతోంది. తెదేపా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వైకాపా గట్టిపోటీ ఇచ్చింది. హోరా హోరీగా ఎన్నికల ప్రచార సభలు జరిగాయి. అధికారంలోకి రాకపోయినా గణనీయమైన ప్రజామద్దతుతో జగన్‌ సారథ్యంలో వైకాపా గట్టిపోటీ ఇచ్చింది. మూడో స్థానంలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నిలుస్తారు’’ అని లగడపాటి వివరించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.