close

తాజా వార్తలు

అప్పుడు ఓటమికి.. ఇప్పుడు భారీ విజయానికి..!

ఈ ఎన్నికల్లో వైకాపాకు కలిసొచ్చిన అంశాలివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ‘ఫ్యాన్‌’ గాలి జోరుగా వీచింది. ప్రజలు పాలనలో మార్పు కోరుకున్నారు. అందుకే వైకాపాకు పట్టం కడుతూ జగన్‌ నాయకత్వానికి జైకొట్టారు. 2014 ఎన్నికల్లో సుమారు 2 శాతం ఓట్ల వ్యవధిలోనే అధికారానికి దూరమైన వైకాపా.. గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్త పడింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఫలితంగా 151 సీట్లతో అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో ఓటమికి.. ఈ ఎన్నికల్లో గెలుపునకు వైకాపాకు తోడ్పడిన అంశాలివే అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.

2014లో..
రాష్ట్ర విభజనతో.. అనుభవజ్ఞుడిని కోరుకోవడం

రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఎన్నికలు జరిగాయి. రాజధాని లేదు, సచివాలయం ఎక్కడో తెలీదు. రెవెన్యూ లోటు భర్తీ చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ ఎలాగో ప్రణాళిక లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో తెదేపా కూటమి, వైకాపా, కాంగ్రెస్‌ పోటీతో త్రిముఖ పోటీ తప్పలేదు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజించిందన్న కసి ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. అందుకే ఆ పార్టీ నేతలు ముందు నుంచే పరోక్షంగా ఓటమిని అంగీకరించేశారు. ఈ క్రమంలో ప్రజల ముందు ఉన్నవి రెండు పార్టీలే. ఒకటి తెదేపా, రెండోది వైకాపా. విభజన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఈ పరిస్థితుల్లో అనుభవం గల నాయకుడు తమకు ఉండాలని ఏపీలో అత్యధిక ప్రజానీకం కోరుకుంది. అందుకే తెదేపా అధినేత చంద్రబాబుకు అవకాశం దక్కింది. 

అవినీతి కేసులు.. జగన్‌ వైఖరి
గత ఎన్నికల నాటికి జగన్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేసుల ప్రతికూల ప్రభావం ఉంది. ‘తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారు’ అంటూ తెదేపా చేసిన ప్రచారం ప్రజల్ని ఆలోచింపజేసింది. విభజనతో అప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని జగన్‌ చేతిలో పెడితే పరిస్థితి మరింత దిగజారుతుందనే విషయాన్ని తెదేపా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. జగన్‌ వైఖరిపైనా సొంతపార్టీ నేతల్లోనే అసంతృప్తి ఉండేది. సీనియర్లను గౌరవించరని, దూకుడు స్వభావంతో తనకు తోచిందే చేస్తుంటారంటూ తెదేపా చేసిన ప్రచారం కూడా వైకాపాకు చేటు చేసింది.

పార్టీ అంతర్గత నిర్మాణం.. సమన్వయ లోపం

2014 వరకు వైకాపాలో అంతర్గత నిర్మాణం అంతగా లేదనే చెప్పొచ్చు. అప్పటికే తెదేపా, కాంగ్రెస్‌ రాష్ట్రంలో బలంగా ఉండటంతో జగన్ పార్టీ వైపు కీలక నేతలు అంతంతమాత్రంగానే ఉండేవారు. దీంతో పార్టీలో సమన్వయం కొరవడేది. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి అంతగా వెళ్లేవి కాదు. 2011లో స్థాపించినప్పటికీ అవినీతి కేసులతో కొన్నాళ్లు జైలు నుంచే జగన్‌ తన పార్టీ వ్యవహారాలను నడిపించాల్సి వచ్చేది. అధినేత జైలులో ఉండటంతో ఆ స్థాయిలో నాయకులు, కార్యకర్తలకు దగ్గరయ్యే నేతే ఆ పార్టీకి కరవయ్యారు. జగన్‌ సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినా అది అంతగా ఫలితాలనివ్వలేదు.  దీంతోపాటు అప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెదేపా బలీయంగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉండటం తదితర  కారణాలతో వైకాపా పూర్తిస్థాయిలో ఎదిగేందుకు అవకాశం లేకపోయింది. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌పై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో వైకాపా రెండోస్థానంలో నిలిచినా.. అధికారంలోకి రాలేకపోయింది.

2019లో..

కీలక నేతలంతా వైకాపాలోకి..

గత ఎన్నికల్లో ఘోర పరాభవంతో రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా వైకాపా, తెదేపాల్లో చేరిపోయారు. ముఖ్యంగా వైకాపాలోకి ఎక్కువ మంది నేతలు వెళ్లారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి తదితరుల చేరికతో దీంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. 2014 ఎన్నికల్లో అనువజ్ఞులు లేక డీలా పడిన వైకాపా.. ఈ ఎన్నికల్లో అన్నింటా సమన్వయంతో ముందుకెళ్లింది. టికెట్ల కేటాయింపు, ఎన్నికల ప్రచార శైలి, పోల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాల్లో సీనియర్ల సలహాలను జగన్‌ తీసుకున్నారు. కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుకోవడం, కీలక నేతలంతా వైకాపాలోకి రావడంతో ‘హస్తం’ ఓట్లలో చాలా వరకు వైకాపాకే మళ్లాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు జగన్‌కు మద్దతు పలికారు. దీంతో ఈ ఎన్నికల్లో వైకాపా విజయం సులువైంది.

పాదయాత్రతో ప్రజలకు చేరువగా..
వైకాపాకు ఇంతటి ఘన విజయం దక్కిందంటే అందులో జగన్‌ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రే కీలక పాత్ర పోషించందనడంతో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. పాదయాత్రతో రాష్ట్రం నలుమూలలూ చుట్టి.. ప్రతి వర్గాన్ని కలిసి వారితో మమేకమయ్యేందుకు జగన్‌కు వీలు కలిగింది. ఓవైపు తెదేపా వైఫల్యాలపై ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో పాదయాత్ర ద్వారానే జగన్‌ ప్రజలకు వివరించారు. ఓ రకంగా ఇది పార్టీ బలోపేతానికి.. నాయకుల్లో నూతనోత్తేజానికి కారణమైంది. వైకాపా వైపు మెజారిటీ ప్రజలు నిలిచేలా దోహదం చేసింది.

‘ఒక్క ఛాన్స్‌’ ప్రచారం..

సుమారు ఐదేళ్లు పాలించినందున తెదేపా ప్రభుత్వంపై సహజంగానే ఉండే వ్యతిరేకత ఈసారి వైకాపాకు కలిసి వచ్చింది. జనసేన ఉన్నప్పటికీ తెదేపాకే మద్దతిస్తోందనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వైకాపా సక్సెస్‌ అయింది. ఒక్క ఛాన్స్‌ జగన్‌కూ ఇద్దామనే ప్రచారం ఈ ఎన్నికల్లో కలిసొచ్చింది. ప్రత్యేకహోదాపై మొదట్నుంచీ ఒకే వైఖరితో ఉండటం, నవరత్నాలు తదితర అంశాలు వైకాపా గెలుపునకు దోహదం చేశాయి.

తెదేపా ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా..

జగన్‌ అవినీతిపరుడని.. రూ.వేలకోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టారంటూ గతంలో చేసిననట్లుగానే తెదేపా ఈ ఎన్నికల్లోనూ ప్రచారం చేసింది. అయితే అదేమీ ప్రభావం చూపలేదు. పదేపదే జగన్‌ అవినీతిపై చేసిన ప్రచారాన్ని ప్రజలు ఈసారి పెద్దగా పట్టించుకోలేదు. మోదీ, కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కయ్యారంటూ తెదేపా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఓ దశలో ప్రజలు దాన్ని నమ్మేస్థితిలో కనిపించినా ఫలితాల సరళిని బట్టి చూస్తే అది కూడా వర్కవుట్‌ అవ్వలేదని అర్థమవుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.