close

తాజా వార్తలు

రివ్యూ: అలాద్దీన్‌

చిత్రం: అలాద్దీన్‌
నటీనటులు: విల్‌స్మిత్‌, మేనా మస్సౌడ్‌, నవోమి స్కాట్‌, మార్వన్‌ కెన్జరి, నవీద్‌ నగ్బన్‌, నసీం పెడ్రాడ్‌, బిల్లీ మాగ్నసీన్‌
సంగీతం: అలన్‌ మాన్కెన్‌
సినిమాటోగ్రఫీ: అలన్‌ స్టివార్ట్‌
ఎడిటింగ్‌: జేమ్స్‌ హెర్బట్‌
స్క్రీన్‌ప్లే: జాన్‌ ఆగస్ట్‌, గై రిచీ
నిర్మాత: డాన్‌ లిన్‌, జొనాథన్‌ ఇరిచ్‌
బ్యానర్‌: వాల్‌ డిస్నీ పిక్చర్స్‌
దర్శకత్వం: గై రిచీ
విడుదల తేదీ: 24-05-2019

1992లో ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కించిన ‘అలాద్దీన్‌’ యానిమేషన్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్‌ను సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక అరబిక్‌ జానపద కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఏకంగా 504మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. అప్పట్లో పిల్లలను, పెద్దవారిని విశేషంగా అలరించిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైవ్‌ యాక్షన్‌ చిత్రంగా దర్శకుడు గై రిచీ దీన్ని ఎలా తెరకెక్కించారు? మరి ఈ కొత్త చిత్రం ఎలా ఉంది? జీనీగా విల్‌స్మిత్‌ ఎలా అలరించారు?

కథేంటంటే: ‘అలాద్దీన్‌’ యానిమేషన్‌ చిత్రం చూసిన వారికి ఈ కథ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. అలాద్దీన్‌(మేనా మస్సౌడ్‌) అనే చిన్న దొంగ తన పెంపుడు కోతితో కలిసి ఆగ్రాబాలో నివశిస్తుంటాడు. ఒక సందర్భంలో ఆపదలో చిక్కుకున్న యువరాణి జాస్మిన్‌(నవోమీస్కాట్‌)ను రక్షిస్తాడు. దీంతో ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. అయితే, వారి ప్రేమకు ఆస్తిపాస్తులు అడ్డంకిగా మారతాయి. మరోపక్క ఆగ్రాబా సుల్తాన్‌ విశ్వాస పాత్రుడైన జాఫర్‌(మర్వాన్‌ కెన్జైరీ) రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. గుహలో దాగి ఉన్న అద్భుతదీపాన్ని సొంతం చేసుకుంటే రాజ్యం కూడా సొంతమవుతుందని భావిస్తాడు. అందుకు సరైన వ్యక్తి కోసం వెతుకుతున్న సమయంలో అలాద్దీన్‌ కనిపిస్తాడు. అదే సమయంలో జాస్మిన్‌ తల్లి బ్రేస్‌లెట్‌ను తిరిగి ఇచ్చేందుకు వచ్చిన అలాద్దీన్‌ను రాజభటులు పట్టుకుంటారు. తనకు కావాల్సిన వ్యక్తి అని చెప్పి జాఫర్‌ అతనిని విడిపిస్తాడు. తను చెప్పినట్లు చేస్తే అలాద్దీన్‌ ధనవంతుడు కావచ్చని, జాస్మిన్‌ను పెళ్లి చేసుకోవచ్చని ఆశ పెడతాడు జాఫర్‌. అలా మాయ తీవాచీని ఎక్కి వారందరూ గుహ వద్దకు వెళ్తారు? అలా వెళ్లిన అలాద్దీన్‌ అద్భుత దీపాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? ఆ దీపం నుంచి వచ్చిన జీనీని ఏం వరాలు కోరుకున్నాడు? జీనీ వచ్చిన తర్వాత ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి?జాఫర్‌ దుష్ట పన్నాగం నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఒక దొంగ.. రాకుమారి మనసు గెలుచుకోవడం కోసం ఎలా ధనవంతుడయ్యాడన్నది స్థూలంగా ఈ చిత్ర కథ. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ‘అలాద్దీన్‌’ కథను మలుపు తిప్పే పాత్ర ఏదైనా ఉందంటే అది జీనీ. అతని రాకతోనే అసలు కథ మొదలవుతుంది. అరబిక్‌ జానపద కథ అయిన ఇందులో దర్శకుడు గై రిచీ పెద్దగా మార్పులు చేయలేదు. జాస్మిన్‌ ప్రేమ కోసం అద్భుత దీపాన్ని వెతుక్కుంటూ అలాద్దీన్‌ వెళ్లడం, అక్కడ జీని ప్రత్యక్షం కావడం మూడు వరాలు కోరుకోమనడం ఇవన్నీ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఒకసారి జీనీ తెరపైకి వచ్చిన తర్వాత కథలో సందడి మొదలవుతుంది. అతని సంభాషణలు, మాయలు, మంత్రాలు ఆకట్టుకుంటాయి. యానిమేషన్‌ సినిమాలో ఇదే అందరినీ ఆకర్షించే  అంశం. ఆ అంశాన్ని ఈసారి లైవ్‌ యాక్షన్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. సన్నివేశాలు సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 

ప్రథమార్ధంలో అల్లాదీన్‌ యువరాణి మనసు గెలుచుకునేందుకు పడే పాట్లు, ఆ తర్వాత జాఫర్‌ మాయలో పడటం, అద్భుత దీపం కోసం వెళ్లడం వంటి సన్నివేశాలతో సాగుతుంది. అసలు కథలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడనే చెప్పాలి. ఆ తర్వాత జీనీ రాకతో సన్నివేశాలన్నీ వేగంగా సాగిపోతాయి. ఎప్పుడైతే జాఫర్‌ పన్నాగం అలాదీన్‌, జాస్మిన్‌లకు తెలిసిందో.. అతడి ఆటకట్టించేందుకు ఏం చేశారన్న సన్నివేశాలను ద్వితీయార్ధంలో చూపించారు. అయితే, యానిమేటెడ్‌ సినిమా కన్నా ఇందులో జాస్మిన్‌ పాత్రను కాస్త బలంగా చూపించారు. జాఫర్‌ను ఎదుర్కొనేది కూడా ఆమే.

ఎవరెలా చేశారంటే: అలాద్దీన్‌ పాత్రలో మేనా మస్సౌడ్‌ చక్కగా సరిపోయాడు. వస్త్రధారణ, డైలాగ్‌ డెలవరీ, యాక్షన్‌ సన్నివేశాల్లో చక్కగా రాణించాడు. జాస్మిన్‌గా నవోమి స్కాట్‌ అందంగా కనిపించింది. అయితే, ఇందులో ఆమెది బలమైన పాత్ర. జాఫర్‌ ఆట కట్టించేది కూడా తనే. ఇక అందరికన్నా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విల్‌స్మిత్‌ గురించి. ఎందుకంటే జీనీగా విల్‌స్మిత్‌ చేస్తున్నారంటే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన నటన ముందు ఆ విమర్శలన్నీ ఎగిరిపోయాయి. డైలాగ్‌ డెలవరీ, హావాభావాలు పలికించడంలో స్మిత్‌ అదరగొట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే విల్‌స్మిత్‌ది వన్‌మెన్‌ షో అని చెప్పాలి. ఇక్కడ మరో విషయమేమిటంటే.. తెలుగులో విల్‌స్మిత్‌కు వెంకటేశ్‌, మేనా మస్సౌడ్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. 
సాంకేతికంగా... సినిమా అత్యున్నతంగా ఉంది. ఈ తరం వారి కోసం డిస్నీ అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. అయితే, బాలీవుడ్‌ సినిమాల తరహాలో పాటలను తెరకెక్కించడం అంతగా అతకలేదు. అవే కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు ప్రాణమని చెప్పాలి. దర్శకుడు గై రిచీ టేకింగ్‌ బాగుంది. కథలో పెద్దగా మార్పుల జోలికి పోలేదు. మాతృ కథతో పోలిస్తే, జాస్మిన్‌ పాత్రను బలంగా తీర్చిదిద్దాడు.

బలాలు బలహీనతలు
+ కథ
+ విల్‌స్మిత్‌
+ విజువల్‌ ఎఫెక్ట్స్‌
-తెలిసిన కథే కావడం
- పాటలు

చివరిగా: అలాద్దీన్‌ ఈ వేసవిలో అందరినీ అలరిస్తాడు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.