close

తాజా వార్తలు

రెండో రోజే అంత అసహనం ఎందుకు?: రోజా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపే వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా సభలో మాట్లాడుతూ.. స్పీకర్‌గా ఎన్నికైనందుకు తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపారు. ఎక్కడైనా మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు గతాన్ని ఉదాహరణగా తీసుకుంటామని.. ఈ రోజు సభలో కొందరు చెప్పిన మాటల విషయంలో తెదేపా ఎమ్మెల్యేలు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారో తనకు అర్థంకావట్లేదన్నారు. స్పీకర్‌ కుర్చీని అవమానించడం, దాన్ని దుర్వినియోగ పరచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇదే మొదటిసారి కాదని, గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయనను అవమానపరిచిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. ఈరోజు తమ్మినేనిని అగౌరవ పరిచిన తీరును సైతం ప్రజలు చూశారన్నారు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమ్మినేని ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికైనందుకు అంతా సంతోషించాలి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లావాసులు చాలా ఆనందపడాలి’ అని రోజా అన్నారు. కానీ తమ్మినేని సభాపతి అయినందుకు అచ్చెన్నాయుడికి సంతోషం కంటే కడుపుమంటే ఎక్కువగా ఉన్నట్టు ఆయన మాటల్లో కనబడుతోందని విమర్శించారు.  

గతంలో కాల్‌మనీ వ్యవహరంలో తాను అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిన వ్యవహారంలో స్పీకర్‌ స్థానాన్ని దుర్వినియోగం చేసి నిబంధనలకు విరుద్ధంగా తనను ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మధ్యంతర తీర్పుతో వస్తే కనీసం న్యాయస్థానం ఆదేశాలను సైతం గౌరవించలేదని, లోపలికి రానీయకుండా మార్షల్స్‌తో తనను బయటకు పంపిన తెదేపా ఎమ్మెల్యేలు ఈ రోజు సభా సంప్రదాయాల గురించి మాట్లాడటమంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. శాసనసభకు అంతా ఎన్నో ఆశలతో వస్తారని, వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి ఐదేళ్లలో మంచిపేరు తెచ్చుకోవాలని వస్తారన్నారు. గత ప్రభుత్వం అధికారం, అహంకారంతో ప్రవర్తించిందని విమర్శించారు.  ప్రతిపక్షంలో కూర్చున్న రెండో రోజుకే అంత అసహనం ఎందుకు? ఎంతో గౌరవంతో జగన్‌ అన్ని విషయాల్లో ఆచితూచి ప్రతిఒక్కరినీ గౌరవిస్తూ సామాజిక న్యాయం చేస్తూ ముందుకెళ్తుంటే.. తెదేపా నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేయడమెందుకని ప్రశ్నించారు. ‘అనుభవం ఉందన్నారు. హుందాతనంతో వచ్చి స్పీకర్‌ను కూర్చోపెట్టొచ్చు కదా’ అని చంద్రబాబును ఉద్దేశించి రోజా వ్యాఖ్యానించారు. బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పిన సీఎం జగన్‌.. ఆ మాటను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. సభాపతి స్థానం తండ్రి స్థానం లాంటిదని.. అందరి పిల్లల్ని సమానంగాచూడాల్సిన బాధ్యత సభాపతిపైనే ఉంటుందన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశం అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.