close

తాజా వార్తలు

‘పెళ్లి తర్వాత ఆఫర్లు తగ్గాయి’

‘బ్యాంక్‌ ఖాతాలో రూ.50 లక్షలుంటే చాలనుకున్నా’

 

హైదరాబాద్‌: నటిగా కెరీర్‌ను ప్రారంభించకముందు చాలా కష్టాలు ఎదుర్కొన్నానని సినీ నటి సమంత అన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సామ్‌ నేడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని సామ్‌ తాజాగా చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జులై 5న విడుదల కాబోతున్న తన తర్వాతి సినిమా ‘ఓ బేబీ’ గురించీ ముచ్చటించారు. ఆ విశేషాల్ని ఓసారి చూద్దాం..

* గత ఏడాది మీరు నటించిన ఐదు సినిమాలు వచ్చాయి? చిత్ర పరిశ్రమలో బాగా కష్టపడుతున్న నటి మీరే అనుకుంటా?
సమంత: లేదు. నా కంటే బాగా కష్టపడే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. నాకు తెలిసి నేను ఎంచుకుంటున్న స్క్రిప్ట్‌ వల్ల ఈ విజయం సాధ్యం అవుతోందేమో. చిత్ర పరిశ్రమకు ఒంటరిగా వచ్చా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా. గత రెండేళ్లుగా ఇంకా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నా. దాని ఫలితమే ఇది.

* ‘ఓ బేబీ’ సినిమా కథలో మీకు ఆసక్తిగా అనిపించిన అంశం?
సమంత: నేను మాతృక (కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’)ను చూశా. దీన్ని దాదాపు ఏడు భాషల్లో రీమేక్‌ చేశారు. ఇది తప్పకుండా ప్రేక్షకులకు చూపించాల్సిన కథ అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్లి హత్తుకుని.. ‘నీ డ్రీమ్‌ ఏంటమ్మా?’ అని అడగాలి అనిపించింది. ఓ కుమార్తెగా ఇప్పటి వరకు నేను మా అమ్మను ఆ ప్రశ్న అడగలేదు. అమ్మ, అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటుంటారు. కానీ, వారు జీవితంలో ఏం కావాలనుకున్నారనే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకుని ఉండం. ఈ సినిమా నిజంగా అందరి కళ్లు తెరిపిస్తుంది. మన అమ్మలు, అమ్మమ్మలు మన కోసం చేసిన త్యాగాలు ఈ సినిమా తర్వాత గుర్తొస్తారు.

* ఇది ఫెమినిస్ట్‌ భావాలున్న సినిమానా?
సమంత: ఇది ఫెమినిస్ట్‌ సినిమా కాదు. అన్నీ అంశాలు ఉంటాయి. ఈ సినిమా కోసం చాలా మంది మహిళలు పనిచేశారు. నా టీం పట్ల గర్వంగా ఉన్నా.

* మీ భర్త నాగచైతన్య (మీ భర్త చైతన్య అనడం కన్నా.. నన్ను చైతన్య భార్య అంటే నాకు ఇష్టం) ‘ఓ బేబీ’ సినిమా ట్రైలర్‌ వచ్చినప్పుడు.. ‘ఈ పాత్ర ‘సో యూ’’ అని అన్నారు. దానర్థం ఏంటి?
సమంత: నేను ఫన్నీగా ఉంటాను కాబట్టి అలా అని ఉంటారు. ఇంట్లో, ఫ్యామిలీ ఫంక్షన్లలో నేను ఓ కమెడియన్‌లా ఉంటాను (నవ్వుతూ). ఆఫ్‌ స్క్రీన్‌లో ఎలా ఉంటానో అలాంటి పాత్రను పోషించడం సంతోషంగా అనిపించింది. చైతన్య సినిమా చూశారు. చాలా సంతోషించారు.

* మీరు 45 సినిమాల్లో నటించారు. సినీ కెరీర్‌ ప్రారంభంలో మీ అభిప్రాయాలు, ఇప్పటి అభిప్రాయాల మధ్య తేడా ఏంటి?
సమంత: ఓ నటిగా ముందు ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి. ఇతరుల్ని చూసి నేర్చుకోవాలి, స్ఫూర్తి పొందాలి. ఒక్కోసారి తప్పులు చూస్తుంటాం. అవి నేర్పిన గుణపాఠం మర్చిపోకూడదు.

* 2015లో మీరు నటనకు దూరం కావాలి అనుకుంటున్నానని అన్నారు. ఐదు పాటలు, ఓ సీన్‌లో నటించి అలసిపోయానని ఎందుకు అన్నారు?
సమంత: అవును.. నాకు సరిపోయే పాత్రలు కాకుండా సరిపోని, సూట్‌ కాని వాటిని చేయడం గురించి అప్పుడు మాట్లాడా. వాటిని దాటుకుని రావడానికి చాలా రోజులు పట్టింది.

* ‘సూపర్‌ డీలక్స్‌’లో మీకు ఏం నచ్చింది? సాధారణంగా ఓ కథానాయిక ఇలాంటి పాత్రను చేయడానికి ఇష్టపడదు కదా?

సమంత: ఈ పాత్ర కోసం చాలా మంది నటీమణుల్ని సంప్రదించారు. కానీ వారంతా తిరస్కరించారు. ఈ పాత్ర నన్ను చాలా భయపెట్టింది. షూటింగ్‌లో పాల్గొన్న తర్వాతి మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. అంతలా భయపడ్డా. ఈ పాత్రలో నటించడం ఫన్‌గానూ అనిపించింది.

* ‘మజిలీ’లో ఏం నచ్చింది?
సమంత: శ్రావణి ఉన్నత స్థాయికి ఎదిగినా, స్వతంత్రంగా జీవించగలిగినా.. తను ఇష్టపడ్డ వ్యక్తి కోసం బాధను భరిస్తుంది. ఈ పాత్రను నేను చాలా నమ్మా.  కనీసం క్లైమాక్స్‌లో కూడా ఆమె.. ‘ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు’ అని అనలేదు.

*మీ భర్తతో కలిసి మరోసారి పనిచేయొచ్చని ఈ సినిమా చేశారు అనడంలో ఎంత మాత్రం నిజం ఉంది?
సమంత: వృత్తిని.. వ్యక్తిగతానికి నేనెప్పుడూ ముడివేయను.

* పెళ్లి తర్వాత జీవితం, కెరీర్‌ ఎలా మారింది?
సమంత: పెళ్లికి ముందు వచ్చినన్ని ఆఫర్లు ఇప్పుడు రావడం లేదు. బహుశా నాతో ఎలాంటి సినిమా చేయాలో తెలియడం లేదనుకుంటా (నవ్వుతూ).

* మీరు, చై జంటగా వచ్చిన తొలి సినిమా ‘ఏమాయ చేసావె’. ఇప్పుడు మళ్లీ ‘మజిలీ’లో నటించారు. అప్పటికీ ఇప్పటికీ సెట్‌లో మీకున్న తేడా?
సమంత: చాలా మారింది. నా భర్త చైతన్య చాలా ఏకాగ్రతగా ఉంటున్నారు. బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నేను నా తొలి సినిమా సమయంలో ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి అని తపన పడుతున్నా. ఇప్పుడు చైతన్యలో నాకు బాధ్యతగల నటుడు కనిపిస్తున్నాడు.

* ఇటీవల గర్భవతి అని వచ్చిన వదంతుల్ని ఖండించారు. ఈ వార్త చూసినప్పుడు ఏం అనిపించింది?
సమంత: విమర్శలు నన్ను తొలుత చాలా బాధించేవి. ఉదయం నిద్రలేచి కామెంట్స్‌ చూసేదాన్ని. అవి నన్ను మానసికంగా చాలా బాధపెట్టేవి. మెంటల్‌గా స్థిరంగా ఉండలేకపోయేదాన్ని. అప్పుడు నాకు మరొకరి సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఓ అంశంపై వివరణ ఇవ్వడం అవసరం అనిపించేది. కానీ ఇప్పుడు నేను మారిపోయా. అన్నింటినీ ఫన్నీగా తీసుకుంటున్నా. పరిస్థితుల్ని అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఓ పోస్ట్‌, ఫొటో షేర్‌ చేసే ముందు దానికి ఎలాంటి విమర్శలు వస్తాయో కూడా ముందే ఊహిస్తున్నా.

* మీకు 7.5 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు? దక్షిణాదిలో ఇది చాలా అరుదు. దానిపై మీ అభిప్రాయం?
సమంత: కొందరు ఉన్నట్లు ఇంకొందరు ఉండరు. ఎవరైనా తప్పుగా మాట్లాడినా.. నేను ఆ ట్వీట్‌ డిలీట్‌ చేయను.  పోనీలే.. అనుకుంటా.

* మీరు అగ్ర కథానాయకులతో కలిసి పనిచేశారు. ఎవరితో సౌకర్యవంతంగా అనిపించింది?
సమంత: నేను పనిచేసిన వారంతా నాకు మంచి స్నేహితులే. నేను ఒకరి పేరు ఎంచుకోలేను. అందరితోనూ నాకు మంచి బంధం ఉంది.

* మహిళల్ని మీరు చాలా ప్రోత్సహిస్తుంటారు?
సమంత: అవును మమ్మల్ని మేమే ప్రోత్సహించుకోవాలి. వేరే వ్యక్తులు మాకు అండగా ఉండటం సాధ్యం కాని పని. అమ్మాయిలు (చిత్ర పరిశ్రమలో నటీమణులు).. మనమంతా ఒకటి అనుకోవాలి. మా మధ్య మంచి బంధం కూడా ఉంది. అది మీకు సోషల్‌మీడియాలో కనిపిస్తుంటుంది. ఒకరినొకరం సపోర్ట్‌ చేసుకుంటాం.

* సామాజిక సేవలో పాల్గొంటున్నారు. పిల్లలు, మహిళల వైద్యానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. దీనికి కారణం? 
సమంత: నేను సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. అప్పట్లో ఓ సొంత ఇల్లు, బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.50 లక్షలు ఉంటే చాలు అనుకునేదాన్ని. ఓ విధంగా అదే నా డ్రీమ్‌ (నవ్వుతూ). అది సాధించా.. దానికి మించి నాకు దక్కిందంతా నేను కావాలి అనుకున్నది కాదు. నేను, మా అమ్మ జీవితంలో ఎంతో కష్టపడ్డాం. ఇతరులు వచ్చి మాకు సహాయం చేసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు ఆ ఫీలింగ్‌ తెలుసు. అందుకే సహాయం చేస్తున్నా.

* దర్శకత్వం, నిర్మాణంపై ఆసక్తి ఉందా?
సమంత: భవిష్యత్తులో కచ్చితంగా సినిమాలు నిర్మిస్తా. కానీ దర్శకత్వం నా వల్ల కాదు (నవ్వుతూ). నాకు అంత ఓపిక లేదు.

* స్క్రిప్టు ఎంపికలో మీ వ్యూహం ఏంటి?
సమంత: నేను ప్రేక్షకుల స్థానంలో ఉండి ఆలోచిస్తా. అలానే కథ ఎంచుకుంటా.

* మీ తొలి ఫైల్యూర్‌?
సమంత: నా తొలి ఐదు సినిమాలు హిట్‌ అయ్యాయి. ప్రజలు నాకు ఫోన్‌ చేస్తూనే ఉన్నారు. ఇది అద్భుతమైన ప్రయాణం, నీది గోల్డెన్‌ లెగ్‌ అన్నట్లు మాట్లాడారు. అదే సినిమా ఏ మాత్రం బాలేదు అనుకోండి.. హీరోయిన్‌నే తప్పుపడతారు. ఆమెపై మూడు పాటలు, సీన్లు ఉన్నా అలానే మాట్లాడుతారు. ఆ హీరోయిన్‌ది ఐరన్‌ లెగ్‌ అంటారు. దర్శకుడ్ని, రచయితని, ఇతరుల్ని ఏం అనరు.

* ఇంత ఆరోగ్యంగా ఉండటం వెనుక రహస్యం?
సమంత:  విషయం నన్ను సోషల్‌మీడియాలో ఫాలో అయ్యే వారికి బాగా తెలుస్తుంటుంది. నేను ఎక్కువ జిమ్‌ ట్రైనింగ్‌లో ఉంటా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.