close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజకీయ పార్టీలు అలాంటి వాళ్లను పెంచి పోషిస్తున్నాయి

ఒకప్పుడు నిర్మాతకు మంచి గౌరవం ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా పోయిందని, నిర్మాత కేవలం డబ్బులు ఇచ్చే ఒక యంత్రంలా మాత్రమే పనిచేస్తున్నాడని అంటున్నారు దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘కోతలరాయుడు’, ‘మొగుడు కావాలి’ వంటి హిట్‌ సినిమాలను నిర్మించి, ‘అలజడి’తో దర్శకుడిగా తనదైన ముద్రవేశారు. ఈటీవీ వార్తా ఛానల్‌లో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానిక విచ్చేసి తన 40ఏళ్ల సినీ ప్రస్థానంలోని ఎన్నో సంగతులను పంచుకున్నారిలా.. 

నీటిపారుదలశాఖలో ఇంజినీర్‌గా జీవితం ప్రారంభించారు? బహుశా ఇప్పటికీ అదే ఉద్యోగంలో ఉంటే ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ అయ్యేవారు కదా!
తమ్మారెడ్డి భరద్వాజ: పదవీ విరమణ కూడా చేసి ఉండేవాడిని(నవ్వులు)

40ఏళ్ల సినీ ప్రస్థానంలో అక్కడే ఉంటే బాగుండేది అనిపించిందా?
తమ్మారెడ్డి భరద్వాజ: అనిపించలేదు. ఎందుకంటే సినిమా అనేది గ్లామర్‌ ఫీల్డ్‌. ఒక గ్లామర్‌ వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్లలేం. పూట గడవక పోయినా జనం ఇక్కడే ఎందుకు ఉంటారంటే, ఆ గ్లామర్‌ కోసం. ఈ ఇండస్ట్రీలో నాకు తెలియకుండా నాకే ఓ గ్లామర్‌ వచ్చింది. దాన్ని వదులుకునేందుకు ప్రయత్నం చేయలేదు. నాతో పాటు వచ్చిన వాళ్లలో చాలామంది విజయవంతమైన వాళ్లు ఉన్నారు. నాకు ఆశించినంత సక్సెస్‌ లేకపోయినా, వారికి నేనేమీ తీసిపోను. 

సినిమా రంగంలో మీకు ప్రేరణ ఏంటి?
తమ్మారెడ్డి భరద్వాజ: యాదృచ్ఛికంగా వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. నాన్నగారు సినిమాల్లో ఉండేవారు. అన్నయ్య దర్శకత్వం వహించేవారు. కానీ, నేనెప్పుడూ షూటింగ్‌లకు వెళ్లలేదు. ఒకరోజు అనుకోకుండా ఇటువైపునకు రావాల్సి వచ్చింది. 

మీకు కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ ఉందా?
తమ్మారెడ్డి భరద్వాజ: ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇంజినీరింగ్‌ చేసి ఉద్యోగం కూడా చేస్తున్నా. దాన్ని వదిలేసి ఇటువైపు రావడం నచ్చలేదు. అప్పటికే మా కుటుంబం ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడుతోంది. ‘మేమిద్దరం కష్టాలు పడుతున్నాం. నువ్వెందుకు’ అనేవారు. మా అమ్మానాన్నలతో పాటు, నా భార్యా పిల్లలకు కూడా నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. 

రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆఖరికి నటుడిగానూ కనిపించారు. సినిమా నిర్మాణంలో ఎందుకు కొనసాగలేకపోయారు? 
తమ్మారెడ్డి భరద్వాజ: ఒకటి వయసు. మరొకటి జనరేషన్‌ గ్యాప్‌ వచ్చేసింది. ఐదారేళ్లు గ్యాప్‌ తర్వాత ‘పోతే పోనీ’ చేశా. సమకాలీన అంశమే కానీ, పెద్దగా ఆడలేదు. మనం చూపించే విధానం ప్రజలకు నచ్చలేదు. ఆ తర్వాత ఐదారేళ్లకు ‘ప్రతిఘటన’ తీశా అదీ చూడలేదు. నాకు నేనుగా మంచి కథలే రాసుకున్నా.. అవి ప్రజలకు నచ్చలేదు. ఈ విషయంలో ప్రేక్షకులనూ తప్పు పట్టలేం. ‘వీళ్లకు మంచి సినిమాలు చూడటం కూడా రాదు’ అని తిట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఆలోచిస్తుంటే, వాళ్లకు కావాల్సిన విధంగా మనం చెప్పలేకపోతున్నామేమో అనిపిస్తోంది. 

చిరంజీవి తదితర పెద్దనటులతో మీరు సినిమాలు చేశారు? వాళ్లతో పనిచేయడం ఎలా అనిపించేది?
తమ్మారెడ్డి భరద్వాజ: అప్పట్లో ఎవరూ వాళ్లు హీరోలని, మేము నిర్మాతలమనే భేదాలు ఉండేవి కావు. అందరితో కలిసిపోయేవాళ్లం. అందరూ తమ సొంత సంస్థ అని పనిచేసేవారు.

దాసరితో సినిమాలు ఏమైనా చేశారా?
తమ్మారెడ్డి భరద్వాజ: ఆయనతో సినిమాలు ఏమీ చేయలేదు కానీ, ‘స్వర్ణక్క’లో ఒక వేషం వేశారు. డబ్బులు తీసుకోకుండా చేశారు. ఆయనతో కలిసి ఎక్కువ కాలం పనిచేశా. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరికి సాయం కావాలన్నా నన్ను పక్కన పెట్టుకుని ఆ కార్యక్రమాలు నిర్వహించేవారు. 

మీ మధ్య విభేదాలు కూడా వచ్చాయని విన్నాం!
తమ్మారెడ్డి భరద్వాజ: ఇద్దరం కొట్టుకోవడం తప్ప అన్నీ జరిగాయి. (నవ్వులు) ఆయనలో ఒక మంచి గుణం ఉంది. అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేవారు. తన దగ్గరకు వచ్చిన వాళ్లందరికీ మంచి చేయడానికి ప్రయత్నించేవారు. అవుతుందా? లేదా? అన్నది కూడా ఆలోచించేవారు కాదు. సినిమా ఇండస్ట్రీలో హీరోలను మించి ఎదిగిన మనిషి. ఆయన లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాం. నిజం చెప్పాలంటే ఆయన వల్లే నాకు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌, పరిచయాలు పెరిగాయి. ఆయన నన్ను సంప్రదించకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ పనీ చేసేవారు కాదు. అందుకే అందరూ నన్ను కూడా గౌరవించేవారు. ఒకసారి ఆయనతో గొడవైతే మా ఇంటి ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ చేసి మా ఆవిడతో మాట్లాడుతూ.. ‘చూడమ్మా! భరద్వాజ నాతో మాట్లాడి 15 రోజులైంది. నా మీద ఏదైనా కోపం ఉంటే వచ్చి నేరుగా పోట్లాడవచ్చు కదా!’ అని అనేవారట.

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లతో పరిచయాలు ఎలా ఉండేవి?
తమ్మారెడ్డి భరద్వాజ: ఎన్టీఆర్‌తో నాకు పెద్దగా పరిచయాలు లేవు. నాన్నగారు సినిమాలు తీశారు. నేను ఒకట్రెండు సార్లు కలిశాను అంతే. అన్నయ్యకు బాగా పరిచయం ఉంది. నాగేశ్వరరావుగారితో బాగా మాట్లాడేవాడిని. దాసరిగారు, రాఘవేంద్రరావుగారు తాము తీయబోయే సినిమా కథను నాకు కూడా చెప్పేవారు. వారు చెప్పిన కథకు నా నుంచి ఏవైనా సలహాలు వస్తాయేమోనని అనుకునేవాళ్లు. సినిమా రషెస్‌ కూడా చూపించేవారు. మూడు రోజుల గ్యాప్‌తో ‘ప్రేమాభిషేకం’, ‘శ్రీవారి ప్రేమలేఖలు’ చూశా. మొదట ‘శ్రీవారి ప్రేమలేఖలు’ చూసి బాగానే ఉందని వెళ్లిపోయాను. ‘ప్రేమాభిషేకం’ చూసి బయటకు వచ్చాను. అప్పుడే దాసరిగారు, నాగేశ్వరరావుగారు బయట నిలబడి ఉన్నారు. నేను వాళ్లను చూసి మాట్లాడకుండా వెళ్లిపోయాను. మరుసటి రోజు నాగేశ్వరరావుగారు సెట్‌కు వచ్చారు. ‘ఏంటయ్యా! రాత్రి సినిమా చూసి మాట్లాడకుండా  వెళ్లిపోయావు’ అని అడిగారు. ‘సర్‌ సినిమా చూసిన తర్వాత నాకు ఏడుపు ఆగలేదండీ. మాట్లాడే పరిస్థితి కూడా లేక వెళ్లిపోయాను సర్‌. చాలా బాగుంది. సూపర్‌ సినిమానండీ’ అన్నా. ‘పాటలు కూడా లేవు కదా. ఎలా చెబుతావు’ అన్నారు. ‘లేదండీ బాగా ఆడుతుంది’ అని చెప్పా. ‘నాకు మాత్రం శ్రీవారికి ప్రేమలేఖలు ఆడుతుంది అనిపిస్తోంది. దీన్ని హిందీలో అమితాబ్‌తో, ప్రేమాభిషేకం జితేంద్రతో చేద్దామని అనుకుంటున్నా ’ అన్నారు. ‘లేదు సర్‌! ప్రేమాభిషేకం పెద్ద సినిమా అవుతుంది. అది చిన్న సినిమా అవుతుంది’ అని చెప్పా. రెండూ విడుదలయ్యాయి. ఏం జరిగిందో మీకు తెలుసు. 

సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో ఏయన్నార్‌ ‘పిల్ల జమీందారు’ చేశారు. అందులో ఒక క్లబ్‌ సెట్‌ను అన్నపూర్ణా స్టూడియోస్‌లో వేశారు. అప్పట్లో చాలా ఖర్చుతో కూడుకున్న సెట్‌ అది. ‘మొగుడు కావాలి’ సినిమా కోసం ఆ సెట్‌ అడిగాం. ‘నువ్వు భరించలేవయ్యా! మేము వేసే ఛార్జీలు కట్టలేరు’ అన్నారు. ‘నాకోసం తగ్గించి ఇవ్వొచ్చు కదా’ అని అడిగా. ‘నేను ఇవ్వను. నీ సినిమాకు తగ్గిస్తే, భరద్వాజకు తగ్గించావు కదా! మాకెందుకు తగ్గించి ఇవ్వరు? అని మరొకరు అడుగుతారు. దాంతో మా మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. అయితే, నీ దగ్గర ఎంత ఉంటే అంతే ఇవ్వు. నా దగ్గర ఉన్న మెటీరియల్‌ మొత్తం ఫ్రీ గా వాడుకుని సెట్‌ వేసుకో’ అని అన్నారు. రెండు రోజుల తర్వాత నేను షూటింగ్‌ వెళ్తే, నా సినిమా సెట్‌ ముందు నాగేశ్వరరావుగారు కనిపించారు. ‘సారీ! భరద్వాజ. సెట్‌ లేటైంది. ఓ గంట ఓపిక పట్టు సెట్‌ పూర్తి చేసి ఇచ్చేస్తాం’ అన్నారు. అంత పెద్ద వ్యక్తి నాకు సారీ చెప్పాల్సిన పనిలేదు. కానీ, చెప్పారు. అది ఆయన గొప్పతనం. అందుకే మహానటుడు అయ్యారు.

ఏదో సినిమా విషయంలో హీరో కృష్ణతో విభేదించారట!
తమ్మారెడ్డి భరద్వాజ: (నవ్వులు) ఆ సినిమాకు సత్యమూర్తి కథ ఇచ్చారు. అందులో సిల్క్‌ స్మితకు బాబూమోహన్‌ ఫ్యాన్‌. అతన్ని తీసుకొస్తే కొన్ని రహస్యాలు చెబుతాడు. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుని క్లైమాక్స్‌లో సాంగ్‌ కూడా పెట్టాం. ఈ విషయంలో మొదటి నుంచీ నాకూ, కృష్ణగారికి కాస్త వాగ్వాదం జరిగింది. ‘సిల్క్‌స్మిత పాటలో మీరు ఉండకూడదు’ అని నేను అంటే, ‘సిల్క్‌ స్మిత ఉండీ, నేను పాటలో కనిపించకపోతే, నా ఫ్యాన్స్‌ ఒప్పుకోరు. ఉండి తీరాలి’ అన్నారు. సినిమా అయిపోయినా, ఈ పంచాయతీ తేలలేదు. పాట ఒక్కటే మిగిలిపోయింది. సెట్‌ కూడా వేశాం. మళ్లీ చర్చ పెట్టాం. ఆయన ఒప్పుకోలేదు. ‘ఉదయం కృష్ణగారితో.. సాయంత్రం బాబూమోహన్‌తో పాట తీయ్‌’ అని ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు. ‘నేను ఆ పాట తీయలేను’ అని చెప్పా! ‘అయితే డ్యాన్స్‌ మాస్టర్లకు వదిలేసి నువ్వు వెళ్లిపో. వాళ్లనే తీసుకోమని చెప్పు’ అన్నాడు. సర్లేనని అలాగే చేశా. బాబూమోహన్‌తో తీసిన పాట పెట్టి సెన్సార్‌కు పంపాం. అక్కడ సిల్క్‌స్మిత పాటకు కట్‌ వచ్చింది. బాబూమోహన్‌తో తీసిన పాటను పెట్టి సెన్సారుకు పంపామన్న సంగతి కృష్ణగారికి తెలియక  ‘అది ఎలా కట్‌ చేస్తారు. సిల్క్‌స్మిత పాట ఉండాలి. నేను సెన్సార్‌ వాళ్లతో మాట్లాడతా ’ అని ఆయన సెన్సార్‌ బోర్డుకు వెళ్లారు. అప్పుడు సెన్సార్‌బోర్డు ఛైర్మన్‌గా సుబ్బరామిరెడ్డిగారు ఉన్నారు. ఆయన కృష్ణను తీసుకెళ్లి పాట చూపించారు. పాట చూడగానే కృష్ణగారికి కోపం వచ్చింది. తనతో తీసిన పాట పెట్టలేదని అప్పుడు ఆయనకు అర్థమైంది. వెంటనే బయటకు వచ్చి ‘నో మోర్‌ ఫ్రెండ్స్‌’ అంటూ నాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత కృష్ణగారు సిల్క్‌స్మితను పిలిచి మళ్లీ ఆ పాటను తీసి, రెండో వారంలో యాడ్‌ చేశారు. 

మీకు కోపం ఎక్కువట!
తమ్మారెడ్డి భరద్వాజ: మనసులో పెట్టుకుని ఎవరిపైనా కోప్పడిన సందర్భాలైతే లేవు. అప్పటికప్పుడు వచ్చిన కోపాలే అవి. నా కెరీర్‌లో అతి పెద్ద వివాదం అంటే దాసరి, కృష్ణగార్లతోనే జరిగింది. మిగతా వాళ్లతో జరిగినవన్నీ చిన్న చిన్నగొడవలే. పగలు, ప్రతీకారాలు పెట్టుకుంటే మనకు ఏదీ రాదు. 

ఒకప్పుడు నటులు, దర్శకులు నిర్మాతలకు అనుకూలంగా ఉండేవారు. కానీ, ఇప్పుడు చాలా మంది అనేక విషయాల్లో వేలు పెడుతుంటారని అంటారు? ఎంత వరకూ నిజం!
తమ్మారెడ్డి భరద్వాజ: మీరు చెప్పింది 100శాతం నిజం. ఒకరిద్దరు దర్శకులు తప్పిస్తే, చాలామంది చాలా విషయాల్లో కలగజేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నిర్మాతకు అసలు ఏ పాత్రాలేదు. కేవలం డబ్బులు పెట్టేవాడిగా మాత్రమే మిగిలిపోతున్నాడు. దిల్‌రాజు వంటి నిర్మాతలు చిన్న సినిమాలు చేసేటప్పుడు నిర్ణయాలు వారే తీసుకుంటారు. అదే పెద్ద హీరోల సినిమాలకొస్తే, వాళ్లు కూడా చేసేదేమీ ఉండదు. అప్పట్లో హీరోలు నిర్మాతకు గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు. డేట్స్‌ ఇచ్చి నిర్మాతకు ఫేవర్‌ చేశామన్న ధీమాలో ఉండిపోతున్నారు. 

దర్శక-నిర్మాతల మండలిలో మీ పాత్ర గురించి?
తమ్మారెడ్డి భరద్వాజ: 1993లో చిత్ర పరిశ్రమలో గొడవలు జరిగాయి. ప్రభాకర్‌రెడ్డిగారు అప్పట్లో డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు. ఒక రోజు నేను రోడ్డు మీద ఉంటే నన్ను కారు ఎక్కించుకుని తీసుకెళ్లి, ‘నేను అధ్యక్షుడిగా దిగిపోతున్నా. ఈయనే కొత్త ప్రెసిడెంట్‌’ అన్నారు. నేను ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఫెడరేషన్‌ సెక్రటరీగా కూడా చేశా. సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలా విషయాలను చక్కదిద్దా. అప్పుడే 24 ఫ్రేమ్స్‌కు 24 యూనియన్లు చేశాం. ఆలిండియా కాన్ఫడరేషన్‌ గుర్తింపు తీసుకొచ్చాం. వేతనాలను అగ్రిమెంట్‌ చేయించాం. ఇండస్ట్రీకి సాయం చేయడంలో నా వంతు కృషి చేశానని చెప్పడానికి గర్వపడుతున్నా. 

‘మా’లో సభ్యత్వం కావాలంటే రూ.లక్ష కట్టాలి. చిన్న వాళ్లకు ఇది సాధ్యమయ్యే పనేనా?
తమ్మారెడ్డి భరద్వాజ: చాలా తక్కువని నా అభిప్రాయం. కొన్ని యూనియన్లలో చేరాలంటే ఐదారు లక్షల రూపాయలు కట్టాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చా. ఎందుకంటే కొత్తవాళ్లు మూడేసి లక్షల రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు. ఇది అన్యాయమని చెబుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను ఉండగా, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కు రూ.25వేలు మాత్రమే ఉండేది. 

ఇటీవల సోషల్‌మీడియాలో మీరు చురుగ్గా ఉంటున్నారు కదా! మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలపై స్పందనలు ఎలా ఉంటాయి?
తమ్మారెడ్డి భరద్వాజ: విమర్శకులు ఎక్కడైనా ఉంటారు. వారిని పట్టించుకోకూడదు. కానీ, ఇక్కడ కేవలం విమర్శించడానికే కొందరు ఉంటారు. అనకూడదు గానీ, రాజకీయ పార్టీలు కూడా వాళ్లకు డబ్బులిచ్చి పోషిస్తున్నాయి. వారిని పెయిడ్‌ ట్రోలర్స్‌ అంటారు. నేను సోషల్‌మీడియాలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. చాలా మంది నా అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. మెచ్చుకుంటారు. మంచి కావాలని కోరుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు.

బాలీవుడ్‌లో వచ్చినన్ని ప్రయోగాత్మక చిత్రాలు మనకెందుకు రావడం లేదు?
తమ్మారెడ్డి భరద్వాజ: ఇక్కడ ప్రయోగాలు చేయడానికి భయపడుతుంటారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు మంచి వేషాలు వేయాలని ఆలోచించేవారు గానీ, రికార్డుల కోసం చూడలేదు. అలా చూసుకుని ఉంటే, ఎన్టీఆర్‌ ‘పిచ్చి పుల్లయ్య’ తీసేవారు కాదు. ఏ హీరో అయినా, రావణాసురుడి వేషం వేస్తారా? కానీ, ఎన్టీఆర్‌ వేశారు. ఎందుకంటే ఆయన తనని తాను నటుడిగా నిరూపించుకోవడానికి తాపత్రయ పడేవారు. ఇప్పుడు వచ్చేవాళ్లు, రికార్డులు క్రియేట్‌ చేయాలని చూస్తున్నారు. ‘జనతా గ్యారేజ్‌’, ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’, ‘ఖైదీ నంబర్‌ 150’ ఇలాంటి సినిమాల్లో కమర్షియల్‌ వాల్యూస్‌ ఉంటూనే సమస్యలపై పోరాటం చేస్తాయి. 

పగలు, ప్రతీకారాలు నేపథ్యంలో సాగే సినిమాల ప్రభావం సమాజంపై ఎలా ఉంటుంది? దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు?
తమ్మారెడ్డి భరద్వాజ: మనిషిపై సినిమా ప్రభావం ఉంటుందా? అన్న దానికి సమాధానం ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా యువతపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. తమ అభిమాన హీరో ఏం చేస్తే అది చేద్దామని అనుకుంటారు. అయితే, పరిణతి చెందిన వారిలో ఆ సినిమా ప్రభావం ఏమీ కనిపించదు. కానీ, సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ పరిణతి చెందిన వ్యక్తి తన పిల్లలను అలాంటి సినిమాలకు తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్లపై ప్రభావం చూపుతుంది. ఫలానా సినిమా చూడొద్దని సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినప్పుడు పిల్లలను తీసుకుని ఆ సినిమాకు వెళ్లకూడదు. అదేమంటే ‘మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం’ అని ప్రేక్షకులు ‘మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం’ అని చిత్ర పరిశ్రమలోని వాళ్లు చెబుతున్నారు. సమాజంలో ఉన్నదే మేము చూపిస్తున్నాం.

టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పూర్తి సినిమా పైరసీ అయిపోతోంది? బుల్లితెరపైనే సినిమా విడుదల చేసి, నిర్ణీత రుసుం వసూలు చేయాలని కమల్‌హాసన్‌ ప్రతిపాదించారు. దీనిపై మీ అభిప్రాయం?
తమ్మారెడ్డి భరద్వాజ: త్వరలో ఆ పద్ధతి కూడా వస్తుంది. అప్పట్లో హోమ్‌ థియేటర్‌ కావాలంటే చాలా పెద్ద తతంగం ఉండేది. అప్పట్లో సౌండ్‌ సిస్టమ్‌ అంటే ఐదారు లక్షల రూపాయలు అయ్యేది. ఇప్పుడు సైజు బట్టి రూ.5 వేలకు కూడా దొరుకుతున్నాయి. కొత్త సినిమాకు రూ.200 పెట్టినా కుటుంబం మొత్తం హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడవచ్చు. 

మీ 40 ఏళ్ల కెరీర్‌లో అసంతృప్తికి గురి చేసిన సందర్భాలు ఏవి? 
తమ్మారెడ్డి భరద్వాజ: సినిమా అపజయాలు వచ్చినప్పుడు అసంతృప్తి తప్ప పెద్దగా నేను నిరాశపడిన సందర్భాలు లేవు. చిత్ర పరిశ్రమకు వచ్చినప్పుడు నేనేమీ తీసుకురాలేదు. నేను మీ ముందుకు కూర్చొని మాట్లాడే స్థాయికి వచ్చానంటే అసంతృప్తి ఉంటే వచ్చేవాడిని కాదు. జీవితమంటే పోరాడాలి. నేను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. ఆర్థికంగా చాలా సార్లు ఇబ్బందిపడ్డా. అయినా, నేను అసంతృప్తికి గురికాలేదు. 

మీ ప్రస్థానంలో మీ తండ్రి, అన్నయ్య పాత్ర ఏంటి?
తమ్మారెడ్డి భరద్వాజ: నా సినీ కెరీర్‌లో వాళ్ల పాత్ర పెద్దగా లేదు. నేను సినిమాలకు వచ్చే సమయానికే అన్నయ్య సినిమా చేయడం మానేశారు.

మీ పిల్లలు ఏం చేస్తున్నారు?
తమ్మారెడ్డి భరద్వాజ: నాకు ముగ్గురు ఆడపిల్లలు. అందరూ విదేశాల్లో ఉన్నారు. 

సినిమాల్లో ఇది చేయలేకపోయాం అని అనుకున్నది ఏదైనా ఉందా?
తమ్మారెడ్డి భరద్వాజ: చాలా ఉన్నాయి. నేను మంచి దర్శకుడిని కావాలనుకున్నా. కానీ, కాలేకపోయా. చాలా గొప్ప సినిమాలు తీయాలి. మణిరత్నం, బాల చందర్‌, దాసరి, విశ్వనాథ్‌గార్ల స్థాయిలో సినిమాలు తీయాలని ఉండేది. కానీ, తీయలేకపోయా. బహుశా నాలో క్రియేటివిటీ తక్కువ ఉందా? లేదా ఇతర ఏమైనా కారణాలు అయి కూడా ఉండవచ్చు. అయితే, నాలో ఏదో లేదనుకోవడమెందుకు? పెద్ద నిర్మాత వచ్చి ఉంటే చేసి ఉండేవాడినేమో! ఇవన్నీ అనవసర ఆలోచనలు. మనకు ఉన్నది ఇది. 

మీలో స్ఫూర్తినింపిన దర్శకుడు?
తమ్మారెడ్డి భరద్వాజ: బాలచందర్‌, భారతీరాజా, మణిరత్నం. వీళ్లు తీసే ప్రతి సినిమా నాకు విపరీతంగా నచ్చుతుంది. హ్యూమన్‌ ఎమోషన్స్‌ తీసుకోవడంలో వారు దిట్ట. మరో దర్శకుడు ఆ స్థాయిలో వాటిని తీసుకోలేడు. 

ఇప్పుడున్న దర్శకుల్లో బాగా చేస్తున్నారు అనిపించిన దర్శకులు?
తమ్మారెడ్డి భరద్వాజ: పూరి జగన్నాథ్‌ మొదట్లో సినిమాలన్నీ ఇరగదీశాడు. అతడి సినిమాల్లో కాస్త రెబలిజం ఉంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు ఒరేయ్‌.. ఒసేయ్‌ అనుకొనేలా కాస్త చెడగొట్టాడేమో అనిపిస్తుంది(నవ్వుతూ). అదే సమయంలో ఎమోషన్స్‌ ఉంటాయి. మొదట్లో రామ్‌గోపాల్‌వర్మ తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని పెంచాడు. నేను కూడా ‘అలజడి’ మంచి సినిమాగా తీశా. అయితే, ‘శివ’ అనేది ఒక కల్ట్‌ ఫిల్మ్‌. నేను రాసుకున్నది రాసినట్లు తీస్తే మూడు గంటలు వచ్చింది. అయితే, దాన్ని రెండు గంటలకు తగ్గించాం. మొత్తం సినిమా ఉంచితే బాగా ఆడేదేమో! నాకే కొంత సినిమా అసంతృప్తి ఉంది. 

సినిమా నిర్మాణం బాగా ఖర్చు ఎక్కువైపోతోంది. ఫ్లాప్‌ అయితే, నిర్మాత కోలుకునే పరిస్థితి లేదు?
తమ్మారెడ్డి భరద్వాజ: ఈ విషయంలో నిర్మాతదే తప్పు. అన్నీ అంచనా వేసుకునే సినిమా తీయాలి. పిండి కొలదీ రొట్టె అన్నట్లు ఉండాలి. బడ్జెట్‌ పెంచుకునే సినిమా ఫ్లాప్‌ అయిందని అనడం తప్పు. 

విదేశాల్లో థియేటర్‌ ఆర్ట్‌ బాగుంది? ఇక్కడ సురభిలాంటి అద్భుతమైన సంస్థ కాల గర్భంలో కలిసిపోతోంది. దీనికి కారణం?
తమ్మారెడ్డి భరద్వాజ: ప్రోత్సాహం లేక. అంతర్జాతీయ స్థాయిలో నాటక ప్రదర్శన చేసే సత్తా వాళ్లకు ఉంది. నాంపల్లిలో వాళ్లు ఒక చిన్న టెంట్‌ వేసుకుని ఎందుకు ఉండాలి. వాళ్లని మరింత ప్రోత్సహిస్తే, ఇంకా బాగా రాణిస్తారు. ఒక రోజు నేను, క్రిష్‌ మరో వ్యక్తి టికెట్లు కొనుక్కొని వెళ్లాం. ముగ్గురి కోసం షో వేశారు. అద్భుత టెక్నాలజీతో నాటక ప్రదర్శన చేస్తున్న వాళ్లను మనం ఆదరించలేకపోతున్నాం. 

సినిమా నిర్మాణం నుంచి బయటకు వచ్చేశారా? ఇంకే ఏవైనా సినిమాలు చేస్తున్నారా?
తమ్మారెడ్డి భరద్వాజ: పలు సినిమాల్లో నా వంతు పాత్ర పోషిస్తున్నా. డబ్బింగ్‌ సినిమాలు చేస్తున్నాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.