close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మృగరాజు’ చేసిన తర్వాత చాలా ఫీలయ్యా!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేమకు గుర్తు తాజ్‌మహల్‌. కానీ, ఆ తాజ్‌మహల్‌కు గుర్తు ఆమే. ఆడవారికి అందం ‘సింధూరం’. కానీ ఆ సింధూరానికి అందం ఆమే. అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమెను చూస్తే, ‘ఆహా’ అంటారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన తార సంఘవి. అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారిలా..!

హాయ్‌ కావ్యా.. ఎలా ఉన్నారు?
సంఘవి: చాలా బాగున్నా. నా సొంతపేరు కావ్యా రమేష్‌. నా తొలి తమిళ చిత్రం ‘అమరావతి’ నిర్మాత కుమార్తె పేరు సంఘవి. ఆయన నా పేరును సంఘవిగా మార్చారు. ఆ పేరు అలా కొనసాగింది.

ఇప్పటివరకూ ఎన్ని సినిమాల్లో నటించారు?
సంఘవి: ఇప్పటివరకూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 99 సినిమాల్లో నటించా. నా 100వ చిత్రం మంచి సినిమా చేయాలి. లేకపోతే అసలు చేయకూడదనే నియమం పెట్టుకున్నా. హిందీలో నేను మిథున్‌ చక్రవర్తితో ఒకే ఒక సినిమా చేశా. 

తెలుగులో మీ మొదటి సినిమా రామానాయుడి ‘తాజ్‌మహల్‌’ ఎలా అనిపించింది?
సంఘవి: చాలా అద్భుతమైన అనుభూతి. మీరు(ఆలీ) నటించిన ‘యమలీల’ తమిళ చిత్రం కార్తీక్‌గారితో చేస్తుండగా నాకు ‘తాజ్‌మహల్‌’లో అవకాశం వచ్చింది. చాలా థ్రిల్‌కు గురయ్యా. మొదటి నన్ను మోనికాబేడీ పాత్ర కోసం అడిగారు. అయితే, ముప్పలనేని శివగారు మరో పాత్ర చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఆ పాత్ర చేయాల్సి వచ్చింది. 

శ్రీకాంత్‌తో ఎన్ని సినిమాలు చేశారు?
సంఘవి: ‘తాజ్‌మహల్‌’ తర్వాత ఐదారు సినిమాల్లో మేము కలిసి నటించాం. 

మీకు ఏ సన్నివేశం చెప్పినా, డ్యాన్స్‌ మూమెంట్‌ చెప్పినా వెంటనే చేసేసేవారట! మీ ఫ్యామిలీలో కళాకారులు ఎవరైనా ఉన్నారా?
సంఘవి: మా బామ్మ వాళ్ల చెల్లి ఆర్తిగారు కన్నడలో దాదాపు 175 సినిమాలకు పైగా చేశారు. జాతీయ, రాష్ట్ర అవార్డులు కూడా వచ్చాయి. ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 

తెలుగులో ఎందుకు విరామం తీసుకున్నారు?
సంఘవి: హీరోయిన్‌గా చేసిన తర్వాత మంచి పాత్రలు వస్తేనే చేద్దామనే ఉద్దేశంతో చాలా కాలం వేచి చూశా. ఈ మధ్యలో ఒక డ్యాన్స్‌ షోకు జడ్జిగా వ్యవహరించా. అలా విరామం వచ్చేసింది. తమిళంలో సముద్రఖనిగారితో చేసిన ‘కొలంజి’ ఈ ఏడాది విడుదలైంది. 

మీకు వివాహం అయిందా?
సంఘవి: 2016 ఫిబ్రవరి 3న నాకు వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మావారు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమెరికాకు చెందిన కంపెనీ తరపున 5జీ టెక్నాలజీపై ఇక్కడ పనిచేస్తున్నారు. పెళ్లికి ముందు మా అమ్మతో కలిసి వాళ్లింటికి రెండుసార్లు వెళ్లాం. ఆ తర్వాత వాళ్లు వచ్చి పెళ్లి గురించి అడిగారు. ‘సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లపై చాలా రూమర్స్‌ ఉంటాయి. అన్నీ మీరు అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకుందాం’ అని చెప్పి మ్యారేజ్‌ చేసుకున్నా. 

మిమ్మల్ని డాక్టర్‌ను చేయాలని మీ తండ్రి అనుకున్నారట!
సంఘవి: మైసూర్‌ మెడికల్‌ కాలేజ్‌లో మా నాన్న గోల్డ్‌ మెడలిస్ట్‌. బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌ కూడా. ఆయన ప్రొఫెసర్‌, మైసూర్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఒక విభాగానికి హెచ్‌వోడీ. ఆయనలాగా నేను కూడా డాక్టర్‌ కావాలని ఉండేది. 9వ తరగతి చదువుతుండగా చెన్నై వెళ్లా. అప్పుడు భాగ్యరాజా సర్‌ ఒక ఫంక్షన్‌లో నన్ను చూసి, తన సినిమాలో చేయమని అడిగారు. ఇదే విషయం నాన్నకు చెబితే, ‘కాలేజ్‌ పూర్తయిన తర్వాత సినిమాల్లో చేయొచ్చు కదా’ అన్నారు. ‘అప్పుడు అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఒకే ఒక సినిమా చేస్తా’ అని నాన్నను రిక్వెస్ట్‌ చేస్తే ‘సరే’నన్నారు. 1993లో నా తొలి సినిమా అజిత్‌తో చేశా.

‘సింధూరం’లో ‘హాయ్‌ రే హాయ్‌.. జామ్‌పండురోయ్‌’ పాట మిమ్మల్ని చూసే రాశారా? 
సంఘవి: (నవ్వులు) తెలియదండీ ఆ విషయం మీరు కృష్ణవంశీగారినే అడగాలి. ఆ సినిమా ఆయన కోసమే తీశారు. ఆ సమయంలో కృష్ణవంశీగారు ‘గులాబీ’, ‘నిన్నే పెళ్లాడతా’ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు తీశారు. చిత్ర పరిశ్రమలోని అందరూ ఆయనతో పనిచేయాలని ఉవ్విళ్లూరుతూ ఉండేవారు. నేను ఫ్లైట్‌లో వెళ్తుండగా చూసి, నన్ను ‘సింధూరం’లో హీరోయిన్‌గా అనుకున్నారట. 

కృష్ణవంశీతో పనిచేయడం ఎలా ఉంది?
సంఘవి: ఆయన అద్భుతమైన దర్శకుడు. తన పనిని ఎంతగానో ప్రేమిస్తారు. అలాంటి దర్శకుడితో పనిచేయడం నా అదృష్టం. నేను చేసిన చిత్రాల్లో చాలా మంచి చిత్రం ‘సింధూరం’. జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాకు నేను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. మేమంతా కలిసి ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాం. అందుకే అది తీశాం. 

మళ్లీ ఆయనతో ఎందుకు సినిమా చేయలేదు?
సంఘవి: ఆ విషయం మీరు ఆయననే అడగాలి. అయినా ‘సింధూరం’కు జాతీయ అవార్డు వచ్చింది. నాకు స్టేట్‌ అవార్డు వచ్చింది. అంతకన్నా ఇంకా ఏం కావాలి. 

మీకు యాక్సిడెంట్‌ ఏదైనా జరిగిందా?
సంఘవి: 2005లో అనుకుంటా మైసూర్‌ నుంచి చెన్నై వెళ్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది. అప్పటికి దాదాపు 10 సినిమాలు చేతిలో ఉన్నాయి. నా ముఖానికి ఫ్యాక్చర్‌ అయింది. ఒక యాక్టర్‌కు ముఖమే కదా ముఖ్యం. అలాంటిది ముఖానికి గాయం అయితే, ఆత్మస్థైర్యం కోల్పోతాం. నా తండ్రి డాక్టర్‌ కావడంతో ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. సాధారణంగా మనం వెళ్లి ముక్కుకు సర్జరీ చేయించుకోవడం వేరు.. దెబ్బ తగిలిన ముక్కుకు శస్త్ర చికిత్స చేయడం వేరు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. 

1993లో మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా! అంటే నాకన్నా(ఆలీ) సీనియర్‌ అనుకుంటా!
సంఘవి: మీరు హీరోగా కన్నా కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. నేను మీకన్నా సీనియర్‌ను ఎప్పటికీ కాదు. మీ తమ్ముడు ఖయ్యూం కన్నా సీనియర్‌ని. 

మా తమ్ముడి పేరు బాగా గుర్తుపెట్టుకున్నారు!
సంఘవి: ఎందుకు గుర్తు ఉండదండీ. రోజూ నాకు లవ్‌ లెటర్లు రాసేవాడు. ఈ విషయం మీకు తెలియదా? ‘ఊరికి మొనగాడు’ సినిమా చేశాం. అందులో నా స్నేహితుడిగా ఖయ్యూం నటించాడు. నేనంటే అతనికి చాలా ఇష్టం. రోజూ గ్రీటింగ్‌ కార్డు, గులాబీపువ్వు ఇచ్చేవాడు. చాలా జాలీగా ఉండేది. నేనూ-శ్రీకాంత్‌ ఖయ్యూంను బాగా ఏడిపించేవాళ్లం. నాకు లవ్‌ లెటర్‌ ఇవ్వగానే ‘శ్రీకాంత్‌ కూడా నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఆయనకు నో చెబితే సినిమా ఆగిపోతుంది. ఏం చేయమంటావు’ అని ఖయ్యూంను అడిగితే, ‘సినిమా ఆగిపోతే మిమ్మల్ని చూడకుండా ఉండలేను. అందుకే ఆయనకు నో చెప్పవద్దు. కానీ మీరు మాత్రం నన్నే ప్రేమించాలి’ అనేవాడు.(నవ్వులు) శ్రీకాంత్‌కు ఊహతో పెళ్లయిన తర్వాత తనకు లైన్‌ క్లియర్‌ అయిపోయిందని తెగ సంతోషపడిపోయాడు.

స్కూల్లో ఎవరైనా ప్రపోజ్‌ చేశారా?
సంఘవి: చాలా మంది నా వెంట పడేవారు. ఒక అబ్బాయి స్కూటర్‌ వేసుకుని రోజూ నన్ను అనుసరించేవాడు. ఒకరోజు సడెన్‌గా చేతిలో గ్రీటింగ్‌కార్డు పెట్టాడు. నేను దాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లి మా అమ్మకు విషయం చెప్పా. ఆ తర్వాత నాకు సినిమా అవకాశం రావడంతో వెళ్లిపోయా. సినిమా చేసి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరిలోని వీడియోషాపులో అతను కనపడ్డాడు. అమ్మకు చెబితే వీడియోషాపులో పనిచేసే కుర్రాడితో కబురు పంపారు. ఈ విషయం తెలియగానే అతను అక్కడి నుంచి పరుగో పరుగు. (నవ్వులు)

ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించినట్లు ఉన్నారు?
సంఘవి: అవును. మొదటి వెంకటేశ్‌గారితో ‘సరదా బుల్లోడు’, ‘సూర్యవంశం’, నాగార్జున గారితో ‘సీతారామరాజు’, చిరంజీవిగారితో ‘మృగరాజు’, బాలకృష్ణగారితో ‘సమరసింహారెడ్డి’, ‘గొప్పంటి అల్లుడు’ సినిమాలు చేశా. తమిళంలో రజనీసర్‌తో ‘బాబా’, కమల్‌గారితో ‘పంచతంత్రం’ చేశా. 

చిత్ర పరిశ్రమలో మీరు తరచూ కలిసే హీరోయిన్‌ ఎవరు?
సంఘవి: మీనా నా బెస్ట్‌ ఫ్రెండ్‌. అన్ని ఫంక్షన్స్‌కి కలుస్తాం. ఆమెతో పాటు రంభ, మహేశ్వరిని కూడా అప్పుడప్పుడు కలుస్తుంటా. 

జపనీస్‌లో ఏదైనా యాడ్‌ చేశారా?
సంఘవి: అవును: ‘హై బాయ్‌’ అనే ప్రకటనలో నటించా. రజనీకాంత్‌గారు ‘ముత్తు’ చేసిన తర్వాత జపాన్‌లో ఆయనకు చాలామంది ఫ్యాన్స్‌ అయ్యారు. అలా వాళ్లు ఇక్కడ నన్ను చూసి మైసూర్‌ ప్యాలెస్‌లో యాడ్‌ షూట్‌ చేశారు. 

పెద్ద హీరోలతో చేయడం ఎలా అనిపించేది?
సంఘవి: నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ‘చిన్నపిల్లలా ఉంది’ అనేవారు. ఎలాగైనా లావుగా తయారై వారితో నటించాలని ఉండేది. ఇప్పుడు ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. 

‘సమర సింహారెడ్డి’ చేస్తున్నప్పుడు ఏం అనిపించేది?
సంఘవి: బాలకృష్ణగారంటే చాలా భయం వేసేది. ఎందుకంటే ‘ఆయనకు చాలా కోపం.. జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పారు. ఒకరోజు నేను కూర్చొని ఉంటే, ‘ఎంటమ్మా.. సైలెంట్‌గా కూర్చొన్నావ్‌. ఏమీ మాట్లాడటం లేదు’  అని అడిగారు. నేను ఇదే విషయం చెప్పా. ‘అలా ఏమీలేదు. నేను రోజూ యోగా, వాకింగ్‌ చేస్తా. కోపాన్ని చాలా కంట్రోల్‌లో పెట్టుకున్నా’ అని అన్నారు. అప్పటి నుంచి ఆయనతో సెట్‌లో సరదాగా ఉండేదాన్ని. ఒక సీన్‌లో ఆయనను చెంపపై కొట్టాలి. అలా చేస్తే ఆయన ఫ్యాన్స్‌ ఎక్కడ కొడతారోనని భయపడిపోయా. అది యాక్టింగ్‌ అని తెలిసినా కూడా ‘నువ్వు ఎలా మా హీరోను కొడతావ్‌’ అని అంటారేమోనని చాలా భయం వేసింది. ఆయనే ధైర్యం చెప్పి ఆ సీన్‌ చేయించారు. 


 

మీకు చాలా కోపం ఎక్కువని విన్నాం! నిజమేనా!
సంఘవి: ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తున్నారని తెలిస్తే దెబ్బలు పడిపోయేవి. అలా రెండుసార్లు జరిగింది. ‘సింధూరం’ షూటింగ్‌ జరుగుతోంది. డైరెక్టర్‌గారు నాకు సీన్‌ వివరిస్తున్నారు. సెట్‌లో ఒక అబ్బాయి కావాలని వచ్చి నన్ను గుద్దాడు. లాగిపెట్టి కొట్టా. ఇంకోసారి వెంకటేశ్‌గారితో ‘సూర్యవంశం’ చేస్తుండగా ఓ రోజు షూట్‌ అయిపోయిన తర్వాత నా మేకప్ మ్యాన్‌తో కలిసి వస్తున్నా. ఒక గ్యాంగ్‌ మా ఎదురుగా నడుచుకుంటూ వచ్చి కావాలనే నాకు తగులుకుంటూ వెళ్లారు. కోపంతో రెండు దెబ్బలు కొట్టా. మా మేకప్‌మ్యాన్‌ నాలుగు దెబ్బలు పీకాడు. 

పూరి జగన్నాథ్‌ మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ తెలుసా?
సంఘవి: తెలుసండీ. చాలా మంచి వ్యక్తి. ఆయనతో కలిసి ‘ఆంధ్రావాలా’లో చేశా. అంతకుముందు జగపతిబాబుగారితో ఓ సినిమా చేయమని అడిగారు. నాకు కుదరలేదు. 

ప్రస్తుతం ఆనాటి హీరోయిన్లు అందరూ రీఎంట్రీ ఇస్తున్నారు. మీరు ఎప్పుడు?
సంఘవి: మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తా. నాకు యాంకరింగ్‌ చేయడం చాలా ఇష్టం.

సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ఎన్ని సినిమాలు చేశారు?
సంఘవి: ఆరు సినిమాలు చేశా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాదాపు ఏడేళ్లు అసలు సమయం లేకుండా సినిమాలు చేశా. ఒక ఏడాది 12 సినిమాల్లో నటించా. 

మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏది?
సంఘవి: ‘తాజ్‌ మహల్‌’తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘సింధూరం’తో చాలా మందికి సంఘవి ఎవరో తెలిసింది. నేను నటించిన చాలా చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. 

‘మృగరాజు’ కోసం వేరే వాళ్లను అనుకుని, చివరకు మిమ్మల్ని తీసుకున్నారట!
సంఘవి: ఆ కథ చెప్పినప్పుడు నాకు రెండు పాటలు, చాలా సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. కానీ, విడుదలైన తర్వాత నేను చాలా బాధపడ్డా. మెగాస్టార్‌తో చేసిన సినిమాలో ఇంకా ఎక్కువ సేపు కనపడితే బాగుండేది కదా! అనిపించింది. సినిమా నిర్మాత దేవీ వరప్రసాద్‌గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. వాళ్లకు ఇవేమీ చెప్పలేం కదా! 

మోహన్‌బాబుతో ఎందుకు నటించలేదు?
సంఘవి: అమ్మో.. ఆయనంటే నాకు చాలా భయం. ‘పెదరాయుడు’లో నటించే అవకాశం వచ్చింది. కానీ, కుదరలేదు. కానీ, తమిళంలో చేశా. 

ఎవరైనా యాక్టర్‌తో చేయడం కష్టంగా అనిపించిందా?
సంఘవి: ఏ నటుడితోనూ నాకు అలా అనిపించలేదు. నేను నటించిన వారిలో రజనీకాంత్‌లాంటి వ్యక్తిని అస్సలు చూడలేదు. సెట్‌లో చాలా మర్యాదగా ఉంటారు. బాగా మాట్లాడతారు. అందరితోనూ కలిసిపోతారు. నేను సినిమాల్లోకి రాకముందు నుంచే మా ఫ్యామిలీ ఆయనకు తెలుసు. 

ఇప్పుడున్న హీరోల్లో ఎవరంటే బాగా ఇష్టం!
సంఘవి: అందరూ బాగా చేస్తున్నారు. ‘బాహుబలి’లో ప్రభాస్‌ యాక్టింగ్‌ చాలా బాగుంటుంది. మహేశ్‌బాబు సినిమాలు కూడా చాలా బాగుంటాయి. హీరోయిన్లలో నయనతార, కీర్తిసురేశ్‌ మంచి పాత్రలు చేస్తున్నారు. 

మీరు అమ్మాయి కాకుండా అబ్బాయి అయితే, ఏ హీరోయిన్‌కు ప్రపోజ్‌ చేసేవారు?
సంఘవి: చాలా మంది ఉన్నారు. మీనాకు ప్రపోజ్‌ చేసేదాన్ని.

మీ ఎదురుగా నాగార్జున, బాలకృష్ణ ఉంటే ఎవరికి ప్రపోజ్‌ చేస్తారు?
సంఘవి: నాకు అంత ధైర్యం లేదు. మీరు(ఆలీ) నా పక్కన ఉండే మీకే ప్రపోజ్‌ చేస్తా(నవ్వులు)

ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడటం వచ్చా?
సంఘవి: అస్సలు రాదు. ‘మీకు అన్నీ బ్యాడ్‌వర్డ్స్‌ చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. ఇలాంటి మాటలు హీరోల దగ్గర మాట్లాడకూడదు’ అని నా మేకప్‌ మ్యాన్‌ అన్ని నేర్పించారు. 

మీ ఆయన కోసం పాడమంటే ఏ పాటపాడతారు?
సంఘవి: ‘సింధూరం’లోని ‘ఊరికే.. ఉండదే.. ఉయాలూగే మనసు’ పాట పాడతా. 

మీ తల్లిదండ్రుల గురించి?
సంఘవి: నా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. నేను సినిమాల్లోకి వెళ్తానంటే డబ్బులు ఇచ్చి మరీ ప్రోత్సహించారు. నేను వాళ్లకు పుట్టడం నా అదృష్టం. పెళ్లయిన తర్వాత మా ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. అసలు నెగిటివిటీ అనేదే చూడరు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.