close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌: నల్లమలలో యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, భవిష్యత్‌లోనూ ఇవ్వబోదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.  బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలోని లంబాపూర్‌లో అన్వేషణ జరిగిందని, కానీ, నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిక్షేపాలున్నప్పటికీ అనుమతులివ్వబోమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిన విషయాన్ని సభలో ఆయన గుర్తు చేశారు. 

మైనింగ్‌లో రెండు దశలుంటాయని, మొదటి దశలో అన్వేషణ ఉంటుందని కేటీఆర్‌ అన్నారు. ప్రాథమిక దశలో జియాలజిస్టులు అధ్యయనం చేస్తారని, కేంద్రం పరిధిలోని ఏఎండీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అయితే మైనింగ్‌ చేయాలా? వద్దా? అనేదానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పారు. యురేనియం విషయంలో ప్రజల్లో ఆందోళన ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

యురేనియం శుద్ధి చేసే వరకు ఎలాంటి రేడియేషన్‌ వెలువడదని, అలాంటిది అన్వేషణ దశలోనే కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యురేనియంపై లేని భయాందోళనలు సృష్టించవద్దని కోరారు. యురేనియం లభ్యత ఉందని తేలినా ప్రభుత్వం అనుమతివ్వబోదని పునరుద్ఘాటించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం చేపట్టారని, అలాంటిది యురేనియం తవ్వకాలకు అనుమతిస్తారని ఎవరూ అనుకోరని అన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిర్దిష్ట విధానం, ఆలోచన ఉందని సభకు వెల్లడించారు. సభ్యుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది: కడియం

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు.యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోందని, ఇది అసత్య వాదనని విమర్శించారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ యురేనియం అన్వేషణకు అనుమతిచ్చిందని, 2016లో యురేనియం అన్వేషణకు మాత్రమే అనుమతి వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలోనే అన్వేషణకు అనుమతి వచ్చిందని, దీంతో తెరాస పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. యురేనియం అన్వేషణపై మండలిలోనూ, అదేవిధంగా శాసనసభలోనూ తీర్మానం ప్రవేశపెడదామని స్పీకర్‌కు అభ్యర్థించారు. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపాలని సూచించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.