close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో కోడెల శివప్రసాద రావు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఆయనది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అధిరోహించారు. మంత్రిగా, స్పీకర్‌గా రాష్ట్రానికి సేవలందించిన కోడెల శివ ప్రసాద్‌ తన జీవితానుభవాలను ఏడాది కిందట ఈనాడు-ఈటీవీ ‘చెప్పాలని ఉంది’తో పంచుకున్నారిలా..

‘శివప్రసాద్‌ రావు చెయ్యి పడితే ఎలాంటి రోగమైనా పటాపంచలైపోతుంది’ అన్న స్థాయిలో పేరు తెచ్చుకున్న మీరు రాజకీయాల్లోకి రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి?
కోడెల: 1976 నుంచి 2010 వరకు సుమారు 30 ఏళ్లకు పైగా నరసరావుపేట చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు వైద్యుడిగా సేవ చేశాను. ఎక్కడా వివాదాలకు చోటిచ్చింది లేదు. అవసరాన్ని బట్టి రోజుకు 18-19 గంటలు పనిచేసేవాడిని. రోగుల తాకిడి ఆ విధంగా ఉండేది.  1983లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసినప్పటికీ వైద్య వృత్తిని మాత్రం వదిలి పెట్టలేదు. ఎందుకంటే వైద్యుడిగా ఉన్న రోజులు నాకు మరపురానివి.

ఓ వైపు వైద్యుడిగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎలా మేనేజ్‌ చేయగలిగారు?
కోడెల: టైమ్‌ టేబుల్‌ వేసుకునే వాడిని. ఎందుకంటే ఒకటి నాకు నచ్చిన పని. రెండోది నాకు అప్పజెప్పిన పని. రెండింటిలో దేనికీ అన్యాయం చేయలేను. సర్జరీలు ఉన్న సమయంలో ఉదయం 5గంటలకే ఆసుపత్రికి వెళ్లేవాడిని. రాజకీయ సమావేశాలేవైనా ఉంటే సాయంత్రం పెట్టుకునే వాళ్లం. రాత్రి 10 గంటలవరకు అదే పని మీద తిరిగి ఇంటికి చేరుకునే వాడిని.

నరసరావుపేటలో పరిస్థితి వల్ల రాజకీయాల్లోకి వచ్చారా? లేక ఎన్టీఆర్‌ పిలుపు మేరకా?

కోడెల: ప్రత్యేక పరిస్థితులున్నప్పటికీ నేను రాజకీయాల్లోకి రావల్సిన అవసరం లేదు. కానీ, అప్పట్లో అణచివేత, ఆశ్రిత పక్ష రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. వాటిని అణచివేయడానికే అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి నా శక్తి సరిపోకపోయినా, నా వంతు సాయపడాలనిపించింది. అందుకే ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

కాసు బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు  మీరు క్రియాశీలక పాత్ర ఎలా పోషించగలిగారు?
కోడెల: అప్పుడు బ్రహ్మానందరెడ్డి కేంద్రంలో అనుభవమున్న నేత, ఇందిరాగాంధీకి సన్నిహితుడు. ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేశారు. అయితే, అప్పుడు కూడా అరాచకం రాజ్యమేలింది. దీంతో నేను ఓ రోజు కర్ర పట్టుకుని వీధిలోకి వచ్చాను. నేను పది గజాలు నడిచానో లేదో చాలా మంది నా వెంట వచ్చారు. ప్రజల్లో అంత అసహనం ఉంది కాబట్టే బ్రహ్మానందరెడ్డిని ఓడించగలిగాం.

ఆపరేషన్‌ కోసం కత్తి పట్టుకునే చేతితో కర్ర పట్టుకోవాల్సి వచ్చింది కదా! ఎంతకాలం నడిచిందా రాజకీయం?
కోడెల: 1983 నుంచి 1990 వరకు నడిచింది. నా సిద్ధాంతం ఒకటే. మేం ఎవరి జోలికీ వెళ్లం. మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం. దీనికి ప్రజల మద్దతు విరివిగా లభించింది.

అప్పట్లో వైద్య వృత్తి చదివే వాళ్లు చాలా తక్కువ.ఆ వృత్తిలోకి వెళ్లడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
కోడెల: మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. నేను పెద్దవాడిని. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా అమ్మ మాకోసం ఉదయాన్నే వండి ఉట్టిమీద పెట్టి పొలం పనులకు వెళ్లేది. అలాంటి మా ఇంట్లో పెద్ద సునామీ వచ్చింది. వారం రోజుల వ్యవధిలో అందరికీ మశూచి సోకింది. నేను మా అమ్మమ్మ ఇంట్లో పెరగడంతో నాకు సోకలేదు. అప్పట్లో ఆ వ్యాధికి మందు లేదు. పసుపు, వేప నీళ్లు వారికి ఉపయోగిస్తుంటే నేను బాగా చలించిపోయేవాడిని. నాతో ఆడుకున్న వాళ్లని అలా చూడలేకపోయాను. తర్వాత వారందరూ చనిపోవడాన్ని తట్టుకోలేకపోయాను. నాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు జరిగింది. అప్పుడే వైద్యుడిని కావాలని నిర్ణయించుకున్నాను. నా లక్ష్యానికి అమ్మానాన్నల ఆశయం కూడా తోడైంది.

పాఠశాల విద్యాభ్యాసం ఎక్కడ సాగింది?
కోడెల: మా ఊర్లో ఐదో తరగతి వరకే పాఠశాల ఉండేది. దీంతో అమ్మమ్మ వాళ్ల ఊళ్లో చదువుకున్నా. రెండు స్కూళ్లు, రెండు కాలేజీలు, మూడు మెడికల్‌ కళాశాలలు తిరిగితే గానీ నా మొత్తం విద్యాభ్యాసం పూర్తి కాలేదు. ఎం.ఎస్‌ బెనారస్‌ యూనివర్సిటీలో చేశాను. ఇందుకు మా అమ్మమ్మ ఇంటి నుంచే ఆర్థిక సహకారం అందేది. మా తాతయ్యకు తెలిసిన ఓ వ్యక్తి నన్ను హేళనగా మాట్లాడారు. ‘వీడి మొహం వీడేం డాక్టరవుతాడు’ అంటూ వెకిలిగా నవ్వారు. ఆ మాటలు నాకు బాగా గుచ్చుకున్నాయి. అది కూడా నేను వైద్యుడిని కావడానికి కారణమైంది. 

మా చిన్నప్పుడు ఏదైనా జబ్బు చేస్తే వ్యాధిని కనిపెట్టిన తర్వాత మందులిచ్చి, అవసరమైతే ఆపరేషన్‌ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు కాలి నుంచి తల వరకు స్పెషలిస్టుల పేరుతో వైద్యులు పుట్టుకొస్తున్నారు. 40-50% డబ్బు ఖర్చుకానిదే వ్యాధి నిర్ధారణ కావడం లేదు. ఓ వైద్యుడిగా దీనిపై మీ అభిప్రాయం?
కోడెల: నేను జనరల్‌ సర్జన్‌ని. అంటే ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ నేనే. గైనకాలజిస్ట్‌ని, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ని నేను. నేను ఒక్కడినే ఇన్ని చేసేవాడిని. ఇది పేషెంట్‌కి, వైద్యుడికీ మంచిదే కానీ, రోగికి సరైన వైద్యం అందాలంటే మాత్రం స్పెషలిస్ట్‌ కావాల్సిందే. ఎందుకంటే వాళ్లకుండే విజ్ఞానం మాకుండదు. కానీ, ఇది ఒకందుకు మంచిది, ఒకందుకు మంచి కాదు.

మీ అనుచరులైతే వారిని వెనకేసుకొస్తారు. లేదంటే వారిపై దండెత్తుతారని మీపై విమర్శ ఉంది. దానిపై మీ అభిప్రాయం.
కోడెల: సామాన్య ప్రజలు దేవుళ్లు. వారి వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాం. నాకు ఆశ్రిత పక్షపాతం లేదు. ప్రత్యర్థి పార్టీలో మంచి వాళ్లుంటే వారి జోలికి వెళ్లేదే లేదు. వారిని విమర్శించడం కూడా తప్పు. అలాగని తప్పు చేసిన వాళ్లని వెనకేసుకురావడం తప్పు.

ప్రత్యర్థి పార్టీ మీపై చాలా ఆరోపణలు చేసినట్లుంది.
కోడెల: అధికారంలో ఉన్నా లేకపోయినా నాపై ప్రజలకో నమ్మకం ఉంది. కానీ, ఎవరైనా రాస్తారోకో చేస్తే నా పేరును ఏ1గా చిత్రీకరించే వారు. దొంగ ఓట్లు వేయిస్తున్నానన్నారు. అణచివేతను నేను భరించేవాడిని కాదు. అందుకే ఓ సారి ఎస్పీతో కూడా పోట్లాడాల్సి వచ్చింది.

రామారావు హయాంలో, ఇటు చంద్రబాబు హయాంలో ఐదారు శాఖలు నిర్వహించారు. అందులో మీకు సంతృప్తినిచ్చిన శాఖ?
కోడెల: పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ నాకు నచ్చిన శాఖలు. ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఈ శాఖలతోనే సాధ్యం. క్షేత్ర స్థాయిలో పథకాల అమలు గురించి తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. నాకు తెలిసి మిగతా శాఖల్లో ఈ అవకాశం చాలా తక్కువ. నేను సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశాను. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకుని నియోజవర్గ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష ఉంచాలని చెప్పేవాడిని. నియోజకవర్గం అంటే నా ఒక్కడిదనే కాదు. మంత్రిగా ఉన్నామంటే రాష్ట్రానికి బాధ్యులుగా ఉన్నట్లు కాబట్టి ప్రతి నియోజకవర్గమూ ముఖ్యమే.

మీ శాఖల్లో రామారావు లేదా చంద్రబాబు ఎక్కువగా జోక్యం చేసుకునేవారా?
కోడెల: రామారావు నా మీద ఎంతో నమ్మకం ఉంచేవారు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ చంద్రబాబు అలా కాదు. మనం ఏం చేస్తున్నామో ప్రతి అడుగు గమనిస్తూ ఉంటారు. తప్పటడుగు వేస్తే ఉపేక్షించరు. నా దృష్టిలో వాళ్లిద్దరూ సూపర్‌మ్యాన్‌లు.

ఎన్టీ రామారావు మీ రాజకీయ గురువు. చంద్రబాబు మీ సమకాలికుడు. పార్టీలో ఆయన కంటే మీరే ముందు నుంచీ ఉన్నారు. ఈ తేడా ఏమైనా కనిపించేదా?
కోడెల: నేను ఆయనని 1984లో తొలిసారి కలిశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద గౌరవం అంగుళం కూడా తగ్గలేదు. ఆయన వ్యూహాలు- రచనలు వర్ణనాతీతం. కష్టపడటానికీ ఓ పద్ధతుందని ఆయన ద్వారానే తెలిసింది. ఆయన పనిరాక్షసుడు. మా ఇద్దరికీ ఎప్పుడూ మనస్పర్థలు వచ్చిన సందర్భాలు లేవు. ఒక సామాన్య మనిషి వచ్చి ‘మీరు చేసింది తప్పు’ అని చెప్పినా వింటారు.

రాజకీయంగా మీరు క్లిష్టంగా గడిపిన కాలం ఏది?
కోడెల: ఒకసారి ఎన్టీ రామారావు లేకుండా నేరుగా ఎన్నికల్లోకి వెళ్లాం. అభ్యర్థుల విషయంలో నాకు ఆయన బరువైన పాత్ర ఇచ్చారు. జిల్లాలో మనం మెజార్టీ సీట్లు గెలవాలని చెప్పి అభ్యర్థుల ఎంపిక స్వేచ్ఛ నాకే ఇచ్చారు. అప్పుడు ముక్కూ మొహం తెలీని వారిని కూడా అభ్యర్థులుగా పెట్టాం. ఆ సమయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను.

యూనిసెఫ్‌తో మీరు చేసిన కార్యక్రమ అనుభవాలు?
కోడెల: ‘స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌లో భాగంగా యూనిసెఫ్ మాతో కలిసి పనిచేసింది. న్యూట్రిషన్‌, బాల కార్మిక వ్యవస్థ తదితర సమస్యలపై ఇప్పటికే మాతో కలిసి పనిచేశారు. వారు చేసే సేవా కార్యక్రమాలు నిజంగా అద్భుతం.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారు. ఐటీ ఉద్యోగాల విషయంలో వారు దూసుకెళుతున్నారు. రాజకీయాల్లో ఇంత వెనుకబాటు తనం ఎందుకు?
కోడెల: మహిళా సాధికారత ఇంకా సార్ధకం కాలేదు. గిరిజన ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఇవే కాకుండా ఆడపిల్లలను బయటకు పంపితే ఏమవుతుందోనన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. వీటన్నింటికీ అవగాహన అవసరం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో మహిళలకు ప్రోత్సాహం ఎక్కువగా ఉందని చెప్పగలను. 

మిమ్మల్ని బాగా బాధించిన సందర్భం.
కోడెల: మా కుటుంబంలో దాదాపు వైద్యులే. నాకో కూతురు, ఇద్దరు కుమారులు. నా చిన్న కుమారుడు వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత రేపు ఉద్యోగంలో చేరుతాడనగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నా జీవితంలో వేదనకు గురయిన సందర్భమది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.