close

తాజా వార్తలు

ఆ గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకుందామనుకున్నా!

‘ఇదేంటిరా భగవంతుడా’ అనిపించింది

ఆయన జీవితం తెరిచిన పుస్తకం..
అందులోని ప్రతి అక్షరం ఓ అందమైన ఆణిముత్యం..
ఒకప్పుడు రంగస్థలంపై నటించారు.. 
ఇప్పుడు రంగు రంగుల వెండితెరపై మనల్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు..
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దళపతి..
ఆయనే సీనియర్‌ నటుడు చలపతి.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తన వ్యక్తిగత జీవితం, ఎన్టీఆర్‌తో అనుబంధం, తనపై వచ్చిన విమర్శలు ఇలా అనేక విషయాలను పంచుకున్నారిలా...!

ఏంటి మీ వయసు 16 సంవత్సరాలు ఉంటుందా? 
చలపతిరావు: ఇప్పుడు నా వయసు 76. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమం అనగానే చాలా హ్యాపీగా ఫీలయ్యా. కానీ, కొన్ని వేల కళ్లు మనల్ని చూస్తూ ఉంటాయి. (నవ్వులు) మనం ఏం మాట్లాడుకుంటామా అని చెవులు రిక్కరించుకుని మరీ వినడానికి చూస్తాయి. (మధ్యలో ఆలీ అందుకుని మంచి విషయాలే మాట్లాడుకుందాం.) మనం మంచే మాట్లాడతాం. ఆ విషయం బయట వాళ్లకు ఎవరికీ తెలియదు. 

వయసులో ఉండగా చిత్ర పరిశ్రమలోని అందరి హీరోలతో ఫైట్స్‌ చేశారు. కానీ, చిన్న దానికే గాయపడ్డారని విన్నాం. అసలు ఏం జరిగింది?
చలపతిరావు: భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాం. కేరళ బస్సు. సామాన్లు అన్నీ పైన టాప్‌పై పెట్టారు. వాటి మధ్యలో నేను, సునీల్‌, హీరోయిన్‌ కూర్చోవాలి. పైకి ఎక్కి కూర్చున్నా కానీ, మనసులో మాత్రం ఏదో తెలియని వెలితి. మధ్యలో వెళ్లిపోదాం అనుకున్నా. సర్లే ఒప్పుకొన్నాం కదాని! ఉండిపోయా. షాట్‌ అయిపోయిన తర్వాత బస్సు పైనుంచి దిగుతుంటే జారి పడిపోయా. అంతవరకే తెలుసు. మూడు రోజుల తర్వాత అపోలో ఆస్పత్రిలో ఉన్నానని చెప్పారు. పక్కటెముకలు విరిగాయి. వెన్నెముకకు దెబ్బ తగిలింది. కాలు విరిగింది. అంతా మంచంలోనే. దాదాపు ఆరు నెలలు బెడ్‌ పైనే ఉన్నా. ‘ఎందుకీ బతుకు చచ్చిపోదామా’ అనిపించింది. ఒక కన్ను కూడా కనిపించడం మానేసింది. బస్సు పైనుంచి పడటంతో కంటిలో నుంచి రక్తం కారిందని చెప్పారు. డాక్టర్‌ మల్లికా బేగం అని ఆవిడ నా కన్ను చూసి, తప్పకుండా చూపు వస్తుందని చెప్పారు. మూడు ఆపరేషన్లు చేశారు. పెద్ద వయసు కదా! కాలు సెట్‌ కావడానికి ఎనిమిది నెలలు పట్టింది. ఇప్పటికీ నొప్పిగా ఉంది. ప్రమాదం గురించి తెలియగానే నా కూతుళ్లు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. 

అటువంటి పరిస్థితుల్లో ‘వినయ విధేయరామ’ షూటింగ్‌ కచ్చితంగా చేయాల్సి వచ్చిందట!
చలపతిరావు: అవును! అప్పటికే నాపై కొన్ని సన్నివేశాలు తీశారు. చిన్నప్పటి రామ్‌చరణ్‌, వాళ్ల అన్నయ్యలను నేనే పెంచి పెద్ద చేస్తా. నాకు ప్రమాదం జరగడంతో షూటింగ్‌ ఎలా చెయ్యాలో అర్థం కాలేదు. అటువంటి సమయంలో బోయపాటికి నిజంగా థ్యాంక్స్‌ చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చే వాళ్లలో బోయపాటి ఒకరు. కష్టాల్లో ఉంటే వచ్చి పలకరిస్తాడు. ‘బాబాయ్‌ ఎన్నాళ్లు ఆస్పత్రిలో ఉంటాడు. ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు. షూటింగ్‌కు తీసుకురండి. బాధలు మర్చిపోతాడు’ అని చెప్పాడట. చిత్ర యూనిట్‌ నా దగ్గరకు వచ్చి, ‘షూటింగ్‌కు బ్యాంకాక్‌కు రావాలి’ అని చెప్పారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా రాగలను’ అని అడిగితే ‘దర్శకుడు మిమ్మల్ని తీసుకురమన్నారు’ అని అన్నారు. ‘అయితే పదండి’ అని వీల్‌ఛైర్‌లో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లా. నా కోసమని విమానం ఎత్తులో ఉండే వెహికల్‌లో లిఫ్ట్‌ చేసి అక్కడి పైలెట్‌ దగ్గరకు ఆ తర్వాత  బిజినెస్‌ క్లాస్‌లో పడుకోబెట్టారు. బ్యాంకాక్‌లో కూడా ఎయిర్‌లిఫ్ట్‌ ఉండటంతో మాకు కలిసొచ్చింది. రామ్‌చరణ్‌, మిగిలిన వాళ్లను నిలబెట్టి, నన్ను కూర్చోబెట్టి షూటింగ్‌ పూర్తి చేశారు. నన్ను ఒక పువ్వులా సుకుమారంగా చూసుకున్నారు. నేను కోలువడానికి సంవత్సరం పట్టేది కానీ, బోయపాటి వల్ల ఆర్నెల్లలో కోలుకున్నా. ఇటీవల కాలంలో అదే నా చివరి సినిమా. మరో సినిమా ఒప్పుకోలేదు.

షూటింగ్‌లు చేస్తారా? పూర్తిగా విరామం తీసుకుంటారా?
చలపతిరావు: రెండు మూడు నెలల్లో అన్నీ మామూలుగా చేస్తా. బాలయ్య సినిమాలో చేయడానికి రెడీ. తర్వాతి షెడ్యూల్‌లో నా షూటింగ్‌లో పాల్గొంటా. దీని తర్వాత బాలయ్య-బోయపాటి సినిమాలో కూడా వేషం వేస్తా. నేను ఆరోగ్యంగానే ఉన్నా. 

చిన్నప్పుడు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లి అందరినీ గుద్దేసేవాడివట ఏంటి ఆ కథ?
చలపతిరావు: మాది కృష్ణాజిల్లా పామర్రు దగ్గర బల్లిపర్రు. నా చిన్నప్పుడు సైకిల్‌ నేర్చుకోవాలని ఉబలాటం. ఇంట్లో చెబితే ఒప్పుకోరు. నాకు ఆరుగురు పెదనాన్నలు. ఐదుగురు మేనత్తలు. అపురూపంగా చూసుకునేవారు. ఒకరోజు సైకిల్‌ దొరికింది. అప్పుడు మా దగ్గరలో ఉన్న కాలువలో నుంచి బుసక తీసి రోడ్డుపై పోశారు. సైకిల్‌ దాని పైకి ఎక్కించి అక్కడి నుంచి కిందకు తొక్కుకుంటూ వస్తే త్వరగా నేర్చుకోవచ్చని ఎవరో సలహా ఇచ్చారు. ఎలాగో పైకి ఎక్కించి సైకిల్‌పై ఎక్కి కూర్చొని బ్రేకులు వదిలేశా. అంతే సైకిల్‌ కిందకు వెళ్లిపోయింది. సరిగ్గా అదే సమయంలో బోడి రాజమ్మగారు అని మా ఊళ్లో ఒకామె ఉండేది. అటు నుంచి సడెన్‌గా రావడంతో ఆమెను గుద్దేశా. ‘ఏరా నీ దుంపతెగ.. నన్ను గుద్ది సైకిల్‌ నేర్చుకున్నావు కదరా’ అనేది(నవ్వులు).

మీకు డ్రైవింగ్‌ వచ్చా?
చలపతిరావు: ప్రపంచంలో ఉన్న అన్ని కార్లు నడిపా. హెలికాప్టర్‌ కూడా నడిపా. ‘పాపం పసివాడు’ కోసం శిక్షణ కూడా తీసుకున్నా. ‘డ్రైవర్‌ రాముడు’లో నేనూ, రామారావుగారు లారీ నడిపాం. ఇదే సినిమా తమిళంలో నేనూ, శివాజీగారు చేశాం. యాక్టర్‌ అంటే అన్ని నేర్చుకుని ఉండాలి. అన్నట్లు చెప్పడం మర్చిపోయా. త్రివిక్రమరావుగారి సినిమా కోసం రైలు కూడా నడపాల్సి వచ్చింది. 

చిన్నప్పుడు చాలా కోతి పనులు చేసేవారని విన్నాం!
చలపతిరావు: మా ఇంటి దగ్గర మంచినీటి చెరువు ఉండేది. ఊళ్లో అందరూ అక్కడికే వచ్చి నీళ్లు పట్టుకుని వెళ్లేవాళ్లం. అప్పుడు అందరి ఇళ్లలో మట్టి కుండలే ఉండేవి. ఎవరైనా కుండ పట్టుకుని నీళ్లకోసం వస్తే, రాయి పెట్టి కుండను బద్దలు కొట్టేవాడిని. వాళ్లు గొడవ చేయడానికి వస్తే, మా మేనత్తలు ఊరుకునేవారు కాదు. 

ఉద్యోగం చేయాలని ఎప్పుడూ అనిపించలేదా?
చలపతిరావు: మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాంతో నాకు చదువుకోవాలనే ఆశ ఉండేది. మా ఊళ్లో అచ్చయ్య మాస్టారు అని ఒకాయన ఉండేవాడు. ఆయన దగ్గరకు వెళ్తే ‘ఏరా.. మీ దొడ్డిలో వంకాయాలు కాస్తున్నాయా? సొరకాయలు కాస్తున్నాయా?’ అని అడిగేవాడు తప్ప. ఒక్క అక్షరం ముక్క కూడా చెప్పేవాడు కాదు. ఇదే విషయం మా ఇంట్లో చెబితే, మా మేనమామల ఇంటికి పంపించారు. ఒక మామయ్య బట్లపెనుమర్రు స్కూల్లో రైటర్‌గా పనిచేసేవాడు. అక్కడకు వెళ్లినా సెలవులు వస్తే చాలు బల్లిపర్రుకు వచ్చేసేవాడిని. 

అక్కడేనా లవ్‌స్టోరీ మొదలైంది?
చలపతిరావు: పీయూసీ చదువుకునేందుకు బందరు వచ్చా. అక్కడ నా లవ్‌స్టోరీ మొదలైంది. తను నా క్లాస్‌మేట్‌. చాలా మంచి అమ్మాయి. నాలో ఏం చూసిందో తెలియదు కానీ, ఒక రోజు నా దగ్గరకు వచ్చి, ‘పెళ్లి చేసుకుంటావా’ అని అడిగింది. అప్పటికి నాకు 19ఏళ్లు. ‘నీకు ఇష్టమా’ అని అడిగా. ‘సరే’నంది. వెళ్లి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో తెలియదు. ఎందుకంటే నాకు అన్నయ్య ఉన్నాడు. సాధారణంగా పల్లెటూళ్లలో పెద్దవాళ్లకు చేయకుండా చిన్నవాళ్లకు ముందు పెళ్లి చేయరు. అలాంటిది నాకు పెళ్లయిందని తెలిసి మా అన్నయ్య ఏడవటం మొదలు పెట్టాడు. ‘తమ్ముడికి పెళ్లయింది. నాకు ఇక పిల్లను ఎవరు ఇస్తారు’ అని అంటుండేవాడు. దాంతో నేనే వాడికి సంబంధం చూసి పెళ్లి చేశా. ఆ తర్వాత నేనూ, ఆవిడ బెజవాడలో కాపురం పెట్టాం. అప్పటికి నేను ఇంకా చదువుతూనే ఉన్నా. అయితే నాటకాలు వేసేవాడిని. (మధ్యలో ఆలీ అందుకుని.. ‘సఖి’ అని మణిరత్నం సినిమా తీశారు. అది నీ కథే.) నా జీవితంలో జరిగిన సంఘటనలను రెండు, మూడు సినిమాలు తీశారు. ఈవీవీగారు ‘మానాన్నకు పెళ్లి’ నా కథే. ఇక అప్పట్లో నేను దాదాపు 100కు పైగా నాటకాలు వేశా. కాలేజ్‌లో చదువుకునే అవకాశం ఇచ్చేవాళ్లు కాదు. రిహార్సల్స్‌కు తీసుకుపోయేవారు. దీంతో పీయూసీ తప్పా. నాకు డాక్టర్ అవుదామని ఉండేది. అందుకే బైపీసీ తీసుకున్నా. దీంతో నాటకాలపైనే దృష్టి పెట్టా. అయితే హీరోయిన్‌లు దొరికేవారు కాదు. ‘తస్మాత్‌ జాగ్రత్త’ అనే నాటకం వేస్తుంటే హీరోయిన్‌గా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మా ఆవిడినే హీరోయిన్‌గా చేయించా. ఏకంగా ఉత్తమనటిగా అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి మద్రాసు వెళ్లిపోయాం. ఎందుకు వెళ్తున్నాం? మద్రాసు వెళ్లాక ఏం చేయాలి? ఇవేవీ తెలియదు. అక్కడికి వెళ్లాక తెలిసింది. ఇదొక మహాసముద్రమని. 

మరి ఎన్టీఆర్‌ను ఎలా కలిశారు?
చలపతిరావు: మద్రాసు వెళ్లిన తర్వాత ఏ స్టూడియోకు వెళ్లినా లోపలికి రానిచ్చేవాళ్లు కాదు. దాంతో ఎన్టీఆర్‌గారిని కలవాలని అనుకున్నా. అంత పెద్ద నటుడి దగ్గరకు నన్ను వెళ్లనిస్తారా? అప్పట్లో వజిల్లా రోడ్డులో నాలుగైదు బస్సులు వచ్చి ఆగేవి. అందరూ గుళ్లు కొట్టించుకున్న వాళ్లే. వెళ్లి ఎన్టీఆర్‌ను కలిసి, హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి, దండలు వేసేవాళ్లు. అప్పుడు ఆయన అందరినీ పలకరించేవారు. తిరుపతి సహా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినా రాని ఆనందం ఎన్టీఆర్‌ పలకరించగానే పులకించిపోయేవాళ్లు. ఇంతకన్నా మంచిదారి లేదని వాళ్లతోపాటు నేనూ వెళ్లా. ఎన్టీఆర్‌ను చూడటానికి వచ్చిన వాళ్లందరినీ పంపించేశారు. నేను ఉండిపోయా. ‘నీ సంగతి ఏంటి’ అని ఎన్టీఆర్‌ అడిగారు. ‘నేను పీయూసీ వరకూ చదువుకున్నా. సినిమాల్లో వేషం కోసమని చదువు మానేసి వచ్చాను’ అని చెప్పా. ‘పిచ్చివాడా.. వెళ్లి చదువుకుని ఉద్యోగం చేసుకో. ఇక్కడ వేషాలు రావడం కష్టం’ అని అన్నారు. ‘లేదన్నయ్యా.. నేను ఫ్యామిలీతో సహా వచ్చేశాను. మళ్లీ వెళ్లడం కుదరదు’ అని చెబితే, ‘మొండివాడిలా ఉన్నావే. వారం రోజుల తర్వాత కనపడు’ అన్నారు. అలాగే వారం తర్వాత వెళ్లా. ‘ఏంటి నువ్వు ఇంకా ఊరికి వెళ్లలేదా’ అని అడిగారు. ‘నేను వెళ్లను’ అని చెప్పా. అప్పుడే హేమాంభరధరరావు దర్శకత్వంలో ‘కథానాయకుడు’ తీస్తున్నారు. ఆయన్ను పిలిచి ‘వీడు ఎవడో మొండివాడిలా ఉన్నాడు. వీడికో వేషం ఇవ్వండి’ అన్నారు. హేమాంబరధరరావుగారు తన ఆఫీస్‌కు రమన్నారు. మరుసటి రోజు అక్కడి వెళ్తే, రెండు రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని చెప్పారు. కొద్దిసేపునాకు ఏమీ అర్థం కాలేదు. కారు వచ్చి నన్ను తీసుకెళ్లింది. 14మంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ అది. అదే నా తొలి చిత్రం. నేను అప్పటికే స్టేజ్‌ ఆర్టిస్ట్‌ను కావడంతో నాకు భయం వేయలేదు. తొలిరోజు షూటింగ్‌ అయిన తర్వాత ‘మనవాడు బాగానే చెప్పాడు’ అని అన్నారు. ఆయనకు నమస్కారం పెట్టి, బయటకు వచ్చేశా. ఆ చిత్రానికి గోపాలకృష్ణగారు నిర్మాత. ‘మనవాడు బాగా చేస్తున్నాడు. నాలుగైదు క్లోజప్‌ షాట్‌లు తీసి పెట్టు. పనికొస్తాడు’ అని కెమెరామెన్‌ వీఎస్‌ఆర్‌ స్వామికి చెప్పారు. ఎందుకంటే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలని అనుకున్నారట. ఈలోగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో ‘కథానాయకుడు’ ఆగిపోయింది. మళ్లీ ఆర్నెల్ల తర్వాత సినిమా మొదలు పెట్టి, పూర్తి చేశారు. బాగా ఆడింది. డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత గోపాలకృష్ణగారు సినిమాలు తీయనని చెప్పి వెళ్లిపోయారు. ‘చేతి దాకా వచ్చిన అవకాశం పోయింది’ అని బాధపడ్డా. ఎప్పటికప్పుడు కష్టం వచ్చేది. దాని వెనకాలో ఒక కర్తవ్యం ఉండేది. దాంతో ఏడుపు వచ్చేది కాదు. హీరోగా ప్రయత్నిద్దామంటే, అప్పటికే చాలా మంది ఉన్నారు. పోనీలే విలన్‌గా చేద్దామంటే, సత్యనారాయణ, త్యాగరాజు, ప్రభాకర్‌రెడ్డి ఇలా అనేకమంది ఉన్నారు. ఏం చేయాలో నాకు తెలియలేదు. దాంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఉండిపోదామని అనుకున్నా. ఇదే విషయం రామారావుగారికి కూడా చెప్పా. అప్పటి నుంచి చిన్నదైనా, పెద్దదైనా ఏ వేషమైనా వేయడానికి సిద్ధంగా ఉన్నా. 

ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చేశారు?
చలపతిరావు: దాదాపు 1500 సినిమాలకు పైగా చేశా. అన్ని భాషల్లో చేశాను. ఇంకో విషయమేమిటంటే, తెలుగులో ఉన్న అందరు హీరోలతోనూ చేశా. అలాంటివాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. 

ఎన్టీఆర్‌తో మీ అనుబంధం ఎలా ఉండేది?
చలపతిరావు: ఆయనతో నా ప్రయాణం చాలా బాగుండేది. ఆయనకు చదువుకున్న వాళ్లు ఎవరైనా కనపడితే, ‘గురువుగారు’ అని పిలిచేవారు. అంత మర్యాదగా మాట్లాడేవారు. సాధారణంగా ఏదైనా సినిమాలో ఒకసారి తండ్రిగా వేషం వేస్తే, ‘మొన్ననే కదండీ వేశారు. వద్దు’ అని అంటారు. కానీ, ‘దాన వీర శూర కర్ణ’లో ఆయన మూడు పాత్రలు చేస్తే, నేను అయిదు పాత్రలు చేశా. నటుడు, దర్శకుడిలో దమ్ముంటే ఎన్ని పాత్రలు అయినా చేయొచ్చని ఆయన చెప్పేవారు. అంత గొప్ప దర్శకుడు ఆయన. ముందు సూతుడి పాత్ర చేశా. దానికి మూడు గెటప్‌లు. ఆ తర్వాత ఇంద్రుడి పాత్ర కూడా నేనే చేశా. ఒకరోజు సడెన్‌గా ఎన్టీఆర్‌ కబురు చేశారు. ‘ఏంటి అన్నయ్యా.. పిలిచారట’ అని అంటే, ‘ఆ 14వ ర్యాక్‌లో గడ్డం ఉంటుంది. 12 ర్యాక్‌లో విగ్గు ఉంటుంది. 22వ ర్యాక్‌లో మీసాలు ఉంటాయి. పెట్టుకుని వచ్చేయ్‌’ అన్నారు. నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయా. ‘ఏంటీ.. ఏమైంది’ అన్నారు. ‘నేను ఇప్పటికే మూడు వేషాలు.. నాలుగు గెటప్‌లు వేశా. ఇప్పుడు ఇది కూడా వేస్తే జనం నవ్వుతారు’ అని అన్నా. ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. ‘ఒరేయ్‌ పిచ్చివాడా.. ఇప్పటికీ పల్లెటూళ్లలో ఎన్టీఆర్‌ ఎవరో తెలియదు.. నిన్ను ఎవడు పట్టించుకుంటాడు. వెళ్లు’ అని అన్నారు. వెళ్లి గెటప్‌ వేసుకుని వస్తే, బొట్టు పెడుతూ, ‘నువ్వు జరాసంధుడివి. వెళ్లి ఆ పాత్ర డైలాగ్‌లు చదువుకో’ అన్నారు. ఆయనకు ప్రతి విషయమూ గుర్తే. 

మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా?
చలపతిరావు: మద్రాసులో నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నా. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్‌ దగ్గరికి వెళ్లి విషయం చెప్పి, ‘మీరే ముహూర్తం పెట్టాలి’ అని అడిగా. ‘రేపు ఉదయం 4గంటలకు మంచి ముహూర్తం ఉంది. అన్నీసిద్ధం చేసుకోగలవా’ అని అడిగారు. నేను ‘సరే’నన్నా. మరుసటి రోజు ఉదయం 4గంటలకు అన్నీ రెడీ చేసుకుని ఉంటే, ఈయన పోలీసు బెటాలియన్‌తో దిగాడు. పిల్లలను తీసుకుని ఇంట్లోకి వెళ్లి, కొబ్బరికాయ కొట్టేశాడు. ‘మనవాడు చిన్న ఇల్లు కట్టుకున్నాడు’ అని తెగ ఆనందపడిపోయారు. అప్పట్లో ఆయనకు మీగడ పెరుగు, గోధుమరవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం. ‘వెరీ గుడ్‌’ అనుకుంటూ అది తిని వెళ్లిపోయారు. 

మీ భార్య ఎలా చనిపోయారు?
చలపతిరావు: అనారోగ్యంతో చనిపోయారు. అప్పుడు రవికి ఏడేళ్లు. పెద్దపాపకు నాలుగు, చిన్న పాపకు మూడేళ్లు. ఆ వయసులో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ‘మళ్లీ పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటే ఏమవుతుంది. వచ్చే ఆవిడ చూస్తుందో?లేదో?’ ఇవే ఆలోచనలు. మళ్లీ పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్‌-తారకమ్మ కూడా చెప్పారు. ‘ఇప్పుడు బాగానే ఉంటుంది. పెద్ద వయసులో నీకు అండగా ఎవరూ ఉండరు’ అని అన్నారు. అప్పుడు బాగా ఆలోచించి ఒకటే నిర్ణయం తీసుకున్నా. ‘ఉంటే పిల్లలు నాతో ఉంటారు. లేకపోతే నాతో చచ్చిపోతారు. అయితే వీళ్లను బాగా చదివించాలి’ అనుకున్నా. చదువు విషయంలో నేనెప్పుడూ మా పిల్లలను ఒత్తిడి చేయలేదు. ముగ్గురూ చదువుకున్నారు. గోల్డ్‌ మెడల్స్‌ కూడా వచ్చాయి. చిన్నప్పటి నుంచి వాళ్లకు ధైర్యం చెప్పేవాడిని. అమరచిత్ర కథలు చదివించేవాడిని. ఆడపిల్లలు ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అలాగే రవికి పెళ్లి చేసి పంపించేశా. స్వతంత్రంగా ఎలా బతకాలో వాళ్లకు తెలిసొచ్చింది. నేటి యువతరానికి నేను చెప్పేది ఒక్కటే, మీకు మీరు స్వతంత్రంగా బతకండి. ఎవరికీ భయపడవద్దు. బాగా చదువుకోండి. అప్పుడే మీరు ఎక్కడ ఉన్నా రాణించగలరు. 

మరి ఇంత అనుభవం ఉన్న మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు?
చలపతిరావు: మహిళల గురించి సోషల్‌మీడియాలో నేను ఏదో అన్నానని ఏకేశారు. నేను అన్నది వేరు.. వాళ్లు కల్పించింది వేరు. కేసులు పెట్టారు. మహిళలను నేను చాలా గౌరవిస్తా. 22ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదు. బయటవాళ్ల కన్నా సినిమా వాళ్లు గొప్పవాళ్లు. సినిమాలో చేసే మహిళల గురించి పరుషంగా మాట్లాడటం, తూలనాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం చేయలేదు. అటువంటిది నన్ను అల్లరి చేసి పారేశారని తీవ్ర మనో వేదనకు గురయ్యా. ‘నన్ను ఈ విధంగా అల్లరిపాలు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాను. ఇన్నాళ్లూ నిప్పులా బతికాం. ఇక బతకనిచ్చేటట్లు లేరు’ అని సూసైడ్‌ లెటర్‌ రాసి చనిపోదామనుకున్నా. 

సంవత్సరంలో 8నెలలు షూటింగ్‌ చేసి 4నెలలు అమెరికాలో ఉంటారు కదా!
చలపతిరావు: అవును! మా అమ్మాయిల దగ్గరకు వెళ్లిపోతా. వాళ్లు రోజూ ఫోన్‌ చేస్తారు. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులను అమ్మాయిలు బాగా చూసుకుంటారు. కొడుకులు అలా కాదు. వాళ్లు దరిద్రమే. పట్టించుకోరు. మా అమ్మాయిలు ఆఫీస్‌కు వెళ్తూనే రోజూ ఉదయం ఫోన్‌ చేస్తారు. మా రవి రెండు నెలలకు ఒకసారి ఫోన్‌ చేస్తాడు. అమ్మలేని లోటు కనపడకుండా వాళ్లను పెంచా. వాళ్లు చాలా క్రమశిక్షణగా పెరగడానికి మా అమ్మే కారణం. మా ఆవిడ చనిపోయిన తర్వాత మా అమ్మను మద్రాసు తీసుకొచ్చా. పిల్లలను బాగా పెంచింది. 

మీ భార్య, ముగ్గురు స్నేహితులు దూరమైపోయిన తర్వాత మీ జీవితం ఎలా గడిచింది?
చలపతిరావు: ప్రతిదానికీ నాకు దేవుడు ఏడుపు రాకుండా చేశాడు. ఒక కష్టం కలిగిన వెంటనే మరొకటి రెడీగా ఉండేది. దానిలో ఇది తోసుకుపోయింది. ఎన్టీఆర్‌ను నేను అమితంగా ప్రేమిస్తా. ఆయన కూడా నన్ను అభిమానంగా చూసుకునేవారు. అటువంటి మనిషి చనిపోగానే గుండె పగిలిపోతుందనుకున్నా. ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే ఆయన ‘చండ శాసనుడు’ చేసే సమయంలో ‘అన్నయ్యా నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను’ అన్నాను. ‘వద్దు. వద్దు. రాజకీయాలు అనేవి దరిద్రం మీరు రావొద్దు. మంచి కథలు, పాత్రలు రాసుకుని, చక్కని సినిమాలు చేయండి’ అన్నారు. అటువంటి మనిషి లేరు. నాకు పెద్ద అండపోయింది. అయితే అప్పటికే దేవీ వరప్రసాదు, విజయా భాస్కరరావు మేము అందరం ఎన్టీఆర్‌ దగ్గర పనిచేసేవాళ్లం. ఆ సమయంలో దేవీ వరప్రసాద్‌తో కలిసి పయనించా. అలాంటి సమయంలో ఈవీవీగారు వచ్చి ‘అల్లుడా మజాకా’ చేశారు. పెద్ద హిట్టయింది. సడెన్‌గా దేవీ వరప్రసాద్‌ చనిపోయారు. ‘ఏంటిరా భగవంతుడా’ అనుకున్నా. ఎందుకంటే అందరితోనూ కలివిడిగా ఉండలేం కదా! కష్ట సుఖాలు పంచుకోలేం. అప్పుడు ఈవీవీతో మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం. అంతా బాగుందనుకున్న సమయంలో ఆయనకు క్యాన్సర్‌ వచ్చింది. ముంబయి తీసుకెళ్లి నేను చూపించా. ‘ఒక్కో ఇంజెక్షన్‌ రూ.లక్ష. వాటితో పాటు, మందులు వాడితే తగ్గిపోతుంది’ అన్నారు. చాలావరకూ తగ్గింది. మంచినీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడే వ్యక్తి.. ఆవకాయ వేసుకుని అన్నం తినే స్థాయికి వచ్చాడు. నేను చాలా సంతోషించా. ‘ఏడాదిలోపు క్యాన్సర్‌ రాకపోతే ఏడెనిమిది ఏళ్లు బతుకుతాడు. లేకపోతే ప్రమాదం.’ అని డాక్టర్లు చెప్పారు. ‘బెండు అప్పారావు’ షూటింగ్‌ చేస్తుంటే, సీరియస్‌ కావడంతో హైదరాబాద్‌ తీసుకొచ్చాం. మూడు రోజుల తర్వాత చనిపోయాడు. ఒక్కో స్నేహితుడు చనిపోతుంటే ఏం చేయాలో నాకు తోచడం లేదు. జీవితం నరకప్రాయంగా అనిపించింది. ఆ తర్వాత నుంచి బోయపాటి శ్రీనుతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. నాకు ఇప్పటికీ మనస్ఫూర్తిగా ఏడవాలని అనిపిస్తుంది. అప్పుడు ‘పాండురంగమహత్యం’లోని ‘అమ్మా అని పిలిచినా..’ అనే పాట పెట్టుకుని ఏడుస్తూనే ఉంటా. అలా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటా. అప్పుడు గుండెల్లోని బాధపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నా ఇద్దరు కూతుళ్లు అమెరికా వెళ్లిపోయిన తర్వాత నాకు మూడో కుమార్తెగా ‘మిర్రర్‌ విజయలక్ష్మి’ దొరికింది. నాకు చిన్న కాలు నొప్పి వచ్చినా పరిగెత్తుకుంటూ వస్తుంది. 

ఎన్టీఆర్‌కు మీరు భక్తుడా..? అభిమానా? బంధువా?
చలపతిరావు: వీటన్నింటికన్నా ఎక్కువ. మొదటి నుంచీ నాకు రామారావుగారు అంటే ఇష్టం. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఒకసారి ‘మేకప్‌ అంటే ఏంటో తెలుసా’ అన్నారు. ‘మేకప్‌ అంటే మనం వేసుకునేది’ అని చెప్పా. ‘అది కాదు. మేకప్‌ అంటే లక్ష్మితో సమానం. మనం మేకప్‌ వేసుకుంటే లక్ష్మి మన దగ్గరకు వస్తుంది. అందుకోసం మేకప్‌ వేసుకుని డ్రామాలు ఆడతాం. లక్ష్మి వచ్చి ఆవహించిన తర్వాత షూటింగ్‌ అయిపోతే, కొబ్బరి నూనె తీసుకుని తువాలుతో మేకప్‌ తుడిచేస్తాం. ఆ తువాళ్లు తీసుకెళ్లి, వాళ్లు ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. అందుకే నేను వాటిని ఉతికి జాగ్రత్త చేయిస్తా. మన వృత్తికి మనమే గౌరవం ఇవ్వాలి కదా’ అని చెప్పారు. పెద్ద వాళ్లకు గౌరవం ఇవ్వాలి. ఇటీవల టీవీల్లో వస్తున్న యాంకర్లు.. ‘రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి’అంటారు. ‘రామారావుగారు’ అంటే వాళ్ల సొమ్మేమీ పోదు కదా! దయచేసి పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.