close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సినిమా: గ‌ద్దల‌కొండ గ‌ణేష్‌
న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్‌, అధ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే, మృణాళిని ర‌వి, స‌త్య త‌దిత‌రులు
ఛాయాగ్రహ‌ణం: ఐనాంక బోస్
పోరాటాలు: వెంక‌ట్‌
క‌ళ‌: అవినాష్ కొల్ల‌
కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌
సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
స్క్రీన్‌ ప్లే: మ‌ధు శ్రీనివాస్‌, మిథున్ చైత‌న్య
ద‌ర్శక‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌

రాత్రికి రాత్రే పేరు మార్చుకున్న చిత్రం ‘గద్దలకొండ గ‌ణేష్‌’. ‘వాల్మీకి’గా ప్రారంభ‌మై... విడుద‌ల‌కు సిద్ధమైన ఈ చిత్రం పేరుపై అభ్యంత‌రాలు వ్యక్తమయ్యాయి. పేరు మార్చాలంటూ కొన్ని సంఘాలు కోర్టు త‌లుపులు త‌ట్టాయి. దాంతో చిత్ర బృందం విడుద‌ల‌కు ముందు రోజు రాత్రి ‘గ‌ద్దలకొండ గ‌ణేష్‌’గా సినిమా పేరు మార్చింది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘జిగ‌ర్తాండ‌’కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. విలన్‌ ఛాయల‌తో కూడిన పాత్రలో వ‌రుణ్ తేజ్ న‌టించ‌డం... రీమేక్‌తో `గ‌బ్బర్‌సింగ్‌`లాంటి విజ‌యాన్ని అందుకొన్న హ‌రీష్‌ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం... ఆస‌క్తి రేకెత్తించిన ప్రచార చిత్రాలు, వ‌రుణ్ లుక్.. ఇలా అన్నీ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. మ‌రి చిత్రం ఎలా ఆకట్టుకుంది?

క‌థేంటంటే: గ‌ద్దల‌కొండ గ‌ణేష్ అలియాస్ గ‌నీ (వ‌రుణ్‌తేజ్‌) ఒక గ్యాంగ్‌స్టర్‌. త‌న‌కి అడ్డొచ్చిన‌ వాళ్లని అంతం చేస్తూ గ‌ద్దల‌కొండ‌పై ఆధిప‌త్యం చెలాయిస్తుంటాడు. ప్రత్యర్థుల‌కు సింహ‌స్వప్నంలాంటి గ‌ణేష్ క‌థ‌తో సినిమా తీయాల‌ని ఆ ఊరొస్తాడు అభిలాష్ (అధ‌ర్వ). స‌హాయ ద‌ర్శకుడిగా ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కొని సినిమా తీసే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్న అభిలాష్ గ‌ద్దల‌కొండ గ‌ణేష్ వ‌ర‌కు వెళ్లాడా? లేదా? ఆయ‌న దందాల గురించి, వ్యక్తిగ‌త జీవితం గురించి ఎలా తెలుసుకొన్నాడు? ఈ క‌థ‌లో క‌థానాయ‌కుడిగా ఎవ‌రు న‌టించారు? ఆ సినిమా హిట్టయ్యిందా లేదా? గ‌ద్దల‌కొండ గ‌ణేష్ జీవితం ఎలా మారింది? శ్రీదేవి (పూజాహెగ్డే), బుజ్జమ్మ (మృణాళిని)లు ఎవ‌రు? వాళ్లకీ, గ‌ణేష్‌కీ సంబంధం ఏంటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: బ‌ల‌మైన క‌థ, క‌థ‌నాల‌కు... దీటైన క్యారెక్టరైజేష‌న్ కూడా తోడైందంటే  ఆ సినిమా మ‌రో స్థాయికి వెళ్తుంది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘జిగ‌ర్తాండ‌’ క‌థ‌ని తెలుగు వాతావ‌ర‌ణానికి త‌గ్గట్టుగా తీర్చిదిద్దడంలో మంచి ప‌నితీరు ప్రద‌ర్శించారు దర్శకుడు హ‌రీష్ శంక‌ర్‌. మాస్ అంశాల్ని... వాణిజ్యాంశాల్ని జోడించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ఆయ‌న ఇదివ‌ర‌కు తీసిన ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా కోసం ‘దబాంగ్‌’ క‌థ‌లో చాలానే మార్పులు చేశారు. కానీ ‘జిగ‌ర్తాండ’ క‌థ విష‌యంలో మాత్రం ఎంత అవ‌స‌ర‌మో, అంతే మార్పులు చేసి... క్యారెక్టరైజేష‌న్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. వ‌రుణ్‌తేజ్‌కి త‌గ్గట్టుగా గ‌ద్దల‌కొండ గ‌ణేష్ పాత్రని తీర్చిదిద్దారు. దాంతో క‌థ, క‌థ‌నాలు... క్యారెక్టరైజేష‌న్ ఒక‌దానికొక‌టి పోటీప‌డి సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. ప్రథమార్ధం సినిమా అంతా కూడా గ‌న్నీ దందాల‌తోనూ, శ‌త్రువుల ఎత్తులకి పైఎత్తులు వేయ‌డంతోనూ సాగుతుంది. మ‌రోప‌క్క అభిలాష్ సినిమా ప్రయ‌త్నాలు సాగుతుంటాయి. క‌థ‌లోనుంచే హాస్యం పండించే ప్రయ‌త్నం చేయ‌డంతో ప్రథ‌మార్ధం ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ద్వితీయార్ధంలో క‌థ‌, మ‌లుపులకి తోడుగా భావోద్వేగాల‌కీ ప్రాధాన్యమిచ్చారు. దాంతో సినిమా మ‌రింత ర‌క్తిక‌డుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, వ‌రుణ్‌తేజ్‌, పూజా హెగ్డే 80ల నాటి లుక్, ఆ నేప‌థ్యం చిత్రానికి ప్రధాన బలం. ప‌తాక స‌న్నివేశాలు కాస్త సాగ‌దీత‌గా అనిపించినా... వాటిని భావోద్వేగాల కోసం చక్కగా వాడుకున్నారు ద‌ర్శకుడు. సినిమా కోసం ట్రైనింగ్ తీసుకునే ఎపిసోడ్‌, సినిమా పూర్తయ్యాక గ‌ద్దలకొండ గ‌ణేష్‌కి వ‌చ్చే గుర్తింపు ఆ నేప‌థ్యంలో పండిన హాస్యం, భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. సినిమా గొప్పదనాన్ని చాటి చెప్పేలా క‌థ సాగే విధానం, ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. అక్కడక్కడా సాగ‌దీత‌గా అనిపించే కొన్ని స‌న్నివేశాలు మిన‌హా సినిమా ఆద్యంతం వినోదం పంచుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: వ‌రుణ్‌తేజ్ గ‌ద్దల‌కొండ గ‌ణేష్ పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్ర ఆయ‌న కోస‌మే పుట్టిందా? అనేలా గెట‌ప్పు, హావ‌భావాలు కుదిరాయి. ఆయ‌న సంభాష‌ణ‌లు ప‌లికిన తీరు కూడా మెప్పిస్తుంది. క‌థ‌, క‌థ‌నాల్ని మించిపోయేలా ఆయ‌న క్యారెక్టరైజేష‌న్ హైలెట్ అయ్యింది. పూజాహెగ్డే క‌నిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే అయినా... ఆక‌ట్టుకున్నారు. ఎల్లువొచ్చి గోదార‌మ్మ... రీమిక్స్ పాట‌లో వ‌రుణ్‌, పూజా చేసిన సంద‌డి ఆక‌ట్టుకుంటుంది.  అధర్వ, మృణాళిని పాత్రల ప‌రిధి మేర‌కు చక్కగా న‌టించారు. ద‌ర్శకుడిగా ఎద‌గాల‌నే త‌ప‌న ఉన్న యువ‌కుడి పాత్రలో అధ‌ర్వ మెప్పిస్తారు. స‌త్య, బ్రహ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, అన్నపూర్ణమ్మ, ర‌చ్చరవి, శ‌త్రు త‌దిత‌రుల పాత్రలు కూడా ఆక‌ట్టుకుంటాయి. డింపుల్ హ‌యాతి చేసిన ప్రత్యేక‌ గీతం, ఆమె అందం సూప‌ర్‌హిట్టు అనిపించేలా ఉంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా కనిపిస్తుంది. ఛాయాగ్రాహ‌కుడు ఐనాంక బోస్ గ్యాంగ్‌స్టర్ సినిమాకి త‌గ్గట్టుగా ప్రత్యేక‌మైన క‌లరింగ్‌, మూడ్‌తో త‌న కెమెరా ప‌నిత‌నాన్ని ప్రద‌ర్శించారు. మిక్కీ జె.మేయ‌ర్ నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ ప‌రంగా మాత్రం చాలా చోట్ల కత్తెర‌కు ప‌నిచెప్పాల్సింది. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.  ద‌ర్శకుడిగా హ‌రీష్‌ శంక‌ర్ ప‌నితీరు మెప్పిస్తుంది. ర‌చ‌న‌లో ఆయ‌న‌కున్న బ‌లం మ‌రోసారి ఈ సినిమాతో రుజువైంది. ‘ఇదివ‌ర‌కు సుఖంగా బ‌త‌కాల‌నుకొనేవాళ్లు.. ఇప్పుడు సుఖంగా చస్తే చాల‌నుకొంటున్నారు’, ‘మ‌న చేతుల్లో ఉత్త గీత‌లే ఉంట‌యి.. రాత‌లు ఉండ‌యి’లాంటి సంభాష‌ణ‌లు చ‌ప్పట్లు కొట్టిస్తాయి.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ వ‌రుణ్‌తేజ్ పాత్ర... ఆయ‌న న‌ట‌న‌ - అక్కడ‌క్కడా సాగ‌దీత‌గా స‌న్నివేశాలు
+ క‌థ‌, క‌థ‌నం  
+ హాస్యం, భావోద్వేగాలు  
+ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌  

చివ‌రిగా.. స‌ందడంతా గ‌ద్దలకొండ గ‌ణేష్‌దే

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.