close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

● ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది
●మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైకాపా ఎమ్మెల్యేల ఆందోళన
● రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ పనితీరుపై పెదవి విరుపు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇసుక సరఫరా, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఇతర అంశాల్లో బాగా వెనుకబడిపోతున్నాం. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఓట్లు పడే అవకాశాలు లేవు. ప్రజల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉంది. రహదారులు ఛిద్రమైనా పునరుద్ధరించే పరిస్థితి లేదు. ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీసు శాఖల పనితీరు ఆందోళనకరంగా ఉంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. దీని వల్ల ప్రజల్లో పార్టీ చులకనవుతోంది. పరిస్థితులను సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దికపోతే పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉంది.. - శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా శాసనసభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుల ఆందోళన ఇది..

న్యూస్‌టుడే - వన్‌టౌన్‌: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, బి.మాధవి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, అదీప్‌రాజ్‌, తిప్పలనాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, శెట్టి ఫల్గుణ, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, సీపీ ఆర్‌కె మీనా తదితరులు పాల్గొన్నారు.

*విశాఖ నగరం సహా జిల్లాలోని పరిస్థితులపై ప్రజాప్రతినిధులు తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక కొరత కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారని, తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. ఇంకా ఏమన్నారంటే...
మా పేర్లు చెప్పుకుని వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండండి..
మా పేర్లు చెప్పుకొని వచ్చే వారి పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలి. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరినీ ఉపేక్షించొద్ధు గతంలో విశాఖలో అనేక భూ కుంభకోణాలు జరిగాయి. విచారణ జరిగినా నివేదిక వెలుగు చూడలేదు. ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇసుకతవ్వకాలు, అమ్మకం, సరఫరాలో చాలా సమస్యలు ప్రభుత్వం దృష్టికొచ్చాయి. ప్రస్తుతం ఉన్న 45 రీచ్‌లను మరింతగా పెంచుతాం. రోబో (రాక్‌) ఇసుక వినియోగాన్ని పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇసుక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌ఏడీ పైవంతెన పనులు జనవరి నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలి. అక్రమ కట్టడాలను కూల్చేయాలి. - విజయసాయిరెడ్డి

*సీఎం ఆశయాలకు అనుగుణంగా అధికారులు సేవలందించాలి. ప్రజాప్రతినిధులు ప్రస్తావించే అంశాలను తక్షణమే పరిష్కరించేవిధంగా చొరవ తీసుకోవాలి. ఇసుక సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం. అభివృధ్ధి, సంక్షేమం సమతూకం సాదించే విధంగా చొరవ తీసుకోవాలి. - మంత్రి మోపిదేవి వెంకటరమణ

*నవంబరు నుంచి దశలవారీగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సమయానికి అభివృద్ధి ప్రజలకు కనిపించాలి. భూ కుంభకోణాలు, ఇసుక కొరత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. గతంలో కశింకోట మండల పరిధిలోని జమ్మాదులపాలెంలో రూ. 250 కోట్ల భూ కుంభకోణం జరిగినా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇక మీదట అలా జరగకూడదు. ఇసుక కోసం విశాఖకు ప్రత్యేకంగా ఒక రీచ్‌ను శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలి. - మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

*ఇసుక కొరత కారణంగా విశాఖలో నిర్మాణం రంగం కుదేలైంది. అనేకమంది ఉపాధి కోల్పోయారు. దీని వల్ల ప్రజల్లో అపోహలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా రాబో ఇసుకను వాడేందుకు చర్యలు చేపట్టాలి. పింఛన్లు, రేషను సరుకుల పంపిణీలో లోపాలు సరిచేయాలి. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అపవాదును తొలగించాలి. - ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

*75 వేల ఇళ్ల నిర్మాణాలకు భూములను అవసరం. శాటిలైట్‌సిటీలను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్‌ఏడీ పైవంతెన నిర్మాణ పనులను వేగవంతం చేశాం. - వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు

*రెవెన్యూశాఖ పరంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 22ఎ జాబితాల్లో భూములను చేర్చడం వల్ల వాటిని అమ్ముకోవాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తోంది. భూముల ఆన్‌లైన్‌ విధానంలో వివాదాలు పెరిగిపోయాయి. వాటిని చక్కదిద్దాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేస్తోంది. తహసిల్దార్ల కార్యాలయాల్లో పనులు జరగడం లేదు.

*జీవీఎంసీ పరంగా పనులు ముందుకు సాగడం లేదు. రహదారులు దెబ్బతిన్నా చక్కదిద్దే పరిస్థితి లేదు.

*పోలీసు కేసుల పరంగా సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాబూజీ తెలిపారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌ఏడీ పైవంతెన వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో జేసీ శివశంకర్‌, ఐటీడీఏ పీఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల వాణి ఇలా..
*భూ సమస్యలను పరిష్కరించాలి. రెవెన్యూ అధికారుల తీరు బాగోలేదు. పంచగ్రామాల భూ సమస్య కొలిక్కి తేవాలి. పరవాడ మండల పరిధిలో రెండు గ్రామాలను జోన్‌5లో విలీనం చేయాలి. వీటిని అనకాపల్లి జోన్‌లో ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

*చోడవరం నియోజకవర్గ పరిధిలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎడ్ల బళ్లపై ఇసుక తరలిస్తున్నవారిపై కేసులు పెడుతున్నారు. ఎస్పీకి చెప్పినా స్పందన లేదు. - చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

*వర్షాలకు గాజువాకలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం. వాలంటీర్ల పనితీరు బాలేదు. - గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

*22ఎ జాబితాల్లో పెట్టిన భూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆన్‌లైన్‌ తప్పిదాలను సరిదిద్దడం లేదు. పోలీసులు వినాయక చవితి ఉత్సవాల్లో అతిగా వ్యవహరించారు. పిల్లలు డీజేలు పెట్టుకుంటే అరెస్టులు చేయడం సరికాదు. - అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

*పోలీసు శాఖ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోంది. తేలికపాటి అంశాలకే గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో పోలీసులు అతిగా వ్యవహరించారు. దీనివల్ల ప్రజల్లో పార్టీ చులకనవుతోంది. రాజకీయంగా ఇబ్బందులొచ్చే పరిస్థితి నెలకొంది.
ప్రతీ ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు
కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ పరంగా ప్రస్తావించిన అంశాలను సమీక్షించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్డీఓలు, డీఎస్పీ, మైనింగ్‌ శాఖలకు చెందిన ఏడీలతో సమన్వయ కమిటీలు వేసి ఇసుక సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తాగునీరు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
జీవీఎంసీ కమిషనర్‌ సృజన మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నగర పరిధిలో రూ.150కోట్ల విలువ చేసే పనులను నిలిపివేశామని, ప్రస్తుతం రూ.10కోట్ల పనులకు టెండర్లును పిలుస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.70కోట్లతో కూడిన ప్రణాళిక అమలు చేయబోతున్నట్లు వివరించారు.


హాజరైన ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.