close

తాజా వార్తలు

భారత్‌కు నిజమైన స్నేహితుడు ట్రంప్‌: మోదీ

హ్యూస్టన్‌: అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ సంయుక్తంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక వద్దకు విచ్చేసిన ట్రంప్‌కు భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ స్వాగతం పలకగా, మోదీ వేదికపైకి తోడ్కొని వెళ్లారు. కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ మాట్లాడుతూ... ‘‘ట్రంప్‌ను కలిసే అవకాశాలు నాకు తరచుగా లభించాయి. ట్రంప్‌ ప్రతి సందర్భంలోనూ అత్యంత స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడు ట్రంప్‌. కొన్నేళ్లుగా భారత్‌- అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. ఇప్పుడు ట్రంప్‌, మోదీ కాదు.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల సమాగమం ఇది. హ్యూస్టన్‌ నుంచి ఈ కొత్త స్నేహగీతం కొనసాగుతుంది. ఈ సభ కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది.’’ అని వ్యాఖ్యానించారు. ‘అబ్‌కే బార్‌ ట్రంప్‌ సర్కార్‌’  మళ్లీ ట్రంప్‌ అధికారంలోకి రావాలని మోదీ ఆకాక్షించారు. ఈ దీపావళి సంబరాల్లో ట్రంప్‌ మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అందరూ బాగున్నారా...

‘హౌడీ-మోదీ’ సభలో పాల్గొన్న మోదీ ... అందరూ బాగున్నారా అంటూ పలు భారతీయ భాషల్లో సంబోధించి సభికులను ఉత్సాహపరిచారు. వైవిధ్య భారతీయ భాషలు స్వేచ్ఛాయుత సహజీవనానికి ప్రతీక అని వాఖ్యానించారు.‘‘ అనేక భాషలు, సంస్కృతులు.. ఒక దేశం మా విధానం. అనేక ఆచారాలు, వేషభాషలు, పూజావిధానాలు మా సొంతం. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ జీవన సంస్కృతి. ఇక్కడున్న 50వేల మంది భారతీయ సంస్కృతికి ప్రతినిధులు. అమెరికా జనాభా కంటే రెట్టింపు ప్రజలు భారతీయ ఎన్నికల్లో పాల్గొన్నారు. భారత్‌లో ఈసారి ఎన్నికల్లో 8కోట్ల మంది కొత్త ఓటర్లు ఓటేశారు. 60 ఏళ్ల తర్వాత భారత్‌లో అత్యంత బలమైన ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్ల పాలన తర్వాత మరింత శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పడింది. ఇదంతా మోదీ ప్రతిభ వల్ల జరిగింది కాదు.. భారతీయుల సంకల్పం వల్ల జరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పు భారత ప్రగతికి నిదర్శనం. ఇప్పడు భారత్‌లో అతి పెద్ద సూత్రం.. ప్రజా భాగస్వామ్యం. సంకల్పం నుంచి సాకారం వరకు... ఇదే భారత్‌  కొత్త నినాదం. నవీన భారత నిర్మాణమే ఈ సంకల్పానికి లక్ష్యం. మమ్మల్ని మేమే పోటీదారులుగా భావిస్తున్నాం. 97 శాతం గ్రామాలకు ఐదేళ్లలో రోడ్లు వేశాం. ఐదేళ్లలో 2లక్షల కి.మీ. మేర గ్రామీణ రోడ్లు నిర్మించాం. గత ఐదేళ్లలో వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానం చేశాం. 37 కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించాం’’ అని మోదీ వివరించారు.

మోదీతో కలిసి పనిచేస్తాం: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్‌- అమెరికా స్వప్నాలు సాకారం చేసేందుకు మోదీతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ‘‘మోదీ.. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప సేవ చేస్తున్నారు. భారత్‌ అత్యున్నత విలువలు, సంస్కృతి... అమెరికా విలువలతో కలిసిపోతాయి. భారత్‌-అమెరికా సంబంధాలు ఎన్నడూలేనంత బలోపేతం అయ్యాయి. ఇరుదేశాల ప్రజాస్వామ్యాలు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తున్నాయి. అమెరికా సమాజంలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయి. నాలుగేళ్లలో కోటీ 40లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. పన్నుల హేతుబద్ధతతో కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఓహియో రాష్ట్రంలో భారతీయ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారం నిర్మిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అమెరికాలో భారత్‌ పెట్టుబడులు పెడుతోంది. అమెరికా తయారీ అత్యున్నత వస్తువులు భారతీయులకు అందుబాటులో ఉంటాయి. భారత ఇంధన అవసరాలకు అమెరికా అండగా నిలుస్తుంది. టెక్సాస్‌ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులు భారత్‌కు అందుబాటులోకి వస్తాయి. వచ్చే కొన్నేళ్లలో భారత్‌కు అమెరికా నుంచి ఎల్‌అండ్‌జీ ఎగుమతులు ప్రారంభమవుతాయి. ముడిచమురు ఉత్పత్తులు కూడా భారత్‌కు అమెరికా నుంచి వెళ్తాయి. భారత్‌- అమెరికాలు రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయి. సరిహద్దు భద్రత అనేది భారత్‌, అమెరికాకు అత్యంత ప్రాధాన్యత అంశం. సరిహద్దు భద్రత అంశంలో భారత్‌కు సహకరిస్తాం. భారత సంతతి అమెరికన్లు అమెరికా అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారు. శాస్త్ర-సాంకేతిక, ఆర్థిక రంగాల్లో  వారి కృషి ప్రశంసనీయం. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇరుదేశాలనూ నూతన పథంలోకి నడిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చింది. 40 కోట్ల మంది బలమైన మధ్యతరగతి భారత్‌ ఆస్తి. ఇక్కడి ప్రజాప్రతినిధులంతా హ్యూస్టన్‌ బలోపేతానికి యత్నిస్తున్నారు. ఈ సభకు  50 వేల మంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకం. ఇది హృదయం ఉప్పొంగే రోజు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.