close

తాజా వార్తలు

అసలైన విశ్వవిజేత అతడే! 

విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడలేదు.. సాహోసపేత ప్రదర్శనలూ చేయలేదు.. రికార్డులూ సృష్టించలేదు.. అయినా గౌతం గంభీర్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎప్పటికీ ప్రియమైన ఆటగాడే. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ ముద్దాడటంలో అతడిదే కీలకపాత్ర. రెండు ఫైనల్లోనూ అత్యధిక స్కోరు అతడిదే. అయినా అతడి పోరాటానికి తగిన గుర్తింపు లభించలేదనేది కొట్టిపారేయలేని వాస్తవం. ధోనీ సిక్సర్‌ ముగింపుతో అతడి తుదిపోరు ఇన్నింగ్స్‌ కనుమరుగైపోయింది. సహచరులంతా వెనుదిరుగుతున్నా అతడు పోరాడి జట్టుకు ఎన్నో మధుర విజయాలు అందించాడు. వ్యక్తిగత రికార్డుల కోసం ఎప్పుడూ ఆశించని గొప్ప పోరాట యోధుడు గంభీర్‌ జన్మదినం నేడే.

గంభీర్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది అతడి ముక్కుసూటి ప్రవర్తన. మైదానంలో ఎవరికీ తలవంచని వ్యక్తిత్వం అతడి సొంతం. 2003లో వన్డే క్రికెట్‌ అరంగ్రేటం చేసిన అతడు తన రెండో సిరీస్‌ ఆడటానికి మరో రెండేళ్లు ఎదురుచూశాడు. తొలి సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ఫర్వాలేదనిపించాడు. కానీ మరో అవకాశం కోసం అతడు వేచి చూడాల్సి వచ్చింది. 2007 వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదని నిరాశతో అతడు క్రికెట్‌ నుంచి వైదొలగాలనుకున్నాడు. కానీ, అదే ఏడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 సమరంలో అతడు గొప్పగా పోరాడాడు. పాక్‌తో జరిగిన ఫైనల్లో గంభీర్‌ (75) అద్భుత ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌ తొలి విజేతగా భారత్‌ను నిలిపాడు.

శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ గంభీరే జట్టును ఆదుకున్నాడు. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ తొలి ఓవర్‌లోనే సెహ్వాగ్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన గంభీర్‌ 42వ ఓవర్‌ వరకు ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా  పరుగులు రాబడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కూడా భారీ షాట్‌కు యత్నించి పెరెరా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటికే జట్టు విజయపథంలో నడవడానికి అనువైన మార్గాన్ని సిద్ధం చేశాడు. విజయానికి 52 బంతుల్లో 52 పరుగుల లక్ష్యాన్ని యువరాజ్‌తో కలిసి ధోనీ (91*) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.

2008 జులై నుంచి 2010 జనవరి వరకు టెస్టుల్లో గంభీర్‌ అద్వితీయమైన ఫామ్‌ని కొనసాగించాడు. 13 టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు. అంతేకాకుండా 2009 ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2009లో నేపియర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో అతడు చేసిన పోరాటం క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరవలేనిది. ఈ మ్యాచ్‌లో 137 పరుగులు బాది ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును కాపాడాడు. 10 గంటల 43 నిమిషాల పాటు అద్వితీయంగా పోరాడి టెస్టును డ్రాగా ముగించాడు. కానీ, 2011 ప్రపంచకప్‌ తర్వాత గంభీర్‌ అంతగా రాణించలేకపోయాడు. అయినా 2012, 2014 ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత దిల్లీ డేర్‌డెవిల్స్‌ (దిల్లీక్యాపిటల్స్‌) ప్రాతినిధ్యం వహించాడు. కానీ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోవడంతో తనంతట తానే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.  

2018 డిసెంబర్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం అతడు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు దిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. ఎంపీగా, మాజీ క్రికెటర్‌గా సామాజిక మాధ్యమాల్లో అతడు చురుకుగా ఉంటాడు. ఆటగాళ్లపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరచడంలో గంభీర్‌ ఎప్పుడూ ముందు ఉంటాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.