close

తాజా వార్తలు

అలీ సర్‌ను చూసి వణికిపోయా: అవికా గోర్‌

మా అమ్మ మాటలు ఆయనకు చెప్పా

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘రాజుగారి గది 3’ సినిమా సెట్‌లో సీనియర్‌ నటుడు అలీని చూసి వణికిపోయానని నటి అవికా గోర్‌ అన్నారు. ఓంకార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. అశ్విన్‌ కథానాయకుడు. ఇందులో అవికా, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ‘రాజుగారి గది’ సీక్వెల్‌లో భాగంగా వస్తోన్న ఈ సినిమా అక్టోబరు 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అవికా విలేకరులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివి..

* ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత తెలుగు సినిమాలో నటించడానికి మూడేళ్లు ఎందుకు పట్టింది?
అవికా గోర్‌: నేను హిందీలో బిజీ అయ్యా. ఇక్కడ నటించే సమయం లేదు. ఈ మధ్య తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కొన్ని ఆసక్తికరంగా లేవు అనిపించింది. కొన్ని నచ్చినా.. డేట్స్‌ ఇవ్వలేకపోయాను. నాకు ఓంకార్‌ ఈ సినిమా కథ చెప్పారు. చాలా ఆసక్తిగా అనిపించి, 40 నిమిషాల్లో ప్రాజెక్టుకు ఓకే చెప్పేశా.

* ‘రాజుగారి గది 3’ హారర్‌ సినిమా. ఇందులో నటిస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
అవికా గోర్‌: వ్యక్తిగతంగా నాకు హారర్‌ సినిమాలంటే చాలా భయం. ఒంటరిగా ఎప్పుడూ ఇలాంటి సినిమాలు చూడలేదు, చూడను. నరేషన్‌ సమయంలో చాలా భయపడ్డా. ఈ సినిమాలో భయపెట్టే సీన్ల కంటే నవ్వించే సీన్లు ఎక్కువగా ఉన్నాయి. నరేట్‌ చేస్తున్నప్పుడు కాసేపు భయపడుతూ.. కాసేపు నవ్వుతూ విన్నాను. ఈ సినిమా షూటింగ్‌ తొలి రోజున నా మేకప్‌ పూర్తయిన తర్వాత అద్దంలో నన్ను నేను చూసుకున్నా. ఆ క్షణం చాలా భయపడ్డా. ఆ దెబ్బతో రెండు రోజులు నిద్రపోలేదు. సాధారణంగా లుక్స్‌ పరంగా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటా. అలాంటిది ఈ పాత్రకు ఓకే చెప్పడంతో నా తల్లిదండ్రులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఆ తర్వాత నా లుక్‌ చూసిన మా నాన్న.. ‘నిజంగా నువ్వు దెయ్యానివేగా..’ అని నవ్వారు.

* మీ పాత్ర గురించి చెప్పండి?
అవికా గోర్‌: ఇందులో నా పాత్ర చాలా సింపుల్‌గా ఉంటుంది. తను కేరళకు చెందిన అమ్మాయి. ఆమె జీవితంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంటుంది. ఈ సినిమాను ఓ మంచి కామెడీ చిత్రం అని కూడా చెప్పొచ్చు. ఇందులో నటించడం నాకు ఓ మంచి అనుభవం. నాకే కాదు.. సాంకేతిక బృందం కూడా ఈ సినిమాతో చాలా నేర్చుకుంది. నాకు తెలుగు అర్థం అవుతుంది. కానీ మాట్లాడేందుకు సమయం పడుతుంది.

* తమన్నా చేయాల్సిన పాత్ర ఇది? ఎలా నటిస్తానో అని భయపడ్డారా?, స్క్రిప్టులో మార్పులు చేశారా?
అవికా గోర్‌: లేదు.. నా వల్ల స్క్రిప్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దర్శకుడు తనకు ఎలాంటి పాత్ర కావాలో ముందే నిర్ణయించుకున్నాడు. అందులో జీవించడమే నటీనటులుగా మా పని. నటించేది తమన్నా, కాజల్‌ లేదా నేను.. ఎవరైనా కావొచ్చు. ఆ పాత్రకు న్యాయం చేయడం మా బాధ్యత. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను.

* మీకు ఈ సినిమా కథ నచ్చిందా? పాత్ర నచ్చిందా?
అవికా గోర్‌: నాకు స్క్రిప్టు, చిత్ర బృందంపై నమ్మకం కల్గింది. అందుకే నటించా. ఓ కథ వింటున్నప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా స్వీకరిస్తారని ఆలోచిస్తా. మంచి సాంకేతిక నిపుణులు కూడా ఎంతో ముఖ్యం. నేను ఓ సినిమాకు సంతకం చేసే ముందు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాను.

* దక్షిణాదికి, ఉత్తరాదికి తేడా ఉందా?
అవికా గోర్‌: చాలా తేడా ఉంది. ఇక్కడి చిత్ర బృందం ఓ క్రమపద్ధతి ప్రకారం ముందుకెళ్తుంది, పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. నిజాయతీగా చెబుతున్నా... అక్కడ ఇలా ఉండదు. వర్కింగ్‌ షెడ్యూల్స్‌ కూడా వేరుగా ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ జులైలో ప్రారంభమైంది. షెడ్యూల్‌ ప్రకారం పూర్తయింది. ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఉండదు.

* మీరు ముంబయి నుంచి వచ్చారు? టాలీవుడ్‌ను ఎందుకు ఎంచుకున్నారు?
అవికా గోర్‌: ఎనిమిదేళ్ల వయసులో సీరియల్‌తో నా కెరీర్ ప్రారంభమైంది. హిందీలో నాకు అవార్డులు వచ్చాయి. కానీ టాలీవుడ్‌ నాకు నటిగా ఓ మంచి అనుభవం ఇచ్చింది. ఇప్పటికీ నాకు సరిగా తెలుగు రాదు. ఓ డైలాగ్‌ కోసం ఎన్నో సార్లు సాధన చేస్తుంటా. ఇప్పుడు నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నా.

* మీకు బాలీవుడ్‌ ఇష్టమా?, టాలీవుడ్‌ ఇష్టమా?
అవికా గోర్‌: రెండూ కాదు.. టీవీ సీరియల్స్‌ ఇష్టం. బహుశా అందులోని ఎమోషన్స్‌ నాకు నచ్చుతాయనుకుంటా. అందుకే బాగా కనెక్ట్‌ అయ్యా. కానీ నేను టీవీ చూడను. (నవ్వుతూ)

* ‘బిగ్‌బాస్‌’లో పాల్గొంటారా?
అవికా గోర్‌: అవకాశం వస్తే.. షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాను. కంటెస్టెంట్‌గా మాత్రం పాల్గొనను. ఎందుకంటే.. దానికి చాలా ఓపిక కావాలి. నాకు అది లేదు. (నవ్వుతూ)

* సెట్‌లో ఇతర నటీనటులతో మీ అనుభవం ఏంటి?
అవికా గోర్‌: అశ్విన్‌ గొప్ప డ్యాన్సర్‌. నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. అందుకే అలాంటి వారిని ఎక్కువ గౌరవిస్తుంటా. అలీ సర్‌ను తొలిరోజు ‘రాజుగారి గది 3’ సెట్‌లో చూశా. భయంతో వణికిపోయా. ఆయన డబ్బింగ్‌ సినిమాల్ని చాలా చూశాను. ఆయన ఓ లెజెండ్‌ అని నాకు తెలుసు. మా అమ్మకు కూడా అలీ సర్‌ అంటే ఇష్టం, ఆయన గురించి తెలుసు. ‘ఒకప్పుడు ఆయన సినిమాలు చూశావు. ఇప్పుడు ఆయనతో కలిసి సినిమా చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది’ అని అమ్మ అన్నారు. ఇదే విషయాన్ని అలీ సర్‌కు కూడా చెప్పా. మీతో నటించే అదృష్టం నాకు కల్గింది అన్నాను. అలీ సర్‌ అందరితో చాలా స్నేహంగా, ఫన్నీగా ఉంటారు. గొప్ప వ్యక్తి.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.