close

తాజా వార్తలు

వ్యాపారాల్లో ‘ఈ’ మార్పు తప్పదా..?

విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఫ్యాషన్‌ రంగ దిగ్గజం ‘ఫరెవర్‌ 21’,  పర్యాటక రంగ దిగ్గజం థామస్‌కుక్‌(యుకే)కు దివాలా అంశంలో ఓ పోలిక ఉంది. అది ఆన్‌లైన్‌ సంస్థల నుంచి పోటీని తట్టుకోలేకపోవడమే. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిపోవడంతో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అతిపెద్ద వ్యాపారంగా ఎదిగేందుకు దూసుకెళుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను సంతరించుకోవడం ఎంత ముఖ్యమో తాజా పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.  

ఇటీవల ఫిబ్రవరిలో వచ్చిన నివేదిక ప్రకారం అమెరికాలోని విక్రయాల్లో తొలిసారి ఆన్‌లైన్‌ విక్రయాల ఆధిపత్యం కనిపించింది. సాధారణ చిల్లర వర్తకం కంటే ఆన్‌లైన్‌ వ్యాపారం ఎక్కువ వాటాను సొంతం చేసుకొంది. ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఆదేశ కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. దాదాపు 20ఏళ్ల వ్యవధిలో అమెరికా మార్కెట్‌పై ఆన్‌లైన్‌ సంస్థలు పట్టు సాధించాయి. 1990ల్లో తొలుత 5శాతం లోపే ఉన్న విక్రయాలు 2019 నాటికి రిటైల్‌ స్టోర్ల విక్రయాలను దాటేయడం గమనార్హం. అమెరికాలో ఫిబ్రవరిలో ఆటోమొబైల్‌ రంగం అత్యధిక వ్యాపారం నిర్వహించగా.. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ రంగం 59.8 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అమెజాన్‌ సంస్థ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ను ముందుండి నడిపంచినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘అమెజాన్‌ ప్రైమ్‌’ రాకతో డెలివరీ ఛార్జీలు తగ్గిపోవడంతో ఎక్కువ మంది అటువైపు మళ్లారు. అమెరికన్లు ఫర్నిచర్‌, దుస్తులు, ఆహారం, ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడంతో ఈ మేరకు రిటైల్‌ విక్రయాలు 0.2 శాతం కుంగాయి.

మరోపక్క భారత్‌లో కూడా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వేగంగా విస్తరిస్తోంది. 2009లో కేవలం 3.5 బిలియన్‌ డాలర్లు ఉన్న ఆన్‌లైన్‌ మార్కెట్‌ 2013నాటికి 12.6 బిలియన్‌ డాలర్లకు చేరింది.  2018 నాటికి 38.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక  కస్టమర్ల సంఖ్యను చూస్తే భారత్‌లో ఈ కామర్స్‌ వేగం అర్థమవుతుంది. గూగుల్‌ లెక్కల ప్రకారం 2014లో 3.5 కోట్ల మంది ఆన్‌లైన్‌ కొనుగోలు దారులు ఉండగా.. ఆ సంఖ్య 2016 నాటికి 10 కోట్లు దాటిపోయింది. వీరిలో చాలా మంది క్యాష్‌ ఆన్‌ డెలివరీ విధానాన్నే వినియోగించుకొంటున్నారు. 2017లో ఫ్లిప్‌కార్టు విక్రయాల్లో  అగ్రస్థానంలో ఉండగా.. 2018 నాటికి  అమెజాన్‌ ఆ స్థానాన్ని కైవసం చేసుకొంది. 

ఈ ఏడాది మొదట్లో భారత్‌లో కొంత ఎదురుగాలి..

ఈకామర్స్‌ రంగానికి భారత్‌లో ఈఏడాది కొంత ఎదురుగాలి వీచిందనే చెప్పాలి. తొలి అర్థభాగంలో ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ఐదోవంతు తగ్గుదల కనిపించే అవకాశం ఉందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కంటర్‌ వెల్లడించింది. ద్వితీయార్ధంలో పండుగల సీజన్‌ ఉండటంతో వీటి విక్రయాలు పుంజుకొనే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మొబైల్‌ ఫోన్ల విక్రయాలు 17శాతం, ఫ్యాషన్‌ విభాగంలో 16శాతం తగ్గుదల ఉందని పేర్కొంది. భారత్‌లో ఖరీదైన సెల్‌ఫోన్లను నెలవారీ వాయిదాలపై ఎక్కువ మంది కొనుగోలు చేశారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వీటికి రుణాలు ఇచ్చేందుకు అయిష్టంగా ఉండటం కూడా విక్రయాలను తగ్గించింది. దీనికి తోడు ఐఎల్‌ఎఫ్‌ సంక్షోభంతో నెలకొన్న నగదు కొరత కూడా ఎన్‌బీఎఫ్‌సీలను వీటికి దూరంగా ఉంచింది. మరోపక్క ఆన్‌లైన్‌ మార్కెట్లకు ప్రజలు అలవాటు పడటంతో నెమ్మదిగా సంస్థలు డిస్కౌంట్లను తగ్గిస్తున్నాయి. మరోపక్క దిగ్గజ సంస్థలు కూడా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌ కూడా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. 
 

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విస్తరించేకొద్దీ రిటైల్‌ మార్కెటింగ్‌పై దీని ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా టైర్‌2, టైర్‌3 పట్టణాల్లో ప్రజలకు టాప్‌ బ్రాండ్లు స్థానిక రిటైల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉండటంలేదు. దీంతో వారు ఈ కామర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు డిస్కౌంట్లు లభించడం, డెలివరీ ఛార్జీలు లేకపోవడం వారిని ఆకర్షిస్తోంది. దీనికితోడు నచ్చకపోతే తిరిగి ఇచ్చేసే విధానాన్ని కూడా ఆన్‌లైన్‌ సంస్థలు అనుసరించడం వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చిల్లర వర్తకులను రక్షించేందుకు గత డిసెంబర్‌లో నిబంధనలను సవరించి ఆన్‌లైన్‌ సంస్థలు ఎక్స్‌క్లూజీవ్‌ డీల్స్‌ ఇవ్వడంపై , ఆయా కంపెనీలకు వాటాలు ఉన్న సంస్థల్లో వస్తువులను విక్రయించడంపై ఆంక్షలు విధించింది. ఇవి చిల్లర వర్తక సంస్థలకు కొంత ఊరటనిచ్చాయి. దాదాపు రూ.40,000 కోట్ల మేరకు ఆన్‌లైన్‌ విక్రయాలపై దీని ప్రభావం ఉంటుందని క్రిసెల్‌ తన నివేదకలో పేర్కొంది. రిటైల్‌ సంస్థలకు రూ.12వేల కోట్ల మేరకు ప్రయోజనం లభించవచ్చని వెల్లడించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.