close

తాజా వార్తలు

మేటి వేటగాడు

జంతువులను వేటాడటం ఆటవిక ధర్మం, బోయవాడు ఆహారం కోసం వేటాడటం స్వధర్మం. రక్షకుడు అయిన మహారాజు సరదా కోసం భక్షకుడు కావడం అధర్మం. మృగయావినోదం పేర జీవహింసకు పాల్పడటం రాజధర్మం అంటే కుదరదు. ప్రకృతి తన సమతుల్యతను కాపాడుకోవడానికి కొన్ని జంతువులను సాధువులుగా, మరికొన్నింటిని క్రూరమృగాలుగా సృష్టించింది. మాంసాహారులైన జంతువులు వేటాడటం కడుపు నింపుకోవడానికి మాత్రమే పరిమితం అయినందువల్ల వన్యమృగాలు శాఖాభేదం లేకుండా కలిసిమెలిసి అడవుల్లో సహజీవనం సాగిస్తున్నాయి. సృష్టిలో శాకాహారులైన జంతువులే పుష్టిగా సమష్టిగా జీవిస్తున్నాయి. ఏనుగు, ఒంటె, గుర్రం లాంటి జంతువులు ఉభయజీవులుగా అడవిలో, గ్రామంలో మనగలుగుతున్నాయి. మానవులు ప్రాణం కాపాడుకోవడానికి- మధుమేహంతో కుళ్లిన శరీరభాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుంటారు. పులికి లేడిని ఆహారంగా చేసి, సమతుల్యతను కాపాడుకుంటుంది- ప్రకృతి.

ఆత్మరక్షణకోసం శత్రువును ఎదిరించి పోరాడటం వేరు, ఆనందంకోసం అడవికి వెళ్లి వెదికివేటాడటం వేరు. సింహం తలలు, పులిచర్మాలు, ఏనుగు దంతాలు, అడవిదున్న కొమ్ములు... గోడలమీద ప్రదర్శించి క్రీడోత్సవం నెరపడం ఘోరపాపం. ఒక బోయవాడు అహింస పరమధర్మం అని తెలుసుకుని రుషి అయ్యాడు. మరో బోయవాడు క్రౌంచ మిథునాన్ని విడదీయడం చూసి ఆ రుషి కవి కోకిలగా మారాడు. మనుషులకున్న వెసులుబాటు జంతువులకు లేదు. సాధుజంతువులు, క్రూర జంతువులు- రెండే రకాలు కనిపిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన మూడుగుణాలను ఆకళించుకుని పరమార్థం సాధించడం సృష్టిలో ఒక్క మనిషికే సాధ్యం.

తమస్సులో మృగత్వం, రజస్సులో మానవత్వం, సత్వంలో దివ్యత్వం పొందగల అవకాశం త్రిగుణాత్మక అయిన ప్రకృతి ప్రసాదించిన వరం. కేవలం ఆహారనిద్రా మైథునాలకు పరిమితం అయినవాడు మానవమృగం. స్వార్థం, ధనం, సుఖం తప్ప మూడో ఆలోచనలేని మానవుడు, మనిషి ఆకారంలోని మృగంలాంటివాడు. మానవ-మానవుడిగా ఎదగడానికి కాలం కర్మం కలిసి రావాలి. స్వసుఖంకన్నా పరసుఖం మిన్నగా భావించి, మానవమృగాన్ని మానవుడిగా మార్చి, దివ్యమానవుడిగా తీర్చిదిద్దడం సాత్వికతత్త్వం. సత్యశోధన, తత్త్వసాధన దాని గమ్యం.

మమత, మానవత అడుగంటుతున్న ఈ సమయంలో అనురాగం, ఆత్మీయత పెంచగల ఏకైక మార్గం- ఆధ్యాత్మిక సాధన. నేనెవరిని, నా గమ్యం ఏమిటి, నేను ఏం చేయాలి? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకాలి. ఏ దారిన వెళ్తే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో ఆ బాటలో నడిపించమని భగవంతుడిని ప్రార్థించాలి. వెంటపడి వేటాడి అక్కున చేర్చుకోగల అసలైన వేటగాడు ఆయనే. ఆయన సూత్రధారి; మనం పాత్రధారులం. వేటను పసిగట్టి ఓ ఆట ఆడించి తగిన బాట పట్టించడం ఎలాగో ఆ భగవంతుడికి బాగా తెలుసు. కర్మజ్ఞాన భక్తి వైరాగ్యాలు ఆయన పన్నిన చతురంగాలు. జీవిత చదరంగం ఆడి ఓడి గెలవాలే తప్ప- వేటాడి ఘనవిజయం సాధించలేం.

సత్వ రజ తమో గుణాలు ప్రకృతి గుణాలు కానీ ఆత్మగుణాలు కావు. అవి పూర్తిగా ఒకేసారి తగ్గడం, విజృంభించడం అంటూ జరగదు. సాధకుడు సదా జాగరుకుడై ఉండాలి. తపస్వి అయినా, దాత అయినా, యశస్వి అయినా, మనస్వి అయినా, మంత్రవిదుడైనా, వేదపరాయణుడైనా... తన కళలను ఆ వేటగాడికి సమర్పించనిదే మంచి ఫలితాన్ని గాని, తగిన భద్రతగాని పొందలేడు. యోగక్షేమేంద్రుడు ఆ భగవానుడే అంటుంది భాగవతం. మేటి వేటగాడు, సిసలైన చెలికాడు ఆయనే!

- ఉప్పు రాఘవేంద్రరావు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.