close

తాజా వార్తలు

మీరైతే ఎం చేస్తారు

మన వంటింట్లో దొరికే పదార్థాలతో అందం కాపాడుకోవచ్చని అమ్మమ్మల కాలం నుంచి చెబుతున్నదే. మరి చర్మ సంరక్షణ విషయంలో మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మాకు చెప్పండి అనే ప్రశ్నకు పాఠకుల నుంచి విశేష స్పందన వచ్చింది.  ఆ వివరాలేంటంటే...

* నేను ముప్పై ఏళ్లుగా స్నానం చేయడానికి సున్నిపిండి వాడుతున్నా. దీనివల్ల చర్మం పాడవ్వదు. వేడుకలు ఉన్నప్పుడు ముఖం కాంతిమంతంగా కనిపించేందుకు ఒక స్పూను అరటిపండు గుజ్జులో, కాస్త నిమ్మరసం, తేనె కలిపి పూత వేసుకుంటా. రోజూ తగినన్ని నీళ్లు తాగుతా. రోజువారీ ఆహారంతో పాటు మొక్కజొన్న, పుచ్చకాయ, ఖర్జూరం, అరటి పండ్లను ఎక్కువగా తీసుకుంటా. ముఖానికి, పాదాలకు పసుపు రాసుకుంటా.

- బూదూరు రజని, బెళగావి, కర్ణాటక


* చిన్నప్పటి నుంచీ నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగా. ఆమె నా చర్మ సంరక్షణ కోసం స్నానానికి ముందు నువ్వుల నూనెతో మర్దన చేసేది. వారంలో రెండు రోజులు సబ్బుకి బదులు సెనగపిండిని వాడతా. దీని ముందు ఎంత మంచి సబ్బు అయినా బలాదూర్‌. నాది పొడిచర్మం. పొడిబారకుండా తగిన తేమ అందేందుకు సెనగపిండి, తేనె, పాలమీగడ, పసుపు సమపాళ్లలో కలిపిన ప్యాక్‌ వేసుకుంటా. ఇలా వారానికోసారైనా చేస్తా.

- లద్దగిరి పావని, శంకరాపురం, కడప


* కొన్ని సంవత్సరాల క్రితం నా ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు టొమాటో రసం, పసుపు కలిపి రాసుకునేదాన్ని. అలానే సెనగపిండి, పెరుగు, పసుపు, నిమ్మరసం కలిపి రాసుకోవడం వల్ల పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పటికీ వాటిని పాటిస్తా. ఆటలమ్మ వచ్చినప్పుడు చర్మంపై మచ్చలు పడుతుంటాయి. ఇలాంటప్పుడు వేపాకు నూరి కొద్దిగా పసుపు కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. అలానే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె గోరువెచ్చగా చేసి దానిలో కొద్దిగా పసుపు, కర్పూరం కలిపి చర్మానికి రాసుకోవాలి. దీనివల్ల మచ్చలు తగ్గిపోతాయి.

- ఎదునోజు హేమలత, చౌటుప్పల్‌


* యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉండే పసుపుని ఎక్కువగా చర్మ సంరక్షణ కోసం వాడుతుంటా. ముఖ్యంగా ఎండ వల్ల చర్మం నల్లగా మారితే పసుపు, సెనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫేస్‌ ప్యాక్‌గా వాడతాను. ముఖంపై ఏర్పడిన టాన్‌ తొలగించడానికి టొమాటో, తేనె, నిమ్మరసం కలిపి చివరకు కొంచెం ముల్తానీ మట్టి చేర్చి ప్యాక్‌లా వేసుకుంటా. ఇది ముఖానికి మెరుపుని తెస్తుంది.

- జానపాటి సంధ్యారాణి, మిర్యాలగూడ


* మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. అమ్మమ్మ, నాయనమ్మలు అందానికి పచ్చిపసుపుని వాడమనేవారు. పుదీనా రసం మొటిమల్ని తగ్గిస్తుందని, కూరగాయలు, పళ్లగుజ్జు ముఖానికి, చర్మానికి మంచిదని చెప్పి రాసేవారు. అదే అలవాటు అయ్యింది. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతా అందుకే చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.  జుట్టుకి ఉసిరికాయ వేసి కాసిన నూనెని రాసుకుంటా. తలస్నానం చేసినప్పుడు నారింజపళ్ల తొక్కల పొడిని నీటిలో కలుపుతా. ఇది చర్మానికి సువాసన ఇస్తుంది. జుట్టుకి కుంకుడు స్నానం చేశాక సాంబ్రాణి ధూపం ఇప్పటికీ మానను.

- జి. సరళా జగన్నాథ్‌, విజయనగరం


* లేత వేపాకు, పచ్చి పసుపు కొమ్ము కలిపి మెత్తగా చేసి పూతలా వేసుకోవాలి. దీనివల్ల ముఖంపై మచ్చలు తొలగి తాజాగా కనిపిస్తుంది. మొటిమలు తగ్గుతాయి. అలానే ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. చర్మం తాజాగా ఉంటుంది.  పొడి చర్మతత్వం ఉన్నవారు కాచిన పాల మీగడను ముఖానికి రాసుకుని ఐదు నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. కాసేపాగి ఎప్పటిలానే రెడీ అవ్వాలి. దీనివల్ల మీ ముఖం ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తుంది.

- నిఖితా యాదవ్‌, బోధన్‌, నిజామాబాద్‌ జిల్లా


* పెదాలు పగిలిపోకుండా మీగడ, నువ్వుల నూనె రాసుకోవాలి. మచ్చలుపోయి మెరుపు రావడానికి, కొద్దిగా సెనగపిండి, చెంచా పసుపు, కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటా. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

- గండికోట చిట్టి, హైదరాబాద్‌


* చిటికెడు పసుపులో పచ్చిపాలు, సెనగ పిండి కలిపి ముఖానికి, చేతులకు పూతలా వేసుకుంటాను. పదిహేను నిమిషాల తరువాత మంచినీటితో కడిగేస్తాను. సున్నిపిండితో స్నానం చేస్తాను. ఇవే చర్మ రక్షణకు తోడ్పడతాయి.

- సయ్యద్‌ జమీల బేగం, కమలానగర్‌, కర్నూలు


* సెనగపిండి, పెరుగు, నిమ్మరసం... పేస్టులా చేసి ముఖానికి పూతలా వేస్తాను. ఆరాక చల్లని నీళ్లతో కడిగేస్తాను. ఇలా వారంతో రెండుసార్లు చేస్తే ముఖం నిగనిగలాడుతుంది.

- ఆదిలక్ష్మి, హైదరాబాద్‌


* ఆలివ్‌ నూనెలో కొంచెం పసుపు కలిపి, చేతులు, మెడ, ముఖానికి పూతలా వేసుకుంటాను. 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

- శిశికిరణ్‌, గీతం విశ్వవిద్యాలయం, బెంగళూరు.


* పాలని కొంచెం వేడి చేసి... అవి చల్లారాక అందులో కొంచెం నిమ్మరసం, తేనే కలపాలి. పెరుగులా తయారవుతుంది. దాన్ని చేతులకు వేసుకొని ఐదు నిమిషాల తరువాత మెత్తటి గుడ్డతో తుడుచుకుంటాను. మృతకణాలు తొలిగిపోతాయి.

- ప్రగ్న పిన్నోజు,. హైదరాబాద్‌


* నేను పచ్చిపాలను మాయిశ్చరైజర్‌లా వాడతాను. మొహం, మెడపైన టొమాటోను, చక్కెరతో కలిపి రాసుకుంటే స్క్రబ్బర్‌లా పని చేస్తుంది. ఆలుగడ్డతో మోచేయి, మోకాళ్ల దగ్గర రుద్దితే నలుపు తగ్గుతుంది.

-అజర్‌ సుల్తాన్‌, శంకరంపేట, మెదక్‌ జిల్లా


* రెండు చెంచాల పెరుగులో అరచెంచా తేనె, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఒక మిశ్రమంలా తయారు చేస్తాను. దీన్ని ముఖంపై ఫేస్‌ప్యాక్‌లా వేసి ఆరాక చల్లటి నీటితో కడిగేస్తాను. చర్మం మృదువుగా మారుతుంది.

- కవితచంద్ర, కరీంనగర్‌.


* నేను తలలో చుండ్రు పోవడానికి అన్నం వండిన తరువాత వచ్చే గంజిని చల్లార్చి తలకు రాసుకుంటాను. గంట తరువాత సీకాయతో తలస్నానం చేస్తాను. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

- పి.రూపులు, సామర్లకోట


* నేను బియ్యం కడిగిన నీటిని రాత్రి మొత్తం ఉంచుతాను. దీన్ని ముఖం, జుట్టు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాను. ఇలా చేస్తే ముఖంలో ట్యాన్‌ పోతుంది. జుట్టు పట్టులా తయారవుతుంది.

- మానెపల్లి సుధారాణి, ఏలూరు


* నేను చర్మ సంరక్షణ కోసం వారంలో రెండు సార్లు పెరుగు, పసుపు, చక్కెర కలిపి ముఖానికి పూతలా వేసుకుంటాను. ఆరాక కడిగేస్తే ట్యాన్‌ తొలిగిపోతుంది.

-లక్ష్మిసోన, గుర్రంగూడ, హైదరాబాద్‌


* రాత్రి పడుకునే ముందు పాల మీగడ చర్మానికి రాసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది.

- జ్యోతి, నంద్యాల


* బియ్యం కడిగిన నీళ్లతో ముఖం కడుక్కుంటే తాజాగా మారుతుంది. వీటికి తలకు రాసుకున్నా మంచిదే. కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే యౌవనంగా కనిపిస్తారు. వీటిని వారంలో కనీసం రెండు సార్లైన చేస్తా.

-  బి.పద్మలలిత, కర్నూలు


* పాల మీగడలో పసుపు కలిపి ముఖానికి మర్దన చేయాలి. సెనగ పిండితో రుద్దుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.

- విజయ ప్రభాకర్‌


* నేను తరచూ బయట తిరుగుతుంటా. అందుకే స్కార్ఫ్‌ వాడతా. గంధం, తేనె, పసుపు కలిపి స్నానం చేసేముందు రాసుకుంటా. దీని వల్ల దుమ్మూధూళి నుంచి చర్మానికి రక్షణ కలుగుతుంది.

- అలియా బేగం, భువనగిరి


* నా డైట్‌లో పండ్లు, ఆకుకూరలు ఎక్కువ ఉండేలా చూసుకుంటా. ఫేస్‌ప్యాక్‌ల కోసం బొప్పాయి, అరటిపండు, సెనగపిండి వాడతా. చర్మానికి తేమ అందేందుకు నువ్వుల నూనె, ఆలివ్‌ నూనెలను కలిపి రాసుకుంటా.

- రాధికా మాధురి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌


* చర్మం నల్లగా మారితే టొమాటో రసంలో కాస్త చక్కెర కలిపి ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది.

- కె.పద్మజ, ఎమ్మిగనూర్‌


* కమలాఫలం తొక్కల్ని ఎండబెట్టి కాస్త పసుపు, పెరుగు, గులాబీ నీరు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

- వంగ తేజ, ఈసీఎల్‌, హైదరాబాద్‌


* టేబుల్‌ స్పూను చొప్పున ఎర్రచందనం పౌడర్‌, కమలాఫలం తొక్కల పొడి, కస్తూరిమంజల్‌ పొడి, ముల్తానీ మట్టి తీసుకుని అన్నింటినీ గులాబీ నీళ్లతో కలుపుకుని ముఖానికి పూత వేసుకుంటాను. అలానే టేబుల్‌స్పూన్‌ చొప్పున ఓట్‌మీల్‌ పౌడర్‌, తేనె, బ్రౌన్‌షుగర్‌ అన్నీ కలిపి రాసుకుంటే, యాక్నే మచ్చలు, పిగ్మెంటేషన్‌ తగ్గుతాయి.

- దీప, హైదరాబాద్‌


* వంటింట్లో దొరికే వస్తువులతో అందం కాపాడుకోవడానికి నేను వారంలో రెండు మూడు రోజులు ఒక స్పూన్‌ కరివేపాకు పేస్ట్‌ని, గ్లాసు మజ్జిగలో వేసి, కాస్త నిమ్మరసం కలిపి తాగుతాను. ఇది జుట్టు రాలిపోకుండా ఉంటుంది. జుట్టు రంగు మారదు.

- కాత్య, చెన్నై


* చర్మం పొడిబారకుండా ముఖానికి పాల మీగడ రాసుకుంటా. టాన్‌ పోవడానికి టొమాటో ముక్క రాసుకుంటా. పెరుగు లేదా బియ్యప్పిండితో పసుపు కలిపి పది నిమిషాలు మొహానికి పట్టించి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటా. మా నాయయనమ్య చెప్పిన ఇంకో మంచి చిట్కా నువ్వుల నూనెలో పసుపుకలిపి ముఖానికి పట్టిస్తే నిగారింపు వస్తుంది.

- కల్యాణి, కూకట్‌పల్లి


ఈతరం మహిళలకు సామాజిక చొరవ పెరిగింది. స్నేహితులతో కలిసి బృందాలుగా ఏర్పడుతున్నారు. వాటికో చక్కని పేరు పెట్టుకోవడమే  కాదు... వాటి ద్వారా కొత్త విషయాలెన్నో నేర్చుకుంటున్నారు. సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి మీ బృందం ఏం చేస్తుందో మాతో పంచుకోండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.