close

తాజా వార్తలు

టర్కీకి భారత్‌ షాక్‌

పర్యాటకులకు ‘ట్రావెల్‌ అడ్వైజరీ’ జారీ

ఇంటర్నెట్‌డెస్క్‌: పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయింది ఇప్పుడు టర్కీ పరిస్థితి. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. అనవసర విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించినందుకు ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగం క్షీణిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని కాదని పాకిస్థాన్‌కు సహకారం అందిస్తూ టర్కీ తన తలపై తానే చెయ్యి పెట్టుకుంటోంది.

అమెరికాతో వైరం.. ఆర్థిక పతనం..

అగ్రరాజ్యం అమెరికాతో వైరం పెట్టుకోవడంతో టర్కీ ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమైంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన టర్కీ.. రష్యా నుంచి గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400ను కొనుగోలు చేసింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా-టర్కీ సంబంధాలు ఈ చర్యతో మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో టర్కీపై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించింది. ఫలితంగా ఆ దేశ కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. నాటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఈ సమయంలోనూ టర్కీ పర్యాటక రంగం మాత్రం మెరుగ్గానే ఉంది. విదేశీ పర్యాటకులతో ఆ దేశం ఆదాయం గడిస్తోంది. అయితే గత కొంతకాలంగా అది కూడా తగ్గుతూ వస్తోంది.

భారత్‌ నుంచే ఎక్కువ..

సిరియాలో టర్కీ దాడులు, కశ్మీర్‌ వ్యవహారంలో పాకిస్థాన్‌కు మద్దతివ్వడం వంటి అంశాల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లే భారత పౌరుల రక్షణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టర్కీ వెళ్లే భారత పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇది ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే.. టర్కీకి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారతీయులే. గతేడాది అక్కడకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య 80శాతం పెరిగింది. గణాంకాల ప్రకారం 2018లో 1,47,127 మంది భారతీయులు టర్కీని సందర్శించారు. వీరిలో ఎక్కువ మంది కశ్మీర్‌కు చెందినవారే. అయితే ఇటీవల ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉగ్రదాడులు, ఆందోళనలు పర్యాటకుల రాకపై ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా భారత్‌ జారీచేసిన ‘అడ్వైజరీ’తో పర్యాటకుల తాకిడి మరింత తగ్గే అవకాశముంది.

పాకిస్థాన్‌కు మద్దతిచ్చి..

ఇటీవల భారత్-టర్కీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు వ్యవహారంలో టర్కీ.. పాక్‌కు అనుకూలంగా వ్యవహరించింది. పాకిస్థాన్‌కు మద్దతిస్తున్నట్లు ఐరాస వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రకటించారు. దీన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్రమోదీ టర్కీ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు టర్కీ వెళ్లే పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం ‘ట్రావెల్‌ అడ్వైజరీ’ జారీ చేసింది. 

ఐఎస్‌ఐ మీటింగ్‌ పాయింట్‌గా..

అటు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐకు టర్కీ మీటింగ్‌ పాయింట్‌గా మారింది. జమ్ముకశ్మీర్‌ నుంచి ఏటా చాలా మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై టర్కీకి వెళ్తుంటారు. వీరిని ఐఎస్‌ఐ లక్ష్యంగా చేసుకుంటోంది. కశ్మీర్‌ యువతలో భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద భావజాలాన్ని నింపేందుకు పాక్‌ ఏకంగా కొందరు టర్కీ దేశస్థులను నియమించినట్లు ఆ మధ్య నిఘా వర్గాలు హెచ్చరించాయి కూడా. వీరి ద్వారా కశ్మీరీ విద్యార్థులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి భారత్‌లో కల్లోలం సృష్టించాలని పాక్‌ కుటిలయత్నం చేస్తోంది. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.