
తాజా వార్తలు
దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కొనసాగగా.. మన్మోహన్ సింగ్ కోసం ఆయన రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మాజీ ప్రధాని, ఆర్థిక శాఖ మాజీ మంత్రి అయిన మన్మోహన్ సింగ్.. 2014 సెప్టెంబరు నుంచి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ ఏడాది జూన్లో ఆయన రాజ్యసభ పదవి కాలం ముగియడంతో 2019 మే నెలలో కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను నామినేట్ చేశారు. ఇటీవల మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి మరోసారి రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో మన్మోహన్ కోసం దిగ్విజయ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో దిగ్విజయ్ స్థానంలో మన్మోహన్ సింగ్ను ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నామినేట్ చేశారు. దిగ్విజయ్ను పట్టణాభివృద్ధి వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి నామినేట్ చేసినట్లు రాజ్యసభ బులిటెన్ వెల్లడించింది.