
తాజా వార్తలు
లండన్: కశ్మీర్ అంశంపై భారత వైఖరికి భిన్నంగా వ్యవహరించిన బ్రిటన్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. అక్కడి భారతీయ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమ అభిప్రాయాన్ని మార్చుకుంది. కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. ఇతర దేశాల వ్యవహారాల్లో ఇకపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ ఛైర్మన్ ఇయాన్ లావెరీ ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌పై భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరింబోమన్నారు. సెప్టెంబరులో కశ్మీర్లోకి అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించాలంటూ చేసిన తీర్మానాన్ని అత్యవసర, భావోద్వేగ సందర్భంలో తీసుకోవాల్సివచ్చిన నిర్ణయంగా అభివర్ణించారు. తమ పార్టీ వైఖరి వల్ల బ్రిటన్‌లోని వివిధ వర్గాల మధ్య చీలికలు రావాలని తాము కోరుకోవడం లేదన్నారు.
కశ్మీర్లోకి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని, అక్కడి ప్రజలకు స్వీయ నిర్ణయాధికారాన్ని కల్పిస్తూ ఐరాస నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ గత సెప్టెంబరులో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన అక్కడి పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత వర్గాలు దీన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. తప్పుడు అభిప్రాయలపై ఆధారపడి తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించాయి. మరోవైపు కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోసం బ్రిటన్ లేబర్ పార్టీ అభ్యర్థించడాన్ని ఇటు భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా విమర్శించింది. ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే లేబర్ పార్టీ ఈ చర్యకు దిగిందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.