close

తాజా వార్తలు

చేతనారూపుడు

స్థావర (స్థిరంగా ఉండే) జంగమాత్మక (కదలాడే) సృష్టి అంతా చేతన, అచేతనల సమాహారం. ఇదంతా పరమాత్మ అధీనంలోనే ఉంది అని భాగవత వ్యాఖ్యాతల కథనం. పాఠకుల స్వానుభవం సైతం అదే.

‘ఈ ప్రాణికోటి పుట్టుక, పెరకువ (జీవనం), లయం (నాశనం) అన్నీ ఆ పరబ్రహ్మ పర్యవేక్షణలోనే జరుగుతాయి. అలాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరుకపరచేవి బ్రహ్మ సూత్రాలు. వాటిని వివరించడం కోసమే భాగవతం ఆవిర్భవించింది. ఆత్మ, పరమాత్మల యథార్థ స్వరూప స్వభావాలను ఉద్దీపనం చేసి, అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి దోహదపడేది భాగవతం’ అని భాష్యకారులు చెబుతారు.

చేతనా జగత్తుకు ఉదాహరణ సంసారం (కుటుంబం) సుఖదుఃఖాలు, జన్మ-జరా-మరణాలు, గెలుపు-ఓటములు, ఎత్తుపల్లాలు తదితరాల సమాహారమే సంసారం. వాటిని తొలగించుకోవడం కోసం నిరంతరం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సంసారులు. ఆ ప్రయత్నాల ఫలితంగా అవన్నీ తొలగిపోతే, నిరతిశయమైన ఆనంద స్వరూవులవుతారు. దానికి దోహదపడేది ఎరుక. అది కలిగినవారు భగవానుణ్ని సులభంగా చేరగలుగుతారు. అదే మోక్షం. దానికి అవసరమైనది సాధన.

జ్ఞాన, భక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులనే గుణాలున్న సంసారి భగవానుడి నిరతిశయమైన స్మరణ కలిగి ఉంటే, దాని ఫలితంగా వైరాగ్యం ఏర్పడుతుంది. అలాంటి వైరాగ్యం కోసం మనోబలం కావాలి. దాన్ని కల్పించేవాడూ ఆ పరమాత్మే. ఈ విషయాన్ని గీతలో కృష్ణుడు స్వయంగా వెల్లడించాడు. ‘బలవంతులకు బలాన్ని, తేజశ్శాలురకు తేజస్సును నేనే’ అని చెప్పాడు.

విష్ణు సహస్ర నామాల్లో ఈ విషయాన్నే ‘బలం, శౌర్యం, తేజస్సుల సమాహార శక్తి కలవాడు ఆ పరమాత్మ’ అని కీర్తించారు. అదే విషయాన్ని భాగవతంలో మరింత స్పష్టంగా చెప్పాడు వ్యాసుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని- ‘దిక్కులన్నింటినీ, రాజులందరినీ, లోకాలన్నింటినీ గెలిచిన బలవంతుణ్ని నేను. అన్నీ నా అదుపాజ్ఞల్లో ఉన్నాయి. అలాంటప్పుడు నీకు ఎవరి బలం అండగా ఉందని ఇంత ధైర్యంగా ఉన్నావు?’ అని అడిగాడు.

ఆ మాటలకు జవాబుగా ప్రహ్లాదుడు ‘బలవంతులకు, దుర్బలురకు, నీకు-నాకు, బ్రహ్మాదులకు సకల చరాచర జగత్తుకు బలమెవ్వడో... అతడే నాకున్న బలం’ అని జవాబిచ్చాడు. ‘సర్వ బలసంపన్నుడు ఆ పరమాత్మే. అంతటివాడే నాకు అండగా ఉన్నాడు’ అని స్ఫురించేలా స్పష్టంగా చెప్పాడు.

అచేతనా జగత్తుకు సైతం ఆధారం సంసారమే. ఇక్కడ సంసారం అంటే ప్రపంచం. ప్రపంచంలో స్థావర ప్రాణులు చాలా ఉన్నాయి. (చెట్లు, లతలు, సముద్రాలు లాంటివి). ‘వాటన్నింటిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నవాడు ఆ పరమాత్మే’ అని కచ్చితంగా చెప్పాడు. సముద్రంలో, గాలిలో, ఆకాశంలో, భూమిలో, అగ్నిలో, రేయింబవళ్లలో, ఆకాశం-సూర్యుడు-చంద్రుడు, ఓంకారం, త్రిమూర్తులు... వీరందరిలోనూ నిబిడీకృతమై ఉన్నాడు ఆ పరమాత్మ’ అన్నాడు. ‘ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు’ అని సందేహం వద్దు. ఆ పరమాత్మ సర్వాత్మకుడు, సర్వవ్యాపి. ఎక్కడెక్కడ వెతికితే అక్కడే ఉంటాడు’ అని నిశ్చయంగా చెప్పాడు ప్రహ్లాదుడు.

జ్ఞానంతో భగవానుణ్ని ఆరాధన మార్గంలో అర్చించి, ఆ అంతర్యామి పట్ల సంపూర్ణ దృష్టిని, భక్తిని, విశ్వాసాన్ని నిలిపినవారు ఆయన్నే చేరుతారు. ఈ విషయానికి ఉదాహరణలుగా ఇంకా ఎందరి చరిత్రలో చెప్పింది భాగవతం. అందువల్లనే భాగవతం పురాణమైంది.

- అయ్యగారి శ్రీనివాసరావు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.