close

తాజా వార్తలు

ప్రజల్ని చంపేస్తుంటే ఊరుకోవాలా?: పవన్‌

అమరావతి: ఇసుక వారోత్సవాలను నిర్వహించేందుకు వైకాపా ప్రభుత్వం 5 నెలల సమయం ఎందుకు తీసుకుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’ పేరిట ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరాన్ని పవన్‌ కల్యాణ్‌  ప్రారంభించారు. ఈ శిబిరాల ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఆహారం అందించనున్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ఆహారం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థను ప్రక్షాలను చేసేందుకు తీసుకొచ్చిన విధానాలు 50 మందిని బలిగొంటాయా? అని ప్రశ్నించారు. ‘సమస్యలపై మాట్లాడటం వేరు.. వాటికి పరిష్కారం చూపడం వేరు’ అని ఆయన అన్నారు.

సగటు మనిషి సమాజంలో నిలబడాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ చెప్పారు. కార్మికులకు ఒకపూట భోజనంతో పెద్దగా ఏం కాకపోవచ్చని, కానీ, వారికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాలను ప్రారంభించానని వివరించారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పవన్ కోరారు. ‘ ప్రజలను చంపేస్తుంటే మేం మౌనంగా ఉండిపోవాలా? వైకాపాకు 151 సీట్లు ఇచ్చినందుకు ఇలా చేస్తారా? కొత్త పాలసీ పేరుతో ఇబ్బందులు పెడతారా? వైకాపా నాయకులకు ఆకలిబాధలు తెలుసా?’ అని పవన్‌ ఘాటుగా ప్రశ్నించారు.

వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకరించారని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని పవన్‌ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షనేత చంద్రబాబుపై కోపంతో నిర్మాణాలు ఆపేస్తారా? అని పవన్‌ దుయ్యబట్టారు. రాజధాని పెద్దదిగా అయిపోతోందని భావిస్తే పరిమాణం తగ్గించాలని కోరారు. 30 వేల ఎకరాల్లో కాకుండా 5 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలని సూచించారు. రాజధానిపై ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలని హితవు పలికారు.

పులివెందులలో పెట్టాలనుకుంటే.. ప్రజామోదంతో అదైనా చేయాలని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. ‘ నేను మాట్లాడితే శాపనార్దాలు పెడతానని అంటున్నారు. వైకాపా నేతలకు భోజనం లేకుంటే ఉంటారా? కార్మికులు 50 మంది చనిపోతే మాట్లాడకుండా ఉండాలా?’ అని పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్లే పార్టీలో ఉంటారని,  ఇష్టం లేనివాళ్లు వెళ్తారని పవన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

దిల్లీకి బయల్దేరిన పవన్‌

డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించిన తర్వాత పవన్‌కల్యాణ్‌ దిల్లీకి పయనమయ్యారు. పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశముంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు పలు రాజకీయ అంశాలపై వారితో చర్చించనున్నట్లు సమాచారం.

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.