close

తాజా వార్తలు

ఆ ఐదు స్టార్టప్‌ల వెనుక మారుతీ..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: మారుతీ సుజుకీ.. దేశంలోనే నంబర్‌ 1 కార్ల విక్రేత. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలు తెలుసుకొంటూ సగటు మధ్య తరగతి కలల కార్లను తయారీ చేసిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. డ్రైవర్‌ రహిత కార్ల వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సాంకేతికతను సృష్టించడం.. దానిని సమర్థవంతంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న స్టార్టప్‌ల వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని ఈ సంస్థ భావించింది. ఈ క్రమంలో మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌(ఎంఏఐఎల్‌) కార్యక్రమం కింద తాజాగా ఐదు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. 

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తొలుత ఎంఏఐఎల్‌ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు మారుతీ ప్రకటించింది. మొబిలిటీ, ఆటోమొబైల్‌ రంగానికి ఉపయోగపడే స్టార్టప్‌లను ఒక చోటకు చేర్చి వాటితో ఒప్పందం కుదుర్చుకొని పనిచేయనున్నట్లు పేర్కొంది. దీనిపై మారుతీ సుజుకీ ఎండీ ఆయుకవా మాట్లాడుతూ ‘‘భారత ఆటోమొబైల్‌ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. చాలా అడ్డంకులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త స్టార్టప్‌లతో జట్టుకట్టడంతో మేము ఆటోమొబైల్‌ రంగంలో సరికొత్త తరంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది ’’ అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మూడునెలల పాటు దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్‌ల్లో అత్యుత్తమ స్థాయి నిపుణులతో శిక్షణను ఇప్పిస్తారు. మారుతీలోని నిపుణులు ఈ స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం చేస్తారు. ఈ స్టార్టప్‌లకు మారుతీ సుజుకీ పరీక్షా కేంద్రం బెడ్‌ను ఉపయోగించుకొనే అవకాశం కల్పిస్తారు. దీంతో ఆయా స్టార్టప్‌లకు ప్రస్తుతం మార్కెట్‌ అవసరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. తాజా స్టార్టప్‌లు లాజిస్టిక్స్‌, ఐవోటీ, భద్రత, పర్యవేక్షణ, ప్లగ్‌ అండ్‌ ప్లే సొల్యూషన్స్‌లో కంపెనీకి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. ఈ ఎంపికల్లో సెన్స్‌గిజ్‌, జెన్‌, ఐడెంటిఫైలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో సెన్స్‌గిజ్‌, జెన్‌లకు మారుతీతో నేరుగా పనిచేసే అవకాశం లభించింది. దీనికి మారుతీ నుంచి కొంత మొత్తం చెల్లిస్తారు. ఎన్మోవిల్‌, డాక్ట్రోన్‌నులకు కూడా మారుతీ సహకరించనుంది. 

సెన్స్‌గిజ్‌
ఈ స్టార్టప్‌ను 2013లో అభిషేక్‌ లత్తే, అపూర్వా షెట్టీ ప్రారంభించారు. ఈ సంస్థ వ్యాపార, పారిశ్రామిక రంగానికి అవసరమైన సెన్సర్ల ఆధారంగా పనిచేసే పర్యవేక్షక పరికరాలు, భద్రత, రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్లు, క్లౌడ్‌, అనలటిక్స్‌ వంటి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాల తయారీ, సేవలను అందజేస్తుంది.  
జెన్‌
ఈ స్టార్టప్‌ను 2017లో ఆయూష్‌ జైన్‌ ప్రారంభించారు. కృత్రిమ మేధ ఆధారంగా  పనిచేసే ఛాట్‌బోట్‌ను తయారు చేస్తుంది. కృత్రిమేధ ఆధారంగా పనిచేసే ఇంజిన్ల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు దీనిని వాడతారు. దీంతోపాటు వినియోగదారుల అనుభవాన్ని విశ్లేషించి మెరుగైన సేవలు అందించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.
ఐడెంటిఫై
2016లో ఆ స్టార్టప్‌ను ప్రారంభించారు. దుష్యంత్‌ దేచిరాజు, కృష్ణకార్తిక్‌ జాస్తి, అనిరుధ్‌ ఇంజేటీ, వినీత పెనుమత్స, రాజశ్రీ జాస్తి కలిసి దీనిని ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ విజన్‌ ఉపయోగించి చౌకగా ఇంటర్నెట్‌ఆఫ్‌ థింగ్స్‌ సాయంతో డ్రైవర్‌, ప్యాసెంజర్ల భద్రతను మెరుగుపర్చే అవకాశం ఉంది. 
ఎన్మోవిల్‌
2015లో నంద కిషోర్‌, రవి బలుసు కలిసి దీనిని ప్రారంభించారు. అనలటిక్స్‌కు సంబంధించిన సేవలను ఇది అందజేస్తుంది. దీనిలో భాగంగా కంపెనీ బ్యాక్‌ఎండ్‌ నెట్‌వర్క్‌లకు సంబంధించి ఈఆర్‌పీ, సీఆర్‌ఎం సేవలను అందించనుంది.

డాక్ట్రోన్
దీనిని 2017లో అజేయ్‌ కబాడి ప్రారంభించారు. ప్లగ్‌ అండ్‌ ప్లే  ఆధారంగా తర్వాతి తరం కృత్రిమ మేధ సేవలను అభివృద్ధి చేసేలా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ నిర్వహణ, శిక్షణ విధివిధానాలు అభివృద్ధి చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.