close

తాజా వార్తలు

భాజపా వీడను.. ఫిరాయింపు నా రక్తంలో లేదు

మాజీ మంత్రి పంకజ ముండే స్పష్టీకరణ

ముంబయి: రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన తదుపరి కార్యాచరణపై ఆలోచించుకోవాల్సి ఉందంటూ మహారాష్ట్ర మాజీ మంత్రి, భాజపా ముఖ్యనేత పంకజ ముండే ఇటీవల ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై ఆమె మంగళవారం మౌనం వీడారు. తాను భాజపాను వీడటంలేదని స్పష్టంచేశారు. భాజపా దివంగత నేత గోపీనాథ్‌ ముండే కుమార్తె అయిన పంకజ ముండే ఆ పార్టీను వీడతారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను భాజపాను వీడటంలేదు. ఫిరాయింపులకు పాల్పడటం నా రక్తంలోనే లేదు’’ అని విలేకర్లతో అన్నారు. తన ట్విటర్‌ ఖాతాలో ‘భాజపా’ అనే పదం తొలగించడంపై చెలరేగిన ఊహాగానాలనూ ఆమె ఖండించారు. ఆదివారం పంకజ ముండే ఫేస్‌బుక్‌ ఖాతాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీని వీడతారంటూ చెలరేగిన ఊహాగానాల నేపథ్యంలో భాజపా సీనియర్‌ నేతలు వినోద్‌ తవడే, రాం షిందే, ఎమ్మెల్యే బాబన్‌రావ్‌ లోనికర్‌ తదితరులు మంగళవారం ముంబయిలోని మలబార్‌ హిల్స్‌లో ఆమె నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. 
ఆమె పోస్ట్‌ను వక్రీకరించారు: భాజపా నేతలు
ఆదివారం రోజున పంకజ ముండే ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను ప్రత్యర్థులు వక్రీకరించారని భాజపా నేతలు మీడియాకు తెలిపారు. దీనిపై ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెప్పారు. భాజపాపై ఆమె ఎలాంటి అసంతృప్తితోనూ లేరని వారు స్పష్టంచేశారు. మరోవైపు, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం పంకజ ముండే తన ఫేస్‌బుక్‌ ఖాతాలో కమలం గుర్తుతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. 

మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు ప్రయాణంపై ఆలోచించుకోవాల్సి ఉందంటూ ఆదివారం రోజున పంకజ ముండే తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రాశారు. తన తండ్రి గోపీనాథ్‌ ముండే జయంతి సందర్భంగా బీద్‌ జిల్లాలో ఆయన స్మారకం వద్దకు డిసెంబర్‌ 12న అనుచరులంతా అక్కడికి రావాలని ఆమె ఆహ్వానించారు. ‘‘మహారాష్ట్రలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మన భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించుకోవాల్సి ఉంది. నాలో నేను ఆలోచించుకొనేందుకు 8 నుంచి 10 రోజుల సమయం కావాలి. అన్నీ ఆలోచించుకొని అన్ని విషయాలూ మాట్లాడతా’’ అంటూ ఆమె పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.