close

తాజా వార్తలు

ఎందుకా పైశాచికం?

రేపిస్టుల క్రూరత్వానికి కారణం ఏమిటి ?
మానసిక నిపుణుల విశ్లేషణ ఇదీ...

అత్యాచారం.. మహిళ జీవితాన్ని చిదిమేసే ఘోరమైన నేరం. నిర్బలులైన అతివల్ని పశుప్రవృత్తితో లొంగదీసుకుని కామోన్మాదులు పొందే పైశాచిక ఆనందం. ఎన్ని చట్టాలొచ్చినా.. మృగాళ్ల అకృత్యాలు ఆగలేదనడానికి హైదరాబాద్‌, వరంగల్‌లలో జరిగిన అత్యాచార ఘటనలే తాజా ఉదాహరణలు. పురుషుడు పైశాచికంగా ప్రవర్తించడానికి కారణాలేమిటి? అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే దానిపై అనాదిగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రకరకాల సిద్ధాంతాలు, విశ్లేషణలు వెలుగు చూస్తున్నాయి.


సిద్ధాంతకర్తలు ఏం సూత్రీకరించారు?

స్త్రీని భయభ్రాంతులకు గురిచేసి.. బెదిరించి.. పురుషుడు పూర్తి స్పృహతో చేసే అకృత్యమే అత్యాచారం. ఈ దుశ్చర్యలో బాధితురాలిని నిందించడంలో అర్థంలేదు.

- స్త్రీవాద రచయిత సుశాన్‌ బ్రౌన్‌ మిల్లర్‌
(1975లో రాసిన ‘ఎగనెస్ట్‌ అవర్‌ విల్‌’ పుస్తకంలో)


రేపిస్టులందరికీ మూడు ఉద్దేశాలు ఉంటాయి. 1.పరపీడన కాముకత్వం(శాడిజం), 2. ఉద్రేకం. 3. ఆధిపత్యాన్ని ప్రదర్శించు కోవాలన్న కోరిక. అత్యాచారం అన్నది సంపూర్ణ మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి చేసేది కాదు. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మానసిక స్థిరత్వం లేని వ్యక్తే ఈ దారుణానికి ఒడిగడతాడు.

- క్లినికల్‌ సైకాలజిస్ట్‌ నికోలస్‌ గ్రోత్‌
(మెన్‌ హూ రేప్‌  అనే పుస్తకంలో- 1976)నిస్సహాయులే లక్ష్యం

రేపిస్టులు సాధారణంగా నిస్సహాయుల్ని, ఒంటరివారిని, చిన్న పిల్లల్ని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. చిన్నపిల్లలకు లైంగిక చర్యల పట్ల అవగాహన ఉండదు కాబట్టి.. దాని తీవ్రతను వారు గుర్తించలేరు. ఎదిరించలేరు. చాక్లెట్లో, బొమ్మలో ఇచ్చి తేలిగ్గా లొంగదీసుకోవచ్చనుకుంటారు. పైగా అత్యాచారం జరిగినా దాన్ని వారు గుర్తించలేరు. అందుకే రేపిస్టుల్లో ఎక్కువమంది చిన్నపిల్లల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిలో చాలామంది పత్రికల్లో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో వచ్చే అత్యాచార వార్తలను నిశితంగా గమనిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 


భావోద్వేగాలు బయటపడనివ్వరు

అత్యాచారం చేస్తున్న వీరూ సాధారణ స్వభావుల్లాగా కనబడతారు. ఇతరుల్లో కలిసి తిరిగేటప్పుడు తమ భావోద్వేగాల్ని బయటపడనివ్వరు. కానీ వీరు ఎప్పుడు అత్యాచారానికి తెగబడతారన్నది చెప్పటం కష్టం. తమ మానసిక స్థితిపై వీరికి నియంత్రణ ఉండదని జార్జిటౌన్‌ యూనివర్సిటీకి చెందిన ఫోరెన్సిక్‌ సైక్రియాటిస్ట్‌ రాబర్ట్‌ సైమన్‌ విశ్లేషించారు. అయితే వీరందరిలో కనిపించే గుణం  బాధితులపై ఏ మాత్రం జాలి, దయ, సానుభూతి లేకపోవటం. సాధారణంగా అందరికీ అమానుషంగా, క్రూరంగా అనిపించే చర్యలు వీరికి ఏ కోశానా అలా అనిపించవు.


కామం ఒక్కటే కాదు...

కేవలం కామవాంఛ తీర్చుకోవడానికే అత్యాచారాలు చేస్తారని దశాబ్దాల క్రితం అనుకునేవారు. కానీ అది నిజం కాదని అధ్యయనాల్లో వెల్లడైంది. 60-70% ఘటనల్లో వీరు తమ ఉద్రేకాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికే వీటికి తెగిస్తున్నట్లు గుర్తించారు. శత్రువు మీద పగ తీర్చుకోవడానికి వారి పిల్లల్ని ఎత్తుకెళ్లడం, భార్యపై అత్యాచారం చేయడం లాంటివి తరచూ కనిపిస్తుంటాయి. మన సమాజం పురుషుడికి కొంత లైంగిక స్వేచ్ఛనూ, ఆధిపత్యాన్నీ ఆపాదిస్తుండటం ఇలాంటి ప్రకోపాలకు ఆస్కారం ఇస్తోందని సామాజిక అధ్యయన వేత్తలు వాదిస్తున్నారు. 


మూకుమ్మడిగా..

అత్యాచార కేసులన్నీ పరిశీలిస్తే.. ఒక జట్టుగా ఏర్పడి, సామూహికంగా పాల్పడుతున్నవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతా బృందంగా ఉన్నప్పుడు తానొక్కడినే చేయడం లేదనే భావన, మిగతావాళ్లూ తోడున్నారనే భరోసా.. ఇవన్నీ అతన్ని ప్రభావితం చేస్తున్నాయి. 


వారి మనోగతం ఏమిటి?

రేపిస్టుల మనసుల్లో ఏముంటుంది? అనే విషయాలను బయటికి తేవడానికి మన దేశానికి చెందిన క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ రజత్‌మిత్రా ప్రయత్నించారు. ఇందుకోసం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న రేపిస్టులతో ఆయన మాట్లాడారు. వీళ్లలో చాలామంది తాము ఎప్పటికైనా జైలునుంచి బయటికి వస్తామనే బలంగా నమ్ముతున్నారు. ఓ పక్క నేర నిర్ధారణ జరిగి.. శిక్ష అనుభవిస్తున్నా.. తాము నేరం చేశామని వారు విశ్వసించడం లేదు. 


మీకు తెలుసా?

* 90% అత్యాచార ఘటనలు బాగా తెలిసిన వారు, పరిచితులు పాల్పడుతున్నవే. ఈ కేసుల్లో దాదాపు 25% బయటపడటం లేదు. తాము చెప్పినా ఎవరూ నమ్మరేమోనన్న భయంతో చాలామంది మహిళలు, పిల్లలు బయటికి చెప్పడం లేదు.
* అత్యాచారాలు కాకతాళీయంగా సంభవించేవేం కాదు. పథకం ప్రకారం జరుగుతున్నవే ఎక్కువ.
* అత్యాచార బాధితురాలికి గాయాలు, దెబ్బల్లాంటివి తగిలితేనే చికిత్స అవసరం అనుకోవటం తప్పు. ఒంటిమీద గాయాల్లేకున్నా.. మానసిక గాయాలకూ చికిత్స అవసరం. 


ఒక్కో రేపిస్టుది ఒక్కో తీరు...

ఆధిపత్య ధోరణి
తనలో పేరుకుపోయిన న్యూనత భావనల్ని అధిగమిస్తూ.. తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి కొందరు ప్రవర్తిస్తారు. గొప్పతనం లేదా బలప్రదర్శన కోసం అత్యాచారాన్ని(పవర్‌ రేప్‌) ఒక మార్గంగా ఎంచుకుంటారు.

ఆగ్రహపూరితం
లైంగిక వాంఛలు తీర్చుకోవడం కన్నా కూడా.. ప్రాథమికంగా స్త్రీని అవమాన పరిచి, గాయపరచి తృప్తిచెందడం ఈ ‘యాంగర్‌ రేప్‌’ ప్రత్యేకం. వీరిలో శారీరకంగా హింసించటం, దుర్భాషలాడటం.. ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. వీళ్లకు సెక్స్‌ అన్నది పరువుతీసే ఆయుధం. వీళ్లలో స్త్రీ ద్వేషులూ ఉంటారు.

పైశాచికం
స్త్రీని హింసిస్తూ.. ఊహా లోకాల్లో విహరిస్తూ... వాళ్ల బాధను చూస్తూ కామోద్రేకం పొందటం. స్త్రీలు బాధపడుతున్న కొద్దీ సంతోషించటం ఈ ‘శాడిస్టిక్‌ రేప్‌’ లక్షణం. స్త్రీని వీరు భోగ వస్తువుగానే చూస్తుంటారు.

అవకాశం
అమ్మాయితో కలిసి బయటికి వెళ్లినప్పుడో లేదా ఆమె కొద్దిగా చనువు ఇచ్చినప్పుడే దాన్నో అవకాశంగా తీసుకుని అత్యాచారానికి పాల్పడే ‘ఆపర్చునిస్టిక్‌’ రకం వీళ్లు. అమ్మాయి మరీ ప్రతిఘటిస్తే తప్ప వీరు ఆగ్రహం చెందరు.


నైతిక విలువల్ని బాల్యం నుంచే బోధించాలి
- మానసిక వైద్య నిపుణురాలు గౌరీదేవి

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్మాదులు మనలో ఒకరిలాగే ఉంటారు. ముందే గుర్తించి వారి చేష్టల్ని నివారించడం కష్టమే. అయితే జాగ్రత్తగా గమనిస్తే చిన్నతనం నుంచే వీరిలో హింసాత్మక ప్రవృత్తి కనిపిస్తుంటుంది. సాధారణ సామాజిక కట్టుబాట్లను పాటించరు. అల్లరి చిల్లరగా తిరుగుతుంటారు. పెద్దవారిని, ఆడవారిని గౌరవించరు. ప్రాణులను హింసించి ఆనందపడుతుంటారు. తల్లిదండ్రులు కూడా వీరి చేష్టలకు విసుగెత్తుతుంటారు. ఈ తరహా లక్షణాలు 10-16 ఏళ్ల వయసులో ఎక్కువవుతుంటే.. వారి పట్ల జాగ్రత్త వహించాల్సిందే. దొంగతనాలు చేయడం, అబద్దాలు చెప్పడం తరచూ చేస్తుంటారు. గుంపుల్లో తిరుగుతుంటారు. తమకంటే పెద్ద వయసు వారితో సహవాసం చేస్తుంటారు. ఈ తరహాలో వ్యాపకాలున్నప్పుడు చెత్త పనులు చేయడానికి వెనుకాడరు. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలకు అలవాటుపడుతున్నారని గుర్తిస్తే తక్షణమే దిద్దుబాటు చర్యలకు తల్లిదండ్రులే పూనుకోవాలి. ఈ సమయంలో గనుక పట్టించుకోకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ అది శ్రుతిమించుతుంది. తర్వాత తల్లిదండ్రుల మాటా వినరు. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే కుటుంబ విలువలు బోధించాలి. అమ్మాయిలూ సమానమేననే భావన పెంపొందించాలి. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్న ఈ కాలంలో వాటిని ఎలా వినియోగిస్తున్నారో పర్యవేక్షించాలి. నిద్రపోవాల్సిన సమయంలో చాటింగ్‌లు, వీడియోకాల్‌్్సతో కాలం గడుపుతుంటే.. దానివల్ల కలిగే నష్టాలను స్నేహపూర్వకంగా విడమర్చి చెప్పాలి. 10-16 ఏళ్ల వయసులో సెక్స్‌ పట్ల ఆసక్తి కనబర్చడం సహజం. కోరికలు కలిగినప్పుడు ఎలా నియంత్రించుకోవచ్చో తెలియజెప్పాలి. ఈ విషయాల్లో అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. ఈ వయసులో విద్య, వృత్తుల్లో ఎదుగుదలకు అవసరమైన శిక్షణలో వారిని నిమగ్నమయ్యేలా చూడాలి. ఆడపిల్లలు కూడా ఒంటరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.