close

తాజా వార్తలు

రివ్యూ: మిస్ మ్యాచ్‌

చిత్రం: మిస్‌ మ్యాచ్‌
తారాగ‌ణం: ఉద‌య్‌శంక‌ర్‌, ఐశ్వర్య రాజేష్‌, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు.
సంగీతం: గిఫ్టన్ ఇలియాస్
కథ‌: భూపతి రాజా 
మాటలు: రాజేంద్రకుమార్, మధు 
ఛాయాగ్రహణం: గణేష్ చంద్ర
పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ధ‌ర్మతేజ‌, శ్రేష్ట‌, 
దర్శకుడు: ఎన్.వి.నిర్మల్ కుమార్ 
నిర్మాతలు: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
సంస్థ‌: అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్‌.ఎల్‌.పి
విడుద‌ల‌: 6 డిసెంబ‌రు 2019

‘ఆట‌గ‌ద‌రా శివ’తో న‌టుడిగా నిరూపించుకున్నారు ఉద‌య్‌శంక‌ర్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన రెండో చిత్రం ‘మిస్ మ్యాచ్‌’. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని తెర‌కెక్కించిన నిర్మల్‌కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం, భూప‌తిరాజా క‌థ‌ని అందించ‌డం, క‌థా బ‌ల‌మున్న చిత్రాల్ని ఎంపిక చేసుకుంటున్న ఐశ్వర్యరాజేష్ క‌థానాయిక కావ‌డం.. ఇలా ప‌లు విష‌యాలు ఈ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి అందుకు త‌గ్గట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకుందాం..

క‌థేంటంటే: గోవింద‌రాజు (ప్రదీప్‌రావ‌త్‌) కుస్తీలో ఛాంపియన్‌. అదొక గొప్ప క‌ళ అని ఆయ‌న కుటుంబం నమ్ముతూ ఉంటుంది. ప‌లుమార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన గోవింద‌రాజు కెరీర్ సెల‌క్షన్ క‌మిటీ రాజ‌కీయాల‌తో అర్ధాంతరంగా ముగిసిపోతుంది. త‌ను క‌న్న క‌ల‌ల‌న్నీ క‌ల్లల‌వుతాయి. దాంతో త‌న కూతురు మ‌హాల‌క్ష్మి (ఐశ్వర్యరాజేష్‌)ని చిన్నప్పట్నుంచే కుస్తీ పోటీల కోసం రంగంలోకి దించుతాడు. ఏషియ‌న్ క్రీడలకి పంప‌డ‌మే ల‌క్ష్యంగా ఆమెని త‌యారు చేస్తుంటాడు. ఇంత‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సిద్ధార్థ్ (ఉద‌య్‌శంక‌ర్) ప్రేమ‌లో ప‌డుతుంది మ‌హా. మంచి తెలివిగ‌ల కుర్రాడైన సిద్ధూనే త‌న‌కి త‌గ్గ వ్యక్తి అని ఆమె న‌మ్ముతుంది. సిద్ధూ మాత్రం మ‌హా త‌న‌కి మ్యాచ్ కాద‌ని భావించినా, ఆ త‌ర్వాత అత‌ను కూడా ప్రేమిస్తాడు. మ‌రి ఈ జంట ప్రేమ‌కి భిన్నమైన నేప‌థ్యాల‌తో కూడిన ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి క‌ష్టాలొచ్చాయి. మ‌ల్లయోధురాలిగా మ‌హా త‌న తండ్రి క‌ల‌ని నెర‌వేర్చిందా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: కుటుంబాల‌తో ముడిప‌డిన ఒక ప్రేమ‌క‌థ ఇది. దానికి క్రీడానేప‌థ్యం కూడా తోడైంది. భిన్న కుటుంబ నేప‌థ్యాలు క‌లిగిన ఇద్దరు ప్రేమ‌లో ప‌డ‌టం, స్పోర్ట్స్ నేప‌థ్యంలో పండే డ్రామా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ప్రేక్షకుల్ని తొంద‌ర‌గా క‌థ‌లో లీనం చేస్తుంది. నాయ‌కానాయిక‌ల పాత్రల్ని ప‌రిచ‌యం చేసిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. అక్కడ‌క్కడా స‌న్నివేశాలు న‌త్తన‌డ‌క‌గా సాగుతున్నట్టు అనిపించినా.. తొలి స‌గ‌భాగం సినిమాని మంచి సెన్సిబిలిటీస్‌తోనే తీర్చిదిద్దారు. విరామం స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. ద్వితీయార్ధమే స‌రైన దిశ‌లో సాగ‌లేదు. ప్రేమ‌క‌థ‌, స్పోర్ట్స్ డ్రామాని కాద‌ని.. జీకే సిమెంట్ ఫ్యాక్టరీ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. వాటిలో స‌గ‌టు వాణిజ్య సినిమాల్ని గుర్తు చేసేలా రొటీన్ ఛేజింగ్ స‌న్నివేశాలు, ఫైట్లు చూపించారు. క‌థానాయ‌కుడు ఒక్క ఫోన్ కాల్‌తోనే పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ అధికారిగా ఎంపిక కావ‌డం మ‌రీ నాట‌కీయ‌త ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ క‌థ‌కి సాయం చేయ‌క‌పోగా, అస‌లు విష‌యాన్ని ప‌క్కదారి ప‌ట్టించిన‌ట్టు అనిపిస్తుంది. ప్రి క్లైమాక్స్ ఎపిసోడ్‌ని కుస్తీ పోటీల‌తో తీర్చిదిద్దారు. అంత‌ర్జాతీయ స్థాయి పోటీల‌ని తెర‌పై చూపించినా.. అవి ఏమంత ఆస‌క్తిక‌రంగా లేవు. స్పోర్ట్స్ నేప‌థ్యం అంటే సాదాసీదా స‌న్నివేశాలైనా ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. గెలుపు ఎవ‌రిద‌నే ఉత్కంఠ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి భావోద్వేగాలు ఏమాత్రం పండ‌లేదు. స‌న్నివేశాల్ని నాసిర‌కంగా తీశారు. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపు మాత్రం ఆక‌ట్టుకుంటుంది. క‌థానాయకుడి కుటుంబానికి త‌గ్గట్టుగా క‌థానాయిక మారిపోయిన‌ట్టు అనిపించినా.. ఆ వెంట‌నే వ‌చ్చే మ‌లుపు మంచి ముగింపునిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ఉద‌య్‌శంక‌ర్ సాఫ్ట్‌వేర్ కుర్రాడిగా చ‌లాకీగా న‌టించాడు. ఆయ‌న సంభాష‌ణ‌లు చెప్పిన విధానం కూడా మెప్పిస్తుంది. హావ‌భావాల విష‌యంలో మాత్రం ఆయ‌న ఇంకా ప‌రిణ‌తి సాధించాలి. ఐశ్వర్య రాజేష్ అభిన‌యం మెప్పిస్తుంది. మ‌ల్లయోధురాలిగా, ప్రేమికురాలిగా ఆమె చాలా స‌హ‌జంగా న‌టించింది. తండ్రీకూతుళ్ల  బంధం నేప‌థ్యంలో మంచి భావోద్వేగాలు పండాయంటే అది ఐశ్వర్య చ‌ల‌వే. ప్రదీప్‌రావ‌త్ క‌థానాయిక తండ్రిగా ఒదిగిపోయే ప్రయ‌త్నం చేశారు. సంజ‌య్ స్వరూప్ క‌థానాయ‌కుడి తండ్రిగా ప్రాధాన్యమున్న పాత్రలో న‌టించారు. శ‌ర‌ణ్య‌, రూపాల‌క్ష్మి త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికత విషయానికొస్తే గ‌ణేష్ చంద్ర కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. గిఫ్టన్ నేప‌థ్య సంగీతంతో పాటు, క‌న్నాలే క‌లలెన్నో పాట‌ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. రాజేంద్రకుమార్‌, మ‌ధు మాట‌ల బ‌లం చాలా చోట్ల క‌నిపిస్తుంది. నిర్మల్ కుమార్ ద‌ర్శకుడిగా కొన్నిచోట్లే ప్రభావం చూపించాడంతే. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు

+ కథానేప‌థ్యం

తండ్రీ-కూతురు బంధం - భావోద్వేగాలు

ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- సాగ‌దీత‌గా సాగే స‌న్నివేశాలు

ద్వితీయార్థంలో నాట‌కీయ‌త‌

చివ‌రిగా:  ‘మిస్ మ్యాచ్’.. తండ్రీకూతుళ్ల భావోద్వేగాల మేళవింపు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.