close

తాజా వార్తలు

ఐరాస మెచ్చినఅందాల అమ్మ

అమ్మగా మారితే... కెరీర్‌లో రాణించడం కష్టమే! ఈ అభిప్రాయాన్ని ఆమె తన విజయంతో మార్చేసింది... వృథా వస్తువులతో కళాకృతులను తీర్చిదిద్దే పనిలో విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తూనే... అందాల కిరీటాన్నీ అందుకుంది. మరోపక్క సామాజికపరమైన అంశాలపై కృషి చేసిమార్పు కోసం పోరాడింది. తాజాగా ఐరాస అందించే ‘కర్మవీర్‌చక్ర అవార్డు’ గౌరవాన్ని  దక్కించుకుంది హైదరాబాద్‌కు చెందిన రుమానా సిన్హా

మ్మానాన్నలు భారతవైమానిక దళంలో పనిచేసేవారు. సేవచేయాలనే తపన వారి నుంచే ఆమెకు అందింది. ‘మనకు దేశం ఏమిచ్చింది అని ఆలోచించడం కన్నా, దేశానికి మనం ఏమిద్దాం అనే దిశగా ఆలోచించాలనేవారు నాన్న. అమ్మ చాలామందికి ఉచితంగా వైద్యసేవలందించేది. మురికివాడల్లో చిన్నారులకు, మహిళలకు ఆమె అండగా ఉండటం చూశా. ఇతరులకు చేయూతనివ్వడంలో ఆనందం దొరుకుతుందని చెప్పేది అమ్మ. ఆమెను చూసే హైస్కూల్‌లో స్కౌట్‌గా చేశా. ఇంటర్‌లో రాష్ట్రపతి పురస్కారాన్ని  అందుకున్నా’ అని చెబుతున్న  రుమానా తరువాత వినూత్నమైన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది.

పేపర్‌బాయ్‌ కూడా పాఠం చెప్పగలడు..
‘ఎదుటివారి నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం నాకలవాటు. పేపర్‌బాయ్‌, పాలవాడు... ఇలా ప్రతి వ్యక్తి నుంచి చిన్నచిన్న పాఠాలను తెలుసుకుంటూనే ఉంటా. మనచుట్టూ ఉన్నవారంతా మనకు ఉపాధ్యాయులే. నాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ల నుంచీ చాలా విషయాలు తెలుసుకునేదాన్ని. ఒక రోజు నా కొడుకు కాగితంతో ఓ బొమ్మ చేశాడు. ఆరోజు వాడే నా గురువు. వాడిలానే వృథా కాగితాలతో పెద్దపెద్ద బొమ్మలు చెయ్యడం మొదలుపెట్టా. బొమ్మలంటే చిన్నచిన్నవి కాదండోయ్‌! వేదికలపై అలంకరణల కోసం వాడే పెద్దబొమ్మలు. ఆ తర్వాత నెమ్మదిగా కాగితపు ఫర్నీచర్‌ తయారీ మొదలుపెట్టా. ఈ వ్యాపారం చాలా తక్కువకాలంలోనే చక్కని అభివృద్ధిని సాధించింది. ఇవన్నీ చేస్తూనే మహిళా సాధికారత కోసం కృషి చేయాలనుకునేదాన్ని. ఏడేళ్లక్రితం నా ఆలోచనలకు ఓ రూపాన్ని ఇవ్వడం మొదలుపెట్టా. సామాజిక సేవాసంస్థ ‘వాయిస్‌ ఆఫ్‌ స్లమ్‌’తో కలిసి మురికివాడల్లో నిరక్షరాస్యులుగా ఉన్న చిన్నారులను కలిసేదాన్ని. వీరికి విద్యనందించడానికి కృషి చేయడం ప్రారంభించా. అదే సమయంలో గృహహింసకు వ్యతిరేకంగా, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టా. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో సమావేశాల్లో వీటిపై మాట్లాడి ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నా’ అని అంటోంది రుమానా.

ఇంజినీరింగ్‌ చదివిన రుమానా కోవే యువవ్యాపారవేత్తల విభాగానికి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. వ్యాపార మెళకువలు చెప్పే విషయంలో తోటి మహిళావ్యాపారవేత్తలకు మెంటర్‌గానూ ఉంది. మిసెస్‌ ఇండియా యూనివర్స్‌ కిరీటం అందుకుంది.
గతేడాది మిసెస్‌ వరల్డ్‌వైడ్‌ ఇండియాగా ఎంపికైంది. వివిధ రంగాల్లో చేసిన సేవలకు కర్మవీర్‌చక్ర అవార్డు అందుకుంది. భవిష్యత్తులో మహిళాసాధికారత దిశగా మరిన్ని సేవలు అందించాలనే ఆశయంతో ముందడుగు వేస్తానంటోంది రుమానా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.