close

తాజా వార్తలు

పెళ్లే సర్వం, స్వర్గం

ప్రేమిస్తే పెళ్లవుతుంది, పెళ్లయితే ఇల్లవుతుందనేది నేటితరం భావన. ప్రేమించకున్నా పెళ్లిపందిరి ద్వారా కూడా పెళ్లవుతుంది.
‘ఇటీవలివరకు, చాలామంది స్త్రీలకు పెళ్లి ప్రధాన జీవనాధారంగా ఉండేది’ అన్నాడు ప్రఖ్యాత బ్రిటిష్‌ దార్శనికుడు బెర్ట్రండ్‌ రస్సెల్‌ తన ‘మ్యారేజ్‌ అండ్‌ మోరల్స్‌’లో. అంటే చాలామందికి పెళ్లే బతకడానికి మార్గం చూపేది. ఇతరత్రా జీవించడానికి స్త్రీలకు సామాజిక పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కావు.
స్త్రీస్వాతంత్రం గురించి శతాబ్దాలుగా ఎవరెన్ని చెప్పినా పెద్దగా మార్పురాలేదు. స్త్రీలు విద్యావంతులై, చేతిలో నాలుగు డబ్బులాడినపుడే నిజమైన అధికారం వస్తుందని ఆధునిక చరిత్ర రుజువుచేసింది.
భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తుంటే సహజంగా ఎవరి అభిప్రాయాలను వారు గౌరవించుకుంటారు, భాగస్వామి కూడా తమ అభిప్రాయాలను గౌరవించాలని భావిస్తారు. అందుకు సిద్ధంగా లేని దంపతుల మధ్యే సమస్యలు. సంపాదన లేకపోయినా ఇంట్లో పనికి వెల కట్టలేని భర్తతో భార్యకు ఎప్పుడూ సమస్యలే. ఉద్యోగం చేయాలనున్నా వద్దని తన సంపాదన చాలనే భర్తలున్నట్టే ఉద్యోగార్హత లేని భార్యలను, ఒక్క జీతం సరిపోదని అవమానించేవాళ్లున్నారు. చిన్నాచితకా పనులు చేస్తుంటే ఇక చాలుగానీ పిల్లలను చూసుకోమని దబాయించే భర్తలూ కోకొల్లలు.  
భార్యాభర్తలు ఒకరి లోపాలను రెండోవారు పూరించేట్టుగా ఉంటే ఆ కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఒకరి బలహీనతలను మరొకరు ఎత్తిపొడుచుకోనంతవరకు ఇబ్బందిలేదు. పరస్పరం కించపరచుకోవడం ప్రారంభిస్తే పిల్లల భవిష్యత్తు అంధకారమౌతుంది. భర్తకే కాదు భార్యకూ ఎన్నో ఆశలు, ఆశయాలు, ప్రణాళికలు ఉంటాయి. పెళ్లి తర్వాత ఒకరికొకరు కార్యదర్శిలా పనిచేస్తే ఇద్దరి ప్రణాళికలూ సాకారమవుతాయి. మనిషి ఒంటరిగానే ఎంతో సాధించవచ్చు. మరొకరు తోడయితే ఎదురేముంది?
పెళ్లంటే ఏమిటి? పెళ్లికి నిర్వచనమిద్దామని చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అన్నిమతాలకు, సంస్కృతులకు వర్తించే విధంగా పెళ్లికి అందరికీ ఆమోదయోగ్యమయ్యే నిర్వచనంలేదు. పెళ్లితో భార్యాభర్తలకు అనేక హక్కులు, బాధ్యతలు వస్తాయి. ఐక్యరాజ్య సమితి 16వ అధికరణంలో- విశ్వమానవాళి హక్కుల గురించి చెబుతూ జాతి, మతాలతో సంబంధం లేకుండా వివాహమాడి, కుటుంబాన్ని స్థాపించే హక్కు అందరికీ ఉందని, ఇద్దరికీ సమాన హక్కులు వర్తిస్తాయని, వధూవరుల అభిప్రాయాలకు విరుద్ధంగా పెళ్లి చేయకూడదని వక్కాణించింది. కనుక వధూవరుల అంగీకారం అన్నింటికన్నా ముఖ్యం. బలవంతపు పెళ్లిళ్లు చేసే కాలం కాదిది, పెద్దలిది గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వం వివాహాన్ని గుర్తిస్తే అది పౌరవివాహమవుతుంది. ఆ గుర్తింపు ఒక ధ్రువపత్రం ద్వారా దాఖలవుతుంది. మతప్రాతిపదికన జరిగితే క్రైస్తవంలో శాక్రమెంటల్‌ పెళ్లి అని, ఇస్లాంలో నిఖా అని అంటాం. హిందువులు వివాహాన్ని పవిత్రకార్యంగా భావిస్తారు. ప్రాచీనకాలంలో ఎక్కువమంది యువకులు సన్యాసులుగా మారి ధర్మవ్యాప్తికే పరిమితమవు తున్నారనే భావనతో దేవతా విగ్రహాలకు కల్యాణాలు జరిపించి యువతీయువకులనూ పెళ్లికి పురికొల్పేవారు. కుటుంబం సమాజానికి ప్రాతిపదిక. కుటుంబం పతనమయినపుడు సమాజం పతనమవు తుంది. మనిషికి ఒంటరితనాన్ని దూరంచేసి, విశ్రాంతి, సాంత్వన, భద్రత, ఆహ్లాదం, సుఖం అందించేది కుటుంబం. కుటుంబంలోకి అడుగుపెట్టే యువతీయువకులు ఒకరిపై ఒకరు పరస్పర గౌరవం, నమ్మకం చూపగలిగితేనే జీవితంలో పెళ్లి ద్వారా సంక్రమించే సౌఖ్యాలన్నీ అందుబాటులోకి వస్తాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.