close

తాజా వార్తలు

రజనీ..జీవితంలో మర్చిపోలేని ఘటన అది!

ఇప్పటికీ తగ్గని ప్రేక్షకుల ఆదరణ

‘‘అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా!.. వయసైనా.. నీ స్టైల్‌, నీ అందం.. ఇంకా నిన్ను వదిలిపోలేదు!’’ ‘నరసింహా’ చిత్రంలో సూపర్‌స్టార్‌ను చూసి రమ్యకృష్ణ చెప్పే మాటలివి. అందుకు ‘తలైవర్‌’ చెప్పే సమాధానం.. ‘థ్యాంక్‌.. థ్యాంక్యూ.. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు!’ అని.

అవును.. ఆయన నవ్వినా స్టైలే.. నడిచినా స్టైలే.. నుదుటిపై వాలే ముంగురులూ స్టైలే..  ఆ ముంగురులను దువ్వే ఐదువేళ్లూ స్టైలే..  చలువ కళ్లద్దాలు.. తీసినా, వేసినా.. రివాల్వర్‌ను గిర్రుమని తిప్పినా.. స్టైలే స్టైలు! బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో కెరీర్‌ను ఆరంభించి.. రంగుల సినీ ప్రపంచంలో ఫిరంగిలా మారి.. 3డీలో నటించి.. మోషన్‌ క్యాప్చర్‌లో మెరిపించి.. మారుతున్న ట్రెండ్‌ను ఫ్రెండ్‌లా చేసుకున్న.. నవ సూపర్‌స్టార్‌... రజనీకాంత్‌! ఆయన 70వ పుట్టినరోజు నేడు..  ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ జీవితంలోని కొన్ని కీలకమైన ఘట్టాలతో ప్రత్యేక కథనమిది..

శివాజీ పుట్టాడు... రజనీ కాదు..

శివాజీరావ్‌ పూర్వీకులది మహారాష్ట్ర. తండ్రి రామోజీరావు గైక్వాడ్‌. పోలీసు కానిస్టేబుల్‌. తల్లి రామాబాయి గృహిణి. శివాజీ బెంగళూరులో జన్మించారు. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. దీంతో చిన్నతనం నుంచే కూలి పనులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రాథమిక విద్యను బెంగళూరులో పూర్తి చేసిన శివాజీ పదహారేళ్ల వయసులో ఉద్యోగ వేటలో పడ్డారు. 1966-73 మధ్య బెంగళూరు, చెన్నైలలో రకరకాల ఉద్యోగాలు చేశారు. చివరకు బస్సు కండక్టర్‌ ఉద్యోగంలో చేరారు. అదే శివాజీ జీవితాన్ని మలుపు తిప్పింది.

శివాజీదే ఆ స్టైల్‌ అంతా!

బాల్యంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తనలోని కళాకారుడిని ఎప్పుడూ వదిలేయలేదు శివాజీ. చిన్నతనం నుంచే అడపాదడపా నాటకాలు వేసేవారు. వేసిన ప్రతీ నాటకంలో శివాజీకి ఓ ప్రత్యేక శైలి ఉండేది. అదే తన జీవితాన్ని వూహించని మలుపు తిప్పుతుందని అస్సలు వూహించలేదు. కండక్టర్‌గా చేరిన తర్వాత విధి నిర్వహణలో ప్రతీది విభిన్నంగా చేసేవారు. బస్సు ఎంత కిక్కిరిసి ప్రయాణీకులు ఉన్నా అందరికీ టిక్కెట్లు 10 నిమిషాల్లో కట్‌ చేసి ఇచ్చేవారు. అదీ వేగం. ఆ వేగంలో కూడా స్టైల్‌ మిస్సయ్యేది కాదు. ఓసారి నాటకంలో ‘దుర్యోధనుడి’ వేషం వేయాల్సి వచ్చింది. అప్పటికి ఆ వేషం చాలా మంది వేసి ఉన్నారు. కానీ శివాజీలాగా ఎవరూ హావభావాలు పలికించలేదు. ఇదే అతని స్నేహితుడు రాజ్‌ బహదూర్‌ దృష్టిని ప్రధానంగా ఆకర్షించింది. ‘నీలో ఓ చక్కని నటుడు దాగి ఉన్నాడు. కానీ నువ్వు ఇక్కడే ఉండిపోతే ఆ నటుడు కనుమరుగైపోతాడు’ అంటూ వెన్నుతట్టి డబ్బులిచ్చి మరీ మద్రాసు పంపాడు శివాజీని.

ఆగస్టు 18, 1975...

ల్లని రూపం, ఆకర్షించే ముఖం.. ‘అపూర్వ రాగంగల్‌’ చిత్రంలో ‘భైరవి ఇల్లు ఇదేనా..’ అంటూ ఓ వ్యక్తి గేట్లను రెండు చేతులతో బలంగా నెట్టి లోపలకు వెళ్తాడు. అప్పటి వరకు ఎవరికీ తెలియదు.. ఇతనే తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టైల్‌ రారాజుగా, కలెక్షన్ల వీరుడిగా మారుతాడని! కె.బాలచందర్‌ పరిచయం చేసిన తొలి సినిమాతోనే తన ప్రత్యకతను చాటుకుని మెప్పించారు ఆ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఆ తర్వాత 1976లో ‘మూడ్రు ముడిచ్చు’లో విలన్‌గా నటించారు. ఆయన విలనిజంలోని వైవిధ్యం గురించి ‘తమిళ సినిమా’ చాలా గొప్పగా చర్చించుకుంది. ఈ చిత్రం తర్వాత దాదాపు ఐదు సినిమాలు ఆయనకు ఆశించిన విజయాన్ని అందించలేదు. అందులో ‘రఘపతి రాఘవ రాజారాం’ అనే తెలుగు సినిమా కూడా ఉంది. రెండేళ్లపాటు శ్రమించి.. ‘భువనా ఒరు కేల్విక్కురి’ అనే చిత్రంలో గుణచిత్ర నటుడిగా తనలోని మరో షేడ్‌ను తెరపై ఆవిష్కరించారు. శోకం నింపే పాత్రలో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అదే ఆయన రాజబాటను వేసింది. 1977లో వచ్చిన ‘పదినారు వయదినిలే’లో ‘పరట్టై’ అనే విలన్‌ పాత్రలో కనిపించి.. ‘ఇదు ఎప్పడి ఇరుక్కు’.. అంటూ తనదైన ‘పంచ్‌’ డైలాగును పరిచయం చేశారు. ఆ సినిమాతో రజనీకాంత్‌ ఎక్కడా తిరిగి చూసుకోలేదు. నేటికీ తన ఆత్మీయ స్నేహితుడిగా భావిస్తున్న విశ్వనటుడు కమల్‌హాసన్‌తో కలిసి అప్పట్లో పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు కాసుల వర్షాన్ని కురిపించాయి. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం చర్చించుకుని.. చెరోదారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

‘రహదారి’.. వేసుకున్నారు!

హుశా.. కమల్‌తో ఆ సమావేశంలో తన జీవితం కోసం ప్రత్యేకించి రహదారిని వేసుకోవాలని రజనీకాంత్‌ నిర్ణయించుకున్నారు కాబోలు. ఎవరి ఆలోచనకీ తట్టని, చిక్కని రహదారిని తనకోసం నిర్మించుకున్నారు. పట్టిందల్లా బంగారంగా మారింది. అపజయాలు ఎదురైనా, విమర్శలు వెన్నంటినా.. గెలుపును అందుకోవడంలో వెనుకాడలేదు. నేటికీ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక కెరీర్‌లో అంచెలంచెలుగా గుర్తింపు తెచ్చుకున్న సినిమాల వివరాల్లోకి వెళితే.. ‘భైరవి’ తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా నుంచే ఆయన ‘సూపర్‌స్టార్‌’గా మారారు. ‘ఇళమై ఊంజలాడుగిరదు’ చిత్రం సిల్వర్‌జూబ్లీని సొంతం చేసుకుంది. ‘తాయ్‌మీదు సత్యం’తో వసూళ్ల రాజుగా రజనీ నిలిచారు. 1980కి ముందు రజనీకాంత్‌ కాస్త మనోవేదనకు గురయ్యారని చెబుతుంటారు. దీంతో ‘రజనీకాంత్‌ పనైపోయింది.. ఇక నెట్టుకురావడం చాలా కష్టం’ అని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేసి 1980లో ‘బిల్లా’ చిత్రంతో మాస్‌గా ఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్‌. ఆ సినిమా ట్రెండ్‌సెట్టర్‌గా మారింది. సూపర్‌స్టార్‌ తడాఖా ఇదీ.. అని చాటి చెప్పింది. విమర్శించే వారి నోరు మూయించింది! రజనీకాంత్‌కు కొత్త జన్మనిచ్చింది.

ఏడాదిలో ఏడు బ్లాక్‌బస్టర్లు!

1981లో రజనీకాంత్‌ సరైన కథలను ఎంచుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 1982లో రజనీకాంత్‌ సింహగర్జన చేశారు. అదే ఏడాదిలో ‘పోక్కిరి రాజా’, ‘తనికాట్టు రాజా’, ‘రంగా’, ‘పుదుకవిదై’, ‘ఎగేయో కేట్ట కురళ్‌’, ‘మూండ్రుముగం’తో పాటు ఏడు చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

ఆధ్యాత్మిక అడుగు..

సాధారణంగా ఏ హీరో అయినా 99 చిత్రాలు విజయవంతంగా పూర్తి చేశాక.. తన వందో చిత్రం అల్టిమేట్‌గా ఉండాలని అనుకుంటారు. ఫైట్లు, పంచ్‌లు పేలాలని భావిస్తారు. కానీ రజనీకాంత్‌ అవన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా.. తన అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భక్తిభావాన్ని నింపాలని ‘రాఘవేంద్ర’ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా పెద్దగా ఆవేదన చెందలేదు. ఇక ‘తలబది’, మన్నన్‌, ‘అణ్ణామలై’, ‘పాండియన్‌’, ‘అరుణాచలం’, ‘బాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘పడయప్పా’ వంటి చిత్రాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘పడయప్పా’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ‘బాబా’లో నటించారు. తాను హిమాలయాలకు వెళ్లడం వెనుక ఉన్న విషయాలను, బాబాజీపై తనకున్న భక్తిని ఈ సినిమా ద్వారా చాటుకున్నారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా విజయం సాధించలేదు. పైగా పలు సమస్యలు కూడా ఎదురయ్యాయి.

ఏనుగు కాదు.. గుర్రాన్ని!

‘బాబా’ తరుణంలో రాజకీయంగా పలు ఇక్కట్లను ఎదుర్కొన్నారు రజనీకాంత్‌. అప్పుడు కూడా ‘ఇక రజనీకాంత్‌ పని అయిపోయింది’ అనే టాక్‌ గట్టిగా వినిపించింది. వాటన్నింటినీ ఏమాత్రం లెక్కచేసుకోకుండా ‘చంద్రముఖి’తో మళ్లీ ప్రేక్షకులను తనదైన స్టైల్‌లో మెస్మరైజ్‌ చేశారు. అంతేకాకుండా ఆ సినిమా సక్సెస్‌ మీట్‌లో ‘నేను ఏనుగుని కాదు కూలబడిపోవడానికి.. గుర్రాన్ని! పడగానే కోలుకుని మరింత వేగంగా పరిగెత్తగలను’ అని రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సినీరంగంలోనూ సంచలనంగా మారాయి. ఇన్ని తరాలను దాటుకుంటూ వచ్చిన ఆయన ‘శివాజి’ ద్వారా సాధారణ చిత్రంతోపాటు దాని 3డీలోనూ కనిపించి మెప్పించారు. ఆ తర్వాత టెక్నాలజీ నిండిన సైన్స్‌ఫిక్షన్‌ చిత్రం ‘ఎందిరన్‌’లో చిన్నారులను సైతం అలరించారు. తదుపరి జనరేషన్‌ అభిమానులకు కూడా కట్చీఫ్‌ వేశారు! ‘2.ఓ’లో నేరు 3డీలో నటించారు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో రూపొందించిన ‘కోచ్చడయాన్‌’లో కూడా నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇటీవల ‘కాలా’, ‘కబాలి’ సమయంలో ‘ఇక రజనీ విరమించుకోవడమే నయం’ అని పలువురు విమర్శించారు. కానీ ఆయన ‘పేట’.. అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘దర్బార్‌’ను ఏర్పాటు చేసేందుకు రజనీ సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆయన తన సినీ కెరీర్‌ను, రాజకీయ అరంగేట్రానికి తగ్గట్టుగా మలచుకుని వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే తాజాగా.. ‘జనాలు నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాదు’ అంటూ వక్కాణించి చెప్పారు.

ఆ సమయంలో ఐదు వేలు పంచేయాలి అదీ పందెం!

రోజు రజనీ, రఘునందన్‌, బహదూర్‌ సరదాగా మాట్లాడుకుంటూ బెంగళూరులో రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఒక్కసారిగా రజనీలోని శివాజీ మేల్కొన్నాడు. జేబులో ఐదు వేల రూపాయల కట్ట తీసి రఘుకి ఇచ్చారు. గుడ్డనహళ్లి నుంచి చామరాజ్‌పేట వెళ్లేలోపు ఖర్చుచేయాలి లేకపోతే పదివేలు తిరిగి ఇవ్వాలి.. ఇదీ పందెం. రఘుకి శివాజీ మనసు తెలుసు. మొదట బజ్జీలమ్మే చోటుకు వెళ్లి పక్కనే వాళ్ల చిన్నారి ఆడుకుంటుంటే రూ.500 ఇచ్చారు. వారు రఘుకి నమస్కరిస్తుంటే దూరం నుంచి రజనీ, బహదూర్‌ నవ్వుతూ చూశారు. అలా తోపుడు బండితో అవస్థపడే వృద్ధుడు, కాగితాలు ఏరుకునే కుర్రాడు, దీనావస్థలో ఉన్న వృద్ధ దంపతులు, అనాథ పిల్లలు ఇలా చాలా మందికి డబ్బు పంచేశారు. డబ్బు కాగితాల కన్నా నిస్సహాయుల కళ్లలో ఆనందాన్ని విలువ కట్టే ఇలాంటి సాయంత్రాలు, పందేలు ఆ స్నేహితులు చేస్తూనే ఉన్నారు. శివాజీలాగా ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి రజనీ సాయం చేసేవారు.

బిచ్చగాడు అనుకొని

సారి బెంగళూరులోని ఓ గుడిలో గట్టు మీద రజనీ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అతడి ఆహార్యాన్ని చూసి బిక్షగాడు అనుకొని ఓ మహిళ పది రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయింది. కాసేపటి తరవాత రజనీకాంత్‌ బయటికి వచ్చి కారు ఎక్కుతున్నప్పుడు ఆమె గుర్తుపట్టి దగ్గరికొచ్చి క్షమించమని అడిగిందట. ‘స్టార్‌డమ్‌, మేకప్‌ లేకపోతే నేనేంటో ఆ సంఘటన గుర్తుచేస్తూనే ఉంటుంది. అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యం ఇవ్వను’ అంటాడు రజనీ.

నేలమీద పడక

‘దళపతి’ సినిమా షూటింగ్‌ సమయంలో అరవింద్‌ స్వామి తెలీక ఓ రోజు రజనీకాంత్‌ గదికి వెళ్లాడు. అప్పటికే అందులో ఏసీ ఆన్‌లో ఉండీ, మంచం పూలపాన్పులా హాయిగా అనిపించడంతో తెలీకుండానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించాడు. అప్పటికి అరవింద్‌స్వామి అనామకుడే. మరోపక్క రజనీ అప్పటికే సూపర్‌స్టార్‌. అందుకే అరవింద్‌ స్వామి కంగారుగా బయటికి వెళ్లి యూనిట్‌ సభ్యులను విషయం ఏంటని ఆరాతీస్తే... ముందురోజు రాత్రి షూటింగ్‌ అయ్యాక గదికి వచ్చిన రజనీ, తన మంచం మీద నిద్రపోతున్న అరవింద్‌ స్వామిని చూసి అతన్ని లేపొద్దని అసిస్టెంట్‌ డైరెక్టర్లకు చెప్పి అక్కడే నేల మీద పడుకున్నాడట.

రంగు వేయడు

సినిమాల్లో ఎంత స్టయిల్‌గా ఉన్నా బయట మాత్రం ధోతీ, కుర్తా, ఇంట్లో ఉంటే లుంగీ, హవాయి చెప్పుల్లోనే కనిపిస్తాడు రజనీ. మేకప్‌, నెరిసిన వెంట్రుకలకు రంగు వేసుకోవడానికి అతను ఇష్టపడడు. ‘అమ్మ పిల్లలకి మంచి బట్టలు తొడిగి, అందంగా తయారు చేసి చూసుకుని మురిసిపోతుంది. అలానే అభిమానులు కూడా నన్ను అందంగా రకరకాల గెటప్‌లలో చూడాలనుకుంటారు. వాళ్లకోసమే సినిమాల్లో అలా కనిపిస్తా. బయట నేను నాలానే ఉంటా’ అంటూ తన ఆహార్యం వెనకున్న ఆంతర్యాన్ని చెబుతాడు రజనీ.

అందుకే చంద్రముఖి!

మిళనాట ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ ఆఖరి సినిమా ‘నరసింహ’. ఆయనంటే రజనీకి చాలా గౌరవం. శివాజీ మరణం తరవాత ఆయన కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు శివాజీ కొడుకు రామ్‌ కుమార్‌కి రజనీ ఫోన్‌ చేసి ‘శివాజీ ప్రొడక్షన్స్‌’ మీద మళ్లీ సినిమా తీయమనీ, తాను హీరోగా నటిస్తాననీ చెప్పాడు. అలా చేసిన ‘చంద్రముఖి’ భారీ విజయాన్నే సొంతం చేసుకొని, శివాజీ ప్రొడక్షన్స్‌ని మళ్లీ గాడిలో పెట్టింది.

మూలాల్ని మరవకుండా...

తాను ఉపయోగించని వస్తువులకు ప్రచారం చేయడం ఇష్టంలేక రజనీ ఇప్పటివరకూ ఒక్క ప్రకటనలోనూ నటించలేదు. షూటింగులకు ఆలస్యంగా వెళ్లిన సందర్భాలూ, కింది వాళ్లను తక్కువగా చూసిన దాఖలాలూ లేవు. ‘అద్భుతాల్ని నేను నమ్ముతా. ఓ బస్‌ కండక్టర్‌ సూపర్‌స్టార్‌లా మారడం అద్భుతమే కదా’ అంటాడు రజనీ. మూలాల్ని మరచిపోకుండా సాగిన ఆ ప్రయాణమే రజనీని అన్నివిధాలా సూపర్‌స్టార్‌ని చేసిందంటారు అభిమానులు.

చెక్కుచెదరని స్నేహం

స్‌కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో అతని స్నేహితుడూ, డ్రైవర్‌ రాజ్‌ బహదూర్‌, రజనీని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరమని ప్రోత్సహించాడు. తరవాత అతను సూపర్‌స్టార్‌ అయినా ఆ స్నేహం చెక్కుచెదరలేదు. ఏడాదికోసారి రజనీకి బెంగళూరులోని స్నేహితుడి ఇంటికెళ్లి ఐదారు రోజులు గడిపి రావడం అలవాటు. ‘రజనీ చెప్పాపెట్టకుండా వస్తాడు. అందరితో కలిసి భోజనం చేస్తాడు. తాను తనలా ఉండగలిగే ఒకేఒక్క చోటు మా ఇల్లే అంటుంటాడు’ అని స్నేహితుడి స్వభావాన్ని గుర్తు చేసుకుంటారు బహదూర్‌.

 

జనీకాంత్‌ జీవితంలో ఎన్నో భోగ భాగ్యాలను అనుభవించారు. అప్పుడు ఎంత స్టార్‌ స్టేటస్‌ అనుభవించారో ఇప్పుడు అంత నిరాడంబరంగా ఉంటారు. జీవితంలో శివాజీరావ్‌ గైక్వాడ్‌ అనుకున్నవన్నీ సాధించాడు. కాదు.. రజనీకాంత్‌ సాధించేలా చేశారు. ఇలాంటి పుట్టిన రోజులను శివాజీరావ్‌ ఎన్నో జరుపుకోవాలని మన రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.