close

తాజా వార్తలు

టాకీసుల్లో రాములో రాములా! స్టేడియాల్లో రాహులో రాహులా!

కోహ్లీ, రోహిత్‌కు లేని కేఎల్‌ ఘనత

సినిమా టాకీసుల్లో జనాలు రాములో.. రాములా! అంటుంటే స్టేడియాల్లో అభిమానులేమో రాహులో.. రాహులా! అంటున్నారు. ప్రతిసారీ ఆహా.. విరాట్‌! ఓహో.. రోహిత్‌! అని కీర్తించే విశ్లేషకులు వారెవ్వా.. రాహుల్‌! అని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ యువ ఆటగాడు అందరి అంచనాలను అందుకుంటున్నాడు. పొట్టి క్రికెట్‌ ఫార్మాట్లో తనకిక తిరుగులేదని చాటుతున్నాడు. అరుదైన గణాంకాలతో దూసుకుపోతున్నాడు. కోహ్లీ, రోహిత్‌కు సాధ్యమవ్వని ఓ ఘనతతో ఔరా అనిపిస్తున్నాడు.


తక్కువేం కాదు

అంతర్జాతీయ క్రికెట్‌కు అద్భుతమైన ఆటగాళ్లను అందించింది భారత జట్టు. సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌, కపిల్‌దేవ్‌ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకు  అంతుండదు. ఇక ఈ తరంలో అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ పేరుగాంచాడు. రికార్డులెన్నో బద్దలు కొట్టాడు. అరుదైన ఘనతలు అందుకున్నాడు. తన సొగసు, వీరబాదుడుతో హిట్‌మ్యాన్‌గా అవతరించాడు రోహిత్‌ శర్మ. టీమ్‌ ఇండియాలో ఇప్పుడు వీరిద్దరిదే హవా. పరుగులైనా.. ప్రశంసలైనా వారివే. బ్యాటింగ్‌, టెక్నిక్‌, సొగసు పరంగా వీరికే మాత్రం తక్కువోడు కాదు రాహుల్‌. టెస్టు, వన్డే, టీ20ల్లో శతకాలు బాదిన మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. తానొక ‘నివురు గప్పిన నిప్పు’ అని చాటాడు.


ఆట.. అందం

మైదానంలో 360 డిగ్రీల్లో షాట్లు ఆడగల దిట్ట రాహుల్‌. తిరుగులేని స్ట్రోక్‌ ప్లేయర్‌. బంతి అతడి బ్యాటు స్వీట్‌ స్పాట్‌ను తగిలిందంటే రివ్వున బౌండరీకి వెళ్లాల్సిందే. అతనాడే సంప్రదాయ కవర్‌డ్రైవ్‌, ఆఫ్‌ డ్రైవ్‌, స్ట్రెయిట్‌ డ్రైవ్‌ల్లో సొగసు ఉట్టిపడితే అప్పర్‌ కట్‌, షార్ట్‌ ఆర్మ్‌, ఫుల్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లలో నవ్యత్వం తొణికిసలాడుతుంది. ఇంకా అతడి అమ్ముల పొదిలో ఎన్నో కొత్త షాట్లు ఉన్నాయి. ముఖ్యంగా టీ20ల్లో అతడి ఆటలో అందం తళుకులీనుతుంది. కళ్లకు చూడముచ్చటగా అనిపిస్తుంది. కొన్నాళ్ల క్రితం జట్టులో చోటు కోల్పోయిన అతడు తిరిగి గాడిన పడ్డాడు. మానసిక ధోరణి మార్చుకున్నాడు. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయాలన్న స్పష్టత తెచ్చుకున్నాడు. ఏ పాత్ర ఇచ్చినా పోషించడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్‌కు దీటుగా ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు.


ఏడు 50లు

పాత్రేదైనా.. ఘట్టమేదైనా తాను దిగనంత వరకే అన్నట్టు రాహుల్‌ చెలరేగుతున్నాడు. కీపింగ్‌, బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో కీపింగ్‌ మొదలుపెట్టి పక్షం రజులు గడవలేదు కివీస్‌తో రెండో టీ20లో ఫీల్డింగ్‌ల మార్పుచేర్పులు చేసేశాడు. తనలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్న అభిమానులు గుర్తించని విషయం ఒకటుంది. 2019 నుంచి టాప్‌ఆర్డర్‌లో ఎక్కువ అర్ధశతకాలు చేసింది అతడే. 2019లో నాలుగు (9 ఇన్నింగ్స్‌), 2020లో మూడు (4 ఇన్నింగ్స్‌) మొత్తం 7 అర్ధశతకాలు సాధించాడు.


వెనకే రోహిత్‌, కోహ్లీ

పరుగుల వరద పారించే రోహిత్‌ విచిత్రంగా నాలుగు అర్ధశతకాలే చేశాడు. అవీ గతేడాది ఆడిన 14 ఇన్నింగ్సుల్లో. ఈసారి ఇంకా ఖాతా తెరవలేదు. సారథి విరాట్‌ కోహ్లీ సైతం కొత్త ఏడాదిలో 4 ఇన్నింగ్స్‌లాడి ఇంకా అర్ధశతకం నమోదు చేయలేదు. గతేడాది 10 ఇన్నింగ్సుల్లో 5 బాదాడు. ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ 2019లో 12 ఇన్నింగ్సులాడి ఒక్క 50 బాదలేదు. ఈ సారి 2 ఇన్నింగ్సుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అందుకే రాహుల్‌పై ఇప్పుడిన్ని ప్రశంసలు.. పొగడ్తలు.. అతడు ఇలాగే జోరు కొనసాగించాలని కోహ్లీ సహా అందరూ కోరుకుంటున్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.