close

తాజా వార్తలు

కోహ్లీసేన సూపర్‌ ఓవరో‘హిట్‌’

సూపర్‌ ఓవర్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న టీమ్‌ ఇండియా
రోహిత్‌ శర్మ, మహ్మద్‌ షమి ఇంద్రజాలం,

ఆఖరి ఓవర్‌ మూడో బంతి వరకు అసలు విజయంపై ఆశల్లేవ్‌. ప్రత్యర్థి విజయం ఖాయమే అనుకున్నారంతా! సిరీస్‌ దక్కించుకొనేందుకు మరో మ్యాచ్‌ గెలవక తప్పదని కోహ్లీసేన సైతం భావించింది. విచిత్రంగా సెడాన్‌ పార్క్‌లో అద్భుతమే చోటు చేసుకుంది. ఆఖరి బంతికి రాస్‌టేలర్‌ క్లీన్‌బౌల్డ్‌ కావడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఇక సూపర్‌ ఓవర్లో ఆఖరి 2 బంతుల్లో భారత్‌ విజయానికి 10 పరుగులు అవసరం. అప్పటి వరకు సౌథీ కట్టుదిట్టంగా బంతులు వేసి భయపెట్టాడు. కానీ హిట్‌మ్యాన్‌ రెండు భారీ సిక్సర్లు బాది పరవశంలో ముంచేశాడు. కాకపోతే న్యూజిలాండ్‌ గుండె మరోసారి పగిలింది!


చితక బాదిన రోహిత్‌

న్యూజిలాండ్‌తో మూడో టీ20 అనేక మలుపు తిరిగింది. ఆధిపత్యం రెండు జట్ల చేతులు మారింది. టీ20 అభిమానుల్ని ఉత్కంఠలో ముంచెత్తింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రోహిత్‌ శర్మ (65; 40 బంతుల్లో 6×4, 3×6), లోకేశ్‌ రాహుల్‌ (27; 19 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. వీరి ధాటికి 8 ఓవర్లకే స్కోరు 80 దాటింది. ఆతిత్య జట్టుకు భారీ ఛేదన తప్పదనిపించింది. అద్భుతంగా ఆడుతున్న ఈ జోడీని తొమ్మిదో ఓవర్‌ ఆఖరి బంతికి రాహుల్‌ను ఔట్‌ చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్‌ విడదీశాడు. మరికాసేపటికే రోహిత్‌, శివమ్‌ దూబె (3) ఔటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీ (38; 27 బంతుల్లో 2×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ కివీస్‌ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని వీరిని ఔట్‌ చేసి రన్‌రేట్‌ తగ్గించారు. చివర్లో మనీశ్‌ పాండే (14; 6 బంతుల్లో 1×4, 1×6), రవీంద్ర జడేజా (10; 5 బంతుల్లో 1×6) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లకు భారత్‌ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.


ఔరా విలియమ్సన్‌

ఛేదనలో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌, బౌలింగ్‌ అత్యంత పేలవంగా మారింది. కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ (95; 48 బంతుల్లో 8×4, 6×6) మునుపెన్నడూ చూడని విధ్వంసం సృష్టించాడు. బుమ్రా బౌలింగ్‌ను సైతం చీల్చిచెండాడాడు. ఓపెనర్ గప్తిల్‌ (31; 21 బంతుల్లో 2×4, 3×6) రాణించాడు. కేన్‌ వీరోచిత బ్యాటింగ్‌తో కివీస్‌ దాదాపు విజయం దిశగా సాగింది. భారీ సిక్సర్లు బాదుతూ అతడు టీమ్ఇండియాను హడలెత్తించాడు. బుమ్రా వేసిన 19 ఓవర్లో 11 పరుగులు రావడంతో కివీస్‌ 171/4తో నిలిచింది. సమీకరణం 6 బంతుల్లో 9గా మారింది. ఆఖరి ఓవర్‌ను షమి వేశాడు. తొలి బంతికి కేన్‌ సిక్సర్‌గా మలచడంతో ఇక విజయం లాంఛనమే అనుకున్నారు. బౌన్సర్‌గా వేసిన మూడో బంతికి ఆడాలా? వద్దా? అనుకుంటూ అతడు అప్పర్‌కట్‌ చేయడం.. బంతి రాహుల్‌ చేతుల్లో పడటం.. కేన్‌ పెవిలియన్‌ చేరడం.. సీఫెర్ట్‌ రావడం  నాటకీయంగా అనిపించింది. రాస్‌టేలర్‌ (17) మరోవైపు ఉన్నాడు. అప్పటికీ ధీమా వారిదే. నాలుగో బంతికి పరుగు రాలేదు. ఐదో బంతికి బైస్‌ రూపంలో సీఫెర్ట్‌ సింగిల్‌ సాధించాడు. షమి ఇక్కడే అద్భుతం చేశాడు. అతడు వేసిన పదునైన యార్కర్‌ను టేలర్‌ షాట్‌ ఆడబోయి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. స్కోరు 179/6 కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.


ఆఖర్లో నాటకీయం

సూపర్‌ ఓవర్‌లోనూ డ్రామా నడిచింది. బుమ్రా ప్రభావం చూపుతాడనుకుంటే విలియమ్సన్‌ ఓ సిక్సర్‌, బౌండరీ బాదాడు. ఆఖరి బంతికి గప్తిల్‌ బౌండరీ సాధించడంతో టీమ్‌ఇండియా లక్ష్యం 18 పరుగులుగా మారింది. భారత ఛేదన అంత సులభంగా ఏమీ సాగలేదు. సౌథీ పదునైన యార్కర్లు విసిరాడు. తొలి బంతికి రోహిత్‌ 2 పరుగులు తీశాడు. రనౌట్‌ ప్రమాదం తప్పించుకున్నాడు. రెండో బంతికి ఒక పరుగే వచ్చింది. మూడో బంతిని ఆఫ్‌సైడ్‌ జరిగిన రాహుల్‌ బౌండరీ బాదాడు. అప్పుడు స్కోరు 7/0. రాహుల్‌ భారీ షాట్‌కు ప్రయత్నిద్దామనుకున్నా సౌథీ యార్కర్‌తో సింగిల్‌ మాత్రమే వచ్చింది. ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు చేస్తేనే విజయం. అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. కొడతాడా? కొట్టడా?డగౌట్లో భారత్‌, కివీస్‌ ఆటగాళ్లలోనూ ఆందోళన. యార్కర్‌గా వేసిన ఐదో బంతిని రోహిత్‌ భారీ ఎత్తులోంచి సిక్సర్‌గా మలిచాడు. సౌథీ ఏ బంతి వేస్తాడో తెలియదు. 4 పరుగులు కావాలి. అనూహ్యంగా అతడు మళ్లీ యార్కర్‌ విసరడం.. హిట్‌మ్యాన్‌ ఫ్లడ్‌లైట్ల ఎత్తుకు బంతిని బాదడం.. కోహ్లీ సహా కుర్రాళ్లు మైదానంలోకి పరుగెత్తడం.. కివీస్‌ ఆటగాళ్ల గుండె మరోసారి పగలడం.. క్షణాల్లో జరిగిపోయింది. 

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.