close

తాజా వార్తలు

సాగుధీరకూలీ... కుబేరుడై

‘‘వ్యవసాయాన్ని నమ్ముకుంటే మిగిలేది మట్టే’’ - మన కర్షకుల్లో నెలకొన్న నైరాశ్యమిది. ‘‘మట్టే లేని వ్యవసాయం చేస్తే... పండేది లాభాలే’’ - ఇది హైదరాబాద్‌కు చెందిన సిరిగిరి రవీందర్‌ నిరూపించిన సత్యం. పొలంలో కూలీగా వెళ్లిన ఈయన... వ్యవసాయ క్షేత్రాలనే కొన్నారు. మార్కెట్లను అధ్యయనం చేసి... ఎడారిలోనూ లాభదాయక సాగు చేస్తున్నారు. ఇంటిపేరులోని ‘సిరి’ని పండిస్తున్నారు. అన్నదాతలకు స్ఫూర్తి ‘గిరి’గా నిలుస్తున్నారు. పండించడమే తెలిస్తే సాగుదారుడిగానే మిగలాలి... పంటను ఎక్కడ? ఎలా? అమ్మాలో తెలిస్తే సాగు‘ధీరుడి’గా వెలగొచ్చని చెబుతున్న రవీందర్‌ ప్రస్థానమిది...!
కష్టం నుంచే కసి పుడుతుంది. ఆ కసిని పనిలో పెడితే... అభివృద్ధి వైపు నడిపిస్తుంది. చిన్నతనం నుంచే కష్టాలు అనుభవిస్తూ బతకడం వల్లనేమో రవీందర్‌కు బాగా సంపాదించాలనే ఆరాటం బలంగా ఉండేది. ఇంటర్‌తోనే చదువు ఆపేసి... సంపాదనలో పడాలనుకున్నారు. ప్రధానోపాధ్యాయుడైన తండ్రి సత్యనారాయణ కోరిక మేరకు డిగ్రీ పూర్తి చేశారు. ఇక వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని కొవ్వొత్తులు, కోడిగుడ్లను అమ్మారు. పెళ్లాయ్యాక బాధ్యతలు పెరిగి ఆదాయం సరిపోయేది కాదు. ఉన్నత స్థాయిలో నిలవాలనే తపనతో ఉన్న తరుణంలో జీవితం సరికొత్త మలుపు తీసుకుంది.  
విదేశాల్లో అభివృద్ధికి విత్తనాలు
ఇక్కడ పడ్డ కష్టం విదేశాల్లో పడితే రెట్టింపు ఆదాయం వస్తుందన్న మాటలు రవీందర్‌ను విపరీతంగా ఆకర్షించాయి. రూ. 3లక్షలు అప్పు చేసి న్యూజిలాండ్‌లో కూలి పని చేసేందుకు వెళ్లారు. పొలంలో రోజుకు ఒక వరుస ఉల్లి గడ్డలు పీకితే వంద డాలర్లు ఇస్తామన్నారు. కూలీలంతా ఒక వరుసకు పరిమితమయ్యేవారు. ఆయన అదనపు గంటలు పనిచేసి రెండు వరుసలు పీకేవారు. అలా రోజుకు రెండొందల డాలర్లు సంపాదించారు. ఒక్కో డాలరు కూడబెట్టి మూడేళ్లలో మూడు లక్షల అప్పును తీర్చేశారు. సంపాదనుంటే సరిపోదు... అందులో ఎంత పొదుపు చేస్తున్నాం? అన్నదాని మీద మన భవిష్యత్తు ఉంటుందని నమ్మి.. ముందుకు నడిచారు.
వ్యాపారానికి శ్రీకారం
పొదుపు చేసిన సొమ్ముతో ట్యాక్సీలు కొని క్యాబ్‌లు నడిపే వ్యాపారం మొదలెట్టారు. అది బాగా కలిసొచ్చింది. అక్కడ వచ్చిన లాభాలతో పెట్రోలు బంకు పెట్టారు. దీన్ని విజయవంతంగా నడిపాకా... తనకు బాగా తెలిసిన వ్యవసాయ రంగంలోనే రాణించాలనుకున్నారు. న్యూజిలాండ్‌లోనే చిన్న వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నారు. కష్టపడి పనిచేసే వారికి వ్యాపారాలే కాదు.. వ్యవసాయ క్షేత్రాలైనా కలిసొస్తాయంతే.
మట్టి లేని వ్యవసాయం
మట్టి అవసరం లేకుండా నీటి ద్వారా పోషకాలు అందించి పంటలు పండించే విధానాన్ని హైడ్రోపోనిక్స్‌ అంటారు. న్యూజిలాండ్‌లో ఈ విధానం విస్తరిస్తున్న రోజులవి. రవీందర్‌ ఈ సాంకేతికతపై పట్టు సాధించారు. సాగు మొదలుపెట్టారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడులు సాధించారు. పంట పండించడం వరకే తెలిస్తే... రైతుగానే మిగిలిపోతాం. మార్కెట్‌పైనా పట్టు సాధిస్తే... వాణిజ్య కర్షకులవుతామని గ్రహించిన ఆయన అనతి కాలంలోనే తన సాగు సామ్రాజ్యాన్ని విస్తరించారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో వ్యవసాయ క్షేత్రాలు కొన్నారు. హైడ్రోపోనిక్స్‌ సాగు చేశారు. వ్యవసాయ, లాజిస్టిక్స్‌ వ్యాపారాన్ని విస్తరించారు. 1996 నుంచి 2010 మధ్య కాలంలో అతని కష్టానికి ఎన్నో లక్ష్యాలు తలవంచాయి.
సొంత గడ్డపైకొచ్చి
సంపాదించిన దాంతో సంతృప్తి చెంది స్వదేశానికి వచ్చి స్థిరపడాలని కుటుంబమంతా అనుకున్నారు. 2011లో హైదరాబాద్‌ వచ్చేశారు. అదే ఏడాది ఇద్దరు కుమారుల పెళ్లిళ్లు చేశారు. 2015 నాటికి యాభై ఏళ్లు రాగానే ఆయన తన వ్యాపారాలన్నీ భార్య, ఇద్దరు కుమారులకు అప్పగించేశారు. ప్రస్తుతం భార్య అనుపమ, ఇద్దరు పిల్లలు రంజిత్‌, రోహిత్‌లు ఈ ప్రాజెక్టులను సమర్ధంగా నిర్వహిస్తున్నారు.

ఎ.ఆర్‌.ఆగ్రోఫీల్డ్్స ఇండియా ప్రై. లిమిటెడ్‌ కంపెనీ కింద వ్యాపారం నిర్వహిస్తున్న రవీందర్‌, తన అనుభవ పాఠాలను తోటి రైతులకు అందిస్తున్నారు.
షాబాద్‌ కార్యక్షేత్రం
ఎప్పుడూ పనిచేసే వారికి ఊరికే ఉంటే పొద్దుగడవదు. పైగా ఆయన లోలోపల వ్యవసాయంపై మమకారం అలానే ఉండేది. తన అభిరుచికి తగ్గ సమగ్ర వ్యవసాయ విధానాల గురించి అన్నదాతలకు తెలియచేయాలనుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. న్యూజిలాండ్‌ సాంకేతికతను ఇక్కడ పరిచయం చేశారు.  ఏడెకరాల్లో హైడ్రోపోనిక్స్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. భారత్‌లో వాణిజ్య సరళిలో హైడ్రోపోనిక్స్‌ను పరిచయం చేసిన తొలి వ్యక్తి రవీందరే. ఆ తర్వాత కాలంలో పెట్టుబడికీ.. వస్తున్న ధరలకు సరిపోలేదు. దీంతో పరికరాలన్నీ న్యూజిలాండ్‌ పంపించేశారు. సమగ్ర వ్యవసాయ విధానాలతో.... పొరుగు రైతులకు విత్తనాలిచ్చి ఆధునిక పద్ధతుల్లో టమోటాలు సాగు చేయించేవారు. ఉత్పత్తిని తిరిగి తానే కొంటూ వచ్చారు. బోయిన్‌పల్లి మార్కెట్లో టమోటాల ధరల విషయంలో దళారులతో పెద్దపోరాటాలే చేశారు. 2012-15 కాలంలో బోయినపల్లి మార్కెట్లో టమోటాల రవీందర్‌ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇలా వివిధ పంటలు సాగుచేస్తూ తనకున్న పది ఎకరాలను ఒక నమూనా క్షేత్రంగా మార్చేశారాయన. ఇతర జిల్లాల నుంచి వచ్చే రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
కిలో కొత్తిమీర రెండు దినార్లు
వ్యవసాయం ఎంత బాగా చేయగలరో... మార్కెట్టును అంతే త్వరగా పట్టుకోవడం ఆయనకు తెలుసు. దుబాయ్‌, లావోస్‌ మార్కెట్లు వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. భారత్‌లో ఒక కిలో కొత్తిమీరకు వచ్చే ధర దుబాయ్‌లో ఒక కట్టకు వస్తోంది. అక్కడ వ్యవసాయ కార్మికుల సమస్య ఉన్నా గిట్టుబాటు మాత్రం పది రెట్లు అధికంగా ఉండటం లాభించే అంశం. అబుదాబీలోని ఐదెకరాల ఎడారి ఇసుక నేలల్లో ముందు ప్రయోగాత్మకంగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు పెంచి డ్రిప్‌ ద్వారా ఫర్టిగేషన్‌ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి. మరో ఐదెకరాల్లో ఉల్లి, మొక్కజొన్న, వరి, మునగ, ఆకుకూరలు, నేపియర్‌ గ్రాసాన్నీ సాగు చేశారు. కిలో కొత్తిమీర రెండు దినార్‌ల చొప్పున అమ్ముతూ రెట్టింపు ఆదాయం పొందుతున్నారు. ఆకుకూరల్ని అబుదాబీ సూపర్‌ మార్కెట్లకు పంపిస్తున్నారు. త్వరలో అబుదాబిలో తన ప్రాజెక్టును వంద ఎకరాలకు విస్తరించనున్నారు. అలానే ముంబయి నుంచి లావోస్‌కు ఉల్లి గడ్డ వెళితే అక్కడ దాని ధర బాగా అధికం. అదే ఉల్లిని లావోస్‌లోనే పండిస్తే మంచి ధరలు పొందవచ్చని గ్రహించారు. లావోస్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 350 ఎకరాల ప్రభుత్వ భూములు లీజుకు తీసుకుని ఉల్లి సాగు చేపట్టారు. మొత్తం తన ప్రాజెక్టుల్లో ఇప్పుటికే 12వేల మందికి ఉపాధి చూపుతున్నారు. ‘లక్ష్యం సాధించడం పట్ల కసి, తగిన ప్రణాళిక, పక్కా కార్యాచరణ, అవసరానికి మించి శ్రమించడమే తన విజయసూత్రాల’నే చెప్పే రవీందర్‌ సాగుదారుడే కాదు... సాగుధీరుడు.

దుబాయ్‌, లావోస్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో పండించే వ్యవసాయోత్పత్తులను ‘ఫ్రెస్కో’ బ్రాండ్‌ పేరుతో ఆయన మార్కెటింగ్‌ చేస్తున్నారు.

- అమిర్నేని హరికృష్ణ
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.