close

తాజా వార్తలు

అమెరికాలో వలసదారులకు కఠిన నిబంధన

ప్రభుత్వ పథకాలపై ఆధారపడితే గ్రీన్‌కార్డు రానట్లే
నేటి నుంచే అమల్లోకి
ప్రవాస భారతీయులకు ప్రతికూలంగా మారే అవకాశం

వాషింగ్టన్‌: వలసదారులపై మరో కఠిన నిబంధనాస్త్రాన్ని ప్రయోగించేందుకు ట్రంప్‌ సర్కారు సమాయత్తమైంది. అమెరికాలో శాశ్వత నివాస హోదా కోరే విదేశీయులెవరూ అక్కడి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా నిషేధం విధించనుంది. తమ దేశంలోని పన్ను చెల్లింపుదారులపై వలసదారులు అదనపు భారంగా మారకుండా నిరోధించేందుకుగాను సోమవారం నుంచి ఈ నూతన నిబంధనను అమల్లోకి తీసుకురానుంది. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు కోసం దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న వేలమంది భారతీయులపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

తమ దేశంలోని పేదల కోసం అమెరికా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తక్కువ ధరకు ఆహార స్టాంపులు అందజేయడం, ఉచిత విద్య, ఆరోగ్య పథకాల వంటివి అందులో ఉన్నాయి. వీటిని పేద అమెరికన్ల కంటే వలసదారులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారని, ఫలితంగా స్వదేశీ పన్ను చెల్లింపుదారులపై అధిక భారం పడుతోందని చాలాకాలంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.   నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందే వలసదారులను అమెరికాలో ‘పబ్లిక్‌ ఛార్జ్‌’గా పిలుస్తారు. అటువంటి వారి సంఖ్యను తగ్గించేందుకుగాను గత ఏడాది ఆగస్టు 14న ట్రంప్‌ సర్కారు నూతన నిబంధనను తీసుకొచ్చింది. వలసదారులెవరైనాసరే తమ కాళ్లపై తామే నిలబడాలని అందులో స్పష్టం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకునేవారికి వీసా గడువు పొడిగించబోమని, గ్రీన్‌కార్డు/శాశ్వత నివాస హోదా ఇవ్వబోమని తేల్చిచెప్పింది. వీసా పొడిగింపు, గ్రీన్‌ కార్డు కోరుకునే విదేశీయులెవరైనాసరే, తాము నిర్దేశిత పరిమితికి మించి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోలేదంటూ ఆధారాలు సమర్పించాలని పేర్కొంది. గత ఏడాది అక్టోబరు 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉన్నా.. కోర్టు తీర్పుల కారణంగా జాప్యం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పుతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

దక్షిణాసియా అమెరికన్లకు దెబ్బ
తాజా నిబంధన కారణంగా ప్రధానంగా అమెరికాలోని దక్షిణాసియన్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ అధ్యయనం ప్రకారం.. అమెరికాలో 50 లక్షల మంది వరకు దక్షిణాసియన్లు ఉండగా.. వారిలో దాదాపు 4.72 లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నారు. 15.8% పాకిస్థానీలు, 23.9% నేపాలీలు, 24.2% బంగ్లాదేశీలు, 33.3% భూటానీలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలోని 61% నాన్‌ సిటిజన్‌ బంగ్లాదేశీ కుటుంబాలు, 48% నాన్‌ సిటిజన్‌ పాకిస్థానీ కుటుంబాలు, 11% నాన్‌ సిటిజన్‌ భారతీయ కుటుంబాలు సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందుతున్నట్లు 2018 వలస విధాన కేంద్రం నివేదిక చెబుతోంది.
* 58% - కుటుంబ పెద్దగా నాన్‌ సిటిజన్‌ ఉండి కనీసం ఒక్క సంక్షేమ పథకాన్నయినా ఉపయోగించుకుంటున్న కుటుంబాలు
* 50% - కుటుంబ పెద్దగా నాన్‌ సిటిజన్‌ ఉండి ప్రభుత్వ ఆరోగ్య పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబాలు



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.