close

తాజా వార్తలు

...ప్రేమతో  ఇవాంకా!

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాకతో అట్టహాసం, హడావుడి భారీ ఎత్తున మొదలైంది. ట్రంప్‌తోపాటు మొదటి మహిళ మెలానియా తన ఆహార్యంతో, హుందాతనంతో ఆకట్టుకుంటున్నారు. వీళ్లేకాదు ఈ పర్యటనలో అందర్నీ మరో పడుచు జంటా ఆకర్షిస్తోంది. వాళ్లే ట్రంప్‌ ముద్దుల కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌. ‘పవర్‌ కపుల్‌’గా పేరున్న వీళ్లని ప్రేమకు చిరునామాగా చెబుతారక్కడ. ఈ ఇద్దరి అన్యోన్యత, అనుబంధం, ప్రేమ ఎంతో ఆసక్తికరం.

గ్రదేశం అధినేత ట్రంప్‌ ముద్దుల పట్టీ ఇవాంకా. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త కుమారుడు జేర్డ్‌ కుష్నర్‌. ఇద్దరికీ తెలిసిన ఓ ఫ్రెండ్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. తొలి చూపులోనే వలపు వలలో బందీ అయ్యారు. తరచూ కలుసుకున్నాక ప్రేమలో వేగం పెరిగింది. వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కాకముందే వారసత్వ వ్యాపార పగ్గాలు అందుకున్నారు. ‘వ్యాపారపరంగా మేం ఎన్నో పెద్దపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటన్నింటికన్నా మేం అత్యంత విజయం సాధించిన ఇష్టమైన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది మా ప్రేమే’ అంటారు ముక్తకంఠంతో.

చూపు తిప్పుకోలేనంత అందం, రాచ కుటుంబాలకు తగ్గని ఠీవీ వీళ్ల సొంతం. అప్పట్లో ఈ జంట ప్రేమ గురించి అమెరికాలో కథలు కథలుగా చెప్పుకునేవాళ్లు. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న రోజుల్లో ఈ జంటను ‘జే-వాంకా’ అనేవారు. హాలీవుడ్‌ తారలు ఏంజెలినా జోలీ, బ్రాడ్‌ పిట్‌ ‘బ్రాంజెలినా’లాగే వీళ్లదీ ఏమాత్రం తగ్గని పాపులారిటీ.

ఇవాంకాది అత్యంత ధనిక కుటుంబం. స్వయంవరం ప్రకటించి కుబేరుల్నే వరుసలో నిల్చొబెట్టేంత తాహతు. అయినా తాను వలచిన చెలికాడి కోసం ఎన్నో మెట్లు దిగింది. జేర్డ్‌ కోసం పెళ్లికి ముందు జూయిష్‌గా మారింది. జూయిష్‌ అమ్మాయి అయితేనే తమ ఇంట్లోకి రావాలన్న జేర్డ్‌ అమ్మానాన్నల షరతును సంతోషంగా ఒప్పుకుంది.

అంతఃపురంలో యువరాణిలా సకలభోగాలూ అనుభవించే ఇవాంకా తన వలపుకాడి కోసం వంటగదిలో అడుగుపెట్టి స్వయంగా అతడికిష్టమైన వంటలు చేయడం నేర్చుకుంది. ‘పెళ్లికి ముందు నాకు కనీసం గుడ్డు ఉడకబెట్టడమే రాకపోయేది. ఇప్పుడు జేర్డ్‌కి నా చేతులతో వంట చేసి, వడ్డిస్తేగానీ నాకు సంతృప్తిగా ఉండదు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

పదిహేడేళ్ల కిందట ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. పుష్కరం కిందట పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వ్యాపారాలు, పర్యటనలతో ఇద్దరికీ తీరిక ఉండటం లేదు. మరి ప్రేమ మధురిమలకు చోటెక్కడ? అంటే వాళ్ల దగ్గర సమాధానం రెడీగా ఉంది. తమ అనుబంధాన్ని తాజాగా ఉంచుకోవడం కోసం ‘డేట్‌ నైట్‌’ పేరుతో వారానికోసారి ఏకాంత ప్రదేశానికి వెళ్లి సన్నిహితంగా గడుపుతారు. ఆ రోజు ఇద్దరి ఫోన్లు స్విచాఫ్‌ అవుతాయట. భర్తకోసం అతనికి నచ్చిన వంటకాలు వండిపెడుతుంది ఇవాంక.

ఇవాంకా, జేర్డ్‌ చూడముచ్చటైన జంటనే కాదు.. ‘పవర్‌ కపుల్‌’ కూడా. ట్రంప్‌ వ్యాపార సామ్రాజ్యపు అతిపెద్ద ఒప్పందాల్ని దగ్గరుండి చూసుకుంటుంది ఇవాంకా. సొంతంగా నగల వ్యాపారమూ ఉంది. ఇదికాకుండా ట్రంప్‌ అధ్యక్ష ప్రచారంలో అంతా తానై వ్యవహరించింది. మరోవైపు కుష్నర్‌ది అతిపెద్ద వ్యాపార కుటుంబం. శ్వేతసౌధ్యంలో అధ్యక్షుడికి ప్రస్తుతం సీనియర్‌ సలహాదారు కూడా.

సెలబ్రిటీ కపుల్‌గా పేరున్న ఈ జంట ప్రేమకు ప్రతిరూపంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. అరబెల్లా రోజ్‌, జెసెఫ్‌ ఫ్రెడెరిక్‌, థియోడర్‌ జేమ్స్‌. విదేశీ పర్యటనల్లోనూ అప్పుడప్పుడు సందడి చేస్తుంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.