close

తాజా వార్తలు

అదే లోటు.. పరిష్కారమే తక్షణ కర్తవ్యం
లండన్‌: నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడమే కీలక మ్యాచ్‌లో టీమిండియా ఇంటిముఖం పట్టడానికి కారణమని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. లీగ్‌ దశలో అదరగొట్టినా సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో మరోకప్పు ముద్దాడాలకున్న టీమిండియా కలలు కల్లలయ్యాయి. ఓటమికి కారణాలు కనిపించడంతో వాటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తేనే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమస్య ఉండదని రవిశాస్త్రి అన్నాడు. దానిపై అతని సుదీర్ఘ వివరణ ఇలా.. 

కేఎల్‌ ఉన్నా..

మొదటి నుంచి టీమిండియాను వేధిస్తున్న అతి పెద్ద సమస్య మిడిలార్డర్‌. జట్టు అన్ని రంగాల్లో మెరుగ్గానే కనిపిస్తున్నా అక్కడ మాత్రం ప్రతిసారి లోటుపాట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ సమయంలో కేఎల్‌ రాహుల్‌ కనిపించాడు. ఆ స్థానానికి అతను న్యాయం చేయగలడనిపించింది. కానీ, దురదృష్టవశాత్తూ శిఖర్‌ ధావన్‌ గాయంతో సమస్య మళ్లీ జఠిలమైంది. ఫలితం మళ్లీ ఓపెనర్‌గా కేఎల్‌ ముందుకు రావాల్సి వచ్చింది. మరో ప్రత్యామ్నాయంగా విజయ్‌ శంకర్‌ కనిపించినా అతనికి కూడా గాయం కావడంతో సమస్య మొదటికే వచ్చింది. మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసినా అప్పటికే సమయం మించిపోవడంతో ప్రయోగాలకు వీలులేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కింకర్తవ్యం ఏదైనా ఉందంటే దీనికి పరిష్కారం వెతకటమే. జట్టులో యువ ఆటగాళ్లను బలోపేతం చేయాలి. వారికి అవకాశాలు కల్పిస్తూ కీలక ఆటగాడిని తయారు చేయాలి.   

అందుకే అక్కడ ధోనీ..

టాప్‌ ఆర్డర్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు చివర్లో ఉంటేనే జట్టు గెలుస్తుందనుకున్నాం. అందుకే ధోనీని ఏడో స్థానంలో పంపాల్సి వచ్చింది. అది జట్టు నిర్ణయం. అందరూ దానికి సమ్మతించారు. కఠిన పరిస్థితుల్లో అతని అనుభవాన్ని జట్టుకు మేలు చేస్తుందనిపించింది. దీనికితోడు ఎలాంటి సమయంలోనైనా అతను గొప్ప ఫినిషర్‌ కావడంతో అదే సరైన నిర్ణయమనిపించింది. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. రక్షణాత్మక ధోరణితో ఆడుతూ ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. అతనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఆ విషయం తనకు కూడా తెలుసు. పంత్‌, పాండ్య ఔటయ్యాక కూడా జట్టు గొప్ప తెగువ చూపిస్తూ చివరిదాకా పోరాడింది. 

వర్షం ఒక కారణమే..

వర్షం కారణంగా కీలక సెమీస్‌ మ్యాచ్‌ రెండు రోజులు సాగడమూ ఫలితంపై ప్రభావం చూపింది. తొలిరోజు ఆటపై పట్టు సాధించాం. కానీ వర్షం వల్ల మళ్లీ తర్వాతి రోజు మొదటి నుంచి మొదలుపెట్టడం ఓ రకంగా ప్రతికూలాంశమే. ఆటలో కొన్ని సార్లు ఇలాంటివి తప్పవు.

కచ్చితంగా నాణ్యమైన ఆటగాడే..

జడేజా సహజంగానే అత్యుత్తమ ఆటగాడు. లీగ్‌ దశలో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ ఫీల్డర్‌గా మాత్రం నాణ్యమైన సేవలు అందించాడు. బౌండరీలు ఆపుతూ, త్రో లు విసురుతూ జట్టుకు గొప్ప తోడ్పాటునందించాడు. పూర్తిస్థాయి ఆటగాడిగా అవకాశం వచ్చిన మ్యాచ్‌ల్లోనూ తనెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. సెమీస్‌లో ధోనీతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును దాదాపు గెలుపు దాకా తీసుకెళ్లాడు. చక్కటి ప్రదర్శనతో తన సామర్థ్యాన్ని మళ్లీ నిరూపించుకున్నాడు. దీంతో అతను మరో స్థాయికి చేరుకున్నాడు. రానున్న రెండేళ్లలో జడేజాలో ఇంకా అత్యుత్తమ ఆటను చూస్తాం. 

రనౌట్‌ కాకుంటే..

పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ధోనీ సహజ నైజం. అది అందరికీ తెలిసిందే. అతను క్రీజులో ఉన్నంత వరకూ భారత్‌దే విజయమని అందరూ ధీమాగా ఉన్నారు. తనకున్న అంచనాల ప్రకారం ధోనీ మదిలోనూ అదే ఆలోచన ఉండి ఉంటుంది. అతని కళ్లలో అది స్పష్టంగా కనిపించింది. కానీ రనౌట్‌ కారణంగా పరిస్థితులు మారిపోయాయి. అయితే రనౌట్‌ అయినప్పుడు ఎదుర్కొన్న బంతిని చేతితో కొట్టాడు. ఎడమ చేతికి వాపు రావడంతో డ్రెసింగ్‌ రూమ్‌లోకి వచ్చాక సహచరులను కూడా కేవలం కుడి చేతితోనే కరచాలనం చేశాడు. ఫిజియో కూడా ఈ విషయంలో చింతించారు. 

కేవలం 30 నిమిషాల ఆటతో..

జట్టు గెలిచినా ఓడినా వారిలో స్ఫూర్తి నింపడం కోచ్‌ ప్రధాన బాధ్యత. మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సమావేశమైన శాస్త్రి వారిని ఉద్దేశించి..‘గర్వంగా ముందుకు వెళ్లండి. మీ ప్రదర్శనతో అందరినీ మెప్పించారు. ఒక్క 30 నిమిషాల ఆట కారణంగా మీరేమీ తక్కువ కాదు. అది అందరికీ తెలుసు. కొన్నేళ్లుగా ఇదే అత్యుత్తమ జట్టు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఒక్క టోర్నమెంట్‌, ఒక్క సిరీస్‌.. అందులోనూ ఓ 30 నిమిషాలు మీ ఆటను నిర్ణయించలేవు. మ్యాచ్‌ చేజారడం బాధించవచ్చు. ఆ విషయంలో మీరింకా చింతిస్తూనే ఉండొచ్చు. కానీ ఆ ఆలోచనను మీ మదిలో నుంచి తీసేయండి. మీరు ఇప్పటికే గొప్ప గౌరవాన్ని సాధించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు. ఓటమిని అంగీకరించలేము. అయితే ఆటలో ఇలాంటివి తప్పవు. ముందుకెళ్లడమే మన పని.’ అని చెప్పుకొచ్చాడు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.