close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేను ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ నుంచి తప్పుకోవడానికి కారణం అదే!

ఒక పుస్తకమంత భగవద్గీతను ఒక పేజీలో రాయలేం. ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ మనిషి గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఎందుకంటే ‘వెయ్యి అబద్ధాల్లో’ ఒక్క నిజం అతను. వెయ్యి పాపాల్లో ఒక్క పుణ్యం అతను. వెయ్యి దోషాల్లో ఒక్క సుగుణం అతను. ఆయనే ప్రముఖ దర్శకుడు తేజ. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా జీవితాన్ని ప్రారంభించిన తాను.. కెమెరామెన్‌గా, దర్శకుడిగా ఎలా ఎదిగిందీ.. ఎలాంటి ఆటు పోట్లు ఎదుర్కొందీ.. ఇలా ఎన్నో సంగతుల గురించి చెప్పారు.

హాయ్‌ తేజగారు ఎలా ఉన్నారు? మీ పేరు ధర్మతేజ కదా! ‘ధర్మ’ ఎటు వెళ్లిపోయాడు?
తేజ: చేసేదంతా అధర్మమని ‘ధర్మ’ వెళ్లిపోయాడు(నవ్వులు) అందరూ తేజ.. తేజ.. అని పిలిచి టైటిల్స్‌లో కూడా అదే కొనసాగుతోంది. కొన్ని హిందీ సినిమాలకు పనిచేసినప్పుడు అక్కడ టైటిల్స్‌లో ధర్మతేజ.. తేజ ధర్మ అని వేసేవారు. ఏది వేసినా ఫర్వాలేదు. నిర్మాత ఇచ్చే చెక్కుమీద మాత్రం కరెక్ట్‌గా ఉంటే చాలు(నవ్వులు). ఈ విషయం బ్యాంకు వాళ్లకు కూడా చెప్పా. ఎలా రాసినా డబ్బులు జమ అవుతాయి. 

దర్శకుడిగా ఎన్ని సినిమాలు చేశారు?
తేజ: మర్చిపోయాను. ఎప్పుడూ లెక్కపెట్టలేదు. హిట్‌ సినిమాలు నాలుగైదు ఉన్నాయి.. ఫ్లాప్‌లు ఎక్కువ. అంతవరకూ మాత్రం గుర్తుంది. 

ఎందుకంత ఓపెన్‌ మైండెడ్‌గా ఉంటారు?
తేజ: అలా ఉండటం సహజం అనుకుంటా. అందరూ అలా ఉండరని నాకు తెలియదు. ఏదైనా అనుకుంటే మొహమాటం లేకుండా చెప్పేయాలి. 

రాంగోపాల్‌వర్మ దగ్గర ఉన్నారు కదా! ఆయన గాలి ఏమైనా తగిలిందా మీకు?
తేజ: ఆయనది నాకు తగిలిందో.. నాది ఆయనకు తగిలిందో తెలియదు(నవ్వులు) ఇద్దరం ఒకే రకంగా ఆలోచిస్తాం కాబట్టి కలవగలిగాం. 

మీరిద్దరూ తొలిసారి ఎక్కడ కలిశారు?
తేజ: ‘రావుగారి ఇల్లు ’ సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన ఆఖరి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాడు. అప్పటికే నేను కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. విరామ సమయంలో నేను లైట్‌ బాయ్‌లు ఇంకొంతమందికి చిన్న చిన్న కథలు, జోక్స్‌ చెబుతుండేవాడిని. ఒకరోజు వర్మ నా దగ్గరకి వచ్చి, ‘కిటికీలో నుంచి కిరణాలు పడేలా షాట్‌ తీయాలంటే ఏం చేయాలి’ అని అడిగాడు. నేను అప్పటికే రవికాంత్‌ నగాయిచ్‌గారి దగ్గర కొంతకాలం పనిచేశా. ఆయన గొప్ప కెమెరామెన్‌. ఇది 10-15 రకాల్లో తీయొచ్చని వివరించి చెప్పా. అంతా విని.. ‘సాయంత్రం మనం డిన్నర్‌కు వెళ్దామా’ అని అడిగాడు. అప్పటికి నా లైఫ్‌లో ఎవరూ నన్ను డిన్నర్‌కు పిలవలేదు. మద్రాసులోని ఒక చైనీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లాం. నేను అలా రెస్టారెంట్‌కు వెళ్లడం అదే మొదటిసారి. ‘నేను సినిమా చేయబోతున్నా. నీకు స్టోరీ సెన్స్‌ ఉంది. పైగా కెమెరా పనితీరు విషయంలోనూ అవగాహన ఉంది. కలిసి సినిమా చేద్దాం’ అన్నాడు. ఇదే విషయం మా కెమెరామెన్‌ మహీదర్‌కు చెప్పా. ‘వాడికి ఇది మొదటిదో, రెండో సినిమాకో పనిచేస్తున్నాడు. అనుభవం లేదు. నువ్వు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ఉన్నావు. పైగా హైదరాబాద్‌లో ఇండస్ట్రీ కూడా లేదు’ అని అంటే, ‘లేదు మేము సూపర్‌హిట్‌ తీస్తాం’ అని చెప్పా. దాంతో మహీదర్‌గారికి కోపం వచ్చి, ‘వాడికి అనుభవం లేదు.. నీకూ లేదు.. మీరు సూపర్‌హిట్ తీస్తారా.. పొండి’అని తిట్టారు. ఎక్కడ నా జీవితం నాశనం అవుతుందోనని ఆయన భయం. ఆ తర్వాత ఇద్దరం కలిసి ‘శివ’ స్క్రిప్ట్‌పై పనిచేశాం. కెమెరా తనకీ కొత్త, నాకు కొత్త కావడంతో కాస్త అనుభవం ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందని గోపాల్‌రెడ్డిగారిని తీసుకున్నాం. ‘ఈ సినిమా చెయ్‌. తర్వాతి సినిమాకు కెమెరామెన్‌గా బ్రేక్‌ ఇస్తా’ అని వర్మ అన్నారు. అలా ‘శివ’ తీసాం. సూపర్‌ హిట్‌ అయింది. దానికి పోస్టర్లు నేనే డిజైన్‌ చేశా. ఆ తర్వాత ‘క్షణక్షణం’. దానికి గోపాల్‌రెడ్డిగారు నిర్మాత కావడంతో ఆయన్ని తీసేయలేం కదా! అప్పుడు మూడో సినిమా ‘రాత్రి’కి కెమెరామెన్‌గా మొదటి అవకాశం వచ్చింది. 

మరి ఆ సినిమా మీకు మొదటి ‘రాత్రి’ అయిందా? లేక కాళ‘రాత్రి’ అయిందా?
తేజ: ఆడలేదు కాబట్టి అది కాళ‘రాత్రి’(నవ్వులు). కానీ, కెమెరామెన్‌గా నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘అంతం’, ‘మనీ’, ‘రక్షణ’, ‘తీర్పు’ సినిమాలు చేశా. 

‘క్షణక్షణం’ సినిమాకు చెందిన ఒక యూనిట్‌కు కెమెరామెన్‌గా చేసినట్లు ఉన్నారు?
తేజ: రామూ లేనప్పుడు కొన్ని సీన్లు నేనే తీసేసేవాడిని. బ్యాంకు దోపిడీ, ఛేజ్‌లు అవన్నీ నేనే తీసేశా. ఆ తర్వాత ముంబయికి వెళ్లిపోయా.

సడెన్‌గా ముంబయికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?
తేజ: ఈ సినిమాలు చేస్తున్న సమయంలో ముంబయి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నేను ఆమీర్‌ఖాన్‌ను మాట్లాడుతున్నా. నా ఫ్రెండ్‌ అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వం చేయబోతున్నాడు. నువ్వు స్క్రిప్ట్‌లో కూడా బాగా పనిచేస్తావని తెలిసింది. నువ్వు కూడా వస్తే సినిమా చేద్దాం’ అన్నారు. అదే సూపర్‌హిట్‌ చిత్రం ‘బాజీ’. ఇది చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి ఎయిర్‌పోర్ట్‌లో షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. సాధారణంగా ముంబయిలో నైట్‌ ఎఫెక్ట్‌లో షూటింగ్‌ అంటే రెండు లారీల లైట్లు చెబుతారు. అప్పుడు నాకు సమీర్‌రెడ్డి అసిస్టెంట్‌గా ఉండేవాడు. ‘మనకు లైట్లు ఏమీ వద్దు. రెండు టార్చ్‌లు పట్టుకురా’ అని చెప్పా. ప్రొడ్యూసర్‌లు అడిగినా ఇదే చెప్పా. అవి తీసుకుని ఆ రాత్రంతా షూట్‌ చేశాం. ఆ తర్వాత సరిగా తీశానా లేదా? అని చూసుకున్నా. అంతా బాగా వచ్చింది. మరుసటి రోజు రాత్రి షూటింగ్‌కు వెళ్తే, ‘వీడు లైట్స్‌ లేకుండా ఎలా తీస్తున్నాడా?’ అని అద్దాల్లో నుంచి మిగిలిన నిర్మాతలు చూస్తున్నారు. అంతే, తెల్లారేసరికి హోటల్‌ బయట పెద్ద క్యూ. ‘ఆ ప్రొడ్యూసర్‌ రమ్మన్నాడు.. ఈ ప్రొడ్యూసర్‌ మిమ్మల్ని రమ్మన్నాడు’ అంటూ డ్రైవర్లు వరుస కట్టారు. అక్కడి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చా. అలా హిందీ సినిమాలు ఒక 30 వరకూ చేశా. మ్యూజిక్‌ వీడియోలు.. ప్రకటనలు 170 వరకూ చేశా. 

కెమెరామెన్‌గా చేస్తూ, దర్శకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది?
తేజ: ‘శివ’ తర్వాత రాంగోపాల్‌ వర్మ డేట్స్‌ దొరకకపోతే, నా దగ్గరకి వచ్చేవాళ్లు. నేనెప్పటికీ కెమెరామెన్‌గానే ఉంటా. డైరెక్షన్‌ నాకు చేతకాదు అని చెప్పేవాడిని. అక్కడ ముంబయిలో చేస్తుండగా, కొందరు దర్శకులు అన్నీ వదిలేసి బయటకు వెళ్లిపోయేవారు. అలా వాళ్లు తీయాల్సిన సీన్లు నేను తీసేవాడిని. ఒక డైరెక్టర్‌ అయితే, 10రోజులు అసలు రాలేదు. మొత్తం నేనే తీశా. ఆ సినిమా పెద్ద హిట్టయిపోయింది. అప్పట్లో నాకు రూ.8లక్షలు ఇచ్చేవారు. ఆ సినిమా తర్వాత రూ.9.లక్షలు ఇచ్చారు. అదే దర్శకుడికి మొదటి సినిమాకు రూ.లక్ష ఇస్తే, తర్వాతి సినిమాకు రూ.40లక్షలు ఇచ్చారు. ఇదేంటి నాకు లక్ష పెరిగింది.. అతనికేమో రూ.39లక్షలు పెరిగిందనుకుని, డైరెక్షన్‌ బాగుంటుందనుకున్నా. అదే సమయంలో రామోజీఫిల్మ్‌ సిటీ కొత్తగా కట్టారు. ఇంటికి దగ్గరగా ఉండవచ్చని, షూటింగ్‌లు ఎక్కువగా ఫిలింసిటీలోని లొకేషన్లను ఎంచుకునేవాడిని. అలా అక్కడ షూటింగ్‌లు చేస్తూ, రామోజీరావుగారిని కలిశా. ‘ఇక్కడ అన్ని బాగున్నాయి. రూ.30లక్షల్లో సినిమా తీయొచ్చు’ అని ఆయనతో అంటే, ‘మీ దగ్గర కథ ఉంటే చెప్పండి తీద్దాం’ అన్నారు. ‘చిత్రం’ కథ ఇంటర్వెల్‌ వరకూ చెప్పా. ‘ఇప్పటివరకూ మీ ట్రాక్‌ రికార్డు బట్టి మిమ్మల్ని నమ్ముతున్నా. మీరు తప్పు చేయరనే నమ్మకంతో మీకు సినిమా ఇస్తున్నా’ అని ‘చిత్రం’ అవకాశం ఇచ్చారు. అది మంచి విజయం సాధించింది.

ఎప్పుడూ కొత్తవారితోనే సినిమా తీయడానికి కారణం ఏంటి?
తేజ: పెద్ద పెద్ద స్టార్స్‌తో తీయాలంటే భయం. ఏదైనా కరెక్షన్‌ చెబితే వింటారో.. వినరోనని భయం. ముంబయిలో అయితే, చెప్పింది వింటారు. కానీ, ఇక్కడ ఎలా తీసుకుంటారో లేదోనని ఆందోళన ఉండేది. ఇంకో విషయం ఏంటంటే.. వాళ్ల స్థాయికి తగ్గట్లు కథ రాయలేను. ఒకవేళ పెద్ద స్టార్స్‌తో తీసినా, వాళ్లకు కరెక్షన్‌ చెబితే చేయరేమోనని భయం. డైలాగ్‌ సరిగ్గా చెప్పకపోతే సీన్ చెడిపోతుంది. సీన్‌ చెడిపోతే, సినిమా చెడిపోయి ఫ్లాప్‌ అవుతుంది. సినిమా పోతే నా ఫ్యూచర్‌ ఏమైపోతుంది? అలా ఆలోచిస్తా. 

మరి బాలకృష్ణతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఎందుకు ఒప్పుకొన్నారు? ఆ తర్వాత ఎందుకు వెళ్లిపోయారు?
తేజ: రామారావుగారి బయోపిక్‌కు నేను న్యాయం చేయలేనేమోనని నాకు భయం వేసింది. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. 

మరి బయట మీరు, బాలకృష్ణ గొడవపడ్డారని, దీంతో మీరు అలిగి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి?
తేజ: మా మధ్య గొడవేమీ లేదు. ఆ తర్వాత బాలకృష్ణగారు కూడా ‘ఏమైంది?’ అని అడిగారు. కానీ, నేను సమాధానం చెప్పడానికి వెళ్లలేదు. 

‘నిజం’ ఎందుకు ఫ్లాప్‌ అయింది?
తేజ: నేను ‘నిజం’ చేసే సమయానికి మహేశ్‌బాబు ‘బాబీ’ విడుదలైంది. అది ఆడలేదు. దాంతో ఎలాంటి అంచనాలు ఉండవని, ‘నిజం’ చేశాం. మధ్యలో ‘ఒక్కడు’ వచ్చింది. దీంతో మహేశ్‌ స్టార్‌డం పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘నిజం’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, అనుకున్న స్థాయిలో ఆడలేదు. డబ్బులు మాత్రం వచ్చాయి. 

‘బాహుబలి’ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ తీశారు. ఎలా అనిపించింది?
తేజ: ఈ సినిమాకు ముందు నేను చేసిన సినిమాలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌లు. దీంతో ఈ సినిమా విడుదలైన తర్వాత ఎవరూ కూడా హిట్‌ అని అనలేదు. పైగా అదే రోజు ఇంకో రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి. వాటితో పోలిస్తే, ఇది అంతగా బాగోలేదని అన్నారు. పైగా ‘చివరిలో రానా చచ్చిపోవడం జనాలకు నచ్చడం లేదు’ అనేవారు. కానీ, కలెక్షన్‌లు అయితే తగ్గలేదు. ఇప్పుడు అందరూ ఫోన్లు చేసి, ‘టీవీలో చూస్తుంటే భలే ఉంటుంది సర్‌ సినిమా’ అని అంటుంటారు. ‘జయం’కు కూడా బాగుందని చెప్పలేదు. 

‘నేనే రాజు నేనే మంత్రి’కి ముందు ఇలాంటి కథలు ఎందుకు ఎంచుకుంటున్నా? అని అనిపించిందా?
తేజ: అవును అనిపించింది. అయితే, తీసే ప్రతీది హిట్‌ సినిమా తీయాలనే చూస్తాం. ప్రతి సినిమాను హిట్‌ అవుతుంది అనుకునే తీస్తాం. సినిమా పూర్తయిన తర్వాత కానీ, తెలియదు ‘ఇది ఆడదు’ అని. అప్పుడేం చేస్తాం. విడుదల చేయక తప్పదు. 

మీ సినిమాలో ఎక్కువగా కొత్త వాళ్లే కమెడియన్లుగా ఉంటారు? ఆ టైమింగ్‌ మీదేనా?
తేజ: అవును. ఆ సీన్లు అన్నీ నేనే రాసుకుంటా. నాకు కామెడీ అంటే ఇష్టం.

సీన్‌ సరిగా చేయకపోతే హీరోయిన్లను మీరు కొడతారని అంటారు? నిజమేనా? 
తేజ: నేను ఎవరినీ కొట్టను. (నవ్వులు) (మధ్యలో ఆలీ అందుకుని.. ‘సీతాకోకచిలుక’ సమయంలో నన్ను భారతీరాజాగారు కొట్టారు. దర్శకులు కొడితే, అదృష్టం కలిసి వస్తుంది. అందుకు అందరూ దర్శకుల చేతిలో దెబ్బలు తినండి అని చెబుతుంటా) ఒక సినిమాలో కల్యాణ చక్రవర్తి అనే అతను చేస్తున్నప్పుడు ‘వన్‌మోర్‌’ అంటే చేయడం లేదు. రిహార్సల్‌లో బాగా చేస్తున్నాడు. టేక్‌లో చేయడంలేదు. ‘ఏంటి సరిగా చేయడం లేదు. కొట్టనా’ అంటే.. ‘కొట్టండి సర్‌. మీరు కొడితే స్టార్లు అవుతారట’ అన్నాడు. ‘నేను కొట్టను నువ్వు చేయాల్సిందే’ అని ఆ సీన్‌ చేయించా. తెలుగు ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్‌ ఉంది. అంత స్టార్‌ అవుతానంటే నన్ను నేనే కొట్టుకునేవాడిని కదా! ఫ్లాప్‌లు తీసేవాడిని కాదు. 

‘ధైర్యం’ సినిమా కొనడానికి వచ్చిన ఒక డిస్ట్రిబ్యూటర్‌ను మీరు ఏదో అనడంతో వివాదం అయింది కదా!
తేజ: సినిమా కొనడానికి ఆయన నా దగ్గరకు వచ్చాడు. ‘ఏంటీ ఇక్కడకు వచ్చావు’ అని అడిగితే, ‘సర్‌ మీ జయం నేను కొన్నాను. ఇప్పుడు ధైర్యం కొనడానికి వచ్చా’ అన్నాడు. అప్పుడు నేను ‘మీ భార్య బాగుందా. పిల్లలు బాగున్నారా. సరే నీ ఇష్టం’ అన్నా. నా టైమింగ్‌ను క్యాచ్‌ చేసి ఆ సినిమా కొనకుండానే వెళ్లిపోయాడు. ఆ సినిమా విడుదలైన తర్వాత ‘డైరెక్టర్‌ ఈ సినిమా కొనద్దు’ అని డిస్ట్రిబ్యూటరే నిర్మాతకు చెప్పాడు. దీంత నిర్మాతల మండలిలో నాపై ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిస్తే, ‘సినిమా కొనవద్దని చెప్పావా’ అని అడిగారు. ‘నేను అలా చెప్పలేదు. భార్యా, పిల్లలు జాగ్రత్త’ అని చెప్పాను అన్నా. ‘దాని అర్థం అదే కదా’ అన్నారు. ‘మీ ఇష్టం మీరు ఏమనుకున్నా ఫర్వాలేదు’ అని అంటే, ‘అయితే నష్ట పరిహారంగా రూ.కోటి కట్టు’ అన్నారు. ఆ సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటే, రూ.కోటి తిరిగి ఇచ్చేశా.

మీరు మృదు స్వభావా.. లేక కరుకుగా ఉంటారా?
తేజ: నేను పూర్తి ర్యాష్‌గా ఉంటా. ఏది చేయాలన్న వెంటనే చేసేస్తా. దాని వల్ల జరిగే తప్పొప్పులను ఆలోచించను. నావల్ల నిర్మాత పెద్దగా నష్టపోయింది లేదు. ఎందుకంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టించను. 

మీరు ఎన్ని సినిమాలను నిర్మించారు?
తేజ: మొత్తం మూడు సినిమాలు ప్రొడ్యూస్‌ చేశా. ‘జయం’, ‘నిజం’, ‘సంబరం’. 

మీ సొంత ఊరు ఏది?
తేజ: నేను పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. చిన్నప్పుడే అమ్మ చనిపోయారు. మా నాన్న ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేసేవారు. ఆ తర్వాత కొంత కాలానికి నాన్న కూడా కన్నుమూశారు. నాకు ఒక అక్క, చెల్లి. అమ్మానాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని బంధువులు పంచుకున్నారు. ఇప్పటికీ మేం ముగ్గురం అప్పుడప్పుడూ కలుస్తుంటాం. 

మీది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లా?
తేజ: సెమీ.. అరేంజ్డ్‌ కమ్‌ లవ్‌ మ్యారేజ్‌. మొదట నేను చూశా. ఇద్దరం చెట్ల వెనుక, పుట్టల వెనుక తిరగకుండా పెళ్లి చేసుకున్నాం. నా భార్య పేరు వల్లి. నాకు పేర్లు అంతగా గుర్తు ఉండవు కానీ, మనుషులను మాత్రం మర్చిపోను. ఒకసారి నా భార్య పేరు మర్చిపోయా. భోజనం చేస్తుండగా, మంచి నీళ్లు కావాలని అడగటానికి ‘హలో మేడమ్‌.. నీళ్లు తీసుకురండి. అంటూ నీ పేరేంటి మర్చిపోయా’ అని అంటే బాటిల్‌ తీసుకుని నేలకేసి కొట్టింది(నవ్వులు) 

మీరు బాలీవుడ్‌లో కూడా పనిచేశారు? అక్కడకు ఇక్కడకూ మీరు గమనించిన తేడా ఏంటి?
తేజ: అక్కడ హీరోలు మంచివాళ్లు. ఒకసారి ఆమిర్‌ఖాన్‌తో సినిమా చేస్తున్నాం. ఒక పెద్ద ఇల్లు ఉంది. షూటింగ్‌ను ఇంటి వెనుకవైపునకు మార్చాలి. ఒకవైపు చాలా చిన్న సందు మాత్రమే ఉంది. మరోవైపు పూర్తిగా ఖాళీ ఉంది. అయితే అటు వెళ్లాంటే చుట్టూ తిరిగి వెళ్లాలి. ఈ సందులో నుంచి వెళ్తే నేరుగా వెళ్లిపోతాం. ఆమిర్‌ఖాన్‌ సిగరెట్లు కాల్చేవారు. అయితే, ఆడవాళ్లు, పిల్లలు ఉంటే మాత్రం కాల్చరు. దాంతో ఆ సందులో నిలబడి ఆయన సిగరెట్‌ కాలుస్తున్నారు. ఇంతలో ఒక లైట్‌ బాయ్‌ లైట్‌ తీసుకుని ఆ సందులోకి వెళ్లాడు. మేం ఏం జరుగుతుందా? అని చూస్తున్నాం. వాడు ఆమిర్‌ దగ్గరకు వెళ్లి ‘తోడా బాజూ ఖడోనా బాస్‌’ (కాస్త పక్కకు నిలబడండి బాస్‌) అన్నాడు. వెంటనే ఆమిర్‌ ‘అరే సారీ.. సారీ..’ అని పక్కకు వంగి నిలబడ్డాడు. లైట్‌బాయ్‌ పక్క నుంచి వెళ్లిపోయాడు. అదే హైదరాబాద్‌లో అయితే షూటింగ్‌ ఆగిపోయేది. ‘వాడు నన్ను పక్కకు వెళ్లమంటాడా’ అని రచ్చ రచ్చ చేసేవాళ్లు. 

ఇంకోసారి జాకీష్రాఫ్‌తో సినిమా చేస్తున్నాం. నేను కెమెరామెన్‌. ఆయన డైలాగ్‌ చెబుతూ మేం చెప్పిన మార్క్‌ దగ్గర నిలబడాలి. ఆయన మాత్రం ఆ మార్క్‌ దగ్గరకు రావడం లేదు. మమ్మల్ని అడ్జెస్ట్‌ చేసుకోమన్నారు. ‘నేనెందుకు చేసుకోవాలి. ఆయన్నే అక్కడకు వచ్చి సరిగ్గా నిలబడి డైలాగ్‌ చెప్పమనండీ’ అన్నా. ఎన్నిసార్లు తీసినా టేక్‌ ఓకే కావడం లేదు. దీంతో నేను జాకీష్రాఫ్‌ దగ్గరకు వెళ్లి, ‘మీరు వచ్చి సరిగ్గా మార్కు దగ్గర నిలబడాలి. మీరు టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నారు’ అన్నా. ఆయన నన్ను కింద నుంచి పైకి చూశాడు. ఆయన ఒక ఏరియాలో జగ్గూ దాదా అట. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. ఆరోజు షూటింగ్‌ అయిపోయిన తర్వాత నేను వెళ్లిపోదామని ఆటో కూడా బయట పెట్టుకుని వచ్చా. ఇంతలో ఆయన మేకప్‌ మ్యాన్‌ వచ్చి ‘సర్‌.. దాదా పిలుస్తున్నారు’ అన్నాడు. నాకు ఒకటే టెన్షన్‌. సరేనని ఆయన క్యారవాన్‌లోకి వెళ్లా. ఏదైనా జరిగితే పారిపోదామని తలుపు తీసే ఉంచా. నేను లోపలికి వెళ్లగానే ఎవడో తలుపువేశాడు. నాకు ఒకటే భయం. ఆయన దగ్గరకు వచ్చి, ‘సారీ తేజాజీ.. ఇక ఇలాంటిది భవిష్యత్‌లో జరగదు. పనిపై ఫోకస్‌ చేయలేకపోయా. ఐయామ్‌ సారీ’ అన్నారు. అప్పుడే అర్థమైంది వీళ్లు చాలా ఉత్తములు అని. నేను ఇక్కడ స్టార్స్‌తో చేయపోవడానికి కూడా ఇదొక కారణం. అలా ఆమీర్‌, అక్షయ్‌, సునీల్‌శెట్టి, అమితాబ్‌ చాలా మందితో పనిచేశా. వాళ్ల డెడికేషన్‌ నిజంగా అద్భుతం. అలా ఇక్కడ వాళ్లు తప్పని నేను అనను. అక్కడ కల్చర్‌ అది. ఇక్కడ స్టైల్‌ ఇది. 

మీరు తర్వాత చేయబోయే ప్రాజెక్టు ఏది?
తేజ: తెలియదండీ. ముందే అడ్వాన్సులు తీసుకుని చేయను. ఒకదాని తర్వాత ఒకటి. చాలా కథలు ఉన్నాయి. నేనెప్పుడూ కథలు రాసుకుని చేయలేదు. అన్నీ నా మైండ్‌లో ఉంటాయి. నా అసిస్టెంట్‌లను కూర్చోబెట్టి చెబుతుంటా.. వాళ్లే రాసుకుంటారు. ‘జయం’కు విత్‌ డైలాగ్స్‌తో పూర్తి నరేషన్‌ ఇచ్చా. 

‘చిత్రం’ సినిమా తేజకు, ‘సీత’ సినిమా తేజకు పెరిగిన జ్ఞానం ఏంటి? 
తేజ: జ్ఞానం అయితే పెరగలేదు. ఉన్నది తగ్గిందని మాత్రం చెబుతా. అప్పుడున్న ఫ్రెష్‌నెస్‌ తగ్గిందేమోనని అనుమానం. సొసైటీ ప్రభావం మనంపై తప్పకుండా ఉంటుంది. ఉదాహరణ ఇంట్లో సోఫా ఉంటే, చిన్న పిల్లలు ఎక్కి తొక్కేస్తుంటారు. ‘వద్దమ్మా! తప్పు తొక్క కూడదు’ అంటే తగ్గిపోతారు. అలాగే పెద్దవాళ్లలో కూడా నేచురల్‌ ఫ్లో తగ్గిపోతుంది. బయట ఏమనుకుంటారోనని బతకడం మొదలు పెడతాం. నాకు ఇప్పుడు అదే అనిపిస్తోంది. 

‘ఔనన్నా.. కాదన్నా’ సినిమా సమయంలో ఆర్పీ పట్నాయక్‌ రెమ్యునరేషన్‌ పెంచమని అడిగితే, ‘మీ స్థాయి ఏంటో’ తెలుసా? అన్నారట! నిజమేనా?
తేజ:నేను అనలేదు. ఆర్పీ పట్నాయక్‌ డబ్బుల కోసం పోరాడే టైప్‌ కాదు. నాలాంటి వాడే. తను హీరో కమ్‌ డైరెక్టర్ అవుదామనే ఉద్దేశంతో నాకు అనూప్‌ను అప్పగించి ‘ఇక నుంచి నేను చేయనండీ. ఇలా డైరెక్టర్‌ అవుదామని అనుకుంటున్నా’ అని చెప్పి వెళ్లిపోయాడు. 

మీ పేరును ఇంటర్వెల్‌ సమయంలో వేసుకుంటారట?
తేజ: మొదట్లో వేస్తే, ‘ఇది తేజ సినిమా’ అని చూసే దృష్టి మారిపోతుంది. అందుకే ఇంటర్వెల్‌ సమయంలో వేసుకుంటా. అదే అలవాటైపోయింది. 

కాజల్‌ను పరిచయం చేసింది మీరే కదా!
తేజ: అవును. ‘లక్ష్మీకల్యాణం’ ఆమె మొదటి సినిమా. ‘నేనే రాజు నేనే మంత్రి’ 50వ సినిమా. అప్పటికీ ఇప్పటికీ తను అలాగే ఉంది. యాక్టింగ్‌ పరంగా చాలా బాగా ఇంప్రూవ్‌ అయింది.

ఉదయ్‌ కిరణ్‌ను మీరు దగ్గరి నుంచి చూశారు కదా! అతనిపై మీ అభిప్రాయం ఏంటి?
తేజ: చాలా మంచి వ్యక్తి. అమాయకుడు. సినిమా ప్రపంచం గురించి అస్సలు తెలియదు. ఇక్కడకు వచ్చాక అన్నీ నేర్చుకున్నాడు. అసలు ‘చిత్రం’ సినిమాకు అతను హీరో కాదు. ఇంకొక అబ్బాయిని అనుకున్నాం. ఉదయ్‌ కిరణ్‌ స్నేహితుల్లో ఒకడిని హీరోగా అనుకున్నాం. హీరో కోసం అనుకున్న అబ్బాయిని అడిగితే, ‘నేను చేయను’ అన్నాడు. దీంతో ఉదయ్‌కిరణ్‌ను పెట్టి తీద్దామనుకున్నాం. ఇంతలో అట్లూరి రామారావుగారు వచ్చి, ‘ఆ అబ్బాయితో నేను మాట్లాడతా’ అన్నారు. మళ్లీ ఉదయ్‌కిరణ్‌ను వెనక్కి పంపాం. అయితే, రెమ్యునరేషన్‌ విషయంలో కాస్త తేడా వచ్చింది. దాంతో మళ్లీ ఉదయ్‌కిరణ్‌ హీరోగా ముందుకు వచ్చాడు. 

‘చిత్రం’ అయిపోయిన తర్వాత నాకు వచ్చినంత పేరు ఉదయ్‌కు రాలేదు. రీమాసేన్‌కు వచ్చింది. ఆ తర్వాత తను ‘హోలీ’ చేశాడు. ‘నువ్వు-నేను’ సినిమాను మాధవన్‌తో చేద్దామనుకున్నాం. తను తెలుగు సినిమా చేయనన్నాడు. రెండు మూడుసార్లు అడిగా, ‘కుదరదంటే..కుదరదు’ అని చెప్పేశాడు. ఉదయ్‌కిరణ్‌ రోజూ నా దగ్గరికి వచ్చి కొంచెం సేపు కూర్చొని వెళ్లేవాడు. ఆ రోజు కూడా నా దగ్గరి వచ్చాడు. ‘మాధవన్‌ చేయనన్నాడు. నువ్వు చేసెయ్‌’ అని ఉదయ్‌తో చెప్పా. ‘సర్‌.. థాంక్యూ’ అన్నాడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎంఎస్‌ రాజుగారు ఒక హీరో కోసం చూస్తున్నారంటే.. ‘నువ్వు వెళ్లి కలువు’ అని ఉదయ్‌కు చెప్పా. ఆయన ‘ఫొటోలు తీసుకురాలేదా’ అన్నాడట. దీంతో నేను అప్పటికే తీసిన ‘గాజు వాక పిల్ల’ పాట చూపించా. వెంటనే ‘మనసంతా నువ్వే’లో తీసుకున్నారు. అలా మూడు వరుస హిట్‌లు వచ్చాయి.

‘నువ్వు-నేను’ షూటింగ్‌ సమయంలో ఒక సంఘటన జరిగింది. హీరోయిన్‌ ప్రేమిస్తోందని ఆమె అత్త తెలంగాణ శకుంతల గొడ్డలితో నరకడానికి వస్తుంది. అయితే, అదే సమయంలో హీరోయిన్‌ను ఎవరో ఒకరు లాగాలి. వేరే వాళ్లయితే సరిగ్గా లాగరేమోనని నేనే హీరోయిన్‌ కాళ్లు పట్టుకుని లాగేశా. 

ఉదయ్‌ కిరణ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మీకు వచ్చి చెప్పుకునేవాడా?
తేజ: నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలూ చెప్పుకొని బాధపడేవాడు. నేను అన్నీ వినేవాడిని. ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర ప్రామిస్‌ తీసుకున్నాడు. అందుకే అతను చెప్పిన విషయాలేవీ ఎవరికీ చెప్పను. అతనికి కాస్త రిలీఫ్‌గా ఉంటుందని ఆ సమయంలోనే ‘ఔనన్నా కాదన్నా’ చేశా. వాళ్ల ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది. చాలా డిప్రెషన్‌లో ఉండేవాడు. వాళ్లన్నయ్య కూడా అలాగే ఉండేవాడు. ఒకసారి ఆత్మహత్యాయత్నం చేస్తే, తిట్టి, ‘ఔనన్నా కాదన్నా’ చేశా. కానీ, ఆ తర్వాత ఉదయ్‌ మళ్లీ అలాంటి అఘాయిత్యానికే పాల్పడ్డాడు. 

‘తేజకు పొగరు ఎక్కువ’ అనేవాళ్లకు మీరిచ్చే సందేశం ఏంటి?
తేజ: ఏమీలేదు. నా గురించి అంతలా మాట్లాడుకుంటున్నారంటే చాలా ఖాళీగా ఉన్నారని అర్థం. నేను ఎవరి గురించి మాట్లాడను కదా! వాళ్ల వల్ల దేశానికి ఉపయోగం ఉండదు. మోదీగారు, జగన్‌గారు నా గురించి మాట్లాడితే ఏదో ఫీల్‌ అవ్వాలి. ఖాళీగా ఉండేవాళ్లు మాట్లాడితే ఎందుకు ఫీల్‌ అవ్వాలి.(నవ్వులు)

ఫుట్‌పాత్‌పై పేపర్లు కప్పుకొని పడుకునే పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారని విన్నాం నిజమేనా?
తేజ: అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత మమ్మల్ని బంధువులు పంచుకున్నారు. నేను మా చిన్నాన్న ఇంట్లో ఉండేవాడిని. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేశా. రోడ్ల మీద తిరుగుతూ దొరికిన పనిచేసుకుంటూ బతికేవాడిని. అప్పుడు దోమలు కుట్టకుండా ఒంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కావు. పేపర్‌ను చుట్టి, దాన్ని కప్పుకొనేవాడిని. గాలి ఆడటానికి దానికి రెండు రంధ్రాలు చేసుకుని పడుకొనేవాడిని. లైఫ్‌ అప్పుడే బాగుండేది. ఇప్పుడు చాలా ఒత్తిడిగా ఉంది. ‘డైరెక్టర్‌గా సినిమా తీయాలి. అది ఆడకపోతే అందరూ ఫీలవుతారు’ ఈ ఒత్తిడి ఏమీ ఉండేది కాదు. అప్పట్లో నాకున్న ఒకే లక్ష్యం దోమల నుంచి నన్ను నేను కాపాడుకోవడం. (నవ్వులు)

మీ ఇంట్లో కనీసం టీవీ కూడా ఉండదట!
తేజ: పిల్లలకు ఇమాజినేషన్‌ పెరగాలి. పుస్తకాలు చదివితేనే అది వస్తుంది. ఉదాహరణకు ‘రాజుగారు గుర్రం ఎక్కి వెళ్తున్నాడు’ అని చదివితే దాన్ని ఊహించుకుంటారు. అదే టీవీలో చూస్తే వాళ్లకు మరో ఆలోచన రాదు. ఎందుకంటే అక్కడే బొమ్మ కనపడుతోంది కదా! మా పిల్లల్ని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్తా.. టీవీని అలా.. చూస్తుంటారు. కానీ, వారానికి ఒకసారి తప్పకుండా కుటుంబంతో కలిసి సినిమాకు మాత్రం వెళ్తాం. 

ఒక సినిమాలో సీనియర్‌ ఆర్టిస్ట్‌ను పెట్టి, 70శాతం షూట్‌ చేసి తర్వాత తీసేశారట?
తేజ: నేను ఒకసారి ఏదో పెళ్లికి వెళ్లినప్పుడు ఆయన కలిశారు. ఆయనను పెట్టి ఓ సినిమా తీశాం. బాగా వస్తుందనుకున్నా. కానీ, సరిగా రాలేదు. దీంతో ఆయన రెమ్యునరేషన్‌ ఇచ్చేసి, ఆ స్థానంలో వేరే నటుడిని పెడదామనుకున్నాం. దీంతో ఆయన నాపై కేసు వేశాడు. రూ.50లక్షలు ఫైన్‌ కట్టాలని అన్నారు. నేను ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటే, మా వైఫ్‌ వచ్చి ‘ఏమైంది’ అని అడిగితే, ‘ఇలా ఫలనా నటుడిని పెట్టి తీశాను. రూ.50లక్షలు కట్టమంటున్నారు’ అని చెప్పా. ‘నీకు రూ.50లక్షలు కాదు. రూ.కోటి జరిమానా వేయాలి’ అని అంది. ‘ఎందుకు’ అంటే, ‘అతను సరిగా నటించడని ప్రపంచమంతా తెలుసు. నీకు ఇప్పుడే తెలిసిందా’ అని అంది. నేను ఆశ్చర్యపోయా. ఆ తర్వాత పెనాల్టీ కట్టి, నాకు నచ్చిన నటుడితోనే చేయించుకున్నా. 

సాధారణంగా ఎవరైనా రెండు మూడు స్వీట్లు తింటారు. కానీ, మీరు ఏకంగా కిలో స్వీట్లు లాగించేస్తారట!
తేజ: నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. భోజనం లేకపోయినా ఫర్వాలేదు. ఒకసారి సునీల్‌శెట్టి రసగుల్లాలు తెస్తే, మాట్లాడుతూనే తినడం మొదలు పెట్టా. ‘నువ్వు ఎన్ని తినగలవు’ అని అడిగారు. ‘తెచ్చినవన్నీ తినేయగలను’ అన్నా. ‘సరే ఇప్పుడు తిను చూద్దాం’ అంటే నేను కబుర్లు చెబుతూనే 72 తినేశా. మొత్తం వీడియో తీశారు.(నవ్వులు) అది నా రికార్డు.

మీకు ఫ్రెండ్స్‌ లేరా?
తేజ: సాధారణంగా ఒక ఇంట్లో, ఒకే రోడ్డులో ఉంటే అక్కడి వాళ్లు ఫ్రెండ్స్‌ అవుతారు. లేదా స్కూల్‌లో చదువుకుంటే ఫ్రెండ్స్‌ కావచ్చు. లేదా ఒకే చోట పనిచేస్తే కూడా స్నేహితులు కావచ్చు. నేను ఎక్కడా స్థిరంగా లేను కదా! నేనెప్పుడూ ఎవరినీ సాయం అడగలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా సాయం కోరను. 
మధ్యలో తేజ.. అలీని ప్రశ్ని్స్తూ.. సాధారణంగా మీ పేరు ‘అలీ’. ఈ కార్యక్రమానికి ‘ఆలీ’ అని రాశారు ఎంతవరకూ కరెక్ట్‌?
ఆలీ సమాధానం: అలీ అని పిలవడం.. రాయడం కరెక్ట్‌. హైదరాబాద్‌లో ‘అలీ’ అని పిలుస్తారు. ఆంధ్రాకు వెళ్లే సరికి ‘ఆలీ’ అని పిలుస్తారు. అలా మారిపోయింది. ‘సీతాకోక చిలుక’ చూసే మీరు సినిమాలో సుమన్‌శెట్టికి ఆలీబాబా అని పేరు పెట్టారని గతంలో మీరు చెప్పారు. చాలా సంతోషం. ఇక మీరు తీసిన ‘ధైర్యం’ హిందీలో డబ్‌ అయింది. అది చూసిన వాళ్లు ఇప్పటికీ ఆ పాత్ర గురించి నన్ను అడుగుతూ ఉంటారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.