close

తాజా వార్తలు

విరామమా? వీడ్కోలా? ధోనీనే అడగండి

ముంబయి: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ రనౌట్‌తో భారత్‌ కథ ముగిసింది. ప్రస్తుతానికైతే జట్టు సభ్యులందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎంఎస్‌ ధోనీ పరిస్థితే ఎవరికీ అర్థం కావడం లేదు. రిటైర్‌ అవుతాడా? ఇంకా ఆటలో కొనసాగుతాడా? ఐతే ఎంతకాలం?జట్టులో ఇప్పుడతని పాత్ర ఏంటీ?ఒక మార్గదర్శిగా కోహ్లీసేనలో 15వ ఆటగాడిగా ఉంటాడా?ఇలా ఎడతెగని చర్చ జరుగుతోంది. అసలింత సాగదీత ఎందుకు? భవిష్యత్తుపై తన ఉద్దేశమేంటో ధోనీనే అడిగితే సరిపోతుందిగా అంటున్నారు మాజీ చీఫ్‌ సెలక్టర్లు, ఆటగాళ్లు.



సెలక్టర్లకు ధైర్యం ఉండాలి

వెస్టిండీస్‌ పర్యటన కోసం శుక్రవారం బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ ఐదుగురు సెలక్టర్లకు కనీసం 50 వన్డేల అనుభవం లేదు. 350 వన్డేల అనుభవం ఉన్న ఎంఎస్‌ ధోనీని వారు ప్రశ్నించగలరా? ఎంపిక చేయకుండా ధైర్యం చేయగలరా? అన్నది సందేహమే. అందుకే సెలక్టర్లకు ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరమని అంటున్నారు మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌. ‘ఆటగాళ్ల ప్రదర్శనలను సమీక్షించి భవిష్యత్తుకు బాటలు వేయడమే సెలక్టర్ల పని. టెస్టు, వన్డే, టీ20 సమూహంలోకి ఏయే ఆటగాళ్లు వస్తారో కచ్చితంగా తెలుసుండాలి. వారి ఆటతీరు పరిశీలించి రిజర్వు బెంచి సామర్థ్యాన్ని గుర్తించి అవకాశాలు సృష్టించాలి. భవిష్యత్తు కోసం సలహాలు తీసుకోవడమూ అవసరమే’ అని వెంగీ అంటున్నారు. 2007 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ నుంచే టీమిండియా తిరిగొచ్చిన తర్వాత వెంగీ సెలక్షన్‌ బాధ్యతలు చేపట్టారు. స్వదేశంలో ప్రపంచకప్‌ గెలిచేవరకు కొనసాగారు.



ధోనీని అడిగేయండి

మరో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ కిరణ్‌మోరే ఇప్పటి నుంచే 2023 వన్డే ప్రపంచకప్‌ సన్నాహాలు మొదలవ్వాలని అంటున్నారు. ‘ప్రస్తుత జట్టు ప్రదర్శన ఎలా ఉందో కచ్చితంగా మీకు తెలుసు. వచ్చే రెండుమూడేళ్లలో వారు జట్టులో కొనసాగాతారా లేదా అంచనా వేయగలగాలి. బ్యాకప్‌ ఆటగాళ్లను సిద్ధం చేసి నిరూపించుకొనేందుకు వారికి చాలినన్ని అవకాశాలు ఇవ్వాలి. ఐతే ఆటగాళ్లలో అభద్రత భావం కలగకుండా జాగ్రత్తపడాలి. ఇక ధోనీ విషయానికి వస్తే అతడి ఉద్దేశం, ప్రణాళికలు ఏంటో అడిగి తెలుసుకోవాలి. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూనే మీ ఉద్దేశమేంటో స్పష్టంగా చెప్పాలి. ఏదేమైనప్పటికీ మాట్లాడటం అత్యంత కీలకం’ అని మోరె అన్నారు. ‘ఉంటే ధోనీ వికెట్‌కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టులో కొనసాగాలి. ఏ ఆటగాడూ ఆడకుండా జట్టులో ఉంటూ మార్గనిర్దేశకుడిగా ఉండలేడు. సెలక్టర్లు అతడి ప్రణాళికలు ఏంటో ప్రశ్నించాలి’ అని వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్ గంభీర్‌ అంటున్నారు. విండీస్‌ సిరీస్‌లో ధోనీ ఎంపికను బట్టి అతడి రిటైర్మెంట్‌ విషయంపై స్పష్టత రానుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.