close

తాజా వార్తలు

ఆ బాల నటులు ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లు!

చిచ్చరపిడుగై వచ్చి.. కోట్లాది హృదయాల్ని గెలిచి..

కప్పుడు తెరపై కనిపించి, ముద్దుముద్దు మాటలతో బాల నటిగా మురిపించిన వాళ్లు ఇప్పుడు హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలో తమదైన శైలిలో రాణిస్తున్నారు.  అలనాటి తార శ్రీదేవి నుంచి ఈనాటి సాయిపల్లవి వరకూ, చాలామంది బాల నటులుగా ప్రేక్షకులకు పరిచయమైన వారే. హన్సిక, నిత్యా మేనన్‌, కీర్తి సురేశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌, నివేదా థామస్‌.. ఇప్పుడు వీరంతా హీరోయిన్లుగా కోట్లాది హృదయాల్ని గెలుచుకున్నారు. వారి విశేషాలు ఓసారి చూద్దాం..

సాయి పల్లవి

‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసేశారు సాయి పల్లవి. ఈ అమ్మడు మలయాళ సినిమా ‘ప్రేమమ్‌’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ 14 ఏళ్ల కిందటే బాలనటిగా సాయిపల్లవి వెండితెరకు పరిచయం అయ్యారు. తమిళంలో ‘కస్తూరిమాన్’‌, ‘ధామ్‌ ధూమ్‌’లు ఆమె తొలి రెండు చిత్రాలు. 2008, 2009లో విజయ్‌ టీవీలో ప్రసారం అయిన ఉంగలిల్‌ యార్‌ అడుత్త ప్రభుదేవా, ఈటీవీ ఢీ4 డాన్స్‌ షో పోటీల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఆమె.. తిరిగి ‘ప్రేమమ్‌’ దర్శకుడి పిలుపుతో హీరోయిన్‌ అయ్యారు.

కీర్తి సురేష్‌

‘నేను శైలజ’ తో తెలుగు తెరకు పరిచయమై, ‘మహానటి’తో అందరితో శభాష్‌ అనిపించుకున్నారు కీర్తి సురేశ్‌. మలయాళ నిర్మాత సురేష్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తె అయిన కీర్తి 2000లో బాలనటిగా తెరంగేట్రం చేశారు. తండ్రి నిర్మాతగా వచ్చిన మలయాళ చిత్రం ‘పైలట్స్‌’ ఆమె తొలి సినిమా. దీంతోపాటు ‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ తదితర చిత్రాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా ఆరేళ్ల కిందట మలయాళంలో వచ్చిన ‘గీతాంజలి’.

నిత్యా మేనన్‌

నటన, చక్కటి గాత్రం, అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్‌ నిత్యా మేనన్‌ పదేళ్ల వయసులోనే బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 1998లో ఓ ఇండియన్‌ ఇంగ్లిష్‌ సినిమాలో టబు చిట్టిచెల్లి పాత్రను పోషించారు. 2008లో ‘ఆకాశ గోపురం’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. తెలుగులో మాత్రం ఆమె మొదటి సినిమా 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

నివేదా థామస్‌

‘జెంటిల్‌మెన్’‌, ‘నిన్నుకోరి’, ‘జై లవకుశ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా తన నటన, అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు నివేదా థామస్‌. ఈ భామ బాలనటిగానూ ఎంతో పేరుతెచ్చుకున్నారు. 2008లో వచ్చిన మలయాళ చిత్రం ‘వెరుతె ఒరు భార్య’ సినిమాకు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటి అవార్డుని సైతం అందుకున్నారు. నిజానికి నివేదా అయిదేళ్ల వయసు నుంచే టీవీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. సన్‌టీవీలో వచ్చిన ‘మై డియర్‌ భూతం’ సీరియల్‌ ఆమెకు గుర్తింపు తెచ్చింది. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్‌లో కమల్‌ హాసన్‌ కుమార్తెగానూ నివేదా నటించారు. ఇలా ఎన్నో సినిమాల్లో చిన్నా పెద్దా పాత్రలు చేసిన తర్వాత తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

హన్సిక

పదారేళ్లకే హీరోయిన్‌గా పరిచయమై, తొలి సినిమా ‘దేశముదురు’తో హిట్‌ కొట్టారు హన్సిక. ఈ ముద్దుగుమ్మ ‘షకలక బూమ్‌ బూమ్‌’ సీరియల్‌తో బుల్లితెర బాలనటిగా అరంగేట్రం చేశారు. తర్వాత ‘దేశ్‌ మే నిక్లా హోగా చాంద్’ సీరియల్‌కు ‘ఫేవరెట్‌ ఛైల్డ్‌ ఆర్టిస్టు’ అవార్డు అందుకున్నారు. హృతిక్‌ రోషన్‌, ప్రీతీ జింటా జంటగా నటించిన ‘కోయీ మిల్‌ గయా’ చిత్రంలో బాల నటిగానూ సందడి చేశారు.

అనూ ఇమ్మాన్యుయేల్‌

అమెరికాలో పుట్టి పెరిగిన అనూ ఇమ్మాన్యుయేల్‌.. భారత్‌లో చదివారు. ఈ సమయంలో తండ్రి తంగచ్చన్‌ నిర్మించిన మలయాళ చిత్రం ’స్వప్న సంచారి’లో బాలనటిగా చేశారు. తర్వాత చదువుకోసం  నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం మలయాళ చిత్రం ‘యాక్షన్‌ హీరో బిజు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగులో ‘మజ్ను’, ‘ఆక్సిజన్’‌, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చేకున్నారు.

ఆలియా భట్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఆలియా భట్‌ ఒకరు. ఈ మధ్య తెలుగులోనూ ఆమె హాట్‌ టాపిక్‌గా మారారు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ బ్యూటీ ఆరేళ్ల వయసులోనే సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అక్షయ్‌ కుమార్‌, ప్రీతీ జింటా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘సంఘర్ష్‌’లో చిన్నప్పటి ప్రీతీ జింటాగా కనిపించారు. తర్వాత 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో హీరోయిన్‌గా మారి, ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్‌గా ఉన్నారు.

శ్రీదివ్య

‘బస్టాప్‌’, ‘కేరింత’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీ దివ్య మూడేళ్ల వయసులోనే బాల నటిగా కెరీర్‌ ప్రారంభించారు. పలు తెలుగు సీరియల్స్‌లో కనిపించారు. 1999 తమిళ సినిమా ‘పో వాసమ్‌’ కోసం వెండితెరపై కనిపించారు. 2000లో వచ్చిన మహేశ్‌బాబు ‘యువరాజు’లో ఓ చిన్నారి పాత్రను పోషించారు. ఇప్పుడు ఈ భామ కోలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.

అవికా ఘోర్‌

సూపర్‌హిట్‌ సీరియల్‌ ‘బాలికా వధూ’తో అందరి మన్ననలు పొందారు అవికా ఘోర్‌. ఇందులో ఆమె చిన్నారి పెళ్లి కూతురుగా కనిపించారు. తర్వాత పలు టాలెంట్‌ షోలు పాల్గొన్నారు. 2009లో ‘మార్నింగ్‌ వాక్‌’ అనే సినిమాలో బాలనటిగా కనిపించారు. 2013లో రాజ్‌తరుణ్‌ ‘ఉయ్యాలా జంపాలా’తో  హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. తర్వాత పలు సినిమాలతో హిట్లు అందుకున్నారు.

 

ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.