close

తాజా వార్తలు

విరాట్‌ వద్దు.. రోహిత్‌ ముద్దు!

హిట్‌మ్యాన్‌కు సారథ్యం అప్పగించాలని అభిమానుల ట్వీట్లు

ముంబయి: వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియాను ఎంపిక చేశారు. ముందుగా అనుకున్నట్టే బీసీసీఐ సెలక్టర్లు యువకులకు పెద్దపీట వేశారు. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. అంతేకాకుండా నవదీప్‌ సైనీ, రాహుల్‌ చాహర్‌ వంటి కొత్తవారితో అరంగేట్రం చేయించనున్నారు. అయితే టెస్టు, వన్డే, టీ20 జట్లకు విరాట్‌ కోహ్లీనే సారథిగా ప్రకటించడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు బాది, ఐపీఎల్‌లో నాలుగు ట్రోఫీలు గెలిచిన రోహిత్‌ శర్మకు సారథ్యం ఎందుకు అప్పగించడం లేదని ట్విటర్‌లో ప్రశ్నిస్తున్నారు. ఇదేదో చినికి చినికి గాలివానగా మారేలా కనిపిస్తోంది. పైగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

కోహ్లీ సారథ్యంలో భారత్‌ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌ చేతిలో ఓడింది. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో కివీస్‌ చేతిలో పరాజయం పాలైంది. గెలిచే సత్తా ఉన్నప్పటికీ కోహ్లీ ఏం చేయలేకపోతున్నాడని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విరాట్‌ ఒక్కసారీ విజేతగా నిలపలేకపోవడం గమనార్హం.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ, రవిశాస్త్రి కలిసి అనవసర ప్రయోగాలతో జట్టు కూర్పును దెబ్బతీస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో అద్భుతంగా ఆడగలిగే, మిడిలార్డర్‌లో ద్రవిడ్‌లా ఆడగల అజింక్య రహానెకు వన్డేల్లో అవకాశమే ఇవ్వడం లేదని అంటున్నారు. విరాట్‌ ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినా ట్రోఫీలు గెలవడం లేదని ఆరోపిస్తున్నారు. సచిన్‌ తెందూల్కర్‌ ప్రపంచ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా సారథిగా విఫలమయ్యాడని ఉదాహరణగా చూపిస్తున్నారు. రోహిత్‌కు సారథ్యం అప్పగించాలని కోరుతున్నారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యుత్తమ సారథి రోహిత్‌ శర్మ. ముంబయి ఇండియన్స్‌ను నాలుగు సార్లు విజేగా నిలిపాడు. జట్టులో అందరినీ గౌరవిస్తాడు. కోచ్‌, మెంటార్‌ చెప్పిన పనిని చెప్పినట్టు చేస్తాడు. కీలక సమయాల్లో బౌలర్లను ఉపయోగించడంలో దిట్ట.

ఇవీ ట్వీట్లు

‘కోహ్లీని బీసీసీఐ సారథ్యం నుంచి తప్పించాలి. భారత్‌కు రోహిత్‌ సారథ్యమే అత్యుత్తమం’, ‘భారత్‌కు ఎవరు మంచి సారథో బీసీసీఐ గ్రహించాలి. సచిన్‌ మంచి బ్యాట్స్‌మన్‌. కానీ సారథిగా విజయవంతం కాలేదు. నాయకత్వం గురించి ఆలోచించండి. ఇది మన బాధ్యత. మన జట్టు కోసం ఒక మంచి సారథిని అందించండి’, ‘హహహ... నన్ను నమ్మండి. అతడు (విరాట్‌) తర్వాతి ప్రపంచకప్‌లోనూ ఓడిస్తాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌ శర్మ మనకున్న అత్యుత్తమ సారథి. ద్వైపాక్షిక సిరీస్‌లను పట్టించుకోకండి. కోహ్లీ మెగా టోర్నీలు గెలిపించలేడు’, ‘రోహిత్‌ను సారథి చేయండి. రవిశాస్త్రిని పంపించేయండి’, ‘అతడిని మళ్లీ సారథిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నేనిక క్రికెట్‌ చూడను’, ‘వన్డే సారథిగా మళ్లీ కోహ్లీనే ఎందుకు? సరైన ఎంపిక కాదు’ అని అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.