close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘‘నేను పట్టుబడితే మహా అయితే ఉరితీస్తారు. అది నాకు వరం. నాకు తల్లీ, తండ్రి, గురువు అన్నీ ఈ భరతమాతే. ఆ తల్లి రుణం తీర్చుకోడానికి ప్రాణాలు అర్పించడం అదృష్టంగా భావిస్తా. నా కోరిక ఒక్కటే, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు నేను మళ్లీ మళ్లీ ఈ గడ్డపైనే పుట్టి నా జీవితాన్ని త్యాగం చేయాలి’’ బ్రిటిష్‌ అధికారులను బాంబులతో భయపెట్టిన విప్లవవీరుడు ఖుదీరామ్‌ బోస్‌ అంతరంగమిది. తెల్లదొరలను తరిమికొట్టడమే ధ్యేయంగా పుస్తకాలను వదిలి పోరుబాట పట్టి అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు ఖుదీరామ్‌. 

చిన్ననాటి నుంచే విప్లవభావాలు..

ఖుదీరామ్‌ బోస్‌ భారత స్వాతంత్ర్య సమరవీరుల్లో తొలి తరానికి చెందిన అతి చిన్న వయస్కుడు. పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లాలో 1889 డిసెంబరు 3న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బోస్‌.. శ్రీ అరబిందో, సిస్టర్‌ నివేదిత ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొంది విప్లవమార్గం పట్టారు. ఆంగ్లేయుల నుంచి భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి ఆటలాడుకునే వయసులోనే పోరుబాటలోకి వచ్చారు.  1905లో బెంగాల్‌ విభజనతో బ్రిటిష్‌ ప్రభుత్వంపై మరింత కసి పెంచుకున్నారు. అలా 15ఏళ్ల వయసులో పుస్తకాలు వదిలిపెట్టి స్వతంత్ర్య పోరాటంలో చేరారు. వందేమాతరం గీతాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు కరపత్రాలను తయారుచేసి వాటిని స్వయంగా పంచారు. ఆ సమయంలో బ్రిటిష్‌ సైనికులు అడ్డగించగా వారిపై ఎదురుదాడి చేసి తెల్లదొరలకు వణుకు పుట్టించారు. 

బ్రిటిష్‌ పాలకులకు ప్రాణభయాన్ని రుచి చూపించి..

1907లో ఓ కేసు విచారణ సందర్భంగా కొందరు యువకులు కోర్టు ముందు నిల్చున్నారు. ఆ సమయంలో పోలీసులు వారిని లాఠీలతో కొట్టారు. దీంతో యువకుల్లో ఒకడైన సుశీల్‌ కుమార్‌ సేన్‌ పోలీసులకు ఎదురుతిరిగాడు. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన జడ్జి కింగ్స్‌ఫోర్డ్‌ అతడికి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. కింగ్స్‌ఫోర్డ్‌ క్రూరత్వానికి మారుపేరు. అతడిని అంతమొందించాలని స్వతంత్ర వీరులు నిర్ణయించుకున్నారు. 

ఇందుకోసం 1908 ఏప్రిల్‌లో జుగాంతర్ అనే విప్లవ సంస్థ కోల్‌కతాలోని ఓ ఇంట్లో రహస్యంగా సమావేశమైంది. ఆ సమావేశంలో అరవింద్‌ ఘోష్‌ లాంటి విప్లవకారులు ఉన్నారు. తొలుత కింగ్స్‌ఫోర్డ్‌ను చంపడానికి ఓ సారి ప్రణాళిక రచించగా అది విఫలమైంది. దీంతో ఆ తర్వాత ఆ పనిని ఖుదీరామ్‌ బోస్‌, ప్రఫుల్లా అనే మరో విప్లవకారుడికి అప్పగించారు. ఏప్రిల్‌ 29 రాత్రి బోస్‌, ప్రఫుల్లా తమ ప్రణాళికను అమలుపర్చారు. కింగ్స్‌ఫోర్డ్‌ కుటుంబం, బ్రిటిష్‌ బారిస్టర్‌ కెనడీ కుటుంబం ముజఫర్‌పూర్‌లోని ఓ క్లబ్‌ నుంచి తిరిగి వస్తుండగా బాంబులు విసిరి పారిపోయారు.

అయితే ఖుదీరామ్‌ గమనించని విషయం ఏంటంటే.. వారు బాంబులు విసిరిన వాహనంలో కింగ్స్‌ఫోర్డ్‌ లేరు. కెనడీ కుటుంబం ఉంది. ఈ ఘటనలో కెనడీ భార్య, కుమార్తె చనిపోయారు. ఈ దాడి గురించి తెల్లవారేసరికి ఊరంతా పాకింది. అప్రమత్తమైన పోలీసులు వీరికోసం గాలించారు. అలా ఆ మరుసటి రోజే ఓ రైల్వేస్టేషన్‌లో టీ తాగుతున్న ఖుదీరామ్‌ను పోలీసులు పట్టుకున్నారు. 


 

చివరి కోరిక ఏంటని అడిగితే..

ఇద్దరు మహిళల హత్యకు కారణమైన ఆరోపణలతో ఖుదీరామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ప్రాణభయంతో ప్రఫుల్లా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలియని ఖుదీరామ్‌ స్నేహితుడిని కాపాడేందుకు నేరాన్ని తన ఒక్కడిపైనే వేసుకున్నారు. ప్రఫుల్లా మృతదేహాన్ని చూడగానే తన అబద్ధం వృథా అయిందని చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఖుదీరామ్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే ఆయన వయసు దృష్ట్యా ఉరిశిక్ష వేయరని అంతా భావించారు. అయితే జడ్జీ మాత్రం ఖుదీరామ్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 

అది వినగానే ఆయన చిరునవ్వు నవ్వారు. దీంతో ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి.. ‘నేను వేసిన శిక్షకు అర్థమేంటో తెలుసా?’ అని అడిగారు. అప్పుడు ఖుదీరామ్‌.. ‘తెలుసు’ అన్నారు. నీ చివరి కోరిక ఏంటని ప్రశ్నించినప్పుడు.. ‘‘మీరు గనుక సమయం ఇస్తే ఇక్కడే నా భారతీయ సోదరులకు బాంబుల తయారీ నేర్పించాలని ఉంది’’ అన్నారు.  దీంతో ఆ న్యాయమూర్తి ఆగ్రహానికి గురై ఖుదీరామ్‌ను బయటకు తీసుకెళ్లండని పోలీసులకు చెప్పారట. 

18ఏళ్లకే ఉరికంభం.. 

న్యాయవిధానాల ప్రకారం.. ఖుదీరామ్‌కు హైకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం వచ్చినా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో 1908 ఆగస్టు 11న మరణశిక్షను అమలు చేశారు. పెదవులపై చిరునవ్వు, చేతిలో భగవద్గీతతో ఖుదీరామ్‌ ఉరికంభం ఎక్కారు. ఉరితీసేనాటికి ఆయన వయసు కేవలం 18ఏళ్ల 7 నెలల 11 రోజులు మాత్రమే. అత్యంత పిన్న వయసులోనే స్వతంత్ర్య పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన గురించి నేటి తరానికి తెలిసింది చాలా తక్కువ. ఆయన జ్ఞాపకార్థంగా ఖుదీరామ్‌ పట్టుబడిన రైల్వేస్టేషన్‌ను ఖుదీరామ్‌ బోస్‌ పూసా స్టేషన్‌గా మార్చారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.