close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నా జీవితంలో సాధించింది అదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: 10ఏళ్ల పాటు వెండితెరకు దూరమైనా ‘ఖైదీ నంబర్‌ 150’తో తన సత్తా ఏంటో చిత్రపరిశ్రమకు చూపారు ‘మెగాస్టార్‌’ చిరంజీవి. ప్రస్తుతం ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల జరుపుకొంటోంది. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ‘సైరా’ను అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బి పాజిటివ్‌’ మ్యాగజైన్‌ కోసం రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన చిరంజీవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. వారి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ మీరూ చదివేయండి.

మీరు చాలామందికి స్ఫూర్తి. అయితే, ఈ ఇంటర్వ్యూలో నా ప్రశ్నలన్నీ ఒక కోడలి హోదాలో అడుగుతా!
చిరంజీవి: తప్పకుండా. 

మీకు బాగా సంతృప్తిని ఇచ్చిన చిత్రం 1983లో వచ్చిన ‘ఖైదీ’యా లేక ఇటీవల మీరు నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’నా!
చిరంజీవి: నాకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో 1983లో వచ్చిన ‘ఖైదీ’ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే, ఆ చిత్రం నాకు స్టార్‌ స్టేటస్‌ ఇచ్చింది. అప్పటివరకూ నేను చేసింది కేవలం 15 చిత్రాలే. కానీ ‘ఖైదీ’ చిత్రంతో నాకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చింది. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు, నాలో ఉన్న టాలెంట్‌లన్నీ ప్రదర్శించడానికి ఆ చిత్రం ఓ వేదిక అయింది. ముఖ్యంగా డ్యాన్స్‌లు, ఫైట్స్‌లతో పాటు, సీరియస్‌గా నటించడానికి ఆస్కారం కల్పించింది. ఆ చిత్రంతో నన్ను నేను నిరూపించుకున్నా. ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఎవరైనా ‘మీ ఫేవరెట్‌ చిత్రం ఏది’ అంటే కచ్చితంగా ‘ఖైదీ’(1983) అనే చెబుతా. ఇక ‘ఖైదీ నంబర్‌ 150’ పేరుతో నా 150వ సినిమా చేయడం యాదృచ్చికంగా జరిగింది. 10 ఏళ్లు రాజకీయాల్లో విరామం లేకుండా గడిపా. అలాంటి సమయంలో చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో పెద్దగా తెలుసుకోలేదు. జనరేషన్‌ కూడా చాలా మారింది. నేను సినిమాల్లో తిరిగి నటించాలనుకున్నప్పుడు చాలా ఆలోచించా. మళ్లీ నన్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? ఆనాటి ఆదరణ ఉంటుందా? అని ప్రశ్నించుకున్నా. ఎందుకంటే పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు, చరణ్‌ ఇతర హీరోలు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కానీ, ‘ఖైదీ నంబర్‌ 150’ నాన్‌ ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే, చరణ్‌ ‘రంగస్థలం’ నా ‘ఖైదీ 150’ రికార్డులను కూడా దాటేసింది(నవ్వులు) నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాతో నాపై ప్రేక్షకులకు ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదని నిరూపితమైంది. రెండు ‘ఖైదీ’ చిత్రాలు నా అభిమాన చిత్రాలే! 


 

అప్పటికీ ఇప్పటికీ మీ ఫిట్‌నెస్‌లో విషయంలో ఏం మార్పులు గమనించారు? 
చిరంజీవి: నేను ఫిట్‌నెస్‌ను రెండు రకాలుగా చూస్తా. ఒకటి మెంటల్‌ ఫిట్‌నెస్‌. రెండోది ఫిజికల్‌ ఫిట్‌నెస్‌. అందంగా, ఆరోగ్యంగా కనపడాలంటే ఆహార నియమాలు, వ్యాయామం తప్పనిసరి. దాంతో పాటు మానసికంగా దృఢంగా కూడా ఉండాలి. అప్పట్లో నా చిత్రం ఆడియో విడుదల వేడుకకు నటి శ్రీదేవి వచ్చారు. ‘చాలా సంవత్సరాల నుంచి చిరంజీవిని చూస్తున్నా. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పూ లేదు. మీ ఆరోగ్య రహస్యం చెబుతారా’ అని అడిగింది. నేను ఒత్తిడిని అస్సలు తీసుకోను. ఏ విషయాన్ని అయినా చాలా కూల్‌గా ఆలోచిస్తా. అందుకే బాహ్యంగా కూడా నేను చాలా కూల్‌గా, ఒత్తిడి లేకుండా కనిపిస్తా. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తా. ఫలితం అనేది మన చేతుల్లో ఉండదు కదా! మన చేతుల్లో ఏమీ లేనప్పుడు ఎందుకు బాధపడాలి. అదే నా ఫిలాసఫీ. అందుకే నేను చెప్పేది ఒక్కటే. ఎవరైనా సరే, పని సక్రమంగా, నిబద్ధతతో చేయండి. ఫలితం అదే వస్తుంది. దీన్ని బలంగా నమ్ముతా. ఇక నేను సంతోషంగా ఉండటానికి నా మనవళ్లతో ఆడుకుంటూ ఉంటా. (నవ్వులు) పిల్లలతో ఆడుకుంటే అస్సలు ఒత్తిడి ఉండదు. 

‘సైరా’కు సంబంధించి కొన్ని సీన్లు చూసినప్పుడు నాకు ఆశ్చర్యమేసింది. గుర్రపు స్వారీ చేస్తూ దాంతో పాటు దూకుతూ కనిపించారు. మీరు ఇబ్బంది పడలేదా? 
చిరంజీవి: యాక్షన్‌ సన్నివేశాలు చేసేటప్పుడు నా వయసు గురించి మర్చిపోతా. అసలు ఆ స్టంట్‌ చేస్తానా? చేయలేనా? అని ఆలోచించను. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లిపోతా. ‘సైరా’లో కనిపించే గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు అన్నీ నేను సొంతంగా చేసినవే. అస్సలు డూప్‌లను పెట్టలేదు. భుజానికి గాయమైనా తిరిగి కోలుకున్న తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నా. ఇప్పుడు పెద్ద పెద్ద కత్తులను సైతం సులభంగా తిప్పగలను. ఆ ఫీలింగ్‌ అద్భుతం.

ఫిట్‌నెస్‌ విషయంలో మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారు?
చిరంజీవి: ఫలానా వ్యక్తి అని ఎవరూ లేరు. టాలీవుడ్, బాలీవుడ్‌, హాలీవుడ్‌ కేవలం చిత్ర పరిశ్రమలోనే కాదు, బయట వ్యక్తులు ఎవరైనా నా దృష్టిలో ఫిట్‌గా కనపడితే, ‘అతనిలా నేను కూడా మారాలి’ అనుకుంటా. ప్రతి ఒక్కరి నుంచి స్ఫూర్తి పొందుతా. ముఖ్యంగా అమితాబ్‌ బచ్చన్‌ను చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఆ వయసులో కూడా ఆయన సెట్స్‌లో ఉత్సాహంగా ఉంటారు. టి.సుబ్బరామిరెడ్డికి 77ఏళ్లు, మురళీమోహన్‌కు 80 ఏళ్లు, వాళ్లందరూ శరీరకంగా, మానసికంగా చాలా ఫిట్‌గా ఉంటారు. అలాంటి వాళ్లందరూ నాకు స్ఫూర్తే. 

మీకు ఇష్టమైన ఆహారం ఏంటి? ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారు?
చిరంజీవి: నేను డైట్‌ అస్సలు పాటించను. చిన్నప్పటి నుంచి ఏదైతే తింటున్నానో చాలా రోజులు అదే ఫాలో అయ్యా. కానీ, ఇప్పుడు వయసు రీత్యా తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటా. కానీ, ఒక విషయమైతే చెప్పగలను. నూటికి నూరుశాతం సమతుల్య ఆహారం మాత్రం తీసుకుంటా. ఈ వయసులో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ విషయంలో చరణ్‌ నాకు సలహాలు ఇస్తుంటాడు. ఒకప్పుడు చేపలు, రొయ్యలు ఇష్టంగా తినేవాడిని. ఇప్పుడు మాంసాహారం తినడం దాదాపు  తగ్గిపోయింది. శాకాహారం ఎక్కువగా తీసుకుంటున్నా. 

మీ జీవితంలో మీ తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంది?
చిరంజీవి: అలాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుడిని, అదే సమయంలో గర్వపడుతున్నా. కేవలం నా తండ్రి ప్రోత్సాహంతోనే నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చా. ఆయనకు నటించాలని ఎంతో ఆశ ఉండేది. ఆయన అద్భుతమైన నటుడు. ప్రజా నాట్యమండలి వేదికగా ఎన్నో నాటకాలు వేశారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలనుకున్నారు. కానీ, కుదరలేదు. స్నేహితుల సాయంతో ‘జగత్‌ కిలాడీలు’, ‘జగత్‌ జంత్రీలు’ చిత్రాల్లో  చిన్న చిన్న పాత్రలు పోషించారు. అప్పుడు నేను ఏడో.. ఎనిమిదో తరగతి చదువుతున్నా. షూటింగ్‌ నుంచి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు నాకు చెప్పేవారు. అవన్నీ వినడం వల్ల నేను నటుడిని కావాలన్న ఆశయం బహుశా అప్పటి నుంచే ప్రారంభమై ఉండవచ్చు. డిగ్రీ పూర్తయిన తర్వాత నటించాలని ఉందని నా తండ్రికి చెప్పా. ఆయన కూడా ‘సరే’ అన్నారు. ‘ఒకవేళ చిత్ర పరిశ్రమలో రాణించలేకపోతే ఏం చేస్తావు’ అని అడిగితే, నాకు రెండేళ్లు అవకాశం ఇవ్వమని కోరాను. అందుకు ఆయన ఒప్పుకొన్నారు. నాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించారు. అదృష్టవశాత్తూ, మొదటి రోజు నుంచే వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అలా 1978 సెప్టెంబరు 22న నా తొలి చిత్రం విడుదలైంది. అదే ఏడాది నేను నటించిన రెండో చిత్రం కూడా విడుదల కావడం విశేషం. అక్కడి నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. నా తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోతే, ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు. నా తల్లి తన 16వ ఏట నాకు జన్మనిచ్చింది. ఆ వయసులో ఆమెకు నేను చిన్న బొమ్మలాంటి వాడినే. ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేది. ఎక్కడికి వెళ్లినా, నన్ను తీసుకెళ్లేది. ‘మీ కొడుకుల్లో మీకు ఎవరంటే ఇష్టం’ అని ఆమెను అడిగితే ‘శంకర్‌బాబు’ అని చెబుతుంది. 

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న నిర్మాతల్లో చరణ్‌ చాలా చిన్నవాడు? రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సైరా’ తీస్తున్నాడు? మీ అంచనాలను చరణ్‌ అందుకున్నాడా? 
చిరంజీవి: చరణ్‌ తండ్రిని అయినందుకు నేను గర్వపడుతున్నా. ‘మీ జీవితంలో ఏం సాధించారు’ అని అడిగితే, ‘రామ్‌చరణ్‌’ పేరు చెబుతా. నా సినీ వారసత్వాన్ని మరోస్థాయికి తీసుకెళ్తాడని గట్టిగా నమ్ముతున్నా. 150 చిత్రాల నా కెరీర్‌లో  ‘మగధీర’, ‘రంగస్థలం’ సినిమాల్లో రామ్‌చరణ్‌ పోషించిన పాత్రలను నేను చేయలేకపోయా. ఇప్పటికి ‘సైరా’తో నా కోరిక తీరింది. ఇక ‘రంగస్థలం’లో చరణ్‌ చేసిన చిట్టిబాబు పాత్ర నాకు వస్తే, నేను రిస్క్‌ తీసుకునేవాడిని కాదు. నేను నటించనని చెప్పేవాడిని. కానీ, చరణ్‌ అద్భుతంగా నటించాడు. 

మీ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారని అంటారు? దీనిపై మీరు ఏమంటారు?
చిరంజీవి: కేవలం సినిమాలే కాదు, వ్యాపారం, ఇతర రంగాల్లోకి వాళ్ల కుటుంబం నుంచి ఎవరైనా వస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. ప్రజలు ఎలా తీసుకుంటారోనని భయాలు ఉంటాయి. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు నాపై ఎలాంటి అంచనాలూ లేవు. నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చా. ‘మెగాస్టార్‌’ కొడుకుగా చరణ్‌ సినిమాల్లోకి వస్తున్నాడంటే అందరిలోనూ భారీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ విషయంలో చరణ్‌ విజయం సాధించాడు. మొదటి సినిమాతో అలా వచ్చినా ‘మగధీర’ నుంచి తనేంటో తాను నిరూపించుకున్నాడు. ప్రేక్షకులను మెప్పించాడు. 

నేటి తరానికి ‘సైరా’ద్వారా ఏం చూపించబోతున్నారు? 
చిరంజీవి: ప్రస్తుతం నేటి యువతకు ‘సైరా’ లాంటి కథ అవసరం. మనం ఆస్వాదిస్తున్న ఈ స్వాతంత్ర్యం వెనుక ఎంతో మంది త్యాగం ఉంది. ఇప్పటివరకూ చరిత్ర పుస్తకాల్లో దాన్ని కేవలం చదువుకున్నారంతే. కానీ ఎవరూ దాన్ని ఫీల్‌కాలేదు. స్వాతంత్ర్య కోసం మనవాళ్లు ఏం చేశారో తెలియాల్సి ఉంది. ‘సైరా’ వాటన్నింటినీ మీ ముందుకు తీసుకువస్తుంది. స్వాతంత్ర్యం విలువ ఏంటో తెలుపుతుంది. బాలీవుడ్‌లో ఆమీర్‌ఖాన్‌ ‘మంగళ్‌పాండే’ చేశారు. ఇలాంటి సినిమాలు రావాలి. 

తల్లిగా, కోడలిగా, అత్తగా మీ భార్య నుంచి నేటి మహిళలు దేనిని స్ఫూర్తిగా తీసుకోవాలి?
చిరంజీవి: సురేఖలాంటి భార్య లభించడం నా అదృష్టం. అందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటుంది. కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతుంది. ఒకానొక సందర్భంలో మూడు షిఫ్ట్‌ల్లో నేను పనిచేసేవాడిని. కుటుంబాన్ని అస్సలు పట్టించుకునే సమయమే ఉండేది కాదు. అలాంటి సమయంలో సురేఖ ఆ బాధ్యతలు తీసుకుంది. నా తండ్రి సురేఖను ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేవారు కాదు. ‘అమ్మా.. అమ్మా..’ అనేవారు. నా సోదరులు కూడా తనని దేవుడు ఇచ్చిన తల్లిగా భావించేవారు. నా సినిమాల్లో ఏదైనా నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ప్రేమగా, ఆప్యాయంగా చూడటంలో ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవచ్చు. 

మీరు ఎందుకు ‘ఐ’, ‘బ్లడ్‌ బ్యాంక్‌’ను ప్రారంభించారు? 
చిరంజీవి: 23ఏళ్ల కిందట ఒక రోజు నేను పేపర్‌ చదువుతుంటే, రక్తం లేక చాలా మంది చనిపోతున్నారన్న వార్త కనిపించింది. ఇంతమంది జనం ఉండి కూడా రక్తం ఇచ్చేందుకు ఎవరూ రావడం లేదనిపించింది. అందుకే ఎంతోమంది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నేను ‘బ్లడ్‌బ్యాంక్‌’ ప్రారంభించాలని అనుకున్నా. ఆ మరుసటి రోజు నుంచే ఆ దిశగా ప్రయత్నాలు చేశా. నా అభిమానులను ఆ దిశగా నడిపా. చాలా మందిలో చైతన్యం వచ్చింది. గత పదేళ్లలో రక్తం అందక చనిపోయిన ఖాతాలు దాదాపు లేవు. దీనికి సంబంధించి ఎవరి దగ్గరి నుంచీ నేను విరాళాలు సేకరించలేదు. నా సొంత డబ్బులతోనే వీటిని నిర్వహిస్తున్నా. ఇప్పటివరకూ నేను సాధించినదంతా నా అభిమానులకే చెందుతుంది. వాళ్లు ముందుకు రాకపోతే, అది కార్యరూపం దాల్చేది కాదు. ఫ్యాన్స్‌ అన్నపదానికి సరికొత్త అర్థం చెప్పారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.