close

తాజా వార్తలు

పల్లవుల నగరంలో స్నేహానికి కొత్త పల్లవి

రేపు, ఎల్లుండి మామల్లాపురంలో మోదీ జిన్‌పింగ్‌ల భేటీ

అగ్రనేతల వ్యక్తిగత స్నేహం పొరుగు దేశాల మధ్య సంబంధాలను సుధృడ పరిచేందుకు దోహదకారిగా మారుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల మధ్య లాంఛనాలకు అతీతంగా రెండో శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. మహాబలిపురం (మామల్లాపురం)లో వెయ్యేళ్ల క్రితం పల్లవ రాజులు నిర్మించిన దేవాలయాలు వారి సమావేశానికి వేదికలవుతున్నాయి.
దిల్లీ, బీజింగ్‌/ఈటీవీ భారత్‌ యంత్రాంగం/ న్యూస్‌టుడే-మహాబలిపురం: సముద్ర తీర నగరమైన చెన్నై సమీపంలోని మామల్లాపురంలో శుక్ర, శనివారాల్లో మోదీ-జిన్‌పింగ్‌ల సదస్సు జరుగుతుందని బుధవారం ఇరుదేశాల విదేశీ వ్యవహారాల శాఖలు అధికారికంగా ప్రకటించాయి. 2017లో చైనా సరిహద్దులోని డోక్లాం వద్ద రెండు దేశాల  సైనికుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న అనంతరం ఉద్రిక్తతలను తొలగించడానికి గత ఏడాది ఏప్రిల్‌లో చైనాలోని వూహన్‌లో తొలిసారి లాంఛనాలు లేని శిఖరాగ్ర సదస్సు జరిగింది. దానికి కొనసాగింపుగా రెండోది ప్రస్తుతం భారత్‌లో జరగనుంది.

అధికారిక ప్రకటన ఆలస్యం
జిన్‌పింగ్‌ రాకపై చైనా ఆలస్యంగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పర్యటన ప్రారంభం కావడానికి దాదాపుగా 50 గంటల ముందుగా మాత్రమే అధికారిక ప్రకటన వెలువరించింది. అధికారిక ప్రకటన ఆలస్యం కావడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అంత సవ్యంగా లేవేమోన్న అనుమానాలు కూడా ఒక దశలో వ్యక్తమయ్యాయి.  జమ్మూ-కశ్మీర్‌పై ఇటీవల భారత్‌ తీసుకున్న నిర్ణయాల కారణంగా జిన్‌పింగ్‌ పర్యటన ఉండదేమో అన్న చర్చ కూడా జరిగింది. లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడాన్ని చైనా తప్పుపడుతోంది. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ జిన్‌పింగ్‌ పర్యటనపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది.

దాదాపుగా అదే సమయంలోనే భారత్‌ విదేశీ వ్యవహారాల శాఖ కూడా శిఖరాగ్ర సదస్సుపై ప్రకటన వెలువరించింది. సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ శాంతిని నెలకొల్పడం, ఉగ్రవాదం అదుపు, వాణిజ్యం పెంపు తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని వివరించింది. జమ్మూ-కశ్మీర్‌ వ్యవహారం ఈ చర్చల్లో ప్రస్తావనకు రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ జిన్‌పింగ్‌ కోరితే దీనిపై ప్రధాని మోదీ అన్ని విషయాలనూ వివరిస్తారని పేర్కొంది. ఈ భేటీలో అధికారికంగా ఎటువంటి ఒప్పందాలూ ఉండకపోవచ్చు.

కశ్మీర్‌ సమస్యను గమనిస్తున్నా: జిన్‌పింగ్‌
ఒకవైపు ఈ సదస్సు నిర్వహణకు అన్నీ సిద్ధంకాగా, మరోవైపు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉండడం విశేషం. బీజింగ్‌లో ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయిన జిన్‌పింగ్‌ తాను కశ్మీర్‌ సమస్యను గమనిస్తున్నానని చెప్పడం గమనార్హం. పాక్‌తో తమ స్నేహం తెగిపోనిదని, శిలలా గట్టిగా ఉండేదని జిన్‌పింగ్‌ అభివర్ణించారు. అన్ని కీలక అంశాల్లో ఆ దేశానికి అండగా ఉంటామని ప్రకటించారు. కశ్మీర్‌ సమస్యను భారత్‌-పాక్‌లు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పందిస్తూ కశ్మీర్‌పై భారత్‌ వైఖరి ఏమిటో చైనాకు బాగా తెలుసని అన్నారు. ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోలేదని చెప్పారు.

సాదర స్వాగతం పలుకుతాం: పళనిస్వామి
మోదీ, జిన్‌పింగ్‌లకు సాదరస్వాగతం పలుకుతామని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నైలో చెప్పారు. 1956లో మామల్లాపురానికి  సమీపంలోని కుళిప్పందళానికి అప్పటి చైనా అధ్యక్షుడు చౌ ఎన్‌లై వచ్చారని గుర్తు చేశారు.

సదస్సు వివరాలు
శుక్రవారం మధ్యాహ్నం జిన్‌పింగ్‌ చెన్నై చేరుకుంటారు. ఆయనను ప్రధాని మోదీ మామల్లాపురం తీసుకెళ్తారు. అక్కడి ‘సముద్ర తీర మందిరాల సముదాయం’ (సీ షోర్‌ టెంపుల్‌)లో సమావేశమవుతారు. అక్కడ ఉన్న వెయ్యేళ్లనాటి చారిత్రక కట్టడాలను సందర్శిస్తారు. అనంతరం జిన్‌పింగ్‌ గౌరవార్థం మోదీ విందు ఇవ్వనున్నారు.
శనివారం ఇరువురు నేతలు ముఖాముఖిగా, అనంతరం అధికారిక బృందాలతో కలిసి చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి చెన్నై చేరుకుంటారు. జిన్‌పింగ్‌ అక్కడ నుంచి నేపాల్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

బస ఎక్కడ?
మోదీ, జిన్‌పింగ్‌లు కోవలంలోని ఐదు నక్షత్రాల హోటల్‌ తాజ్‌ ఫిషర్‌మెన్‌లో బస చేయనున్నారు. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురానికి వేర్వేరు వాహనాల్లో వెళ్తారు. సెమ్మంజేరి, వడ నెమ్మేలి, పట్టిపుల్లంలో రహదారికి ఇరువైపులా జనం నిలబడి వారికి స్వాగతం పలకనున్నారు.

జాలర్లతో ముచ్చట్లు
ఇరువురు నేతలు జాలర్లు, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకిస్తారు.

చేపల వేట నిషేధం
సదస్సు దృష్ట్యా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి 13వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. జాలర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. మంగళవారం నుంచే పర్యాటకుల రాకనూ నిలిపివేశారు. ఇరు దేశాల ఉన్నతాధికారులు సంయుక్తంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయం కోసం పది మంది ఐఏఎస్‌ అధికారులు సహా, 34 మంది ప్రత్యేక అధికారులను నియమించింది.

ఆకర్షించే పాశుపతాస్త్ర శిల్పం

మామల్లాపురంలోని శిల్పాలన్నింటిలోనూ పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం పొందే ఘట్టం అద్భుతంగా ఉంటుంది. దేవగణంతో కదిలివచ్చిన శివుడు అడవిలో తపస్సు చేస్తున్న అర్జునుడికి దీన్ని ప్రదానం చేస్తున్న ఘట్టాన్ని వర్ణిస్తూ వందకుపైగా దేవతలు, మనుషులు, వృక్షాల విగ్రహాలను దీంట్లో సుందరంగా చెక్కారు. వసంత రుతువులో పౌర్ణమి నాడు శివుడు ఈ అస్త్రాన్ని అనుగహ్రించాడన్న అర్థం వచ్చేలా వీటిని తీర్చిదిద్దారు. రాత్రి సమయంలో ఈ శిల్పంతో పాటు, వెన్నముద్ద, ఐదు రథాలు ఇతర విగ్రహాలను ఇద్దరు నేతలు సందర్శించనున్నారు.

చైనాతో 2000 ఏళ్ల బంధం

చైనాతో మామల్లాపురానికి ఉన్న బంధం రెండు వేల ఏళ్ల నాటిదనడానికి చారిత్రక అధారాలు ఉన్నాయి. పల్లవుల కాలంలో అప్పటి చైనా రాజు ‘వి’  ఆ దేశ వర్తకులను కడల్‌ మల్లై (మహాబలిపురం)కు పంపించారు. పల్లవ రాజు అనుమతితో చైనా రాజు నాగపట్నం ఓడరేవులో బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పారు.

 

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.