close

తాజా వార్తలు

ఇద్దరు కార్మికుల ఆత్మార్పణం

డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో శ్రీనివాసరెడ్డి కన్నుమూత
హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ ఉరేసుకుని బలవన్మరణం
నర్సంపేటలో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మరో డ్రైవర్‌
భారీ బందోబస్తు మధ్య ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అంతిమయాత్ర
ఉద్ధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె
రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు, నిరసనలు
ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే: విపక్షం, ఆర్టీసీ ఐకాస
రెచ్చగొట్టిన వారే బాధ్యులు: మంత్రులు
డ్రైవర్‌ మృతికి సంతాపం
సమ్మెకు పలు రెవెన్యూ సంఘాల మద్దతు

ఖమ్మంలో ఒక డ్రైవర్‌ ఆత్మార్పణం.. హైదరాబాద్‌లో ఒక కండక్టర్‌ బలవన్మరణం..  నర్సంపేటలో మరో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం..  ఆర్టీసీ సమ్మెలో ఆవేదనా భరిత ఘట్టాలివి.  వాతావరణం గంభీరంగా మారిన పరిస్థితుల్లోనూ పట్టుదలలు కొనసాగుతున్నాయి.

శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కార్మికులు ఈ ఆవేదనలో ఉన్న సమయంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నర్సంపేటలో ఒక డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను నిలువరించారు. మరోవైపు తాత్కాలిక నియామకాల కోసం ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదివారం ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉద్ధృతం చేశారు. వంటావార్పు కార్యక్రమాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మరణంతో ఖమ్మం రీజియన్‌లో ఒక్క బస్సూ తిరగలేదు. సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాము కూడా జీతాలు తీసుకోవద్దని నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్లలోని ఆర్టీసీ అధికారులు, భద్రత సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయంపై ఆర్టీసీ ఐకాస హర్షం వ్యక్తం చేసింది. తమకు గొప్ప మద్దతు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపింది. సమ్మెకు పలు రెవెన్యూ సంఘాలూ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆదివారం ఏపీఎస్‌ ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. సమ్మె రాజకీయ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఆరోపించింది.

కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మృతికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లు సంతాపం తెలిపారు. అయితే కార్మిక సంఘాల నేతలే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. రెచ్చగొట్టిన వారే బాధ్యత వహించాలని మంత్రి దయాకర్‌రావు అనగా, కార్మికుల జీవితాలతో విపక్షాలు చెలగాటమాడుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు.


శ్రీనివాసరెడ్డి కన్నుమూత
ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత: అరెస్టులు
కంచన్‌బాగ్‌, న్యూస్‌టుడే

ఖమ్మంలో శనివారం కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. 90 శాతం మేర కాలిన గాయాలతో ఉన్న ఆయనను హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో డాక్టర్‌ జగదీష్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో చికిత్స పొందుతూ ఉదయం 10:45 గంటలకు కన్నుమూశారు. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యుడిని రప్పించి మధ్యాహ్నం ఒంటిగంటకు ఆసుపత్రిలోనే శవపరీక్ష చేయించి పోలీసు వాహనాల మధ్య అంబులెన్స్‌లో ఖమ్మంకు తరలించారు. 

కార్మికులు, ప్రజా సంఘాల తీవ్ర ఆగ్రహం
శ్రీనివాసరెడ్డి మరణించిన విషయాన్ని సీపీఐ అగ్రనేత నారాయణ ఆసుపత్రి బయట వెల్లడించారు. వెనువెంటనే ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు దశలవారీగా అరెస్టులు చేశారు. సుమారు వంద మందిని గోషామహల్‌ ఠాణా, మైలార్‌దేవులపల్లి ఠాణాలకు తరలించామని పోలీసులు తెలిపారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు.శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతున్న సమయంలో నేతలు నారాయణ, తమ్మినేని వీరభద్రం, కోదండరాం, వి.హన్మంతరావు తదితరులు పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి అసువులు బాసిన అనంతరం రేవంత్‌రెడ్డి, లక్ష్మణ్‌, వివేక్‌, మోత్కుపల్లి తదితరులు ఆయన కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు.

శ్రీనివాసరెడ్డిది ప్రభుత్వ హత్యే: విపక్షాలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు ఆర్టీసీ నిరవధిక సమ్మెపై అసంబద్ధంగా, పొంతనలేని ప్రకటనలు గుప్పిస్తుండటంతోనే ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని పలువురు రాజకీయ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని కొందరు మంత్రులు, నాయకులు కవ్వింపు చర్యలకు పూనుకొంటూ అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ నేతలు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లు బయటికి వచ్చి టీఎస్‌ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలవాలని కోరారు. కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రి వద్ద ఆదివారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు, మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణమాదిగ, టీఎస్‌ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.

సమ్మె అణచివేతకు ప్రయత్నం

సకల జనుల సమ్మె కొనసాగిన తరహాలో చేపట్టిన ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేస్తూ కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారు.  టీఎస్‌ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.
- కోదండరాం

 

రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ప్రకటించాలి.  శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య లేఖను మరణ వాంగ్మూలంగా భావించి తెలంగాణ ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి. 

- రేవంత్‌రెడ్డి

శ్రీనివాసరెడ్డి మరణానికి కేసీఆర్‌ నైతిక బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలి. నియంత పాలనను తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

- మోత్కుపల్లి నర్సింహులు

‘బతికుంటే.. వస్తాను’
శ్రీనివాసరెడ్డి చివరిమాటలు

‘బతికుంటే.. వస్తాను’  ఆదివారం కన్నుమూసిన ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి ఆఖరి మాటలివి. శనివారం ఖమ్మం బస్టాండు వద్ద ఆయన సమ్మెలో పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్న కొందరు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్తూ మళ్లీ ఎన్ని గంటలకు వస్తారు? అని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించగా ‘బతికుంటే.. వస్తాను’ అంటూ వెళ్లిపోయారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఏడాదిలో పదవీ విరమణ
శ్రీనివాసరెడ్డిది స్నేహపూర్వక స్వభావం. తనతోపాటు ఇతరులూ బాగుండాలని కోరుకొనే మనస్తత్వం. 1991లో ఆర్టీసీ డ్రైవర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన 28 ఏళ్లపాటు సంస్థకు సేవలందించారు. మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న శ్రీనివాసరెడ్డికి ఇతరత్రా ఏ ఇబ్బందులు లేవు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ కఠిన వైఖరితో ఆయన తీవ్రంగా కలత చెందారు. తోటి కార్మికుల పరిస్థితి తన కళ్లెదుట కదలాడి ఆత్మహత్యాయత్నానికి పురిగొల్పింది. శ్రీనివాసరెడ్డికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయి అభిరామ్‌రెడ్డి  ఆర్మీలో, చిన్న కుమారుడు కార్తీక్‌రెడ్డి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రాపర్తినగర్‌లో ఉండే శ్రీనివాసరెడ్డి ఇరుగుపొరుగుతో, తోటిఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలిగేవాడన్న పేరుంది. తొలుత నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌లో ఉన్న శ్రీనివాసరెడ్డి తర్వాత తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌లో చేరారు.

భారీ బందోబస్తు మధ్య అంతిమయాత్ర
శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని చూసి ఖమ్మం కన్నీరుమున్నీరయింది. ఖమ్మం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ వద్దకు రాత్రి ఏడుగంటల ప్రాంతంలో అంబులెన్స్‌ రాగానే సీపీఎం, సీపీఐ, న్యూడెమొక్రసీ, ఆర్టీసీ ఐకాస నాయకులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య రాత్రి 9 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర బైపాస్‌ రోడ్డు ఎక్కగానే పోలీసులు కాల్వొడ్డు హిందూ శ్మశాన వాటికకు తరలించేందుకు ప్రయత్నించగా కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకొన్నారు. ఆర్టీసీ బస్‌ డిపో మీదుగా ఈ యాత్ర సాగాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారితో గంటపాటు చర్చలు జరిపారు. ఎట్టకేలకు యాత్ర బస్‌డిపో మీదుగా శ్మశానవాటిక వద్దకు సాగింది. రాత్రి 11 గంటల తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతిమయాత్రలో ఆర్టీసీ ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి, మంద కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీనివాసరెడ్డి భౌతికకాయానికి ఎంపీ బండి సంజయ్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, నాయకులు పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, ఆర్టీసీ ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి నివాళులర్పించారు.

- ఈనాడు, ఖమ్మం

శ్రీనివాసరెడ్డి మృతికి మంత్రుల సంతాపం
ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి మృతికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లు సంతాపం తెలిపారు.  సమ్మె కారణంగా కార్మికుడి మరణం బాధాకరమని, ఈ పరిస్థితికి కార్మిక సంఘాల నేతలే కారణమన్నారు. ‘‘కార్మికులు, సంస్థ సమస్యలపై ప్రభుత్వం కమిటీని వేసి నివేదిక వచ్చాక పరిష్కరిస్తామని చెప్పినా సంఘాల నేతలు పట్టించుకోలేదు. సమ్మె వైపే మొగ్గు చూపారు.  ప్రతిపక్షాల చేతిలో కార్మిక సంఘాలు కీలుబొమ్మలుగా మారడం దురదృష్టకరం’’ అని మంత్రులు అన్నారు.

 

ఆవేదనకు గురిచేసింది 
ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి మృతి వార్త తీవ్ర ఆవేదనకు గురి చేసింది.  ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్చల ద్వారా సానుకూల దృక్పథంతో సమస్యను పరిష్కరించాలి. 
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
డ్రైవర్‌ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత
ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సమస్యలను పరిష్కరించకుండా మంత్రుల చేత సమ్మెను తక్కువ చేసి మాట్లాడించడం సరికాదు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి. 
- తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ 
ఆత్మబలిదానం కలచివేసింది 
డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మబలిదానం కలచివేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ‘ఆర్టీసీ కార్మికులు ఏడ మంచిగా ఉన్నారు’ అని దుఃఖించడం ఆయన ఎంత మనోవేదనతో ఉన్నారో వెల్లడిస్తుంది. కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 

నర్సంపేటలో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్‌ బత్తిని రవి ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు తెజస అధ్యక్షుడు కోదండరాం నర్సంపేటకు వస్తుండడంతో సాయంత్రం కార్మికులంతా డిపోలో ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో రవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకున్నారు. తోటి కార్మికులు, పోలీసులు గమనించి నిప్పంటించుకోకుండా నిలువరించారు. అనంతరం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు.

 

 

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.