close

తాజా వార్తలు

పానీపూరీ అమ్మినోడు..

ఈనాడు క్రీడావిభాగం

 

ఉత్తరప్రదేశ్‌లోని భాడోహికి చెందిన పేద కుటుంబం నుంచి వచ్చాడు యశస్వి. ఊహ తెలిసే సమయానికి అతడికి క్రికెట్‌ పిచ్చి పట్టేసింది. వయసు పెరిగే కొద్దీ అదింకా పెరిగింది. కానీ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే స్థోమత అతడికి లేదు. దీంతో ఎదిగే వయసులో ఆట కోసమే ఊరు విడిచిపెట్టి ముంబయికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి పోషణ భారంగా మారడంతో యశస్వి తండ్రి కూడా అతడికి అడ్డు చెప్పలేదు. ముంబయి చేరుకున్న తర్వాత ఓ డైరీలో పనికి కుదిరి స్థానికంగా క్రికెట్‌ ఆడడం మొదలెట్టాడు. అయితే క్రికెట్‌ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పని సరిగా చేయడం లేదని అతణ్ని తప్పించారు. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో కూడా యశస్వి ఊరికెళ్లిపోలేదు. అతడి బంధువొకరు కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నప్పటికీ, అది కూడా ఇరుకైందే కావడంవతో.. తర్వాత ఆజాద్‌ మైదానంలోని ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌కు చెందిన గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు. మూడేళ్ల పాటు యశస్వి అక్కడే ఉన్నాడు. అందులో కరెంటుండేది కాదు. మూత్రశాలా లేదు. అయినా అందులోనే సర్దుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్‌ ఆడటం.. సాయంత్రం పూట పానీపూరీ అమ్మడం, మరికొన్ని పనులు చేయడం ద్వారా జీవనం సాగించాడు. డబ్బులు సరిపోక కొన్ని కడుపు నిండకపోయినా ఓర్చుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం యశస్వి విడిచిపెట్టలేదు. అతడి ప్రతిభ గుర్తించి స్థానిక ఆటగాళ్లు, కోచ్‌లు ప్రోత్సహించారు.

యశస్వి నేపథ్యం గురించి తెలిస్తే అతను ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడం అద్భుతం లాగే అనిపిస్తుంది. ఒకప్పుడు అతను కడుపు నిండా తినడానికి తిండి లేదు. ఉండటానికి గూడు లేక ఏ వసతీ లేని గుడారాల్లో నివసించాడు. తల్లిదండ్రుల అండ లేకుండానే ఓవైపు క్రికెట్‌ సాధన సాగిస్తూ.. ఇంకోవైపు ఖర్చుల కోసం పానీ పూరీలు అమ్మాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.

అదే మలుపు..

యశస్వి గురించి జ్వాలా సింగ్‌ అనే కోచ్‌కు తెలియడం అతడి కెరీర్‌కు మలుపు. ఎ-డివిజన్‌ ఆటగాళ్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్న యశస్వి ప్రతిభను మెచ్చి అతడికి జ్వాలా సింగ్‌ శిక్షణ ఇచ్చాడు. త్వరగానే ముంబయి అండర్‌-19 జట్టుకు ఎంపికైన యశస్వి.. గత ఏడాది అతను శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. మూడో వన్డేలో చక్కటి శతకం (114) బాది భారత్‌కు సిరీస్‌ అందించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలతో అండర్‌-19 జట్టు ముక్కోణపు సిరీస్‌ గెలవడంలో యశస్విది ముఖ్య పాత్ర. యశస్వి ఉపయుక్తమైన స్పిన్నర్‌ కూడా. ప్రతి మ్యాచ్‌లోనూ అతను బౌలింగ్‌ చేస్తాడు. విశాఖపట్నంలో జరిగిన విజ్జీ వన్డే ట్రోఫీలో 224 పరుగులు, 8 వికెట్లతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలవడం విశేషం. యశస్వి ముంబయి తరఫున రంజీల్లోనూ అరంగేట్రం చేశాడు.

జాఫర్‌ను చూసి..

యశస్వి సత్తా చాటుతున్నా శుభారంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేని బలహీనత ఉండేది. ముంబయి దిగ్గజం వసీమ్‌ జాఫర్‌ను చూసి ఈ బలహీనతను అతను అధిగమించాడు. ‘‘70, 80 స్కోర్లు చేస్తున్న నేను సెంచరీలు కొట్టలేకపోవడం నిరాశ కలిగించింది. అలాంటి సమయంలో విదర్భతో మ్యాచ్‌లో జాఫర్‌ బ్యాటింగ్‌ను సునిశితంగా గమనించాను. కేవలం జాఫర్‌ ఆట చూసే సుదీర్ఘ సమయం క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకున్నా. ఇప్పుడు భారీ స్కోర్లు చేస్తున్నా’’ అని యశస్వి చెప్పాడు.

తలుపు తడతాడా?

టీనేజీలోనే దేశవాళీ క్రికెట్లో సంచలన ప్రదర్శన చేసి టీమ్‌ఇండియా తలుపులు తట్టిన ముంబయి ఆటగాళ్లు సచిన్‌, కాంబ్లి, పృథ్వీ షాల సరసన యశస్వి చేరుతాడన్నది అక్కడి క్రికెట్‌ పండితుల అంచనా. యశస్వి బ్యాటింగ్‌ శైలి, అతడి నైపుణ్యం, నిలకడ చూసి కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే సత్తా ఉన్నవాడిగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఊపును కొనసాగిస్తే.. టీమ్‌ఇండియాకు ఆడాలన్న కలను యశస్వి నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.