close

తాజా వార్తలు

ఆపద్బాంధవ రోహిత్‌

అజేయ సెంచరీతో ఆదుకున్న ఓపెనర్‌
భారత్‌ 39/3 నుంచి 224/3కు
రాణించిన రహానె
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు

39 పరుగులకే 3 వికెట్లు.. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి గంటలో ఎదురైన సంకట స్థితి ఇది! ఓవైపు తక్కువ స్కోరుకే కీలక వికెట్లు పడిపోయాయి.. మరోవైపు రబాడ, ఎంగిడి నిప్పులు చెరుగుతున్నారు.. ఇలాంటి స్థితిలో ఓపెనర్‌ రోహిత్‌శర్మ (117 బ్యాటింగ్‌; 164 బంతుల్లో; 14×4, 4×6) ఆపద్బాంధవుడయ్యాడు.. కాసేపు స్ట్రోక్‌ ప్లేని పక్కనపెట్టి.. వికెట్ల పతనానికి అడ్డుగా నిలిచాడు. ఆ తర్వాత గేరు మార్చి అద్భుత సెంచరీతో జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. అతడితో పాటు అజింక్య రహానె (83 బ్యాటింగ్‌; 135 బంతుల్లో 11×4, 1×6) విలువైన ఇన్నింగ్స్‌ ఆడటంతో తొలి రోజు ఆటలో భారత్‌దే పైచేయి అయింది.

రాంచి

టెస్టుల్లో ఓపెనర్‌ అవతారమెత్తాక రెచ్చిపోయి ఆడేస్తున్న రోహిత్‌శర్మ నుంచి మరో ముచ్చటైన ఇన్నింగ్స్‌! 50 పరుగుల లోపే కెప్టెన్‌తో సహా మూడు వికెట్లు పడిపోయి స్థితిలో పట్టుదలతో క్రీజులో నిలిచిన రోహిత్‌.. సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టులో భారత ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. ఒక దశలో 39/3తో కష్టాల్లో పడ్డ భారత్‌.. రోహిత్‌తో పాటు రహానె కూడా రాణించడంతో కోలుకుని ఆట ఆఖరుకు 224/3తో నిలిచింది. వెలుతురు లేమి, వర్షం కారణంగా తొలి రోజు ఆటలో 58 ఓవర్లే సాధ్యపడ్డాయి.

షాక్‌ మీద షాక్‌: ఇప్పటికే సిరీస్‌ సాధించిన విశ్వాసంతో రాంచి టెస్టులో శనివారం టాస్‌ గెలిచి ధీమాగా బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌కు ఉదయం షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. సఫారీ పేసర్లు భారత బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు సృష్టించారు. ముఖ్యంగా పిచ్‌ నుంచి సహకారం అందుకుంటూ విజృంభించిన రబాడ.. బ్యాట్స్‌మన్‌ను కుదురుకోనీయలేదు. బంతి అనూహ్యంగా బౌన్స్‌ కావడంతో క్రీజులో అసౌకర్యంగా కదలిన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (10) రబాడ ఔట్‌ స్వింగర్‌ను వెంటాడి స్లిప్‌లో ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రబాడ మరో దెబ్బ కొట్టాడు. చెతేశ్వర్‌ పుజారాను డకౌట్‌ చేశాడు. రబాడ వేసిన బంతి నేరుగా వచ్చి ప్యాడ్లను తాకగా అంపైర్‌ ఔట్‌  ఇవ్వలేదు. కానీ రివ్యూలో అతను ఔట్‌ అయినట్లు తేలింది. ఆ తర్వాత భారత్‌కు పెద్ద షాక్‌ తగిలింది. పుణె టెస్టు డబుల్‌ సెంచరీ వీరుడు, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (12) నోర్జె బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్‌ సమీక్ష కోరినా.. అది అంపైర్‌ కాల్‌ కావడంతో అతను వెనుదిరగక తప్పలేదు.

ఆచితూచి.. దాడి చేసి
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో రోహిత్‌.. రహానెతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద రబాడ బౌలింగ్‌లో అంపైర్‌ అతణ్ని ఎల్బీగా ప్రకటించినా.. సమీక్ష కోరిన రోహిత్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని సహనాన్ని పరీక్షిస్తూ రబాడ లెగ్‌ కటర్స్‌తో పాటు ఎన్నో అస్త్రాలు సంధించినా అతను సంయమనం కోల్పోలేదు. లిండె బౌలింగ్‌లో షార్ట్‌ లెగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను హంజా వదిలేయడం కూడా అతడికి కలిసొచ్చింది. లంచ్‌ సమయానికి స్కోరు 71/3. విరామం తర్వాత రోహిత్‌ తన శైలిలో చెలరేగాడు. తన ట్రేడ్‌ మార్క్‌ పుల్‌ షాట్లతో అలరించిన అతను.. నోర్జె బౌలింగ్‌లో ముచ్చటైన డ్రైవ్‌తో 86 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. స్పిన్నర్‌ పీట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు కొట్టిన రోహిత్‌.. అతని బౌలింగ్‌లోనే లాంగ్‌ఆఫ్‌లో భారీ సిక్సర్‌ బాది ఘనంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడిన రహానె 70 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్‌ తర్వాత ఈ జోడీ 4.62 రన్‌రేట్‌తో 134 పరుగులు జోడించడం విశేషం. టీ విరామానికి భారత్‌ 205/3తో నిలిచింది. విరామం తర్వాత వెలుతురు లేమి.. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట నిలిపేయడంతో ఆఖరి సెషన్లో కేవలం ఆరు ఓవర్లే పడ్డాయి. రోహిత్‌-రహానె జోడీ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 185 పరుగులు జత చేసింది.

వానా ఇప్పుడు రాకు..
రోహిత్‌శర్మ సెంచరీకి చేరువైన తర్వాత ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. అతను 95 పరుగుల మీద ఉన్నప్పుడు నెమ్మదిగా వర్షం మొదలైంది. దీంతో ఆకాశం వైపు చూసిన రోహిత్‌ ‘ఇప్పుడు రాకు’ అన్నట్లు సంకేతాలివ్వడం కనిపించింది. ఈ తర్వాత అతను సిక్స్‌తో సెంచరీ చేసుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయింది. ఈ క్రమంలోనే రోహిత్‌ టెస్టుల్లో 2000 పరుగుల మైలురాయి కూడా దాటాడు.

అయినా... టాస్‌ చిక్కలేదు
ఆసియాలో తాను కెప్టెన్‌గా బరిలోకి దిగిన గత తొమ్మిది టెస్టుల్లో టాస్‌ ఓడిపోవడంతో రాంచి టెస్టులో తన బదులు వేరొకరిని టాస్‌కు పంపే అవకాశం ఉందని ఈ మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ విలేకరులకు చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లే తన బదులు బవుమాను టాస్‌ కోసం పంపాడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌. అయినా ఫలితం లేకపోయింది. బవుమా కూడా టాస్‌ను గెలవకపోవడంతో మరోసారి సఫారీ జట్టుకు మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కలేదు.

నదీమ్‌ అరంగేట్రం
ఈ మ్యాచ్‌లో భారత్‌ తుది జట్టులో ఓ మార్పు చేసింది. పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని పేసర్‌ ఇషాంత్‌శర్మను తప్పించి అతని స్థానంలో స్థానిక ఆటగాడు స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ను ఎంచుకుంది. కుల్‌దీప్‌ గాయపడటంతో శుక్రవారమే జట్టులోకి వచ్చిన నదీమ్‌.. వెంటనే తొలి టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఏకంగా ఐదు మార్పులతో బరిలో దిగింది. ఎంగిడి, హంజా, క్లాసెన్‌, లిండ్‌, పీట్‌ చోటు సంపాదించారు. వీరిలో వికెట్‌కీపర్‌ క్లాసెన్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ లిండెలకు కెరీర్‌లో ఇదే తొలి టెస్టు. గాయపడిన కేశవ్‌ మహరాజ్‌, మార్‌క్రమ్‌లతో పాటు ఫిలాండర్‌, డిబ్రుయిన్‌, ముత్తుస్వామిలను తుది జట్టు నుంచి తప్పించారు.

ఈరోజూ వర్షం బెడద

తొలి రోజు ఆటలో టీ విరామం తర్వాత మ్యాచ్‌ను అడ్డుకున్న వర్షం.. రెండో రోజూ అంతరాయం కలిగించేందుకు ఆస్కారముంది. ‘‘రాంచిలో ఆదివారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి వర్షాలు తగ్గొచ్చు’’ అని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో తుపాను ఉండడం వల్లే రాంచిపై వర్ష ప్రభావం పడుతోందని అధికారులు చెప్పారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) ఎల్గర్‌ (బి) రబాడ 10; రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ 117; పుజారా ఎల్బీ (బి) రబాడ 0; కోహ్లి ఎల్బీ (బి) నోర్జె 12; రహానె బ్యాటింగ్‌ 83; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (58 ఓవర్లలో 3 వికెట్లకు) 224;
వికెట్ల పతనం:  1-12, 2-16, 3-39;
బౌలింగ్‌: రబాడ 14-5-54-2; ఎంగిడి 11-4-36-0; నోర్జె 16-3-50-1; లిండె 11-1-40-0; పీట్‌ 6-0-43-0.

6
రోహిత్‌శర్మకు ఇది ఆరో టెస్టు సెంచరీ. ఈ సిరీస్‌లో మూడోది. 1978లో సునీల్‌ గావస్కర్‌ తర్వాత ఒక సిరీస్‌లో రెండు అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్‌  రోహితే
17
ఈ సిరీస్‌లో రోహిత్‌ కొట్టిన సిక్సర్లు. ఒకే సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల కొట్టిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మయర్‌ (15) రికార్డును అధిగమించాడు.
111
ఈ సిరీస్‌లో డేన్‌ పీట్‌ బౌలింగ్‌లో రోహిత్‌ చేసిన పరుగులు. అతను కొట్టిన 17 సిక్సర్లలో 11 పీట్‌ బౌలింగ్‌లో వచ్చినవే. 
434
ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా రోహిత్‌శర్మ సాధించిన పరుగులు... స్వదేశంలో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన మహ్మద్‌   అజహరుద్దీన్‌ (388)ను అతను దాటాడు.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.